భారత దేశ పౌరులారా.. సిగ్గుతో తలదించుకోండి..!!

by Gantepaka Srikanth |

మీరు చూస్తున్న ఈ ఫొటో ముంబై రైల్వేస్టేషన్. ఇక్కడ పట్టాలన్నీ ఎరుపు రంగులోనే లేదా తుప్పు పట్టి ఉన్నాయనో భావిస్తే మీరు ఉమ్మిలో కాలేసినట్టే.

భారత దేశ పౌరులారా.. సిగ్గుతో తలదించుకోండి..!!
X

మీరు చూస్తున్న ఈ ఫొటో ముంబై రైల్వేస్టేషన్. ఇక్కడ పట్టాలన్నీ ఎరుపు రంగులోనే లేదా తుప్పు పట్టి ఉన్నాయనో భావిస్తే మీరు ఉమ్మిలో కాలేసినట్టే. ఇది ముంబైలోని రైలు ప్రయాణికులు గుట్కా, పాన్ వేసుకుని ఉమ్మివేయడంతో ఉన్న దుస్థితి. ఈ ఫొటోను చూసి ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేసే దేశ పౌరులారా .. సిగ్గుతో తలదించుకోండి. = (దాయి శ్రీశైలం)

మనమంతే.

తిన్న దగ్గరే ఉంచుతాం.

ఉంచిన చోటే తింటాం.

నోట్లో పాన్ వేస్కొని తుపుక్‌మని ఉంచితే అదొక ఆనందం.

జర్దా.. తంబాకేసుకొని గోడలపై ఉమ్మడం ఒక ఆర్ట్ అనుకుంటాం.

తుంపర్ల వాన పడ్డట్టు బస్సు కిటికీలోంచి ఉంచితే అదో తుత్తి...

అంతే కదా..?

ఏదో ఇండియాలో కాబట్టి బతికిపోతున్నాం.

వేరే దేశాల్లో అయితే ఉమ్మేస్తే ఉరే...

ఉమ్మేయడం నిజంగా నేరమా.?

బహిరంగంగా ఉమ్మడమంటే రోగాలకు స్వాగతం పలికినట్టేనా.?

చట్టం ఏం చెప్తోంది.?

మనం ఏం చేస్తున్నాం.?

ఇచ్చట ఉమ్మేయరాదు.. అనే వాల్ రైటింగ్‌లు ఎన్ని చూసుంటాం. కానీ, మన గొప్పదనమేంటంటే. ఎక్కడైతే ఉమ్మేయరాదని ఉంటుందో అక్కడే ఉమ్మేసే ఘనులున్నారు మన దగ్గర. ఉంచితే ఏమవుతుంది.? అదేమైనా నేరమా.? అంటుంటారు. బాజాప్తా ఉంచుతాం ఎవరికి చెప్తారో చెప్పుకోండీ.. ఏం చేస్తారో చేస్కోండీ అని సవాళ్లు విసిరే విజ్ఞులన్నమాట.

ఉమ్మడం మన హక్కా.?

అక్కడ ఇక్కడ అనేంలేదు. అన్నిచోట్లా ఉన్నారు ఉమ్మురాయుళ్లు. పాన్ తింటారు.. ఫరాఖత్‌గా ఎక్కడంటే అక్కడ ఉంచేస్తారు. తంబాకు నములుతారు.. తాత జాగీరైనట్టే బహిరంగ ప్రదేశాల్లో ఉంచుతారు. గుట్కా వేస్కుంటారు.. గుప్పుమనే కంపు వచ్చేలా ఉమ్మి చిమ్ముతారు. అంతేనండీ.. ఇండియాలో ఉమ్మడం.. దవడకేసుకున్న గలీజునంతా చిమ్మడం జన్మహక్కులా ఫీలవుతుంటారు. రోడ్లు.. ఇళ్లు.. ఆఫీసని లేదు. మేక నమిలినట్టు నమిలామా ? తుపు..క్‌మని ఉంచామా అనేదే లెక్క. కొన్ని మతాలు, తెగల నమ్మకాలూ ఈ ధోరణి పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. రోడ్లపై, బస్సుల్లో ఎక్కడంటే అక్కడే ఉంచేస్తుంటారు. ఇక రైళ్లు, రైల్వే స్టేషన్లలో ఉమ్మేయడం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

వారసత్వ సంపదనా.?

