కొడుకు పుత్తడి.. కూతురేమో ఇత్తడా.?!

by Daayi Srishailam |   (  Updated:2025-10-14 01:04:32  IST  )

ఏ తల్లిదండ్రి తమ కూతుర్లను కొడుకుతో సమానంగా చూసుకుంటున్నారు.?

కొడుకు పుత్తడి.. కూతురేమో ఇత్తడా.?!
X

మనకూ ఓ కూతురుండాలని ఆశ పడతాం.

ఎందుకంటే ఆడపిల్ల ఇంట్లో ఉంటే "లచ్చుమమ్మోరు" ఉన్నట్టే.

కూతురిలో అమ్మను చూసుకొని మురిసిపోవచ్చు.

"నా బిడ్డ రాణి రుద్రమ.. నా బిడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి" అని చెప్పుకొని మెరిసిపోవచ్చు.

మనం ఈ భూమికి ఎడబాసిన్నాడు..

"నా అయ్యో.. నా అమ్మో" అని ఏడ్చి మన ఆత్మలను శాంతింపజేయడానికి కూతురైతే కావాలి.

కానీ ఏ తల్లిదండ్రి తమ కూతుర్లను కొడుకుతో సమానంగా చూసుకుంటున్నారు.?

- దాయి శ్రీశైలం

నిజంగా గుండెమీద చెయ్యేసుకొని చెప్పుండ్రీ.? ఏ మనం మన కొడుకును.. కూతుర్ని ఒకేలా చూస్తున్నమా.? అందరూ అని చెప్పట్లేదు. అన్ని విషయాల్లో ఇలా ఉంటారనడం లేదు. కానీ.. సగటు ఇండియన్ పేరెంట్ సైకాలజీ ఇలానే ఉంటుంది. "నా తర్వాత నా కొడుకే" అని చెప్పుకుంటాం. కానీ.. కూతురు అని చెప్పుకోలేం. ఆస్తి అంతస్తులు.. భూములు జాగలు పక్కకు పెడదాం. ఇద్దరికీ ఒకే రకమైన స్వేచ్ఛనిస్తున్నామా.? ఏమన్నంటే.. "ఆడపిల్లవు" అనే దబాయింపు. కొడుక్కి స్వేచ్ఛా వాయువులందించి.. కూతుర్ని మాత్రం నిబంధనల పంజరంలో నీల్గవెడ్తాం. షరతుల జైల్‌ఖానాలో బందిస్తాం. హద్దులు మీరమని ఎవరూ ప్రోత్సహించడం లేదు. కానీ ఆ హద్దులు ఇద్దరికీ ఒకేలా ఉంటే మంచిదని చెప్తున్నాం. అలా పాటించనప్పుడిక సమానత్వమెక్కడిది.?

ఒక కన్ను ఎక్కువ.. ఇంకో కన్ను తక్కువనా.?

"కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిలా పెంచాలిరా" అని గొప్ప పలుకులు పలుకుతాం. అలాంటి పాటలు విని తరిస్తాం. కానీ.. వాస్తవిక జీవితంలో అదే సూత్రాన్ని పాటిస్తమా.? చిన్నప్పటి నుంచే "కూతురు" పట్ల కఠినంగా ఉంటాం. కొడుకును ఒక తీరుగా.. కూతుర్ని ఇంకో తీరుగా చూస్తాం. ఏమన్నంటే "ఇయాలరేపు ఆడపిల్లల్ని అట్లనే చూడాలె.. బయటకట్ల కఠినంగనే కన్పిస్తంగానీ లోపల మస్తు ప్రేముంటది" అని సెంటిమెంట్ డైలాగులు కొడతాం. ఇంకా "అమ్మాయిలకు ఆ మాత్రం భయం పెట్టకపోతే ఎట్లా" అనే కవరింగులు ఇస్తుంటాం. "కూతురు" పట్ల చిన్నచూపే లేకపోతే.. కొడుకు తర్వాతనే కూతురనే వివక్షే లేకపోతే" ఈ డొంక తిరుగుడు మాటలెందుకొస్తయి.? "ఇద్దరూ నా కండ్లే" అన్నప్పుడు.. ఒక కన్ను ఎక్కువ ఇంకో కన్ను తక్కువుంటదా.?

కూతురైతే వద్దని మొఖమ్మీదనే చెప్పేయమా.?

