- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చలాన్ జాన్తా నై.. చల్నేదో బాల్‌కిషన్.!
ఆల్రెడీ చలాన్ ఉందని తెలిసినా బాజాప్తా "రాంగ్‌రూట్"నే వెతుక్కుంటారు

దిశ, ఫీచర్స్: బైకుంటది. కానీ భద్రత సోయి ఉండదు. కారుంటది. కానీ వేగ నియంత్రణ ఉండదు. రాంగ్‌రూట్ డ్రైవింగ్.. రద్దీ ఏరియాలో పార్కింగ్.. పొగలు చిమ్మే పొల్యూషన్.. ఇలా దేనిపైనా బాధ్యతుండదు. బాధ్యత తెలిసేలా ట్రాఫిక్ పోలీసులు చలాన్ రాసినా అదే తీరు. "బాధ్యతలేని మనిషి తాలుకా".. మనల్నెవడ్రా ఆపేది అని మళ్లీ మళ్లీ చేసిన తప్పులే చేస్తుంటారు మనలో కొందరు. బండిమీద ఆల్రెడీ చలాన్ ఉందని తెలిసినా బాజాప్తా "రాంగ్‌రూట్"నే వెతుక్కుంటారు.
హర్ దర్ద్ కా దవా..
కండ్లుమూసి తెరిచేలోపు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రూల్స్ పట్ల నిర్లక్ష్యం.. వ్యవస్థ పట్ల బాధ్యతారాహిత్యంగా ఉండటం వల్లనే భద్రతను బజార్లో వదిలేసి వెళ్తుంటారు చాలామంది. టూవీలర్ నడిపేవాళ్లకు హెల్మెట్ పెట్టుకోవాలంటే నామోషీ. కార్ నడిపేవాళ్లు సీట్‌బెల్ట్ పెట్టుకోవడం నామోషీ. ఎవరైనా చెప్తే "చల్ నాకేమైతది. నా లైఫ్‌లో ఒక్కసారిగూడ యాక్సిడెంటైంది లేదు. డ్రైవింగ్ సరిగా చేయడనే రిమార్క్ లేదు" అని స్పీచులిస్తుంటారు. రోడ్డుమీద బతుకులు మనవి. మనం డ్రైవింగ్‌లో తోపులమే అయుండొచ్చు. కానీ ఎదురుగా వస్తున్న వాహనంలో ఉండేవాళ్లకు సమస్యే కదా.? స్పీచులు కాదు.. భద్రతపై బాధ్యత కావాలిక్కడ. ఎంతచెప్పినా.. ఎలా చెప్పినా జనాలు వింటలేరనే "హర్ దర్ద్ కా దవా జిందాతిలిస్మాత్" అని ట్రాఫిక్ చలాన్లు తీసుకొచ్చారు.
జైసా కర్నా వైసా భర్నా..
"చలాన్ వేస్తున్నారు" అని మొత్తుకుంటారుగానీ.. ఎందుకు వేస్తున్నారని ఆలోచిస్తున్నారా.? "సిగ్నల్ జంప్" చేస్తే రోడ్ క్రాస్ చేస్తున్న వాళ్లకు.. వాహనాలకు ఇబ్బందే కదా.? ఇలా చేస్తేనే కదా యాక్సిడెంట్లు జరిగేది. అయినా రెండు నిమిషాలు ఆగలేని ఆత్రమేంది.? సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ పడుతుందని తెలిసినా లెక్క చేయకుండా వెళ్తుంటారు. "వేస్తే వేయని.. మనం కట్టేదుందా" అనే రుబాబొకటి. ఇక్కడ చాలామందికి రూల్స్ అతిక్రమించడం.. చట్టాన్ని గౌరవించకపోవడం ఒక ప్యాషన్.. కిక్. అందుకే తాగి డ్రైవింగ్ చేస్తారు. రాంగ్ రూట్లో వెళ్తారు. సిగ్నల్ జంప్ చేస్తారు. హెల్మెట్ ధరించరు. సీట్ బెల్ట్ పెట్టుకోరు. ఓవర్ స్పీడ్ గా వెళ్తారు. వద్దని వారిస్తే వాదిస్తారు. "జైసా కర్నా.. వైసా భర్నా".. చేసుకున్నోడికి చేసుకున్నంత కాబట్టీ చలాన్ల మోత మోగుతుంటది.
నియ్యత్ కిత్నా బర్కత్ ఉత్నా..
