ఫిట్‌నెస్ తక్కువ.. ఫిరాయింపు ఎక్కువ.!!

by Daayi Srishailam |

ఇదే మనకు తెలిసిన గొప్ప మార్పు సూత్రం

ఫిట్‌నెస్ తక్కువ.. ఫిరాయింపు ఎక్కువ.!!
X

దిశ, ఫీచర్స్: మనకు శరీరమ్మీద ధ్యాసెక్కువ. ఫిట్‌నెస్ మీదా ఫికరెక్కువే. క్షణాల్లో ఫ్యామిలీ ప్యాక్ బాడీని సిక్స్‌ప్యాక్‌గా మార్చేయాలన్నంత కసి ఉంటుంది. జిమ్‌కు వొయ్యి స్లిమ్ అవ్వాలనే ఆత్రం చాన్నే ఉంటుంది. బాగనే పైసలు ఖర్చువెట్టి సరకు సరంజామా బాగనే ప్రిపేర్ కూడా చేస్కుంటం. అంతబాగనే ఉంటదిగానీ.. అసలు మ్యాటర్ కాడికి వచ్చేసరికి తుస్సుమంటాం. వరసగా రెండ్రోజులువొయ్యి మూడోరోజున మూలకు ముదురుకుంటం. ఇదే మనకు తెలిసిన గొప్ప మార్పు సూత్రం.

ఆరంభ శూరత్వం బ్యాచ్..

పక్కింట్లోనో.. పక్కూర్లోనో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే.. దెబ్బకు మన మనసు మారిపోతది. "హే చల్.. రేపటిసంది మొత్తం మారిపోవాలి" అనేటంత ఆత్రం తన్నుకొస్తది. "హెల్త్ ముఖ్యం రాజా.. అసలే రోజులు బాగలేవు" అని స్పీచులిచ్చి మనతో పాటు ఇంకో పదిమందిని కూడా మార్చేసాయలనేంత పట్టుదల పరదా దాటి వస్తుంది. ఇసొంటివి అప్పటిమందం బాగనే అనిపిస్తయిగానీ.. మూడోరోజు ఇదేదీ యాదికిరాదు. బోధిచెట్టుకింద వచ్చిన ఆలోచన అట్నుంచటే మాయమైతుంటది. "పొద్దటీలి బర్లు కాన్రావు.. మాపటీలి గొర్లు కాన్రావు" అనేటట్లు ఇచ్చిన వాగ్దానాన్నెప్పుడో వాగులో కలిపేస్తం. తీసుకున్న తీర్మాణానికి తెల్లారకముందే తెడ్డడ్డం పెడతం. ఇసొంటి తీస్మార్కాన్లుంటారనే ఎన్కటికి పెద్దలు పసిగట్టి ఆరంభశూరత్వం ముచ్చట చెప్పిండ్రు.

ప్లాన్ పెద్దదే.. పాటిస్తమా మరీ.?

చలి గట్టిగనే పెడ్తుందని తెలుసు. చలికి పొద్దు పొద్దున్నే లేచే రకం కాదని కూడా తెలుసు. మన బద్దకం మీద మనకే అంత నమ్మకం ఉన్నప్పటికీ ఏదో తెలియని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. "లే.. లేచి పరిగెత్తూ" అని తరుముతుంది. "జిమ్‌కువొయ్యి జిగేల్‌మనాలనీ" పురమాయిస్తుంది. ఆ క్షణంలో మన ఆత్రం ఎలాంటిదంటే.. "ఐదు రోజుల్లో ఐకాన్ స్టార్ మారిపోవాలి" అనిపిస్తది. "తలుసుకుంటే తలైవా లెక్క మారిపోతా" అనే తెగింపు కనిపిస్తుంది. "రాత్రికి రాత్రే రాజమౌళి సినిమాలో హీరోలెక్క తయారవ్వాలి" అనేంత ఉత్సుకత ఆవహిస్తుంది. క్యాలెండర్ తీసుకుంటాం. పెన్ను తీసుకుంటాం. ఇయ్యాలేం వారం.. రేపేం వారం అని చెక్ చేసుకొని టిక్ పెట్టుకొని టిక్‌టాక్ ప్లానేసుకుంటాం. ప్లాన్ పెద్దదేగానీ.. పాటించే కాడనే తేడా కొడుతది.

అలారం మోతలు మోగినా లేవం..