"కూతురు" పట్ల వ్యత్యాసం చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. పుట్టినప్పుడు "నా తల్లే.. నా బంగారమే.. నా అమ్మనే.. నా వెండే.. నా లచ్చల కోడెనే" అని ఎగిరేసి ఎత్తుకొని మురిసి ముద్దాడిన కూతురు పెరుగుతున్న కొద్దీ ప్రయారిటీ తగ్గుతుంది. ప్రేమలు బాగనే ఉంటాయి. కానీ.. ప్రయారిటీ కాడనే తేడా వస్తుంది. కొడుకుకైతేనేమో "అరేయ్ నీకు వచ్చే బర్త్ డేకు సైకిలిప్పిస్తరా" అని వాడు అడగముందే ఆశపెడతాం. అదే కూతురు తనంతట తానుగా "నాన్నా నాకు సైకిల్ కావాలీ" అని అడిగితే "హా.. బాగనే తొక్కినవ్ తియ్.. ఆడపిల్లకు నీకెందుకమ్మా సైకిలూ" అని మొఖమ్మీదనే వద్దని చెప్పేస్తాం. "ఆడపిల్లలకు ఇగ సైకిళ్లే ఇప్పిస్తలేరు.. వాళ్లు సైకిళ్లే తొక్కుతలేరా" అంటే.. అది కొడుకు వాడేసిన సైకిలైనా ఉండాలి.. లేకపోతే వాడికంతకన్నా ఖరీదైనది ఇంకేదైనా ఇప్పించి ఉండాలి.

అంగట్లవెట్టి అమ్మి తక్కెట్లవెట్టి జోకాల్నా.?

"కొడుకు" ఇంటికి రావడం ఆలస్యమైతే పేరెంట్స్ మస్తు గరమ్మీదుంటారు. "వాడు ఇంటికైతే రానీయ్ చెప్తా" అనే రేంజిలో మాట్లాడతారు. తీరా వచ్చినంక.. "యాళ్లపూటొస్తెగాదా" అని నాన్న అపురూపంగా మందలిస్తే.. అమ్మ "టేబుల్ మీద అన్నముంది.. ఆమ్లెటుంది తిని జల్ది పండుకో" అని గావురం చేస్తుంది. ఒకవేళ "కూతురే" ఇంటికి ఓ ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే.. అంగట్లవెట్టి అమ్ముతరు.. తక్కెట్లవెట్టి జోకుతరు. "టైమెంతయ్యింది.? ఇప్పుడేనా ఇంటికొచ్చేది. అందుకే నేను మొత్తుకునేది ఈ సదువులు.. కోచింగులు అవసరమా అనీ" అని నాన్న గుడ్లు గుర్కాయిస్తే.. అమ్మనేమో "నీకు దిమాగ్ పన్జేస్తలేదానే.? భయం భక్తిలేక నన్ను తిట్టిపిస్తవ్. ఎన్నిసార్లు జెప్పాలె.. ఇంకెన్నడు బుద్ధొస్తదో ఏమో.. తిండి దండగ.. పైసల్ దండగపో నీకు" అని కొట్టినంత పనిజేస్తది.

పెండ్లి చేయాలి కాబట్టీ పొగడాలన్నమాట.?

ఇంట్లో అలా కసురుకుంటారు గానీ.. బయటివాళ్లతో "మా అమ్మాయినైతే చాలా మంచిగా చూస్కుంటం. మేం గీత గీస్తే దాటదు. మేం ఎట్లజెప్తే అట్ల వింటది. మొన్ననే ఐదు తులాలువెట్టి నెక్లెస్ జేపిచ్చినం" అని మిస్టర్ పర్ఫెక్ట్ ముచ్చట్లు చెప్తరు. వినేవాళ్లుంటే "అసలు కాళ్లకు మట్టి అంటకుండా పెంచినం.. చెటాన చెంపదెబ్బ ఎయ్యకుండ సాదినం" అని ప్రేమ తుపాను కురిపిస్తారు. ఎందుకంటే "కూతురుకి" పెండ్లి చేయాలె కదా.? మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్తెనే మంచి సంబంధం దొరుకుతుందనే వాళ్ల పాయింట్. అందుకే ఇంట్లో ఒకలా ఉన్నా.. బయట అందరు చూస్తున్నప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకొని పేలు చూస్తుంటది. చుట్టాలు వాళ్లూ వీళ్లూ వెళ్లిపోగానే "ఇట్లనేనా రెడీ అయ్యేది.. ఆ జుట్టేంది వీరబోసుకున్నవ్" అని దండకం మళ్లీ షురూ చేస్తారు.

