- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా vs పాకిస్తాన్.. నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్న డాక్యుమెంట్
క్రికెట్‌ను ఆటలా కాకుండా యుద్దంలా చూసే దేశాలు బహుశా ఈ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మాత్రమే. ఇండియా, పాకిస్తాన్ మధ్య హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ లాంటి మ్యాచ్‌లు జరుగుతుంటాయి.

క్రికెట్‌ను ఆటలా కాకుండా యుద్దంలా చూసే దేశాలు బహుశా ఈ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మాత్రమే. ఇండియా, పాకిస్తాన్ మధ్య హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ లాంటి మ్యాచ్‌లు జరుగుతుంటాయి. కానీ, వాటికి లేని ఒక ఎమోషన్.. ఒక్క క్రికెట్ మ్యాచ్‌కే ఉంటుంది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే చూస్తున్న ప్రతీ అభిమానీ ఒక సైనికుడిలా ఫీల్ అవుతాడు. వేసే ప్రతీ బంతిని ఒక ఫిరంగి గుండులా.. కొట్టే ప్రతీ షాట్‌ను మిస్సైల్ దాడిలా భావిస్తాడు. క్రికెట్ ఆడే ఆటగాళ్లు కూడా.. ఈ రెండు దేశాల మ్యాచ్ ఫలితాన్ని అంత స్పోర్టివ్‌గా తీసుకోరు. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఆడే ఆటగాడి నుంచి చూసే ప్రేక్షకుడి వరకు అందరూ ఒకేలా ఫీలయ్యేది ఒక్క ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కే. అందుకే ఈ రెండు దేశాల క్రికెట్‌ను 'ది గ్రేటెస్ట్ రైవల్రీ'గా పిలవడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. = జాన్ కోరా
ఇండియా-పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడక చాలా ఏళ్లు గడిచిపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. 1952 నుంచి 2008 వరకు రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాయి. కానీ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే సిరీస్ 2003-2004 సీజన్‌లో జరిగిన బైలేటరల్ సిరీసే. దీని వెనుక ఒక పెద్ద స్టోరీనే ఉంది. ఈ సిరీస్ మొత్తం ఒక ఎమోషన్.. ఒక రివల్యూషన్. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఆ సిరీస్‌కు సంబంధించి ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. 'ది గ్రేటెస్ట్ రైవల్రీ : ఇండియా Vs పాకిస్తాన్' అనే పేరుతో ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమ్ అవుతోంది. మూడు ఎపిసోడ్లు ఉన్న ఈ డాక్యుమెంటరీని చూస్తుంటే అస్సలు బోర్ ఫీల్ అవరు. ఈ సిరీస్‌కు ముందు ఏం జరిగింది? ఈ సిరీస్‌లో ఆడిన ఆటగాళ్ల ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? చూసిన ప్రేక్షకులు ఎలా ఫీలయ్యారనే ప్రతీ అంశాన్ని టచ్ చేస్తూ తీసిన అద్భుతమైన డాక్యుమెంటరీ ఇది. సాధారణంగా డాక్యుమెంటరీ అంటే చూడటానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఈ డాక్యుమెంటరీని మొదలు పెడితే.. చివరి వరకు ఆపకుండా చూస్తారు. అంత నాటకీయంగా నడిపించారు. ఈ డాక్యుమెంటరీ మొత్తం ఇండియా వైపు నుంచి వీరేంద్ర సెహ్వాగ్, పాకిస్తాన్ వైపు నుంచి షోయబ్ అక్తర్ మాటల్లో నడుస్తుంది. వారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే డాక్యుమెంటరీని నడిపించడంతో.. మనం కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాం.
ది రైజ్ ఆఫ్ ది లెజెండ్స్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ కొట్టిన సిక్స్‌తో ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. వీరేంద్ర సెహ్వాగ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్, రవిచంద్రన్ అశ్విన్, రమీజ్ రాజా.. వీళ్లందరూ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో చెబుతూ మనల్ని నెమ్మదిగా ఆ ఎమోషన్‌కు లింక్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే ఇండియా-పాకిస్తాన్ సిరీస్‌లోకి తీసుకెళ్లరు. కానీ ఆ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఇద్దరు లెజెండరీ క్రికెటర్ల ఎదుగుదలను చూపిస్తారు. 2004 సిరీస్‌లో షోయబ్ అక్తర్, వీరేంద్ర సెహ్వాగ్ మధ్య బంతితో, బ్యాట్‌తో జరిగిన యుద్దానికి ముందు.. వీళ్లు ఎలా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. వాళ్ల పడ్డ కష్టాలేంటి. చివరకు పాక్ గడ్డపై వీరిద్దరి మధ్య జరిగిన పర్సనల్ యుద్దం ఏంటనేది చూపించారు. షోయబ్ బంతులను తప్పించుకోవడానికి ఇండియన్ బ్యాటర్లు పడ్డ కష్టాలు.. సెహ్వాగ్‌ను ఆపడానికి పాకిస్తాన్ బౌలర్లు చేసిన ట్రిక్కులను చూపించారు. మొత్తంగా ఇది అక్టర్, సెహ్వాగ్‌ల ఎపిసోడ్. వీరిద్దరి ఆటకు ఒక ఇంట్రడక్షన్.