జిమ‌ను చూసినప్పుడల్లా మన ఫిట్‌నెస్ మీద సోయి వస్తుంటది. "మామా రేపట్నుంచే జిమ్‌కు పోవాల్రా" అని సోపతగాళ్లను చైతన్యపరిచి ఒక పెద్ద టీమే తయారుచేస్తాం. "మామా.. నువ్వు ఐదింటికి అలారం పెట్టు.. నేను ఐదు పదికి పెడతా. నీ అలారంతో లేవకపోయినా.. నా అలారం సప్పుడుకైనా లేవొచ్చు" అని రకరకాలుగా చర్చించుకుంటారు. రాత్రిపూట అంతపెద్ద చర్చలు పెట్టి.. తెల్లారేసరికి అలారం మోతలు మోగినా మొద్దునిద్ర నుంచి లేవనే లేవం. మన టీంలో ఎవరైనా ఒకడు ఇగురంగల్లోడు డైరెక్టుగా ఇంటికొచ్చి "మామా లేవురా.. ఇయాల్టి నుంచి జిమ్‌కు పోదామంటిరిగా" అని తలుపులు బద్దలు కొట్టినా లేవము. చెవులల్ల దూదిపెట్టుకున్నట్లు "మామా.. ఏమైందోరా నైట్ నుంచి అనీజీగా ఉంది.. రేపటి నుంచి పక్కా" అని తన్ని తరిమేసినంత పనిచేస్తాం.

ఆర్నెళ్ల ఫీజ్ ఒక్కసారే కట్టేస్తం..

మనకు పొద్దున్నే లేవచాత కాదు. పక్కోడు లేచి వచ్చినా మబ్బు వదలకుండా పండుకుంటాం. కానీ అదే మనకు పుసుక్కున మెలకువ వస్తే ఇక అవతలోడు అయిపోయినట్టే. వానికో పది పన్నెండుసార్లు ఫోన్లు కొట్టి సుక్కలు సూపిస్తం. ఇంటికివొయ్యి మరీ బయటకు లాక్కొచ్చి "చలో నడువిప్పుడు" అని నానా రచ్చ చేస్తాం. జిమ్‌కు పోవడు ఆల్శెమే లేదు.. ఆర్నెళ్ల ప్యాకేజీ అడ్వాన్స్ కట్టి పారేస్తరు. "ఫీజు కట్టకపోతే లాపర్వ ఐతది మామా.. ఒక్కసారే గుండుగుత్త మొత్తం టోటల్ అమౌంట్ కట్టేస్తే డుమ్మా కొట్టాలనిపించదు" అని పైసల చెల్లింపులో రాజీ పడకుండా ముందుకెళ్తాం. ఇక రెండ్రోజులు వాళ్లను ఆపే వశం కాదు ఎవరికీ. "అరే మేం జిమ్‌కు వోతున్నంరా" ఊరు మొత్తం దండోరా వేసినట్లు ఫుల్ పబ్లిసిటీ చేసేస్తం. ఫస్ట్ రోజే ఫిట్నెస్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తాం.

కొత్త మురిపెం.. పొద్దంతా అదే ధ్యాస..

ఎట్లాగూ జిమ్‌కు వోతున్నం.. సామాన్లు అన్నీ తెచ్చుకోవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతది. సరుకు సరాంజామా ఒక్కటికూడా మిస్ కాకుండా అన్నీ తెచ్చుకోవాలనుకుంటాం. అట్లా చేస్తెనే మనకు జిమ్‌కు వొయ్యిన సాటిసిఫేక్షన్ ఉంటదన్నమాట. డీమార్టుకు పోతరు షూస్ తెచ్చుకుంటరు. విశాల్‌మార్ట్‌కు పోతరు బ్రాండెడ్ జిమ్ డ్రెస్ కొనుక్కుంటరు. జిమ్‌లోనే కాకుండా ఇంట్లో కూడా కొంత ప్రాక్టీస్ చేయాలని అవీ ఇవీ అని రకరకాల వస్తువులకు బేరం పెడతరు. తర్వాత వీలైతదో లేదో అని పార్లర్‌కువొయ్యి కటింగ్.. షేవింగ్ చేయించుకుంటారు. జిమ్‌లో చెమటొస్తే జిడ్డు కారొద్దని ముఖారవిందాన్ని సైతం ముద్దమందారంలా తయారు చేయించుకుంటారు. కొత్త మురిపెం కదా.? వారం రోజులు అస్సలు తెల్లారితే.. పొద్దుమూకితే జిమ్ ముచ్చట్లే.. ఫిట్నెస్ ధ్యాసే.

