మా దారి గొర్రెదారి.. వెనక చూడం.. ముందుకు చూడం.!

by Daayi Srishailam |

తల నేలకేసుకున్నామా.. ముందెళ్లే తోక కనిపిస్తుందా.. దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నామా అంతే బస్

మా దారి గొర్రెదారి.. వెనక చూడం.. ముందుకు చూడం.!
X

దిశ, ఫీచర్స్: మనదంతా గొర్రెదాటుడు యవ్వారం. ఎనకాముందు చూసుడు ఉండదిక్కడ. గొర్రె పోయినట్లు ముందెళ్లే గొర్రెనకాల పోవడమొక్కటే తెలుసు. అది చెరువులకు తీసుకపోతుందా.? గుంతలకు తీసుకపోతుందా.? కంపల పడేస్తదా.? కాలువల నూకేస్తదా.? అనే పట్టింపేదీ ఉండదు. తల నేలకేసుకున్నామా.. ముందెళ్లే తోక కనిపిస్తుందా.. దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నామా అంతే బస్. రంగమేదైనా.. దారి ఏదైనా ఇదే కథ.. ఇదే తీరు.

గుడ్డెద్దు చేన్లవడ్డట్టు..

"గొర్రెకు ఎదురు.. గుర్రానికి ఎనక పోవద్దు" అంటారు పెద్ద మనుషులు. ఎందుకో తెలుసు కదా.? అది ఎనకా ముందు చూసుకోదు. తొవ్వపొంటి ఎవరొస్తున్నారనేది దానికి సంబంధంలేని విషయంగా భావిస్తుంది. ఈ క్రమంలో మనం వాటికి ఎదురుపోతే దారికి అడ్డం తగలొచ్చు.. కొమ్ములతో పొడవనూ వచ్చు. ఇంకోటి అది ఎప్పుడు తుమ్ముతుందో.. జాడిస్తుందో కూడా తెలవదు. అందుకే గొర్రెకు ఎదురుపోవద్దంటారు. కానీ.. మనం చేస్తున్నదేంది.? గొర్రెలకు ఎదురుపోవుడు కాదు.. గొర్రెల్లా దారితప్పి మిగిలిన వారినీ అట్లనే తీసుకపోతున్నాం. "గుడ్డెద్దు చేన్లవడ్డట్టు" అందరమూ గుండుగుత్తగా ఒకే బురదలోకి పెయ్యంతా పెండ పూసుకుంటున్నాం. మనతో వచ్చిన ఇంకో గోస ఏందంటే.. "అది వద్దురా సామీ" అని చెప్పినదాన్నే ఇంకా ఎక్కువ చేస్తుంటాం.

గొర్రె దాటుడు.. వేలం వెర్రి

వద్దన్న పని చెయ్యడమే కాకుండా "ఎల్లయ్య ఏది చేస్తే అదే చేస్తా" అనడం ఇంకో సమస్య. ఫర్ ఎగ్జాంపుల్.. కాలేజీలో చేరాలంటే ఏ కోర్సు తీసుకోవాల్నో మనకంటూ ఒక స్పష్టమైన అవగాహన, ముందస్తు ఆలోచన ఉండాలి. కానీ మనొళ్లు అట్ల చేసే బాపతు కాదు. పక్కపొంటోడు ఏ కోర్సు తీసుకుంటుండు.? వాడు ఏ కాలేజీలో చేరుతుండు.? వాని ఫీజెంత.? వంటి యవ్వారాలు తెలుసుకున్నంక వాడెట్ల చేస్తే.. అట్ల చేస్తం. అరే.. అది మన చదువు.. మన ఫ్యూచరు కదా.? మనం అవ్వాలనుకుంటున్నాం.. ఏ కోర్సు చేస్తే ఏమవుతాం అనేది మనకొక ప్లాన్ ఉండాలి. కానీ.. మనొళ్లు అట్లెవరూ చేయరు. ఎంతసేపూ పక్కోడెట్ల పోతుండు.. వాని ఎనకాల మనమెట్ల పోదాం అని మాత్రమే ఆలోచిస్తారు. దీనినే "గొర్రె దాటుడు.. వేలం వెర్రి" అని అంటారు.

మనసు అలా ఎలా మారుతుంది.?

