మా టైం.. మా ఇష్టం.!

by Daayi Srishailam |

ఇండియన్స్ లో రానురాను టైంసెన్స్ విపరీతంగా లోపిస్తోంది

మా టైం.. మా ఇష్టం.!
X

కొందరుంటారు.

రావాల్సిన టైమ్‌కు రారు.

పోవాల్సిన టైమ్‌కు పోరు.

యాళ్లదప్పి భూపాలం పాడినట్లు..

చేయాల్సిన టైమ్‌లో కాకుండా వాళ్లకు తీర్వాటమైన టైమ్‌లో చేస్తరు.

సమయపాలన పాటించండయా అంటే సాకులతో కాలమెల్లదీస్తరు.

దీనివల్ల ఎవరికి నష్టం.?

టైమ్‌‌సెన్స్ కెరీర్‌కు లైసెన్స్ లాంటిది.

అది లేకపోతే సక్సెస్ లేదు.

ఆల్శెంజేశి అవకాశాలు చేజార్చుకొని లబోదిబోమంటే ఏం ఫాయిదా.?

టైం సెన్స్ అనేది.. కామన్ సెన్స్‌లో ఫస్ట్ చాప్టర్ అని తెలుసుకుంటే మంచిది.

- దాయి శ్రీశైలం

ఎన్కటికి టైం సెన్స్ బాగుండేది. ఎప్పుడుజెయ్యాల్సిన పని అప్పుడే చేస్తుండె. అంబట్యాళ్ల దాక పండుకొని సన్యాళ్లకు లేస్తే తన్ని తడకవతల పడేద్దురు. కానీ ఇప్పుడంతా మోతెవర్ల జమానా. దేనికీ యాళ్లపాళ్లుంట లేదు. మణికట్టుకు గడియారం పెడతరుగానీ.. దాన్ని ఫాలో అయ్యే సోయి ఉండదు. టక్కు టిక్కు తయారైతరుగానీ.. టైం సెన్స్ మీద ధ్యాస పెట్టరు.

ఏది ఇంపార్టెంట్.?

టైమ్‌కు తినరు. టైమ్‌కు పండుకోరు. టైమ్‌కు లేవరు. టైమ్‌కు పనిచేయరు. నైట్ పండుకునేటప్పుడు "రేపు ఇంపార్టెంట్ పనుంది కాబట్టీ టైమ్‌కు లేవాలె" అనుకుంటరు. సాంప్రదాయినీ.. సుప్పినీ అనే రేంజిలో అలారం పెట్టుకుంటరు. ఆరింటికి లేవాల్సుంటే బుద్ధిగా ఐదింటికే అలారం సెట్ చేస్తరు. తెల్లవారంగ ఐదింటికే ట్రింగ్ ట్రింగ్‌మని అలారం మోగుతుంటది. మోగిన ప్రతీసారి స్నూజ్‌లో పెడ్తరు. ప్రతీ పది నిమిషాలకోసారి అది మోగుతనే ఉంటది. అట్లా అలారాన్ని ఆపీ ఆపీ ఏడింటికి లేచి తయారయ్యేసరికి ఎనిమిదైతది. ఆ ఇంపార్టెంట్ పని కాస్త టైంసెన్స్ లేకపోవడం వల్ల అన్- ఇంపార్టెంటైపోతది.

ఎక్కడ ఫెయిలైతున్నం.?

లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి బిగ్‌డీల్ తగులుతుంది. టైమ్లీ క్యాచ్ చేస్తే లైప్ సెటిలయ్యే చాన్స్ ఉంటది. ఒకరకంగా అదొక జాక్‌పాట్ కావచ్చు. రోజువారీ మన టైంటేబుల్, టైం సెన్స్ వేరే ఉండొచ్చు. షెడ్యూల్ కాస్త నిదానంగా ప్రిపేర్ చేసుకొని ఉండొచ్చు. కానీ.. డీల్ పెద్దది అని తెలిసినంక కూడా రొటీన్ షెడ్యూల్ ప్రకారమే ప్రిపేరైతం అనుకుంటే పుణ్యకాలం కాస్త ముగిసిపోతది. డీల్ ఇచ్చెటోడు కూడా ముందు మనకెంత టైమ్ సెన్స్ ఉంది.? అనేది చెక్ చేసుకున్నంకనే దానికి మనం సూటైతమా లేదా అనేది కాలిక్యులేట్ చేసుకుంటడు. చాలామంది ఇక్కడనే ఫెయిలై బిగ్ ఆఫర్స్ కోల్పోతుండ్రు.