ఒక్కరోజులోనే కరిగిపోతుందా.?

మనొళ్ల కథ ఎట్లుంటదంటే.. ఏదైనా ఒక్కరోజులోనే జరిగిపోవాలె అనుకుంటారు. పెంచుకునేటప్పుడేమో అడ్డమైన చెత్తంతా తినేసి.. కనీసం వారంలో ఒక్కరోజైనా ఎక్సర్‌సైజ్ కూడా చెయ్యకుండా "గుండుకు లేకుండా" బొర్రలు పెంచుకుంటాం. సినిమాల్లోనో.. క్రికెటర్లనో చూసినప్పుడు "అర్రే.. మనంకూడా ఇట్లయితే బాగుండు" అనిపిస్తుంది. ఏం చేస్తమిగ.. అంతా ఒక్కరోజే కరిగిపోవాలని అనుకుంటాం. ఎలాగూ జిమ్‌లో చేరాము కదా.. రోజుకు రెండు పూటలా చక్కగా.. ఓ పద్ధతి ప్రకారం ప్రాక్టీస్ చేసి ఫిట్నెస్ పెంచుకోవాలని ప్రయత్నిస్తే కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్లకాకుండా అన్నీ ఒక్కసారే ఎత్తి.. ఏదో ఒకటి సక్రమంగా చేయకుండా అది కొంత ఇది కొంత ట్రైచేసీ ఏ ఒక్కదానిమీద పట్టులేకుండా ఎక్సర్‌జ్ చేసి జీరో సైజ్ కలలు కంటాం.

ఫిట్నెస్ కూడా టైంపాస్ ముచ్చటేనా.?

ఫీజు కట్టేశాం. సరుకు సరంజామా బాగనే తెచ్చుకున్నాం. పూర్తిసమయం కూడా కేటాయిస్తున్నాం. ఊరంతా చాటింపు కూడా వేసుకున్నాం కాబట్టీ.. కొన్నిసార్లు మన కోసం కాకపోయినా మనం పెట్టిన ఖర్చు కోసమైనా ఎఫర్ట్ పెట్టాలి. కానీ మనం అలా చెయ్యం. అక్కడికి వెళ్లికూడా అవే టైంపాస్ ముచ్చట్లు పెట్టుకుంటాం. ఎక్సర్‌‌సైజ్ తక్కువ.. సెల్ఫీలు ఎక్కువ అన్నట్లు ఉంటది మనొళ్ల కథ. రెండుసార్లు డంబెల్స్ ఎత్తి.. డజన్ సార్లు వీడియోలు తీసుకుంటారు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చెయ్యాలి కదా మరీ.? ఇన్‌స్టాలో సోకుల బాగోతాన్ని సూపెట్టి ఇంకింత ఫాలోయింగ్ పెంచుకోవాలన్నమాట. ఈ మొత్తం ఎపిసోడ్లో మనం చేసిన ఖర్చు.. స్పెండ్ చేసిన టైమ్ అంతా ఉత్త బూడిదలో పోసిన పన్నీరే. అంటే.. ఆఖరికి ఫిట్నెస్ మ్యాటర్‌ని కూడా టైంపాస్ ముచ్చట కిందికే తీసుకొస్తున్నాం.

అవీ ఓ కారణాలేనా.?

చలికాలం కదా.? వాకింగ్ టీములు చాలా తయారైతాయిప్పుడు. చలికాలంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలామంచిది అనేది కొందరి అభిప్రాయం. సేమ్ జిమ్ బాగోతం లెక్కనే ఇక్కడ కూడ మఫ్లర్లు.. స్వెటర్లు.. వాకింగ్ షూస్ తెచ్చుకుంటారు. ప్లాన్ మంచిగనే ఉంటుంది కానీ.. అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తారు. "ఆరంభింపరు నీచ మానవులు" పద్యం ఉందికదా.. అచ్చం అలానే ఉంటుంది వీళ్ల యవ్వారం. "ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్" అన్నట్లుగా వీళ్లు వింటర్ వాకింగ్ క్యాంపులు స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేస్తారు. వాళ్ల కారణాలు కూడా "అయ్యో పాపం" అనేటట్లుగా అంతపెద్ద సీరియస్‌గా ఏముండవు. "సలి ఎక్కువ పెడుతుంది మామా".. "నైట్ లేట్‌గా పండుకున్నా కాకా" వంటి చిన్నా చితక కారణాలు చెప్పి చేతులెత్తేస్తారు.