మొగ పోరగాళ్లయితే ఎట్లో అట్ల బతుకుతరా.?

అందరూ ఇలానే ఉంటారని చెప్పడం లేదు. చాలామంది కూతుర్ల పట్ల ఇలాంటి వివక్షనే చూపిస్తున్నారు. మంచిగనే చదివిస్తారు.. అడిగినవి కొనిస్తారు. కానీ అవి కొడుకుతో పోలిస్తే సమానంగా ఉండవు. అంతెందుకు చదువుకొని, మంచి హోదాలో ఉన్నవాళ్లు కూడా తమ కూతుర్ని ఒక స్కూల్లో, కొడుకుని ఇంకో స్కూల్లో చదివిస్తుంటారు. "పాప చదువులో హుషారుగా ఉంది. బాబే మొద్దునా కొడుకు.. అందుకే కొడుకును లక్షల్లో ఫీజున్న స్కూల్లో చేర్పంచి.. బిడ్డను వేలల్లో ఫీజున్న స్కూల్లో చదివస్తారు. వాళ్ల ఉద్దేశం ఏంటంటే.. "మొగ పోరగాళ్లయితే ఎట్లో అట్ల బతుకుతరు. వాళ్లేం జేసినా నడుస్తది. కానీ ఆడిపోరగాళ్లది అట్ల కాదుగా. ఒగయ్యింటికిస్తే అక్కడ అత్తమామతోటి అణిగిమనిగి ఉండాలె.. కట్టుకున్నోనితోటి భయంభక్తితో ఉండాలె"అని ఆలోచిస్తారు.

కొడుక్కి సంపాదించి పెట్టాలె.. బిడ్డెను సాగనంపాలె.!

"కూడబెట్టడం.. పోగెయ్యడం" పైకి చూడటానికి "కూతురు కోసమే" అనే గోల్డ్ కోటింగ్ ఇచ్చినా ఆ ఉద్దేశం వేరేదై ఉంటుంది. ఇవన్నీ ఎందుకు. చాలా సింపుల్ ముచ్చట.. రోజూ మన కండ్లముందు జరిగేవే చూద్దాం. "ఏంజేస్కుంటవ్ సామీ.. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నవ్" అని ఎవరైనా అంటే.. "నాగ్గూడ మొగ పోరడుండుగానే.. రేప్పొద్దున వాడు అనడా మా అయ్య నాకేం సంపాదించిండు" అనీ అని చెప్తుంటారు. అంటే.. వాళ్ల ఉద్దేశం కొడుకుకు సంపాదించి పెట్టాలె. ఆస్తికి.. అంతస్తుకు వారసుడు కొడుకే. అంతేగానీ "బిడ్డకోసం కష్టపడుతున్నా.. బిడ్డ కోసం సంపాదిస్తున్నా" అని అనరు. బిడ్డను ఎంతసేపూ లగ్గంజేసి సాగనంపుడే కదా అనుకుంటారు. మంచి కట్నమిచ్చి.. మంచి కాన్‌దాన్ చూసి పెండ్లిచేస్తే బరువు.. బాధ్యత తీరిపోయినట్లు ఫీలవుతుంటారు.

కొడుకులా ఎందుకు పెంచొద్దు.?

ఇద్దరూ అమ్మాయిలే పుట్టారనుకోండి.. చాలామంది ఏం చేస్తున్నారు.? చిన్న కూతురికి అబ్బాయి డ్రెస్ వేసి తనలో కొడుకును చూసుకుంటున్నారు. ఒక కొడుకు.. ఒక బిడ్డె ఉంటే బాగుంటుందనే ఆలోచన మంచిదే. కానీ.. ఎవ్వరైనా ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్లు కూతురు లేదనే వెలితితో తమ ఇద్దరు కొడుకుల్లో ఒకరికి లంగావోణి వేసి పెంచిన చరిత్ర ఉందా.? కూతుర్ని కొడుకులా చూసుకున్నట్లుగా.. కొడుకుని కూతురిలా ఎందుకు చూసుకోలేకపోతున్నారు.? అంటే మానసికంగా అలాంటి వాటికి సమాజం సానుకూలంగా ఉండదన్నమాట. ఐనా.. కూతుర్ని కొడుకులా పెంచడమంటే మగవాళ్లేసుకునే బట్టలేయడం మాత్రమే కాదు. కొడుక్కిస్తున్న ప్రయారిటీ ఇవ్వాలి. ఆమెకివ్వాల్సిన స్వేచ్ఛను ఇవ్వాలి. స్వతంత్రంగా ఉండే.. సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలి.

