- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెదరాయుడి తీర్పు.. తెగదు.. ముడిపడదు.!
ఎంత చిన్న సమస్యయినా ఏండ్లకేండ్లు సాగదీస్తరు

ఏ సమస్యొస్తే..
ఎవరి దగ్గరికి వెళ్లాలో వాళ్ల దగ్గరికే వెళ్తాం.
రోగానికొకరు..
నొప్పికొకరు..
పైసలకొకరు..
పనికొకరు..
ఇట్లా ప్రతీదానికో ప్రత్యేకమైన వ్యక్తి ఉంటాడు.
కానీ.. ఊర్లల్ల కథ వేరే ఉంటుంది.
అన్నింటికీ ఒకే మందు అన్నట్లు..
పనేదైనా.. ప్రాబ్లమేదైనా చూసుకునేది ఒక్కరే.
ఆ ఒక్కరే.. "పెద్దమనిషి".
- దాయి శ్రీశైలం
తెల్లబట్టలేసుకొని.. జుట్టుకు నల్ల రంగేసుకొని.. పొద్దున లేస్తే ఆ ఇంట్లేం ముచ్చట.. ఈ ఇంట్లేం ముచ్చట.. ఆ సార్ ఇట్లా.. ఈ మేడం అట్లా.. వాళ్లింట్లకు జొర్రీ.. వీళ్లింట్లకు జొర్రీ అన్నీ బేకార్ ముచ్చట్లు.. బేకార్ పంచాయితీలు తెంపే అర్హత ఉన్నొళ్లే ఆ పెద్ద మనుషులు. ఈ రోజెవరు దొరుకుతరా.. రేపెవరు దొరుకుతరా అని ఎదురుచూస్తూ "పాము సావొద్దు.. కట్టె ఇరగొద్దూ" అన్నట్లు ఎంత చిన్న సమస్యయినా ఏండ్లకేండ్లు సాగదీస్తరు.
పెదరాయుడు తీర్పులే..
ఊర్లల్ల ఏం పంచాయితులంటయి.? ఎక్కువ భూముల పంచాయితీలే ఉంటున్నయి. భూముల ధరలకు రెక్కలొచ్చి గుంట భూమికోసం కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు జనాలు. అట్లా కొట్లాడీ కొట్లాడీ బేజార్‌కొచ్చీ ఓ పెద్ద మనిషి దగ్గరికి పోతరు. అటువైపొక పెద్దమనిషి.. ఇటువైపొక పెద్దమనిషి. ఇద్దరూ కూడబలుక్కుంటరు. ఇరు పార్టీలను ఒక్క దగ్గరికి కూడుస్తరు. ఎల్లికి ఎగేసి.. మల్లికి దిగేసి పెదరాయుడు లెవల్లో తీర్పిస్తరు. ఐతే ఐతదీ.. లేకపోతే కాదు అనేదేదీ తేల్చరు. అట్లచేస్తే మల్లా వీళ్లకు ఉపాధి కరువైతది కదా.? అందుకే కోర్టులోతీర్పు లెక్క మల్లో వారానికి వాయిదా వేస్తరు. ఆ వారమైనా తేలుస్తరా అంటే అదీ ఉండదు. వాళ్లకు వాళ్లే ఏదో మాట్లాడుకుంటారు. బయటికి మాత్రం "ఇట్లయితే కష్టం.. ఇంకోసారి కూసుందాం" అని చెప్పి నాన్చుతారు.
కాంప్రెమైజ్ కానివ్వరు..
అన్నదమ్ముళ్ల పంచాయితీ.. ఆలు మగల పంచాయితీ.. ఇట్లా ఏదైనా వాళ్లే వస్తారు. సేమ్.. అట్లనే సాగదీసుకుంటూ కూసుంటారు. వాళ్ల వాలకం చూసి చిరాకుదొబ్బి వాళ్లతో సంబంధం లేకుండా మనమే కాంప్రెమైజ్ అవుదామని ప్రయత్నిస్తే కాళ్లళ్ల కట్టెలు పెట్టి.. "ఐతే.. మీరు మీరే చూస్కుంటరా.. మాకేం ప్రాబ్లం లేదుగానీ మల్లేదైనా సమస్యొస్తే మా దగ్గరికైతే రావద్దు సూడు ముందే చెప్తున్నం" అని లేనిపోని డౌట్లుపెట్టి కేసును మల్లా వాళ్ల దగ్గరికే రప్పించుకుంటారు. ఒకవేళ మనకు కలిసిపోదామనే ఆలోచన ఉన్నా "అట్లెట్ల కలిసిపోతరయా.. అంతా మీ ఇష్టమేనా. ఇంత కోసమైతే పెద్ద మనుషులెందుకు.. నలుగురిలో పంచాయితీ ఎందుకూ" అని చిర్రుబుర్రులాడుతారు. ఎంతసేపూ పంచాయితీ సాగాలి.. వాళ్ల పబ్బం గడవాలి.. అదే ధ్యాస తప్ప సమస్యను సాల్వ్ చేద్దామనుకోరు.
చారాణా కోడికి..
