- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతబట్టలను దానం చేయం.. దాచిపెట్టుకుంటాం.!
ముక్కవాసనొచ్చి మూషికసైన్యం దిగేదాక అవి బట్టలనే సోయే రాదు.!

బెడ్‌రూమ్‌లో బట్టలే..
బాత్‌రూమ్‌లో బట్టలే..
హాల్‌లో బట్టలే..
సెల్ఫ్‌లో బట్టలే..
ఇందు కలదు.. అందు లేదని సందేహం వద్దు.
ఎందెందు వెదికినా బట్టలే కనిపిస్తయి.
ఇట్లేసుకొని అట్ల ఇప్పేస్తరు.
మల్లా వాటి వంతు ఎప్పుడొస్తదో.?
చెప్పలేం అసలు రాకపోవచ్చు కూడా.
పక్కవాళ్లకు ఇద్దామంటే పైసలు గుర్తొచ్చె..
దానం చేద్దామంటే ధైర్యం రాకపాయె..
మూటల్లో.. ముళ్లెల్లో మూలుగుతనే ఉంటయి.
ముక్కవాసనొచ్చి మూషికసైన్యం దిగేదాక అవి బట్టలనే సోయే రాదు.!
- దాయి శ్రీశైలం-సుజిత రాచపల్లి
ఎవరింట్ల చూసినా ఈ బట్టల బాగోతం కనిపిస్తుంది. ఇయ్యాల కట్టిన చీర రేపు కట్టుకోరు మనొళ్లు. రేపు వేసుకున్న అంగీ ఎల్లుండి వేసుకోరు. ఇగ తెచ్చుకున్న బట్టలు మూటల్లో ఎందుకు మూల్గవు.? ముక్కవాసన ఎందుకు రావు.? వారం వారం షాపింగ్.. సంచులకొద్ది బట్టలు.. శాస్త్రానికోసారి కట్టుకొని మూలకు పడేస్తమంతే. ఇదెక్కడి పాడు అలవాటో ఏమో.?
ఆడవాళ్లకు అదో పిచ్చి
బట్టలమీద ఆడొళ్లకున్నంత పిచ్చి ఇంకెవరికీ ఉండదు. అల్మారా నిండా చీరలే ఉంటయి. ఎప్పుడేది కట్టుకోవాల్నో.. ఏది ముందు కొనుక్కున్నదో తెలియనంత స్టాక్ ఉంటుంది. రేట్లేమన్నా తక్కువ పెడతరా అంటే అదీ ఉండదు. ముందే చెప్తరు "రేటెంతయినా సరే.. బట్టలు బాగుండాలె" అనీ. అస్సలు తగ్గరు మనొళ్లు. అన్ని ఉంటయికదా.? పుసుక్కున ఏ చుట్టాలదో.. ఇరుగు పొరుగు వాళ్లదో ఫంక్షన్ ఉంటే ఐపాయె ఇగ. ఇంకో చీరకు టెండర్ పడ్డట్టే. గల్లాపెట్టె ఖాళీ అయి.. అల్మారా నిండిపోతది. ఇంకో గమ్మతి ఏందంటే.. షాపింగ్ అంతా అయిపోయినంక "ఇంట్లున్నయే బాగున్నయిగా" అనిపిస్తుంది.
ఉత్తగ పైసలు బొక్క
మారుమూల గ్రామాల్లో కూడా "చందన బ్రదర్స్".. "చెన్నయ్ షాపింగ్ మాల్".. "కళాంజలి".. వంటివి ఎందుకు పెడుతున్నారు.? జనాలు గొర్రెలు అని వాళ్లకు తెలుసు కాబట్టి. మార్కెట్ ఇక్కడ బాగైతుందనే "షాపింగ్ మాల్స్"ను పల్లెల్లోకి తీసుకొస్తున్నారు. వీటిని చూసి జనాలు ఆగుతలేరు. "షాపింగ్ పిచ్చి"తో అవసరం లేకున్నా టైంపాస్ కోసం బట్టలు కొంటున్నారు. మనమేమైనా సినిమా షూటింగ్‌కు పోతున్నమా.. పొద్దునొక డ్రెస్సు.. పొద్దుమూకినంక ఒక డ్రెస్సు వేసుకొని వేషం కట్టుకోనీకె.? ఎందుకండీ ఇవన్నీ.? ఉత్త పుణ్యానికి పైసలు బొక్క తప్ప.. దమ్మిడి ఫాయిదా ఉండదు వీటితో.
ఫంక్షన్ నుంచి తరిమేస్తరా.?