మెకానికల్ ఇంజినీర్ కావాలని ఉన్నోడు మెకానికల్ ఇంజినీరింగే చేయాలి. కానీ ఇక్కడ అట్లుండదు. బాబాయ్ కొడుకు ఏం చేస్తుండు.? అత్తమ్మ కూతురు ఏం తీసుకుంది అనేదాన్ని బట్టి మన కెరీర్ ఆధారపడి ఉంటదన్నమాట. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆశ ఉంటుంది. ఇంట్లో వాళ్లు కూడా అట్లనే ట్రీట్ చేస్తారు. కానీ ఎంసెట్ రాసే నాటికి మనసు మారుతుంది. ఎందుకంటే పక్క బెంచీ పారిజాత ఇంజినీరింగ్ చదువుతా అంటుంది. ఎదురింటి ఏకాంబరం కొడుకు ఇంజినీరింగ్ చేసి అమెరికాలో సెటిలైండు. కాబట్టీ మనం కూడా ఇంజినీరింగే చేయాలనే ఆశ పుడుతుంది. ఇక్కడిదాక వచ్చినంక కూడా కన్ఫ్యూజనే. ఇంజినీరింగ్‌లో వాళ్లు సీఎస్ఈ తీసుకుంటే మనం అదే తీసుకోవాలి. వాళ్లు సివిల్ తీసుకుంటే మనమూ సివిలే తీసుకోవాలన్నమాట.

గొర్రెల్ని జమచేసే పనేనా ఇక.?

ప్రతీదాంట్లో మనొళ్లు ఈ గొర్రె పోకడనే పోతున్నారు. ఏదైనా ఇష్యూ జరిగిందనుకుందాం. ఎవరో ఒకరు దానిమీద కామెంట్ చేసేదాక వీళ్లెవరూ మాట్లాడరు. వ్యతిరేకించేవాళ్లయినా.. సమర్థించేవాళ్లయినా వాళ్లు మాట్లాడే దానిపై తమకంటూ ఒక అభిప్రాయం, ఉద్దేశం ఉండి మాట్లాడితే ఓకే. కానీ మనొళ్లు అలా కాదు. తమ అభిప్రాయాన్ని.. ఉద్దేశాన్ని తెలపడం కాకుండా ఇంకొకరు చెప్పంగనే అందుకుంటరు. అసలు వాళ్లేం చెప్తున్నారో కూడా ఆలోచించరు. అంత టైం కూడా లేదు మనొళ్ల దగ్గర. అదే గొర్రె పోకడంటే. అందరూ మాట్లాడుతున్నారంటే అది కరెక్టే అని ఫిక్సవుతారు. దీన్ని క్యాష్ చేసుకునేవాళ్లు "గొర్రె పండుకున్న జాగల బొచ్చెంత రాలింది" అని వెతుక్కొని ఇంకింత మంది గొర్రె జనాల్ని జమజేసే పనిలో మునుగుతారు.

నీకంటూ స్వతహాగా ఆలోచనే ఉండదా.?

రిస్క్ తీసుకోవడం, ఎక్స్‌పరిమెంట్లు చేయడం కొందరికి చేతగాదు. వాళ్లెంత సేపూ సేఫ్‌సైడ్ గురించే ఆలోచిస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది.? తమ టాలెంట్ మీద కాకుండా ఎదుటోడి నిర్ణయం మీద ఆధారపడాల్సి వస్తుంది. టెక్నాలజీ విస్తరించి ఎన్నో వ్యాపార అవకాశాలున్నా మనొళ్లు అటుదిక్కు మళ్లిచూడరు. ఒకరు చాయ్ బండి పెడితే వీళ్లూ అదే పెడతారు. లేకపోతే ఇంకెవరో మెడికల్ షాప్ పెడితే వీళ్లూ అదే పెడతారు. కానీ ఎవరూ పెట్టనిది.. ఎవరూ టచ్ చేయనిది టచ్ చేద్దామని మాత్రం అనుకోరు. అందుకే ఎక్కడైనా చూడండి.. ఒకచోట ఉంటే వరుసగా మెడికల్ షాపులే ఉంటాయి. లేదంటే స్కూల్సే ఉంటాయి. హోటల్సే ఉంటాయి. ఇదే గొర్రె దాటుడు యవ్వారం. అవకాశాలను కాకుండా అవతలి వాళ్ల నిర్ణయాన్ని బేస్ చేసుకొని బతుకుతుంటారు.

పాము అంటే పడగ అంటారు..