మూడునెలలకే బోర్ కొడుతుందా.?

ఇంకా కొందరుంటారు. వాళ్లకు ఫిట్నెస్ మీద ఎలాంటి ధ్యాస ఉండదు. కానీ దోస్తుగాడు చేస్తుండనీ.. చుట్టాలబ్బాయి చేస్తుండని ఏవేవో ఫిట్నెస్ కేరింగ్ తీసుకుంటారు. "మార్కెట్లో ప్రొటీన్ డ్రింక్స్.. పౌడర్స్ అందుబాటులో ఉన్నాయి.. మేం వాడుతున్నాం.. జస్ట్ వారం రోజుల్లోనే పది కిలోల బరువు తగ్గి సన్నగా కట్టెపుల్లలా మారొచ్చు" అని చెప్తే వింటారు. వెంటనే ఫాలో అవుతారు. ఒక్కో ప్రొటీన్ డ్రింక్‌కు నెలకు ఎంతలేదన్నా రూ.7వేలు ఖర్చు అవుతుంది. మొదట్లో "పైసలదేముంది.. ప్రాణంకంటే ఎక్కువనా" అని వరుసగా మూడునెలలు కొనేస్తాం.. వాడేస్తాం. తర్వాత బోర్ కొడుతుంది. అర్రే అవసరమా మనకు ఇవన్నీ అనిపిస్తుంది. చేపట్టిన కార్యాన్ని ఎంత ఆత్రంతో మొదలుపెట్టారో అంతే ఆత్రంగా వదిలేస్తారు. దానివల్ల ఏం ఫాయిదా.?

నెలకు పదిహేను రోజులు డుమ్మానా.?

కొంతమందికి యోగా చేయాలనుంటుంది. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది.. శరీరం నియంత్రణలో ఉంటుందనేది వాళ్ల ఉద్దేశం. ఆలోచన మంచిదే. కానీ అదెంతసేపు ఉంటుందో గ్యారెంటీ ఉండదు. యోగా గురువును మాట్లాడతారు. క్యాంప్ కోసం ప్లేస్ అరేంజ్ చేస్తారు. పది పదిహేను మందితో టీంను ఏర్పాటు చేస్తారు. తీరా క్యాంప్ నడుస్తుంటే దావత్ ఉందని ఒకరోజు.. చుట్టాలొచ్చిండ్రని ఒకరోజు.. స్కూల్కో పేరెంట్స్ మీటింగ్ ఉందని ఒకరోజు ఇలా నెలకు పది పదిహేను రోజులు డుమ్మా కొడతారు. ఆర్గనైజర్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక టీం సభ్యుల యవ్వారం ఎట్లుంటదో అర్థం చేసుకోవచ్చు. పదిహేను మంది కాస్త పదికి వస్తారు. పది కాస్త ఐదుకు చేరుతుంది. సరే.. వాళ్లయినా కంటిన్యూ అవుతారనే గ్యారెంటీ లేదు. ఏమంది టెంట్ ఎత్తేయడమే ఇక.

కొద్దికొద్దిగా అలవాటు చేసుకోవాలి కదా.?

ఎవరో చెప్తారు "కొర్రలు తింటే బొర్రలు కరుగుతయి.. జొన్నలు తింటే సన్నగా అవొచ్చు" అనీ. వాస్తవానికి ఇది నిజమే. మన పూర్వీకులు తిన్నది ఈ తిండే కదా.? కానీ మనొళ్లు వీటిని అలా సీరయస్ కోణంలో తీసుకోరు. తినేది మితంగా తింటూ డైటింగ్ మెయింటెన్ చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది. అలా కాకుండా.. సూపర్ మార్కెట్‌కు వొయ్యి పది పది కిలోల కొర్రలు.. జొన్నలు.. బ్రౌన్ రైస్.. రెడ్ రైస్ ఇలా సంచులకొద్ది తెచ్చుకొని ఇంట్లో పడేస్తరు. ఆ తిండి ఇంతకుముందు మనకు అలవాటు లేనిదాయె. ఒక్కసారి కాకుండా కొద్దికొద్దిగా అలవాటు చేసుకొని తింటే ప్రయోజనం ఉంటుంది. ఈ నియమేదీ పాటించకుండా ఒక్కసారిగా దానిమీద పడితే మొఖంకొట్టి మళ్లీ దాని జోలికి వెళ్లరు. తీసుకొచ్చిన దినుసులు అలానే ఉండిపాయె.. పత్యం పాడైపాయె. ఏం లాభం.?