కొడుకుపై నమ్మకం సరే.. కూతురు మారదా.?

"మా బిడ్డ మీద మాకు వివక్ష ఎందుకుంటదీ.? మాకు కొడుకెంతనో.. కూతురు కూడా అంతే" అని చెప్పేవాళ్లు నిజాయితీగా ఒకమాట చెప్పాలి. పెండ్లయి అత్తగారింట్లో ఉన్న కూతురికి ఎంతమంది గుణుక్కోకుండా ఆర్థిక సర్దుబాటు చేస్తున్నారు.? "ఇల్లు కడుతున్నం.. ఓ లక్ష రూపాయలు ఇయ్యి" అని నోరు తెరిచి అడిగితే.. "హిహ్హిహ్హీ నా దగ్గరెక్కడివిరా.. నేనే చిట్టీలు కట్టలేకపోతున్నా" అని నవ్వి ఊరుకుంటారుగానీ పైసా సాయం చేయరు. ఎన్నడో ఒకనాడు పండుగ పబ్బాలకు వెయ్యి రూపాయలు ఇవ్వడానికే ఆపసోపాలు పడుతారు. కానీ.. అదే కొడుకు ఆన్ లైన్ గేమ్స్ ఆడి పది ఇరవై లక్షలు పోగొడితే మాత్రం "ఊర్లో ఇజ్జత్ పోతుంది" అని అదలుబదలు చేసైనా సరే అప్పు కట్టేస్తారు. కొడుకు ఇవాళ కాకపోతే రేపైనా మారతాడనే నమ్మకం పెట్టుకుంటారు.

కొడుక్కి ఆకులల్ల.. కూతురుకి కంచాలల్లనా.?

ఏదో ఎందుకండీ.. రాజకీయం ముచ్చట్నే తీసుకుందాం. నాన్న రాజకీయ వారసత్వం కూతురుకు ఇస్తారా.? కొడుక్కా.? ఒకవేళ కొడుకేదైనా అవినీతి మరక అంటించుకుంటే లేదా అన్‌ఫిట్ అని డిసైడైతే మాత్రమే "నా రాజకీయ వారసురాలు నా కుమార్తె" అని ప్రకటిస్తారు. అంతేతప్ప వాళ్లంత వాళ్లుగా నేరుగా కూతుర్ని రాజకీయ వారసురాలిగా ప్రకటించరు. వారసత్వం కొడుక్కే.. స్వేచ్ఛ కొడుక్కే.. ఆస్తి కొడుక్కే.. ప్రేమ కొడుక్కే.. ఇలా అన్నీ కొడుక్కిచ్చి కూతురు దగ్గర వెతుక్కునే వాళ్లే మనొళ్లు. ఐనా వడ్డించేటోడు మనోడైతే ఏ మూలగ్గూసుంటేంది.? ఇదే నీతి సూత్రాన్ని ఫాలో అవుతున్న మెజార్టీ జనాలు.. కొడుక్కి ఆకులల్ల.. కూతురుకి కంచాలల్ల వడ్డించి చేతులు దులుపుకుంటున్నారు.

ఏమని అర్థం చేసుకోవాలి.? లోపం ఎవరి.?

కొడుకైనా.. కూతురైనా ఇద్దరొక్కటే అనుకుంటేనే సమాన ప్రాధాన్యత ఇచ్చినట్టు. అలా కాకుండా కొడుకూ కొడుకూ అని గావురం చేస్తే.. ఏదో శాస్త్రం ఉంటది కదా "గావురం గంజికేడిస్తే" అనీ అట్లయితది కథ. ఇక్కడ కొడుకులను తక్కువ చేసి చూపడంగానీ.. పనికిరానివాళ్లుగా చూపడం లేదు. కాకపోతే ఈ లింగ వివక్ష అనేది ఇంటి నుంచే ప్రారంభమై ఒకర్ని ఒకలా.. ఇంకొకర్ని ఒకలా చూస్తున్నారు. మొన్న పొద్దుటూర్లో ఏం జరిగిందో చూసినం కదా.? పాపం.. ఆ తల్లి ఒక గవర్నమెంట్ టీచర్. ఎందరు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉంటుందో.? కానీ సొంత కొడుక్కి నేర్పలేకపోయింది. మందలించిన పాపానికి వాడు తల్లి గొంతుకోసి.. బయట పడేసి దర్జాగా టీవీ చూస్తున్నాడంటే ఏమని అర్థం చేసుకోవాలి.? లోపం ఎవరిదనుకోవాలి.?