సోషల్ మీడియాలో చూడండి. జరిగితే ఒకరోజంతా ఒక్కటే టాపిక్ మీద రచ్చ జరుగుతది. వరదలతో మూసీ ముంచెత్తింది అంటే మొత్తం దానిమీదనే చర్చ జరుగుతుంది. అందరూ పెడుతున్నారు.. మనం పెట్టకపోతే ఏమవుతుందో ఏమో అనీ హరీబరీ పోస్టులు చేస్తుంటారు. ఎవరైనా ప్రముఖులు చనిపోతే.. క్రికెట్లో ఇండియా టీమ్ గెలిస్తే.. ప్రభుత్వం ఏదైనా పథకాన్ని తీసుకొస్తే ఎవరో ఒకరు దాని గురించి షురూ చేస్తారు. ఇక ఆ ఒక్కరు చేయంగనే మిగిలిన వాళ్లంతా గొర్రెల్ని తలపించేలా అవే పోస్టులు పెడుతుంటారు. చాలాసార్లు తాము పెడుతున్నది నిజమా కాదా.? అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోరు. ఇప్పుడు మనం పెట్టకపోతే ఏవైనా కొంపలు మునిగిపోతాయేమో అనే ఆత్రంలో తప్పొప్పులను సైతం పట్టించుకోకుండా చర్చకు దారితీస్తుంటారు.

మేధావులూ ఉన్నారు బాబోయ్..

విషయ అవగాహన ఉన్నవాళ్లు కూడా ఈ ఆత్రంలో బొక్కబోర్లా పడుతుంటారు. ఫలానా హీరోయిన్ విడాకులు అని ఎవరో పనికిమాలిన పోస్ట్ పెడితే దాన్ని నిర్ధారించుకోవాలనే స్పృహ లేకుండా సర్కులేట్ చేస్తుంటారు. అందరికంటే ముందుండాలి లేదా అందరితో పాటు ఉరకాలి అనే పోటీ నుంచి వచ్చిన ఆత్రమే ఇది. నిర్ధారించుకునేదాక వెయిట్ చేస్తే అది సెన్సేషన్ కాదుకదా.? ఒకవేళ అది తప్పని తేలితే ఎవరు పట్టించుకుంటారు. జనాలకు కావాల్సింది మసాలా. పోయినేడాది వినాయక విగ్రహాల తయారీకేంద్రంలో కరెంట్ షాక్ తగిలి నలుగురు చనిపోయారు. చాలామంది దీనిని తాజా విషయంగా స్ప్రెడ్ చేశారు. ఒకర్ని చూసి ఒకరు ఇట్లా చేసే సరికి అది మల్లొకసారి నెట్టింట్లో చక్కర్లు కొట్టింది.

ఎవడెట్ల పోతే నీకెందుకయా.?

పిల్లల్ని బాగా చదివించుకోవాలి.. ప్రయోజకుల్ని చేయాలి అనేది ఏ తల్లిదండ్రి అయినా కోరుకుంటారు. ఆ దిశగా వనరులు సమకూర్చి వాళ్ల కోసం తిప్పలు పడుతుంటారు. కాకపోతే ఇక్కడ మనొళ్లతో వచ్చిన పరేషాన్ ఏందంటే.. పిల్లల్ని ఏం చెయ్యాలి.. ఎట్లా ప్రోత్సహించాలి అనే ఆలోచన కంటే వేరేవాళ్లు ఏం చేస్తున్నారని 24 గంటలు నిఘా వేసి చూస్తుంటారు. బయటొళ్లు తమ పిల్లల్ని అమెరికా పంపితే మనమెందుకు పంపొద్దూ అని అనుకుంటారు. సరే అమెరికాకు పంపించి ఎక్కడ ఉండాలి.. ఏం చదవాలి అనేవి ఆలోచిస్తరా అంటే అవీ ఉండవు. ఫలానా వాళ్లు మనం పంపించాలంతే. అక్కడ చదివితే మన కాన్‌దాన్ల ఇజ్జత్ నిలవడ్తది అని ఆలోచిస్తారు. ఎంతసేపూ ఎవరెట్ల పోతుండ్రు.. ఎవరేం చేస్తుండ్రని ఆలోచించుకుంట కూర్చుంటారు.

ఇందుకోసమేనా మీరు చదువుకున్నది.?