"ఏంది బ్రో మొన్ననే తీసుకుంటివిగా.. మల్లా డ్రెస్ తెచ్చుకుందామంటున్నవ్" అని ఎవరైనా అడిగితే "హే బ్రో.. అది వేరేవాళ్ల మ్యారేజ్.. ఇది వేరేవాళ్ల మ్యారేజ్" అని అంటుంటరు కొందరు. వేరేవాళ్ల మ్యారేజ్ వారం వ్యవధిలోనే జరిగితే "వేరేవేరే కొత్త డ్రెస్సులు వేస్కొని రావాలె" అని ఎవరైనా చాటింపేసిండ్రా లేక ఫంక్షన్ హాల్ ముందు బోర్డు పెట్టిన్రా.? లేకపోతే "అయ్యో.. ఈ చీర మొన్ననే కట్టుకున్నవ్.. మల్ల అదే కట్టుకున్నవ్" అని అడిగి ఫంక్షన్ నుంచి పంపించేస్తరా.? ఎందుకు మరి జనాలు మ్యాచింగ్ మానియాలో పడి తీరొక్క డ్రెస్సు తీసుకొని ఒక్క ఉతుకుకే మూటకట్టేస్తున్నారు.?
పోనీ.. దానం చేస్తరా.?
ఎవరి పైసలు వాళ్లవి.. ఎవరి బట్టలు వాళ్లవి. కొనుక్కోవడం.. కొయ్యకు తగిలేయడం వాళ్లిష్టం. కానీ.. వాళ్లకు అవసరం లేనప్పుడు ఆ మూటలు పెంచుకోవడం ఎందుకు.? ఇంట్లోనే కుక్కుతూ.. కుంభాలలెక్క పేర్చడం ఎందుకు.? మనకు అవసరం లేనిది ఇంకెవరికో అవసరం ఉంటుంది కదా.? మన దగ్గర లేనిది ఇంకెవరి దగ్గరో ఉండకపోవచ్చు కదా.? అలాంటి వాళ్లకిస్తే తప్పేంటి.? ఉత్తగనే మూటలల్ల ముక్కవాసనొచ్చేదాక ఉంచుకోవడం కన్నా.. అవసరం ఉన్నొళ్లకు దానం చేస్తే ఎంత పుణ్యం దక్కుతుంది చెప్పండి.? ఒకరి అవసరాన్ని తీర్చామనే తృప్తికంటే మించిందేముంటది.?
మీ చాకిరే చేస్తుంది కదా.?
ఇంట్లో పని మనిషి ఉంటుంది. పాపం.. పొద్దట్నుంచి రాత్రి వరకు చాకిరీ చేస్తుంది. దినాం.. అవే మాసిన బట్టలు.. అవే చిరిగిన బట్టలు. ఆమె పరిస్థితేంటో ఇంటి ఓనర్‌లకు తెలుసు. ఆమె కుటుంబం అవసరాలేంటో కూడా తెలుసు. "అయ్యో.. పాపం మనం వాడని బట్టలేవైనా ఉంటే వాళ్లకిద్దాం. ఇంట్లో ఉత్తగ మూటలల్ల మూలిగితే ఏమొస్తుంది" అని అనుకోరు. అందరూ ఇట్లనే ఉంటారని చెప్పలేం. కానీ.. చాలామంది ఇట్లనే ఉంటారు. కొందరైతే "పనొళ్లను పనొళ్ల లెక్కనే చూడాలె.. ఇట్లా ఇష్టమొచ్చినట్లు బట్టలు.. అవీ.. ఇవీ ఇస్తే వాళ్లూ మనతో సమానం అని ఫీలైపోరూ" అని అంటుంటారు.
అనాథలకు.. ఆశ్రమాలకు
సరే.. పని మనిషికో.. పక్కింటి వాళ్లకో ఇస్తందుకు మనసు ఒప్పుతలేదు అనుకుందాం. ఎవరో తెల్వని పేదొళ్లకు ఇవ్వండి. ఇప్పుడైతే "అనాథలకు.. వృద్ధులకు బట్టలు దానం చేయండి" అని ఊరూరా.. గల్లీ గల్లీకి వెహికిల్స్ తిరుగుతున్నాయి కదా.? కనీసం వాళ్లయినా ఇస్తే ఎంత బాగుంటది చెప్పండి.? ఏ దిక్కూ లేక.. ఏ తోడూ లేక.. ఎవరో పుణ్యాత్ములు చేరదీసి సేవ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు కొంత తోడ్పాటునందిస్తే ఏమవుతుంది.? ఈ సోయి మానవధర్మంగా అందరికీ ఉండాలి కదా.? ఇక్కడ ఇంకోటి.. "ఏదో కొత్తవి కొనుకొచ్చి" ఇవ్వమని చెప్తలేం కదా. వాడకుండా పడివున్న వాటినే ఇవ్వమంటున్నాం.