ఆత్రం కన్నా.. ఆలోచన మిన్న

చలికాలం ఎక్సర్‌సైజ్ అయినా.. జిమ్ అయినా.. వింటర్ కేర్ అయినా.. యోగా అయినా.. మెడిటేషన్ అయినా.. మన ఫిట్నెస్‌ను పెంచుకునే ఇంకే మెథడ్ అయినా దానికో పద్ధతి పాడు ఉండాలి. గుడ్డెద్దు చేన్లవడ్డట్టు ఏదో ఐడియా వచ్చిందా ఫాలో అయినమా అన్నట్టు ఉండొద్దు. అదికూడా ఆరంభశూరత్వం అస్సలే ఉండొద్దు. ఏదైనా దానిని పూర్తిగా ఫాలో అయ్యి ఆచరిస్తేనే కదా ఫలితం కనిపించేది.? కానీ మనం అలా చెయ్యం. ఎంతసేపూ దాన్ని చూడంగనే ఇప్పుడే చేసెయ్యాలె.. ఫటాఫట్ ఫలితం దక్కాలె అనే ఆత్రంలో ఉంటం. దానివల్ల టైం కరాబ్.. దిమాగ్ కరాబ్.. పైసా కరాబ్ తప్ప వేరే ప్రయోజనం ఉండదు. అందుకే ఆత్రాన్ని పాతరవెట్టి ఆలోచనకు పనిపెట్టాలె. అలా పెడితే ఫిట్నెస్‌గా ఉండటమే కాదు.. కొద్దిరోజులకు మనమే పెద్ద ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్ కావచ్చు.

మోటివేట్ చేస్తుంటాం: జీడిపెల్లి లింగారావు, ఫిజికల్ డైరెక్టర్, కరీంనగర్

యువతలో ఫిట్నెస్ ధ్యాస పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే. కానీ స్టార్టింగ్లో పెట్టిన ఎఫర్ట్ చివరి వరకు ఉండటం లేదు. ఆరంభ శూరత్వం లెక్క మధ్యలోనే ఎత్తేస్తున్నారు. దీనివల్ల టైం వేస్ట్ తప్ప మిగతా ఏం ప్రయోజనం ఉండదు. మేం పిల్లలకు ఇదే చెప్తం. మన ఫిట్నెసే మనకు ఆరోగ్య రక్ష అని మోటివేట్ చేస్తుంటాం.

మైండ్‌సెట్ మారాలి: శ్రీకాంత్ రాసాల, సంస్థాన్ నారాయణపురం

చలికాలం వచ్చిందంటే యువతలో వాకింగ్ చేయాలి.. జిమ్‌కి వెళ్లాలనే ధ్యాస ఎక్కువుంటుంది. ఆలు లేదు చూలు లేదు అన్నట్లు.. ముందు ప్రవేశమే జరగకుండానే ఏవేవో సరుకులు.. సరంజామా తెచ్చుకుంటారు. తీరాచూస్తే మధ్యలోనే టాటా బైబై చెప్పేస్తుంటారు. ఈ రకమైన మైండ్సెట్ పోతెనే ఫిట్నెస్ సాధ్యం.

ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి: ఎన్ గీత, పీఈటీ, మహబూబ్ నగర్

పిల్లల్లో ఇలాంటి ధోరణి చూస్తుంటాం.ఫిట్నెస్ ధ్యాసకన్నా హడావిడే ఎక్కువగా ఉంటుంది. ఈ హడావిడితో వచ్చేది ఏముండదు కాబట్టే ప్రతీ సెషన్‌లో అవగాహన కల్పిస్తాం. ఫిజికల్ ఫిట్నెస్‌తో ఉంటే ఆరోగ్యమే కాకుండా కెరీర్ పరంగా కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కనీసం అదైనా అర్థం చేసుకుంటే మంచిది.

Next Story