మంచైనా.. చెడైనా ఎట్ల చేసుకుంటే అట్ల అనుభవిస్తం. తప్పని తెలిసినా తప్పతాగి బండి నడిపితే ఎవరేం చేస్తారు.? రాంగ్ రూట్ డ్రైవింగ్ జీవితాన్నే రాంగ్ రూట్లో తీసుకెళ్తుందని చెప్పినా వినకపోతే ఇంకేం చెప్తాం.? ప్రతీసారి అదే తప్పు.. అదే తీరు. ఒకొక్కరి బండికి యాబై అరవై ఫైన్లు ఉంటాయి. సరే వాటినైనా చెక్ చేసుకొని కడతారా అంటే అదీ ఉండదు. వాళ్లు నడిపించే బండిని అమ్మినా ఆ చలాన్లు క్లియర్ చేసుకునేంత పైసలు రావు. అయినా మన రాజాసాబ్ రాజసం తగ్గకుండా భయం లేకుండా రోడ్లమీద తిరుగుతూనే ఉంటాడు. పుసుక్కున ట్రాఫిక్ వాళ్లకు దొరికాడే అనుకోండి. చలాన్ల బిల్లు చూసి కండ్లు బైర్లు కమ్ముతాయి. ఏదైనా అంతే "నియ్యత్ కిత్నా.. బర్కత్ ఉత్నా". ఒళ్లు దగ్గరపెట్టుకొని డ్రైవింగ్ చేస్తే బాధపడే అవసరం ఉండదు కదా.?
బాల్ బాల్ మే బచ్ గయే..
రోడ్డుమీద చిత్ర విచిత్రాలు చాలా చూస్తుంటాం. ట్రాఫిక్ పోలీసులను చూసి ఉరుకులు పరుగులు పెట్టేవాళ్లు కొందరు. నటించేవాళ్లు కొందరు. యూటర్న్ తీసుకొని సందులు బొందులు తిరిగేవాళ్లు కొందరు. ట్రాఫిక్ వాళ్ల కంటపడకుండా రూట్ మార్చి ఏవేవో వేషాలేస్తుంటారు. అంత భయమే ఉన్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఐపోతుంది కదా.? ఇలా ఆపసోపాలు పడే అవసరమే ఉండదు కదా.? ఎంత రూట్ మార్చినా.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా వెంట్రుకవాసిలో "బాల్ బాల్ మే బచ్ గయే" అన్నట్లు తప్పించుకున్నా చలానా చిట్టా విప్పడం తప్పదు. ఫైన్ కట్టక తప్పదు. దాక్కొని దాక్కొని తిరిగేబదులు రూల్స్ పాటించి రుబాబుగా తిరిగితే కలిగే ఆనందంలోనే అసలైన కిక్కుంటుందిగానీ.. తప్పు అని తెలిసినా తవరికీ దొరకనని దాక్కొని తిరిగితే ఉండదు.
రాత్ గయి బాత్ గయి..
ఒకసారి అనుభవమైనప్పుడు ఇక రిపీట్ చేయొద్దు అనిపిస్తుంది. కానీ కొందరుంటారు.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ పడుతుందని తెలిసినా.. జేబుకు చిల్లు పడుతుందని అర్థమైనా.. ప్రాణానికే ముప్పందని గ్రహించినా అదే తీరు.. అదే తంతు. "రాత్ గయి బాత్ గయి" అన్నట్లు నిన్న ఇచ్చిన మాటకు నీళ్లు తాగించి.. మొన్న వేసిన ఒట్టును తీసి గట్టుమీద పెట్టి ఎప్పటిలాగే ఎగిరెగిరి దుంకుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇచ్చినమాటకు విలువియ్యకుండా.. తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండకుండా తమకు తామే ప్రమాదంలోకి నెట్టేసుకుంటారు. అదేందోగానీ హెల్మెట్ పెట్టుకోకపోతే సస్తవురా అయ్యా అని మనసు చెప్తున్నా ఎహే ఏంకాదు అనే కేర్ చెయ్యరు. ఎంతటి ప్రమాదమని తెలిసినా లెక్కపెట్టని తనంతో తాము చేసిన తప్పుకు ఫ్యామిలీని ముంచుతారు.
దలీందర్ జో హై దర్‌ఖాస్త్ దియేతో..