అపాయింట్మెంట్ అంత లైటా.?

అపాయింట్‌మెంట్ ఉంది తొందరగా వెళ్లాలని తెలుసు. ఓ అద్దగంట ముందే ఉండాలని టైమ్‌కు రెడీ ఐతరు. టైం ప్రకారమే ఇంట్ల నుంచి బయల్దేరుతరు. తీరా రోడ్డెక్కేసరికి "అబ్బా ఇంకా ఇంత టైముందా" అనిపిస్తది. ఇంకేదో చిన్న పని గుర్తుకొచ్చి పోతరు. అటు తిరిగి ఇటు తిరిగి మల్లా అదే కథ ఐతది. టైంకు పోవాలని బైయల్దేరిన వ్యక్తి.. టైం చాలుందిగా అని విలువైన సమయాన్ని ఉత్తగనే గడుపుతడు. అంటే.. టైం సెన్స్ అనేది లేకపోతే మనం ఎంత ముందు లేచినా.. ఎంత ముందుగా ప్రిపేరైనా.. ఆఖరికి అటు మర్లి.. ఇటు మర్లి అపాయింట్‌మెంట్ టైం దాటిపోయినంకనే పోతరుగానీ.. ఓ పది నిమిషాల ముందు ఉండలేకపోతరు.

తప్పును ఎవరు ఒప్పుకుంటరు.?

టైంసెన్స్ లేకనే చాలామంది ఆగమైండ్రనే ముచ్చట తెలుసుకుంటే మంచిది. ఎవరి దగ్గర కనిపిస్తుంది ఈ టైంసెన్స్.? జనాలవి యాళ్లపాళ్ల లేని జీవితాలే.. ఆఫీసర్లవీ యాళ్లపాళ్ల తప్పిన కొలువులే. వాళ్ల టైంసెన్స్ గురించతే చెప్పతరం కాదు. టైం తగ్గట్టు వాళ్లుండరు. వాళ్లకు తగ్గట్టుగా టైంను మల్చుకుంటరు. "దొంగలువడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు".. బతికున్నప్పుడు అర్జీవెట్టుకుంటే ఆయింత పానంబోయినంక పరిష్కారానికి పిలుస్తరు. "ఏంసారూ ఇంత లేటా" అని అడిగితే "మీరొక్కరనే ఉన్నరా" అని అంటడుగానీ.. తనకు టైంసెన్స్ లేకపోవడం వల్లనే ఇంత ఆల్శెమైందనేది మాత్రం ఒప్పుకోడు.

బాధ్యతే గుర్తురాదు

హాస్పిటల్స్‌లో చూస్తుంటంగదా.? పాపం ఐసీయూలో పేషెంట్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే డాక్టర్ మాత్రం తన క్యాబిన్ల ఫోన్ సంభాషణలో బిజీగా ఉంటడు. అదేమన్న ఇంపార్టెంట్ ఫోన్ కాలా అంటే అదీ ఉండదు. "హలో చెప్పు.. తిన్నవా.? ఏం కూర" అనే ముచ్చట్లే. టైంపాస్ చేసి ఆఖర్కి చెక్ చేసి "మించిపోయింది" అని అంటడు. రావాల్సిన టైంకు వచ్చి.. సూడాల్సిన టైంకు చూస్తే పేషెంట్‌ పరిస్థితి సీరియస్ కండీషన్ ఉండకపోవు కదా.? ఏ పని ఎప్పుడు చెయ్యాల్నో ఒక డాక్టర్‌కు వేరేవాళ్లు చెప్పాల్నా.? అంత బాధ్యతగల్ల స్థానంలో ఉన్నొళ్లకు టైంసెన్స్ ఎంత ముఖ్యమో తెలవదా.?