ఉమ్మడం మన సంస్కృతిలో భాగం కాదు. సంప్రదాయమూ కాదు. చరిత్రలో ఎక్కడా ఉమ్మడమొక హుందా ? అనే ఆనవాళ్లూ లేవు. కానీ మనవాళ్లు దానినొక అలవాటుగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదేమైనా వారసత్వ సంపదనా.. తరతరాలుగా కొనసాగించడానికి.? అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో పాన్.. గుట్కాలు నమిలి ఉమ్మేయడం వల్లే గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొందరైతే మరీ మూర్ఖంగా మొక్కలపై ఉమ్మేసి మూతి తుడుచుకొని, ఇదేంట్రా బాబూ అని అడిగితే ముక్కు ముడుచుకుంటారు. అది గాల్లో కలుస్తుందా.? పర్యావరణంపై ప్రభావం చూపిస్తుందా.? పక్కవారిపై పడుతుందా.? పిల్లలు దానిని ముట్టుకుంటారా.? ముట్టుకుంటే ఏవైనా అంటు వ్యాధులు సోకుతాయా.? అనే సోయి ఉంటే అంతొట్టు.

అతిక్రమణ- నేరం

మనకేంటి మహరాజుల్లా ఎక్కడంటే అక్కడ ఉమ్మేసి హుందాగా కూర్చుంటాం. కానీ చాలా దేశాల్లో అదొక నేరం. ఉమ్మడం చూస్తే కుమ్మడమే తరువాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేర్వేరు ఉద్దేశాలతో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించారు. కొన్ని దేశాలు అంటు వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడాన్ని నిషేధించాయి. కొన్ని దేశాలు ప్రజా పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిషేధం విధించాయి. ఉమ్మేయడమంటే ఇక్కడ ఉత్త లాలాజలాన్ని ఉమ్మేయడం మాత్రమే కాదు. పొగాకు ప్రేరేపిత పాన్, గుట్కా, ఖైనీ, జర్దా, తంబాకు వంటివన్నీ అన్నమాట. నిషేధమంటే నిద్రపోయినట్లుండదు అక్కడ. నిషేధాన్ని అతిక్రమిస్తే తోలు తీసి డోలు కడతారు.

వెయ్యి డాలర్ల పైన్

సింగపూర్‌లా డెవలప్ చేస్తా అని వాగ్దానాలు చేస్తుంటారు కదా మన లీడర్లు. అంత క్లియర్ క్లీన్‌ అన్నమాట సింగపూర్. అక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే ఉతికి ఆరేస్తారు. 1000 నుంచి 1100 డాలర్ల జరిమానా విధిస్తారు. ఇండియన్ కరెన్సీలో ఆ మొత్తం ఎంతో తెలుసా.? అక్షరాలా డెబ్బై వేల రూపాయలు. సచ్చింది గొర్రె. ఉత్త పుణ్యానికి ఉమ్మి ఉంచి రూ.70వేల ఫైన్ కట్టడమంటే మామూలు ముచ్చట కాదు. భూటాన్‌లో కూడా ఇలాంటి నియమం అమల్లో ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తే 100 Nu ఫైనేస్తారు. అలాగే న్యూ గినియాలో చూయింగ్ గమ్‌లు, తమలపాకులు వంటివి ఉమ్మేస్తే PGK 120 జరిమానా విధిస్తారు. ఇప్పుడు చెప్పండి బాబులూ.? బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడమంటే ఎంత సీరియస్ మ్యాటరో.!