గిఫ్టే అనుకోండి
"బట్టలు కొత్తవైతే.. బంధువులు కూడా కొత్తొళ్లే" అంటుంటారు పెద్దమనుషులు. అంటే.. సుట్టాలైనా తెల్లగ బట్టలేస్కుంటెనే గౌరవమిస్తారు. అందుకే మీ ఇంట్లో మూటలల్ల మూలుగుతున్న బట్టలను.. ఒకసారి మాత్రమే వేసుకొని పక్కకు పడేసిన వాటిని బయటెవరికో ఇవ్వబుద్దిగాకపోతే మీ చుట్టాలవాళ్లకు ఇవ్వండి. ఎలాగూ ఒకట్రెండు సార్లే వాడినవి కాబట్టీ వాళ్లూ ఫీల్ కాకుండా మంచి ప్యాకింగ్ చేసి గిఫ్ట్‌లా ఇవ్వండి. ఇలాంటి మనసు లేకుండా.. ఇలాంటి సాయమేదీ చేయకుండా "వాళ్లను మా చుట్టాలని చెప్పడానికి నామోషీగా ఉంది" వంటి పనికిరాని కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్.?
రీసైక్లింగైనా చేయండీ
కనీసం రీసైక్లింగ్ గురించయినా అవగాహన ఉందా.? పాతవి.. ఉపయోగించని బట్టలను మళ్లీ ఉపయోగించేలా.. లేదా కొత్త ఉత్పత్తులగా మార్చడమే ఈ క్లాత్ రీసైక్లింగ్. పర్యావరణాన్ని కాపాడటంలో.. వ్యర్థాలను తగ్గించడంలో.. వనరులను సమర్ధవంతంగా ఉపయోగించడంలో ఈ పద్ధతి తోడ్పడుతుంది. టెక్స్‌టైల్ వ్యర్థాలు మనకు పెద్ద సమస్యగా మారాయి కాబట్టీ రీసైక్లింగ్ ద్వారా దీని తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది. కొత్త బట్టల తయారీకి నీళ్లు.. రసాయనాలు ఎక్కువ అవసరం. రీసైక్లింగ్ ఇవేవీ అవసరం లేదు. కాబట్టీ పర్యావరణాన్ని మనం కాపాడినవాళ్లం అవుతాం కదా.?
ఏమైతది అనుకుంటున్నారా.?
"పైసలు మావే.. బట్టలు మావే.. వాటిని కట్టుకోవాలో.. మూటల్లో దాచిపెట్టుకోవాలో మా ఇష్టం" అని పుష్ప డైలాగులొద్దు బాసూ. బట్టలు మీవే అయుండొచ్చు. కానీ దానివల్ల పబ్లిక్‌కూ సమస్యలొస్తాయని తెలుసుకుంటే మంచిది. ఎక్కువకాలం వీటిని మూటల్లో ముదరడం వల్ల.. శుభ్రం చేయకపోవడం వల్ల అలర్జీలు.. శ్వాసకోశ సమస్యలొస్తాయి. అవి ఇతరులపై ప్రభావం చూపించి లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టీ "మా బట్టలు మా ఇష్టం" అనే ఆలోచన మొదటికే మోసం అని గ్రహించి బట్టలను పారేయకండి.. ముదిరిపెట్టకండి.
పాత బట్టలు.. కొత్త సమస్యలు
పాత బట్టలు దుమ్ము.. ఫంగస్.. బూజును ఈజీగా తీసుకోవడం వల్ల అలర్జీలు.. ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు వస్తాయి. సిల్వర్ ఫిష్.. చీమలు.. బొద్దింకలు వంటి కీటకాలు ఆకర్షితమై బట్టలను డ్యామేజీ చేస్తూ.. ఇల్లంతా వ్యాపిస్తాయి. ఎక్కువకాలం దాచిపెట్టే బట్టల వల్ల బ్యాక్టీరియా.. ఫంగస్ చేరి కంపు వాసన వస్తుంది. ఇన్ఫెక్షన్లు వస్తాయి. కప్‌బోర్డులు.. సెల్ఫ్‌లలో బట్టలే నిండిపోయి వేరే వస్తువులకు ప్లేస్ సరిపోదు. కొంతకాలానికి అవి చీకిపోతాయి కాబట్టీ పారేయాల్సి వస్తుంది. పాలిస్టర్.. సింథటిక్ లాంటివి అంత ఈజీగా భూమిలో కలిసిపోలేవు. ఫలితంగా టెక్స్‌టైల్స్ వ్యర్థాలు ఎక్కువవుతాయి.