ఎందుకొచ్చిన తంటా అని కొందరు ఎప్పటి చలాన్ అప్పుడే క్లియర్ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు ఫైన్లు పడకుండా ఉండాలని జాగ్రత్త పడుతుంటారు. బాధ్యత ఉన్నవాళ్లయితే ఇలా చేస్తుంటారు. కానీ సామాజిక బాధ్యతలేనివాళ్లు దీనిని చాలా తేలిగ్గా తీసుకుంటారు. ప్రభుత్వం నుంచిగానీ లేదా పోలీస్ శాఖ నుంచిగానీ "50శాతం మాఫీ".. "70శాతం మాఫీ" అనే ప్రకటనలు ఏమైనా వస్తుండొచ్చేమో అని చలాన్ క్లియర్ చేయకుండా ఆఫర్ కోసం ఎదురుచూస్తుంటారు. రెండు మూడు సార్లు బంపరాఫర్ వచ్చింది కాబట్టీ మళ్లీ చేస్తుండొచ్చనే ఒక ఆశ ఉంటది. వేలకు వేలు పేరుకుపోయిన ఫైన్ల భారం తగ్గుతుందనుకుంటారు. కానీ "దలీందర్ జో హై దర్‌ఖాస్త్ దియేతో ఖచేరీ ఖుద్ బర్కాస్ హోగయా" అన్నట్లు దరిద్రానికి ఆ ప్రకటన రాదు. చలాన్లు క్లియర్ కావు.
గ్యారా కద్దూ బారా కోత్వాల్..
యువత ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ ట్రాఫిక్ వాళ్లతో ఆటలాడటానికి ప్రధాన భరోసా వాళ్ల లీడర్. సర్పంచో.. ఎంపీటీసో.. మరీ అంతకాదంటే ఎమ్మెల్యేనో వీళ్లకు సంబంధించినొళ్లు అయుంటారు. అంతమాత్రాన ట్రాఫిక్ చలాన్లు వాటంతట అవే క్లియర్ అవ్వవు కదా.? కానీ.. చాలామంది చలాన్ల దగ్గర పోలీసులకు చిక్కితే "సార్ వన్ మినట్ ప్లీజ్" అని సైడ్‌కు వెళ్లి వాళ్ల లీడరన్నకు ఫోన్ కలుపుతాడు. ఇక లీడర్ మాటలెట్లుంటయంటే "సార్.. ఈ ఒక్కసారికి మావోన్ని ఇడ్శిపెట్టుండ్రి. ఎమ్మెల్యే సార్ మనుషులం మేం" అని ఏదో చెప్తాడు. పోలీస్‌కు ఇంకా కోపం పెరిగి "టోటల్ క్లియర్ చేసినంకనే వదులుతా" అంటాడు. "గ్యారా కద్దూ బారా కోత్వాల్" అయినట్లు ఏదో చెయ్యబోతే ఇంకేదో అయ్యి అసలుకే ఎసరొచ్చి నానా ఇబ్బంది పడుతుంటారు.
ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్..
ఇంట్లో పెంచుకున్న కోడికి విలువ తక్కువన్నట్లు సగం వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నదే "ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్" పొలిటికల్ లీడర్సే. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం సిస్టంను భ్రష్టుపట్టిస్తుంటారు. ఎన్నికలప్పుడు రకరకాల ప్రకటనలు ఇస్తుంటారు. ప్రజలకు లేనిపోని ఆశలు.. భ్రమలు కల్పిస్తుంటారు. "బండిపోతె బండిస్తాం.. చలాన్లూ కట్టొద్దు మేమే భరిస్తాం. మేమున్నంక మీకెందుకు భయం" వంటి స్టేట్మెంట్ల వల్ల చలాన్లు క్లియర్ చేసుకోవాలనే సానుకూల దృక్పథం ఉన్నవాళ్లు కూడా ముందుకు రారు. "ఎవరూ కట్టనిది మనమెందుకు కట్టాలి.?" అనే భావనతో ఉంటారు. అందుకే ఏండ్లకేండ్లు వాళ్ల చలాన్లు పేరుకుపోయి ఉంటాయి. పోలీసులకు చిక్కితే ఏదో ఒక సాకు చెప్పి అప్పటివరకు బయటపడతారు కానీ కట్టాల్సిన ఫైన్ అట్లనే ఉంటుంది.
ఆలూ టమాటా ఘీకా పరాటా..