అందరూ అలా ఉంటారని కాదు.. కానీ.!

కూతురు, కొడుకు అనే వ్యత్యాసం సొసైటీలో ఉన్న ప్రతీ పేరెంట్ చూపిస్తారని మా ఉద్దేశం కాదు. చాలామంది అల ఉంటారు. విదేశాల్లో చదివిస్తారు. భారీ ఫీజులు చెల్లిస్తారు. అమ్మాయిలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాగనే ఎంకరేజ్ చేస్తుంటారు. ఐతే.. అది భయమో.. అభద్రతో.. లేక సొసైటీలో జరుగుతున్న కొన్ని సంఘటనల ప్రభావమోగానీ ప్రాధాన్యతనివ్వడంలో కొంత వ్యత్యాసాన్ని చూపిస్తుంటారు. అంటే ఇద్దరికీ ఒకే షాపులో వస్తువులు తీసుకున్నా.. ఒకే ప్రొడక్ట్ ఆర్డర్ చేసినా రెండింట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. మన పిల్లలపై మనకుండాల్సింది భయం.. అభద్రత.. అనుమానం కాదు. నమ్మకం ఉండాలి. సొసైటీ అలా ఉందని మనం కఠినంగా ఉన్నంత మాత్రాన మార్పొస్తుందా.?

సమానత్వం అంటే అవసరాలు తీర్చడమా.?: నవజీవన ప్రియ

కూతురుకి అవకాశాలివ్వడంలో మన ఆలోచనలు ఇంకా పాతకాలుపు ధోరణిలోనే ఉన్నాయి. వాస్తవానికి తల్లిదండ్రులు కూతురి అవసరాలు తీర్చడంలో వెనకాడరు. మంచి బట్టలు.. సౌకర్యాల.. విద్యా సామగ్రి అన్నీ అందిస్తారు. కానీ అవకాశాల విషయంలో వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. కొడుక్కి ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపుతారు. కూతురికి మాత్రం ఇక్కడే చదువుకుంటే చాలు అని దబాయిస్తారు. కూతురి విషయంలో భద్రతను సాకుగా చూపి ఎక్కడికీ వెళ్లనీయరు. ఈ భావన అవగాహనలో కనిపించకపోయినా.. ఆచరణలో మాత్రం స్పష్టంగా ఉంటుంది. సమానత్వం అంటే అవసరాలు తీర్చడం కాదు.. అవకాశాలు సమానంగా ఇవ్వడం. అంత చదివేం చేస్తుంది.. పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అనే మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇది కేవలం అమ్మాయిని కాదు.. ఒక కుటుంబాన్ని.. ఒక తరాన్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది.

ఆత్మన్యూనత భావం పెరుగుతుంది: సుధ కొనకళ్ల, సామాజికవేత్త

మొదట్నుంచీ మనది పురుషాధిక్య సమాజం. ఇప్పుడే కొంతలో కొంత మార్పు వస్తోంది. అయితే ఈ మార్పు మహిళల్లో సాధికారతను ఆశించిన స్థాయిలో పెంచడం లేదు. దీనికితోడు ఆడవాళ్లకు సహజంగానే కుమారుల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తండ్రులకేమో ఆడపిల్లల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే పిల్లలకు సమాన అవకాశాలు కల్పించడంలో వ్యత్యాసం ఉంటుంది. కొడుకు వంశోద్ధాకుడు కాబట్టీ ప్రయారిటీ ఇస్తే ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వెనకటి కాలంలో అంటే అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టీ ఈ విధానం సాగిపోయింది. కానీ ఇప్పుడు అలాంటి విధానం సరికాదు. సాధ్యమైనంత వరకు కొడుక్కి ఎంత అవకాశం కల్పిస్తున్నామో కూతురికీ అంతే కల్పించాలి. ఒకవేళ కొడుక్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి.. కూతురి విషయంలో సంకుచిత స్వభావాన్ని ప్రదర్శిస్తే వారిలో ఆత్మన్యూనత భావం పెరిగిపోతుంది. అది ఇంటికి మాత్రమే కాదు.. సమాజానికీ మంచిది కాదు.

READ MORE ......

ఎవరిదీ లోపం.. మగవాళ్లలో పిల్లలు పుట్టక పోవడానికి కారణాలు ఏంటో చెబుతారా ?


Next Story