అనాగరిక చర్య

కట్టు బొట్టు, సంస్కృతి, సంప్రదాయాలల్లో భారత్ ను మించిన దేశం లేదు.. దాన్ని కాదనలేం. కానీ, ఇంత బతుకు బతికీ ఇంటెనకాల సచ్చిండన్నట్టూ అంత గొప్ప సంస్కృతి ఉన్న దేశంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం అనే దగ్గర ఎందుకు ఆగిపోతున్నాం. నాగరికత తెలిసిన మనమే అనాగరికులుగా వ్యవహరిస్తున్నాం. అదే పాశ్చాత్య దేశాలు ఈ విషయాన్ని అనాగరిక చర్యగా భావిస్తున్నారు. నేపాల్‌లో ఇదొక క్షమించరాని నేరం.

క్షయ హెపటైటిస్

పాన్, గుట్కా, జర్దా, ఖైనీ, తంబాకు వంటివి నమిలి బహిరంగంగా ఉంచడం అనేది ప్రజా పరిశుభ్రతకు తలకాయనొప్పే. ఆరోగ్య పరంగానూ ఇది తీవ్రమైన సమస్యే. క్షయ, హెపెటైటిస్, స్వైన్ ఫ్లూ, ఏవియన్ ఫ్లూ, న్యుమోనియా, జీర్ణాశయాంతర వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఇవే ప్రధాన కారణాలు. ఇంగ్లండ్‌, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు 19వ శతాబ్దం చివర్లో ఒక ప్రజా నోటీసును విడుదల చేశాయి. అదేంటంటే పొగాకు ఉత్పత్తి వాడకం పెరుగుతుండటం వల్ల క్షయ వ్యాధి విజృంభించే ప్రమాదముంది కాబట్టి బహిరంగ ఉమ్మివేయడాన్ని నిషేధించాయి. న్యూ గినియా అయితే ఈ ఉమ్మివల్ల క్షయ వ్యాధి వ్యాపిస్తున్నట్టు నిర్ధారణకొచ్చి మరీ బ్యాన్ విధించింది.

చట్టాలేం చేస్తున్నాయి.?

చైనా దీన్ని సీరియస్‌గా తీసుకుంది. 2016లో హాంగ్ జౌ నగరంలో జీ20 శిఖరాగ్ర సమావేశాల్లోనూ దీని ప్రస్తావన తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించడానికి ఒక చట్టాన్నే తీసుకొచ్చింది. మయన్మార్ కూడా ఈ విషయంలో కఠినంగానే ఉన్నది. పారిశుద్ధ్య కారణాల దృష్ట్యా దీనిపై బ్యాన్ విధించింది. ఇండియాలో కూడా దీనిపై బ్యాన్ ఉందనుకోండి. కానీ ఎవడింటాడు సార్.? అదొక సవాలుగా మారిపోయింది. మున్సిపల్ చట్టాలున్నా నిషేధం అమలు కావడం లేదు. కానీ హైదరాబాద్ మెట్రో రైళ్లలో మాత్రం పక్కాగా వర్కవుట్ అయ్యింది. దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఉమ్మి తొట్టిల్లాంటివి ఏర్పాటు చేసి నిరంతర అవగాహన కల్పిస్తే కొంత మార్పు వస్తుంది.

ప్రాంతీయ చట్టం ప్రకారం..

1. గోవా 1997లో ధూమపానం, ఉమ్మివేయడంపై నిషేధ చట్టం తీసుకొచ్చింది.

2. తమిళనాడులో Spitting Prohibition Act 2002 ప్రకారం నిషేధం విధించింది.

3. పశ్చిమ బెంగాల్ ఆరోగ్య పరిరక్షణ చట్టం 2003 ప్రకారం ఉమ్మేయడాన్ని నిషేధించింది. సెక్షన్ 7 ప్రకారం రూ.200 జరిమాన విధించింది.

4. కేరళలో 2006లో హైకోర్టు ఆదేశానుసారం బహిరంగంగా ఉమ్మివేయడం నిషేధం.

5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1997లో ఉమ్మివేయడాన్ని నిషేధించింది.

మున్సిపల్ చట్టం ప్రకారం..

1. కర్నాటక మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం 2013 ప్రకారం ఉమ్మివేయడం నిషేధం. దీన్ని అతిక్రమిస్తే మొదటిసారి రూ.100, ఆ తర్వాత రూ.200 ఫైన్.