వాల్ ఆఫ్ కైండ్‌నెస్
ఇవ్వడానికి.. తీసుకోవడానికి నామోషీ ఉండకుండా దేశవ్యాప్తంగా "వాల్ ఆఫ్ కైండ్‌నెస్" డిఫెరెంట్ కాన్సెప్ట్‌లను డిజైన్ చేశారు. మన దగ్గర సికింద్రాబాద్.. మార్కెట్ రోడ్.. కోఠి.. అబిడ్స్.. ఎర్రగడ్డ.. అఫ్జల్‌గంజ్ వంటి ప్రాంతాల్లో 2016లో వాల్ ఆఫ్ కైండ్‌నెస్ సెంటర్స్ ఏర్పాటుచేసింది జీహెచ్ఎంసీ. ఇళ్లలోని పాత బట్టలను అక్కడ ఉంచితే అవసరం ఉన్నవాళ్లు తీసుకెళ్లేవారు. ఎంతమంచి కాన్సెప్ట్. కానీ ఎందుకో ఆదరణ తగ్గిపోయింది. అవి మళ్లీ పూర్వవైభవం చాటాల్సిన అవసరం ఉంది.
ప్లాస్టిక్‌లా మారిపోతోంది
👉 హైదరాబాద్‌లో రోజూ 8,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది.
👉 దాంట్లో టెక్స్‌టైల్ వ్యర్థాలు 720 టన్నులు.
👉 భూమిలో ప్లాస్టిక్ కలవడానికి 200500 సంవత్సరాలు పడుతుంది.
👉 అదే నైలాన్.. పాలిస్టర్ వంటి బట్టలు కలవడానికి 20200 ఏళ్లు పడుతుంది.
👉 2023-24లో 43.56% వ్యర్థాలు మట్టిలో కలిస్తే వాటిలో వస్త్రాలు 8.76%.. కవర్లు 11.53%
👉 2022- 23లో 46.80% వ్యర్థాలు మట్టిలో కలిస్తే వాటిలో బట్టలు 9.04%.. కవర్లు13.36%
👉 2021- 22లో 53.09% వ్యర్థాలు మట్టిలో కలిస్తే వాటిలో బట్టలు 9.77%.. కవర్లు 14.09%
👉 2020- 21లో 55.37% వ్యర్థాలు మట్టిలో కలిస్తే వాటిలో బట్టలు 9.24%.. కవర్లు 13.76%
ఏమవుతుంది.?
👉 పాతబట్టలు ఇంట్లో పేరుకుపోతే ఇల్లు అస్తవ్యస్తంగా మారి మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
👉 సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల డ్యామేజయ్యి.. రీసైక్లింగ్ విలువ కోల్పోతాయి.
👉 కాటన్.. సిల్క్ బట్టలు కాలం గడిచేకొద్దీ బలహీనం అవుతాయి. రీసైక్లింగ్ కష్టం అవుతుంది.
👉 రీసైకిల్ చేసిన బట్టల నుంచి కొత్త ఉత్పత్తులు తయారుచేయడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి.
👉 పాత బట్టలను దానం చేయడం లేదా రీసైకిల్ చేయడం వల్ల అవసరం ఉన్నవాళ్లకు ఉపయోగపడతాయి కదా.?
ఇంట్లో ఎలా చేయాలి.?
👉 పాత అంగీలను బ్యాగులు.. ఆఫ్రాన్లు.. టేబుల్ క్లాత్‌లుగా మార్చొచ్చు.
👉 చీరలను కర్టెన్లు.. దుప్పట్లు.. బెడ్ స్ప్రెడ్లుగా మార్చొచ్చు.
👉 జీన్స్‌ను కట్‌చేసి షార్టులు.. బ్యాులు.. స్టోరేజీ బాక్సులుగా ఉపయోగించొచ్చు.
👉 పాత బట్టలను శుభ్రం చేసి.. డ్రైక్లీన్ బాక్సుల్లో లేదా వాక్యూమ్ బ్యాగుల్లో నిల్వచేయాలి.
👉 నాఫ్తలీన్ బాల్స్ లేదా లవంగాలు వంటి సహజ కీటక నివారిణులను ఉపయోగించాలి.
👉 ప్రతి 6 నెలలకు ఒకసారి బట్టలను చెక్ చేసి అవసరం లేనివాటిని దానం చేయాలి.