ఒక ఊరు ఊరంతా డ్రైవర్లే ఉంటారు. లేదంటే ఎలక్ట్రీషియన్లు, మేస్త్రీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఇట్లా గుండుగుత్తగా ఒకే రకమైన ప్రొఫెషనల్స్ ఎందుకుంటారు.? అదే గొర్రె పోకడ. పిల్లల్ని బాగా చదివిస్తారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. పోతే అమెరికా కూడా పంపించే ప్లాన్ చేస్తారు పేరెంట్స్. కానీ మనోడికి దోస్తుగాడు బర్ల షెడ్ పెట్టిండని తెలిసి తనుకూడా డెయిరీ పెట్టాలనుకుంటాడు. చదువుకున్న చదువుకు.. చేస్తున్న ఆలోచనకు పొంతనే ఉండదు. కానీ అమెరికాలో ఇప్పుడు ఫ్యూచర్ లేదు.. సొంతూర్లోనే సంపాదించుకోవచ్చు.. ఫలానా దోస్త్ అలానే చేసిండనే ఆలోచనతో ఊర్లపొంటి పోరగాళ్లంతా ఇదే పనిలో మునిగిపోతున్నారు. ఆ పని చేయడం తప్పుకాదు. కానీ ఒకరు చేసిండ్రని అందరూ అదే చేయడం కోసమేనా తాము చదువుకున్నది.?

రైతులూ అలానే ఉన్నారు సామీ..

రైతులు కూడా ఇదే తొవ్వను ఎంచుకుంటారు. వ్యవసాయంలో పుట్టి.. వ్యవసాయంలో పెరిగిన వాళ్లు సైతం సొంత నిర్ణయంతో.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగ పనిచెయ్యరు. పక్క పొలమొళ్లు ఆకుకూరలేసి మంచి మార్కెట్ చేసుకుంటున్రంటే వీళ్లూ అదే వేయాలనుకుంటారు. వాళ్లు వరేస్తే వీళ్లూ వరే ఏస్తారు. వాళ్లు యూరియా చల్లితే వీళ్లూ చల్లుతారు. వాళ్లు నీళ్లు ఆపితే వీళ్లూ ఆపుతారు. అలా ఎందుకు చెయ్యాలి.? సొంతంగా ఆలోచించే సామర్థ్యం లేకనా.? అంత శ్రమ ఎందుకనా.? ఇంకొకరు చేసేదాన్ని అనుసరించి చేతులు కాల్చుకునే బదులు మన సొంత ఆలోచనతో ముందుకు సాగితే అంతకన్నా మెరుగైన లభాలు వస్తుండొచ్చు. అందరికన్నా మనమే వ్యవసాయంలో టాప్‌లో ఉండొచ్చు. కానీ అలా చేయం మనం.

మూసలో మురిసిపోవడం బంద్ చెయ్..

ఇక్కడ పాయింటేందంటే.. పనిలోనో, వ్యాపారంలోనో, చదువులోనో కాదు. సొసైటీ బిల్డపే ఇలా తయారవుతోంది. సొసైటీల దేనికైనా సమతుల్యత ఉండాలి. సమతుల్యత లేకపోతే వ్యవస్థ నడవదు. అందరూ డాక్టర్లే ఉన్నారనుకోండి.. మరి పేషెంట్లెవరు.? అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే అనుకోండి.. మరి వాటిని కొనేదెవరూ.? ఎవరి అభిరుచికి తగ్గట్టు.. ఎవరి ఆలోచనకు తగ్గట్టు వాళ్లు కెరీర్ బిల్డప్ చేసుకుంటే లేదా.. ఆలోచిస్తే ఈ రకమైన వ్యత్యాసాలేవీ ఉండవు కదా.? అలా కాకుండా.. ఇవేవీ విశ్లేషించుకోకుండా మూసలో ఉరుకుతూ మురిసిపోతే సాధించడానికి.. శోధించడానికి ఏమీ ఉండదు. క్రియేటివిటీతో పనే ఉండదు. ఏధో అందాజా తమకు తోచినట్లు గుడ్డిలో గురివింద అన్నట్ల ఇంకొకర్ని ఫాలో ఫాలో అనుకుంటూ పోతే సరిపోతుంది.

ఖద్దరేసుకొని కడక్ వాయిస్ వినిపిస్తాడు..

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. ఎలక్షన్లు కూడా త్వరలోనే ఉండొచ్చని అంటున్నారు. ఊర్లళ్ల అప్పుడే పంచాయతీ ఎలక్షన్ల ఫీవర్ షురూ అయ్యింది. ఇప్పుడెక్కడ చూసినా ఈ ముచ్చట్లే. అంతే ఈ మనుషులే అంత. ఎలక్షన్లు అయిపోయేదాక మిగతా విషయాలన్నీ పక్కన పెడతారు. అప్పుల గురించి.. ఆరోగ్యం గురించి.. సంపాదన గురించి.. సంసారం గురించి మర్చిపోతారు. బరిలో లేకపోయినా బలపర్చిన వ్యక్తినైనా గెలిపించుకోవాలనే ఆరాటం. వాస్తవానికి తనకెన్నో ముఖ్యమైన పనులుంటాయి. కానీ ఎలక్షన్ల సీజన్ మల్లె్ప్పుడొస్తదనే ధ్యాసలో అందరిలా తనుకూడా ఖద్దరేస్కొని కడక్ వాయిస్ వినిపిస్తుంటాడు. అందరు చేయంగా మనమెందుకు చేయొద్దు అని వార్డు మెంబరు బరిలోనో.. ఉప సర్పంచ్ రేసులోనో ఉండాలనుకుంటాడు.