అంత చేసినా అదే కథ

"ఎద్దున్నోడికి బుద్ధుండదు.. బుద్ధున్నోడికి ఎద్దుండదు" అంటరుగదా. సేమ్ అట్లనే మోపైండ్రు ఇప్పటి పోరగాళ్లు. కాలేజీ తొమ్మిదింటికి. ఐదు నిమిషాలు లేటైనా కాలేజీ గేట్ క్లోజ్ చేస్తరని తెలుసు. అందుకే ఏడు గంటలకే ఇంట్లకెల్లి బయల్దేరుతడు. తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు గేట్ ముందు నిలవడి సెక్యూరిటీ గార్డ్‌తో "ప్లీజ్ అంకుల్ పంపించు అంకుల్" అని బతిమిలాడుతడు. ఈ రెండు గంటలు ఏడికివొయ్యిండంటే.. సారుకు ఒక్కనికే రాబుద్ధి కాదుగా.? మధ్యలో వాణ్నీ.. వీణ్నీ కలుపుకొని అడ్డామీద బాతాఖానీ కొట్టేసరికి టైం తొమ్మిదైపాయె. బైక్ స్టార్ట్‌జేసి 80-90 స్పీడులో పోయినా లేటైపాయె.

సాకులొద్దు బ్రో

కొలువులే దొరుకుతలేవయా అంటే కొందరు.. వచ్చిన అవకాశాన్ని టైంసెన్స్ లేక కోల్పోతుండ్రు. ఇంటర్వ్యూకు టైమ్‌కు వెళ్లరు. మీటింగ్‌కు సరైన సమయానికి చేరుకోరు. "ఏ టైమ్‌కు రమ్మంటే ఏ టైమ్‌కు వచ్చినవ్" అని అడిగితే ఎక్కడలేని కారణాలు చెప్తరు. "బయల్దేరే టైమ్‌కు నల్లొచ్చింది.. నీళ్లు పట్టిన, మార్కెట్‌కువొయ్యి మావిడికాయలు తెచ్చినా, ట్రాపిక్ జామ్ అయింది" అని రకరకాల రీజన్స్ చెప్తుంటరు. కావాలనే ఇంట్రెస్ట్.. పోవాల్సిందే అనే సోయి ఉంటే ఏ ట్రాఫిక్ ఆపుతదండీ మనల్ని.? టైం పంక్చువాలిటీస్ పాటించకుండా ఉద్యోగాలిచ్చేవాడిని నిందిస్తే ఎట్లా.?

పోస్ట్‌పోన్ చేస్తే అంతే ఇక

కొంతమంది ఉంటరు. ఏది చెప్పినా తెస్తాగు.. చేస్తాగు అని అంటుంటరు. అసలు ఆ పనేందో కూడా పూర్తిగా తెలుసుకోకుండా మైండ్‌లో "ఆగు" అనేదాన్ని మైండ్‌లో ఫిక్స్ చేసి పెట్టు్కుంటారు. ఒక సందర్భంలోనో.. ఒక పనిలోనో కాదు. ప్రతీ పనిలో ఇదే ఫార్ములాను వాడుతుంటారు. ఒకరకంగా వాళ్లకిది అలవాటైపోతుందన్నమాట. "ఆగు" అనే మాట మైండ్‌లో ఉందంటే దానర్థం.. వాళ్లకు టైమ్ సెన్స్ లేదన్నమాట. పోస్ట్‌పోన్ మైండ్‌సెట్ వల్లనే ఈ దురలవాటు ఏర్పడుతుంది. ఒకవేళ ఇది ముదిరిపోయిందే అనుకోండి.. ఇక వాళ్ల సెన్స్.. టైమ్ సెన్స్ గురించి జన్మలో ఆలోచించదు.

ముహుర్తం ముచ్చటేమాయె.?