2. ముంబై పోలీస్ చట్టం 1951, సెక్షన్ 116 ప్రకారం మహారాష్ట్రలోని ప్రభుత్వ ప్రాంగణాల్లో ఉమ్మివేయడం నిషేధం.

3. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.500 కంటే ఎక్కువ జరిమాన.

4. బీహార్ మున్సిపల్ చట్టం 2007 ప్రకారం బహిరంగ మూత్ర విసర్జన, ఉమ్మివేయడం నిషిద్ధం. రూ. 200 జరిమానా.

5. జోధ్‌పూర్‌లో అధ్యయనం నిర్వహించి.. నిషేధం విధించారు.

వ్యాధి కారకం - డాక్టర్ సుజిత్ కుమార్ బాశెట్టి, జనరల్ సర్జన్

జనాల్లో ఒక నిర్లక్ష్యం ఉంది. బయట ఏదైనా చేయొచ్చని అనుకుంటారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఏవైతే వ్యాధికారక క్రిములు విడుదలవుతాయో, ఉమ్మివేసినప్పుడు కూడా అవే విడుదలవుతాయి. కొవిడ్ టైంలో చూశాం కదా. ఇవే వ్యాధికారక కణాలతోనే ఎంతో నష్టం జరిగింది. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్, సీజనల్ జ్వరాలు వంటివి ఉమ్మితోనే వస్తున్నాయి. పాన్, గుట్కాల ఉమ్మితో అయితే ఇంకా పెద్ద సమస్యే.

పరిశుభ్రతే నాగరికత- రాము దోసపాటి, సామాజిక కార్యకర్త

ఉమ్మి చిన్నది అనుకుంటున్నారు కానీ దాని ప్రభావం తీవ్రమైనది, వ్యాధులను వ్యాప్తిచేసి, నగరాల అందాన్ని మసకబారుస్తుంది అది. బయట మీ ఇష్టమొచ్చినట్టు ఉమ్మేస్తున్నారు. సరే మీ ఇంట్లో ఉమ్మేస్తారా అలాగే.? రహదారులు, పరసరాలు, ప్రజా కార్యాలయాలు కూడా శుభ్రంగా ఉండాలి కదా.? పబ్లిక్ ప్రదేశాలను మన ఇల్లుగానే భావించాలి. శుభ్రత మన గుర్తింపు కావాలి. ఎందుకంటే పరిశుభ్రత మన నాగరికతకు ప్రతిబింబం.

అప్పటి శ్రద్ధేది.? - కే. ప్రసన్నజ్యోతి, హైదరాబాద్

బహిరంగ ప్రదేశాల్లో కొందరు విచ్చలవిడిగా ఉమ్మేస్తుంటారు. వారికి అదేం ఆనందమోగానీ పాన్ పరాగ్ లాంటివి నములుతూ గొప్పగా ఫీలవుతుంటారు. మహిళలను చూస్తే ఇగ అదే పనిగా ఉమ్మేస్తుంటారు. షాపింగ్ మాల్స్, బస్ స్టాప్, థియేటర్, మార్కెట్ ఎక్కడ చూసినా ఇదే తంతు. కరోనా వైరస్ వ్యాప్తి చెందింది ఉమ్మితోనే కదా.? అప్పుడు చూపించిన శ్రద్ధ ఇప్పుడు కొద్దిగ చూపించినా పర్లేదు.

చర్యలు తీసుకోవాలి - రామ్ జె, నాగర్ కర్నూల్

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు వెళ్లినప్పుడు తల తిరుగుతుంటుంది. ఎక్కడ చూసినా పాన్, తంబాకు ఉమ్మేసిన మరకలే. ఉమ్మి వేయడం వలన అనేక అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అధికారులు ఈ అంశంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం కదా.?

ఫొటో ఆర్ ఆర్ : రంగారెడ్డి జిల్లా కొత్తూరులో రహదారిపై ఉమ్మివేసిన వ్యక్తితోనే ఉమ్మిపై మట్టిపోయిస్తున్న పోలీసులు(ఫైల్)

Next Story