👉 దానం చేయగా మిగిలినవాటిని Goonj లేదా GreenSole వంటి కేంద్రాలకు ఇవ్వొచ్చు.
రీ సైక్లింగ్ ఎలా చేస్తారు.?
👉 పాత బట్టలను డొనేషన్ సెంటర్లు.. రీసైక్లింగ్ బిన్‌ల ద్వారా సేకరిస్తారు.
👉 H&M, Zara వంటి బ్రాండ్స్ కూడా రీసైక్లింగ్ కోసం బట్టలను సేకరిస్తాయి.
👉 సేకరించిన బట్టలను పాలిస్టర్.. కాటన్.. ఉన్నిగా వేరు చేస్తారు.
👉 బట్టలను చిన్న ఫైబర్లుగా విడగొట్టి.. కొత్త నూలుగా మారుస్తారు. పాత జీన్స్ నుంచి బ్యాగులు తయారుచేస్తారు.
👉 సింథటిక్ ఫైబర్లను రసాయనికంగా కరిగించి కొత్త ఫైబర్రలుగా మారుస్తారు.
👉 పాత చీరలను కర్టెన్లు.. బ్యాగులుగా సృజనాత్మక కొత్త డిజైన్లుగా మారుస్తారు. దీనిని అప్‌సైక్లింగ్ అంటారు.
👉 శుభ్రపరిచే గుడ్డలు.. ఫిల్లింగ్ మెటీరియల్ వంటి ఉత్పత్తులుగా మారుస్తారు. దీనిని డౌన్ సైక్లింగ్ అంటారు.
👉 బట్టలను ఫైబర్లుగా విడగొట్టి కొత్త టెక్స్‌టైల్స్ తయారుచేస్తారు. దీనిని మెటీరియల్ రీసైక్లింగ్ అంటారు.
ఇట్లుంది మన కథ
👉 ఇండియాలో సంవత్సరానికి సుమారు 1 మిలియన్ టన్నుల టెక్స్‌టైల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి.
👉 వాటిలో కేవలం 15% మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి.
👉 బట్టల వ్యర్థాలు పోగవుతున్న దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది.
👉 హైదరాబాద్‌లో రోజూ దాదాపుగా 720 పాత బట్టల వ్యర్థాలు డంపింగ్ యార్డుకు చేరుతున్నాయి.
👉 చెత్తకుప్పల్లో పోగవుతున్న బట్టల వ్యర్థాల్లో 30% తిరిగ ఉపయోగించుకోవచ్చు.
👉 హైదరాబాద్‌లో ఒకే రీసైక్లింగ్ సంస్థ ఉంది. దాని సామర్థ్యం ఇంకా పెరగాలి.
👉 రీయూజ్.. రీసైక్లింగ్.. రెడ్యూజ్ నియమాన్ని ప్రైవేటు.. ప్రభుత్వ సంస్థలు పాటిస్తేనే వస్త్ర వ్యర్థాలకు పరిష్కారం.
డొనేట్ చేస్తే మంచిదే కదా?: ప్రసాద్, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్
పాత బట్టలు సంచులకొద్దీ దాచిపెట్టుకుంటారు కానీ దానం చేయడానికి ముందుకు రారు. పాపం.. అనాథలు.. వృద్ధులు బట్టల్లేక ఇబ్బంది పడుతుంటారు. ఆశ్రమాలు కొన్ని డ్రైవ్‌లు నిర్వహిస్తూ ఊరూరికీ వస్తున్నాయి. అలాంటి సంస్థలకు ఇస్తే మంచిదే కదా.? సంచులల్లో దాచుకున్న బట్టలతో ఏం ఉపయోగమే వాళ్లకే
మనకు పాతవే.. వారికి కొత్తవి: నిఖిత ఎన్
పాత బట్టలతో బీరువాలు నిండిపోతాయి. పేరుకు పాతబట్టలే కానీ వాటిని ఎక్కువసార్లు వేసుకోం. ఇంట్లో మూలకు పడేసే బదులు ఎవరికైనా ఇస్తే ఎంత బాగుంటుంది.? ఇస్తే ఎవరేమనుకుంటారో అనుకున్నవాళ్లు కైండ్‌నెస్ వాల్ దగ్గర పెడితే అవసరం ఉన్నవాళ్లకు మేలు జరుగుతుంది. అవి మన దృష్టిలో పాత బట్టలే కావచ్చు. కానీ అవసరం ఉన్నవారికి అవే కొత్త బట్టలు.