పెండ్లీల బాగోతం చూస్తుంటం కదా.? ముహూర్తం పదింటికి ఉంటది. సుట్టాలు పక్కాలు అందరొస్తరుగానీ పెండ్లి పిలగాని కాళ్లు కడిగేటొళ్లు రారు. పంతులొచ్చి కూసుంటడుగానీ పందిట్లకు పెండ్లి పిల్ల చేరుకోదు. వొచ్చినొళ్లు అటు చూసి ఇటు చూసి ఏ బార్లకో జొర్రుతరు. వచ్చింది పెండ్లికనే విషయమే మర్చిపోతరు. పని పూర్తిజేసుకొని తీరా ఫంక్షన్ హాలుకువోతే అప్పటికే లగ్గమైపోయి వధూవరులు భోజనం చేస్తుంటరు. టైమ్ సెన్స్ అనేది లేకపోవడంతో పదింటికి కావాల్సిన పెండ్లి ఒంటి గంటకయ్యింది. పెండ్లికొచ్చినొళ్లు ఒకొక్కరు ఒక్కోదిక్కువాయె. తప్పు ఎక్కడ జరిగిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

టాలెంట్ ఒక్కటే కాదు..

టైం సెన్స్ లేకపోవడం వల్ల ఇదీ అదీ అని కాదు. అన్ని పనులు ఆగమే ఐతున్నయి. పెండ్లి లేటాయె. హాస్పిటల్స్‌లో ఆపరేషన్ లేటాయె. కొలువు రాకపాయె. ఉన్న కొలువు ఊడిపాయె. తిండిలో సమయ పాలన లేకపోవడం వల్ల ఆరోగ్యం పాడైపాయె. పేరు కరాబైపాయె. దిమాగ్ కరాబాయె. ఒకటా రెండా.? ఇట్ల చెప్పుకుంటవోతే చాంతాడంత లిస్టే ఉంటది టైం సెన్స్ ముచ్చట. అందుకే చాలామంది టాలెంట్ ఉన్నా.. ఈ సమయ పాలన అనేది లేకపోవడం వల్లనే మంచి కెరీర్‌ను డెవలప్ చేసుకోలేకపోతుండ్రు. కొందరు డెవలప్ అయ్యే స్టేజికొచ్చినా టైంను విస్మరించి డౌన్ ఫాల్ అవుతుండ్రు.

పెద్ద సమస్యే

సైకాలజీ ప్రకారం టైం సెన్స్ లేకపోవడం అనేది ముదిరితే మానసిక సమస్యగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాంటి వాళ్లను "టైమ్ బ్లయిండ్‌నెస్"గా పేర్కొంటరంటా. ఈ సమస్య ఉన్నొళ్లకు టైమెట్ల ఐపోతుందే తెల్వదంటా. టైమ్‌కు పని మొదలు పెట్టడం.. లేదా కంప్లీట్ చేయడం రెండింటిలోనూ సమస్యలుంటయి. అంటే దేన్నీ సక్కగ చెయ్యరన్నమాట. ఈ సమస్యున్నొళ్లకు ఊకే ఆలస్యం అవటం.. పనుల షెడ్యూల్‌ చేయలేకపోవడం.. డెడ్‌లైన్లు మర్చిపోవడం.. ఒకే పనిలో ఎక్కువ సమయం ఉండిపోవడం.. లేదా తక్కువ సమయం కేటాయించడం వంటివి చేస్తరంటా.

ప్లాన్ ఉండదు

మనమేదో చిన్న సమస్య అనుకుంటున్నాం. కానీ మనకు తెల్వకుండ ఇదొక పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు చెప్తుండ్రు. నేటితరంపై ఇది ప్రభావం చూపిస్తుందని అంటుండ్రు. సైకలాజికల్‌గా ఇదొక సమస్యగా ఉత్పన్నమైతే.. డిప్రెషన్, యాంగ్జయిటీ సమస్యలొస్తయి. ఇంకా ముదిరితే "అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిసార్డర్" సమస్యకు గురైతరంటా. "ప్రొక్రాస్టినేషన్" అనే క్వాలిటీ ఉన్నొళ్లు పనులను వాయిదా వేసి టైం సెన్స్ ను పాటించక డెడ్ లైన్లను మిస్ ఐతరు. "ఇంపల్సివిటీ" అనే క్వాలిటీ ఉన్నొళ్లు దేన్నీ సరిగా ప్లాన్ చేసుకోకుండా చిందరవందర షెడ్యూల్ ప్రిపేర్ చేసి సమయపాలన లేని జీవితాన్ని గడుపుతారు.

Next Story