ది బ్యాటిల్ గ్రౌండ్
1999లో కార్గిల్ వార్ జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అప్పుడే ఒక ప్రతిపాదన తీసుకొని వస్తాడు పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. ఎవరైతే కార్గిల్ వార్‌కు ఆద్యుడో.. అతనే ఇండియా-పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడటానికి క్రికెట్‌ను ఒక పావులా ఎంచుకుంటాడు. తమ దేశంలో ఆడటానికి భారత క్రికెట్ జట్టును ఆహ్వానిస్తాడు. ముషారఫ్ మాటలను ఎలా నమ్మేది? ఒక వేళ నమ్మినా భారత ప్రభుత్వం అనుమతిస్తుందా? అప్పటి ప్రధాని వాజ్‌పేయి మనసులో ఏముంది? ఇరు దేశాల ప్రభుత్వాలు ఓకే చేసినా.. ఆటగాళ్లు ధైర్యం చేసి వెళ్తారా? ఇలా సాగుతుంది ఎపిసోడ్. (వెళ్తారని మనకు తెలుసు.. కానీ ఆ డ్రామాను మనం ఫీల్ అయ్యేలా చేయడమే ఇక్కడ సక్సెస్). 15 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన భారత జట్టులో ఆటగాళ్ల భయాందోళనలు ఎలా ఉన్నాయనేది చక్కగా చూపించాడు. అదే సమయంలో క్రికెట్ కోసం పాకిస్తాన్ వెళ్లిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎమోషన్స్‌ను తెరపై మనం ఫీల్ అయ్యేలా చేశారు. ఈ ఎపిసోడ్‌లో వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లలో జరిగిన డ్రామా అంతా చూపించారు. అప్పటికి 2-2తో సిరీస్ సమానంగా ఉంటుంది. ఒక కీలకమైన వివాదంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
మేకింగ్ హిస్టరీ
ఇండియా-పాకిస్తాన్ మధ్య చివరిదైన 5వ వన్డేతో ఈ ఎపిసోడ్ ప్రారంభిస్తారు. అయితే ఈ మ్యాచ్‌తో స్టార్ అయిన లక్ష్మీపతి బాలాజీ గురించి షోయబ్ అక్తర్, సెహ్వాగ్, గంగూలీ చెప్పిన మాటలు మనకు ఆహ్లాదంగా అనిపించడమే కాదు.. నవ్వు కూడా తెప్పిస్తాయి. షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో బాలాజీ సిక్సులు బాదడం.. బంతితో పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించడం.. మొత్తంగా ఈ మ్యాచ్ మొత్తం బాలాజీ నామస్మరణతో ఉంటుంది. బాలాజీకి ఎంత పేరొస్తుందంటే.. చివరకు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా బాలాజీ కొట్టే సిక్సులకు చప్పట్లు కొట్టేంత. మొత్తానికి టీమ్ ఇండియా వన్డే సిరీస్ గెలుస్తుంది. ఇది ఒక హిస్టరీ. పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌ను ఇండియా ఓడించడం ఇదే మొదటి సారి. ఇక ఆ తర్వాత టెస్టు సిరీస్. దీంట్లో సెహ్వాగ్ బ్యాటింగ్ ప్రెషర్‌ను ఎలా తొలగించుకున్నాడనేది చూపించాడు. చివరకు టెస్ట్ సిరీస్ కూడా ఇండియా గెలుస్తుంది. వన్డే, టెస్టులు ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి వాతావరణం నెలకొంది అనేది అప్పటి ఆటగాళ్ల మాటల్లో మనకు కూడా అర్థం అవుతుంది. పాకిస్తాన్ ఓడిపోయినందుకు ఈ మాటలు వింటే మనకు కూడా బాధేస్తుంది. అంతలా కనెక్ట్ చేశారు. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఇండియన్ క్రికెటర్లను ఎలా చూసుకున్నారో సరదాగా చెప్తుంటే చూస్తున్న ప్రేక్షకుడు కూడా భావోద్వేగానికి గురవుతాడు. ఆ తర్వాత ఐపీఎల్.. పాక్, ఇండియా క్రికెటర్లు కలిసి ఒకే జట్టులో ఆడటం.. ఆ తర్వాత ముంబై ఎటాక్స్.. పాక్ క్రీడాకారులను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయడం..ఇదంతా చిన్న చిన్న బిట్లుగా చూపించారు.
ఎమోషన్.. ఎంటర్‌టైన్‌మెంట్
మొత్తంగా ఈ డాక్యూసిరీస్ అంతా డ్రామా.. ఎమోషన్.. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోతుంది. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బాండింగ్ గురించి చర్చిస్తారు. ఆట గురించే కాకుండా పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడతారు. అయితే ఈ డాక్యూసిరీస్‌లో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ మాత్రం మిస్ చేశారు. ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో సచిన్ 194 స్కోర్ మీద ఉండగా కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ డిక్లేర్ చేస్తాడు. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని చూపించలేదు. ద్రావిడ్, సచిన్ టెండుల్కర్ అసలు ఈ డాక్యూసిరీస్‌లో భాగస్వామ్యం కాకపోవడం పెద్ద లోటుగానే చెప్పవచ్చు. కానీ మొత్తంగా.. క్రికెట్ ప్రేమికులకు ఒక నోస్టాల్జియా.
ది గ్రేటెస్ట్ రైవల్రీ : ఇండియా Vs పాకిస్తాన్
1. రైజ్ ఆఫ్ ది లెజెండ్స్ - 36 నిమిషాలు
2. ది బ్యాటిల్ గ్రౌండ్ - 34 నిమిషాలు
3. మేకింగ్ హిస్టరీ - 40 నిమిషాలు
డైరెక్టర్లు : చంద్రదేవ్ భగత్, స్టీవర్ట్ సగ్
కాస్ట్ : షోయబ్ అక్తర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, జాన్ రైట్, ఉస్మాన్ సమీయుద్దీన్, రవిచంద్రన్ అశ్విన్ తదితరులు..