చలాన్లు ఎగ్గొట్టి దర్జాగా రోడ్డుమీద తిరిగేవాళ్లలో "బడా బాబులు".. "సెలబ్రిటీలు".. "రాజకీయ నాయకులు" ఉండటం ఆశ్చర్యకరం. వెయ్యికీ.. రెండువేలకు భయపడటానికి వాళ్లేం కామన్‌మ్యాన్ కాదు. కోట్లకు కోట్ల రూపాయల సంపాదన.. మంచి గుర్తింపు.. హోదా ఉన్నవాళ్లు. అలాంటి వాళ్ల వాహనాల మీద ఉన్న వేలకు వేల రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయంటే వారి సామాజిక బాధ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చలాన్ ఎగ్గొట్టాలి అనే ఆలోచన ఉన్నోడికి.. సొసైటీలో పేరు ప్రఖ్యాతలు ఉన్నోడికి చలాన్ల విషయంలో "ఆలూ టమాటా ఘీకా పరాటా" లెక్క పెద్ద తేడా లేదని చెప్పొచ్చు. దరిద్రం ఏంటంటే ఈ సెలబ్రిటీలు చలాన్లు కట్టకపోతే వాళ్ల అభిమానులు కట్టాల్సిన పరిస్థితి. ఎవరు ఎవరికి ఆదర్శంగా ఉంటున్నారో.. సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారో వాళ్లకే తెలియాలి.
గధా ఘోడా దో భీ బరాబర్..
ట్రాఫిక్ రూల్స్.. చలాన్ల మీద తెలిసినోడు అంతకే.. తెలియనోడు అంతకే ఉన్నాడు. చదువుకున్నోడు.. చదువుకోనోడు ఇద్దరూ అదే పనిచేస్తున్నారు. అంతో ఇంతో చదువుకోనొళ్లకు వ్యవస్థలు.. చట్టాల పట్ల భయమో.. భక్తో ఉంటుంది. ఎందుకొచ్చిన పంచాయతీ అని "ఇజ్జత్ కే సవాల్" అనుకొని చలాన్లు క్లియర్ చేసుకుంటారు. కానీ చదువుకున్నొళ్లు.. అన్నీ తెలిసినొళ్లు మాత్రం "చల్నేదో బాల్ కిషన్" అని కట్టకున్నా నడుస్తుందిలే అన్నట్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. మన ఇంట్లో తింటూ పిల్లనిచ్చిన మామ మేకల్ని మేపినట్లు.. ఈ వ్యవస్థ సహకారంతో.. చట్టాలు కల్పించిన అవకాశాలతో చదువుకొని.. ఉద్యోగం సంపాదించి ట్రాఫిక్ చట్టాలను చెత్తబుట్టలో పడేస్తున్నాడు. ఇదే కదా "గధా ఘోడా దో భీ బరాబర్" అని అంటే.
సర్కారీ బండీ మే కిత్నే చువ్వే..
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాళ్ల బ్యాంక్ అకౌంట్లోంచి చలానా పైసలు కట్ చేసుకునే సిస్టం రావాలని ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా ప్రకటనలు చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ ఎంప్లాయిస్ దాక అందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మా చలాన్లు సరే మీ చలాన్లు ఎన్ని ఉన్నయో వెనక్కి తిరిగి చూసుకోండి అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ముందు "సర్కారీ బండీ మే కిత్నే చువ్వే" తెలుసుకోండి అని సవాల్ చేస్తున్నారు. ఇదికూడా కరెక్టే కదా.? రూల్స్ కామన్‌మ్యాన్‌కే కాదు.. అందరిక సమానంగా ఉండాలి. దీంట్లో ఎవరికీ మినహాయింపు ఉండొద్దు. ఒక నిర్ణయం తీసుకునే ముందు.. ఒక చట్టం చేసేముందు.. ప్రకటన చేసేముందు క్రాస్ చెక్ చేసుకుంటే మంచిదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
దర్ద్ హీ దర్ద్ కా దవా హై..
పోలీసులు రూల్స్ గురించి చెప్పడమే వాళ్ల బాధ్యత కాదు. వాళ్లు కూడా వాటిని పాటిస్తేనే ఆచరణ సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒకచోట చూసే ఉంటాం. "హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపే పోలీస్.. త్రిపుల్ రైడింగ్ చేస్తూ రాంగ్ రూట్లో వెళ్తున్న పోలీస్" అని. అందుకే "దర్ద్ హీ దర్ద్ కా దవా హై" అనేట్లుండాలి. ఉష్ణం ఉష్ణేన శీతలం అంటారు కదా.? మన వ్యవస్థ బాగుండాలంటే ముందు దానిని దానిని అనుసరించాలి. అలా కాకుండా "ఉల్టాచోర్ కోత్వాల్ కో డాంటే" అన్నట్లు తొండికి దిగి తుంగలో తొక్కితే ఏ రూల్సూ అమలు కావు. ఏ చట్టానికీ గౌరవం ఇవ్వరు జనాలు. ముందే వాళ్లు "మనం కట్టే ఫైన్ల పైసలు సర్కారు ఖజానాలోకి వెళ్తయా.? పోలీసువాళ్లు తలా ఇన్ని పంచుకుంటారా" అనే అభిప్రాయంతో ఉంటారు కాబట్టీ నిజాయితీ ఇక్కడ ముఖ్యం.