గొర్లు కదిలినట్లే గుంపుగా కదులుతారు..

మనమేదైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సి ఉందనుకోండి. లేదా మన సంస్థ బాస్‌లు ఏదైనా నోట్ ప్రిపేర్ చేసివ్వమన్నారు అనుకోండి.. అదీ కాదంటే సింపుల్ స్పందనేదైనా ఇవ్వమన్నారనుకోండి. మనొళ్లు ఏం చేస్తారో తెలుసా.? ఏమని ఇవ్వాల్నో.. ఎట్ల స్పందించాల్నో అర్థం కాదు. చూద్దాం ముందుగాల ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో అని ఎదురుచూస్తుంటారు. ఎవరైనా ఒకరు "ఓకే" అన్నారనుకోండి. ఇక మిగిలినవాళ్లంతా గొర్రెలు కదిలినట్లు అందరూ "ఓకే""ఓకే" అని స్పందిస్తారు. అదేదో మనకు తెలియని సమాధానం కాదు. అయినా ఒకరు పెట్టినంకనే పెడదామని గోటికాడ నక్కలా ఎదురుచూస్తూ ఉంటారు. ఒకరు కదలగానే మిగతా గొర్లు కదిలినట్లు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేస్తుంటారు.

పెద్ద సమస్యే: వీరేందర్ చెన్నోజు, సైకాలజిస్ట్

మన ధోరణి మారాలి. మన ఆలోచనా విధానం మారాలి. షార్ట్ కట్‌లు మనల్ని కాపాడలేవు. షార్ట్‌కట్స్ వెతుకుతున్నావంటే మనం మన సామర్థ్యాన్ని నిద్రపుచ్చుతున్నామని అర్థం. ఎంతోమంది ఫెయిల్యూర్స్‌కి ఇదే కారణం. ఇలాంటికోవకు చెందిందే గొర్రె దాటినట్లు గుడ్డిగా పనిచేయడం. ఇదొక ట్రాన్స్‌లో బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉండి చేసే పని. సైకాలజీ పరంగా ఇది పెద్ద డిజార్డరే. దీనిని సెట్ చేయాలంటే కూడా అంత ఈజీ ఏం కాదు.

స్కిల్స్ దెబ్బతింటాయి: నూనె సుదర్శన్, సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్

తమకంటూ ఒక ఆలోచన లేనివాళ్లు, ఎదుటివారి మీద ఆధారపడేవాళ్లు ఏదీ చూడకుండా గొర్రె దాటుడు యవ్వారంలా వెళ్తుంటారు. దానివల్ల స్కిల్స్, టాలెంట్, క్రియేటివిటీ అంతా కనుమరుగైపోతుంది. ఎంతసేపూ ఇంకొకరిని అనుసరించాలనే ధ్యాసే ఉంటుంది. చదువుకున్నవాళ్లు, మంచి హోదాలో ఉన్నవాళ్లు కూడా ఇలాంటి తప్పులు చేసి కెరీర్‌ను పాడుచేసుకుంటుంటారు. ఈ ధోరణి వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ.

ఒకర్ని చూసి ఒకరు: మన్నె సురేష్, మోటివేషనల్ స్పీకర్

ఈ ధోరణి చాలామందిలో ఉంటుంది. ఎవరైనా ఏదైనా షురూ చేయంగనే అందరూ అదే పాట పాడుతుంటారు. తమకంటూ నిర్ధిష్టమైన లక్ష్యం.. గమ్యం ఉన్నప్పటికీ అవన్నీ వదిలేసి గొర్రె దాటినట్లు వెనకా ముందు ఆలోచన చేయకుండా గుడ్డిగా మొదలుపెడతారు. దాంట్లో ఖర్చెంత, ఆదాయమెంత, లాభమెంత, ఒకవేళ లాసైతే పరిస్థితేంటి వంటివేవీ ఉండవు. గుడ్డిగా ఒకరు చేసిండ్రు కాబట్టీ చేద్దాం అనుకుంటారంతే.

Next Story