డూండే తో ఖుదా భీ మిల్తా హై..
ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ట్రాఫిక్ రూల్స్ తెలిసినా హెల్మెట్ లేకుండానే డ్రైవింగ్ చేసేవాళ్లు.. తాగి బండి నడిపేవాళ్లు.. రాంగ్ రూట్లో వెళ్లేవాళ్లు.. సిగ్నల్ జంప్ చేసేవాళ్లు.. ఇవన్నీ చేసేసి పైగా ఫైన్ ఎగ్గొట్టే వాళ్లు "డూండే తో ఖుదా భీ మిల్తా హై" అని తెలుసుకుంటే మంచిది. మనం ఎంత పెద్దొళ్లమైనా.. ఎంత డబ్బున్నొళ్లమైనా.. చదువుకున్నొళ్లమైనా చట్టం ముందు అంతా సమానమే. "ఏక్ అనార్ సౌ భీమార్" లెక్క ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన అందరికీ ఒకే రకమైన చలాన్ ఇష్యూ అవుతుంది. ఒకే రకమైన ఫైన్ పడుతుంది. కాబట్టీ రోడ్డు మీదికి వచ్చినప్పుడు బాధ్యతగా డ్రైవ్ చేయడం శ్రేయస్కరం. ఈగోలను ఇంట్లోనే వదిలేసి వాహనం క్లచ్.. బ్రేక్‌ల దృష్టి పెడితే ఏ ట్రాఫిక్ కెమెరా నజర్ మనమీద పడదు.
అవగాహన పెంచుతున్నాం: దయాకర్, రాచకొండ పోలీస్ కమిషనర్ పీఆర్వో
ట్రాఫిక్ రూల్స్ పట్ల.. చలాన్ల పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. రూల్స్ ఉన్నవి ప్రజల క్షేమం కోసం. వారి సేఫ్టీ కోసమే. ఫైన్లు విధిస్తే అయినా రూల్స్ పాటిస్తారనేదే ఈ ఫెనాల్టీల ఉద్దేశం. కానీ జనాలు పోలీసు వాళ్లు చూస్తారు.. ఫొటో కొడతారు అనే భావనతోనే ఉంటారు. అది తప్పు. రూల్స్ పాటిస్తే ఎలాంటి చలాన్లు వేయరు కదా.?
సేఫ్టీ ముఖ్యం కదా.?: సురేష్, ట్రాఫిక్ పోలీస్
వాహనదారుల క్షేమం కోసం రోజూ చెక్ పాయింట్ పెడతాం. చాలామంది హెల్మెట్ పెట్టుకోరు. లైసెన్స్ ఉండదు. ఒక్కో బైక్ మీద ముగ్గురు నలుగురు ఉంటారు. వాహనం నెంబర్ చెక్ చేస్తే ఒక్కోదాని మీద ఐదు.. ఆరు ఫైన్లు ఉంటాయి. చలాన్ కట్టి వెళ్లండి అని అంటే ఎవరికో ఫోన్ కలిపి మాట్లాడమని చెవి దగ్గర పెడతారు. ఎవరితో మాట్లాడితే ఏం ప్రయోజనం.. సేఫ్టీ ముఖ్యం కదా.?
పేరెంట్స్ పేరుమీద: సత్యనారాయణ వేల్పుల, కరీంనగర్
ఈ మధ్య యూత్ పోరగాళ్లకు ఏం చెప్పినా నెగెటివ్‌గానే అర్థం చేసుకుంటున్నారు. ఒకొక్కడు తాగి బండి నడిపిస్తుంటాడు. పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తారు. వీళ్లేమో అదేం పట్టించుకోకుండా రోడ్లమీద విన్యాసాలు చేస్తుంటారు. వాహనం పేరెంట్స్ పేరుమీద ఉంటుంది కదా.? చలానా నోటీస్ అందాక వాళ్ల పేరెంట్స్ నోరెళ్లబెడతారు. మందలిస్తే మల్లా అదొక సమస్య అని చలాన్లు క్లియర్ చేస్తుంటారు.