ఆ పంచాయితీ పెట్టుడేందో.. దానివల్ల వచ్చేదేందోగానీ.. పెట్టినప్పుడల్లా ఐదారు వేలకు బొక్క. తాగుడాయె.. తినుడాయె.. రానుపోను తొవ్వ కిరాయిలాయె. "చారాణా కోడికి బారాణా మసాలా" అన్నట్లు తడిపి మోపెడు ఖర్చులు చేస్తరు. "అరే ఏందన్నా.. వస్తున్నం పోతున్నంగానీ పంచాయితీ అయితే తెగుతలేదు ముడిపడుతలేదు" అని అడిగితే.. "అరే రామా తొందర పడితె ఐతదానయా.? ఊకెనేనా పంచాయితంటే. జర ఓపిక పట్టుండ్రీ. మేం చేసిది కూడా మీ కోసమేగదా.? సాగదీస్తే మటుకు మాకేమైనా ఫాయిదానా.? పంచాయితీ తెంపినందుకు మీ దగ్గరేమైనా ఐదు తీసుకుంటున్నమా.. పది తీస్కుంటున్నమా" అని నోరు మూయిస్తరు. "తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లు" సోంపు పాకెట్ నుంచి బిర్యానీ దాక అంతా వాళ్లతోనే ఖర్చు పెట్టిస్తారు.
లంగా అని తెలిసినా..
జనాలు కూడా పెద్ద మనుషులను గుడ్డిగా నమ్ముతారు. వాడు లంగ అని తెలిసినా ఏ చిన్న సమస్యొచ్చినా వాడి దగ్గరికే పోతారు. మోసకారి అని తెలిసినా వాళ్ల సాయమే తీసుకుంటారు. ఇంకా కొందరైతే.. "ఎహే.. తింటే నాలుగు పైసలు తింటడేమోగానీ.. పనైతే పక్కా చేస్తడు. మనకు పని కావాలెగానీ.. పైసలదేముందీ" అని అంటారు. అంటే.. జనాలను అట్లా మాయజేసి మలుపుకునే సత్తా ఈ పెద్ద మనుషుల దగ్గర ఉంది. ఎన్ని డిగ్రీలు చదివినా.. పీహెచ్డీలు చేసినా ఇలాంటి తెలివి తేటలున్న వాళ్లు ఎక్కడా దొరకరు. అందుకే వాళ్లనొక ప్రత్యేకమైన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. పొద్దున ఏడెనిమిది గంటలకే తయారై రోడ్డెక్కుతారు. వాళ్లకు స్పెషల్ వెహికిల్ రావాలి.. స్పెషల్ ఫుడ్ తినిపించాలి.. అంతా అయిపోయినంక ఫుల్టుగా తాగించాలి. ఈ లెక్క అయితే అస్సలు తప్పకుండా చూసుకుంటారు.
ఎక్కడ ఇరికించాలో తెలుసు..
అందరూ ఒక్కతీరు ఉండరు కదా.? వాళ్ల పనేందో తెలిసి కొందరు అటుదిక్క చూడరు. అలాంటి వాళ్ల మీద ఓ కన్నేసి ఉంచుతారు. ఉదాహరణకు ఏదైనా ల్యాండ్ ఉందనుకోండి. అది ఎవ్వరిదైనా ఒకవేళ అమ్మిపించాలన్నా.. లేదా కొనిపించాలన్నా వాళ్ల ద్వారానే జరగాలి అనుకుంటారు పెద్ద మనుషులు. "అంతా క్లియర్ ఉన్నాక నడమ వాళ్లకెందుకు చెప్పేది" అని ఎవరైనా తెలవకుండా అమ్మితే.. ఆ కొనుక్కున్నవాడెవడో తెలుసుకొని వాణ్ని బెదిరిస్తారు. "కిరికిరి ఉన్న భూమిని ఎట్లా కొంటవయా.? దాన్ని మొన్ననే వేరేవాళ్లకు అమ్మేసిండ్రు.. ఆ భూమి కేసు కోర్టులో ఉంది" అని చెప్పి లేనిపోని అనుమానాలు కలుగజేస్తారు. పాపం.. దేవుడా అంటానీ వాళ్లు మల్లా మనోడి దగ్గరికే వస్తారు. "అంతా క్లియర్ చేసినా.. ఏమున్నా నేను చూస్కుంటా" అని చెప్పి సల్లగ జేస్తాడు.
సమస్య వాళ్లే.. పరిష్కారం వాళ్లదే..
వాస్తవానికి అక్కడే సమస్యా ఉండదు. పెద్ద మనుషులం అని చెప్పుకునే వాళ్లకు కావాల్సిందల్లా నాలుగు రోజులు పూట గడవడం.. ఏది చేసినా మా ద్వారానే చేయాలని అనుకోవడం. అందుకే వాళ్లు గీసిన గీత దాటిన వాళ్లకు అదీ ఇదీ చెప్పి సమస్యను క్రియేట్ చేస్తారు. సమస్యను క్రియేట్ చేయడమంటే ఇక్కడ ఒక భయాన్ని సృష్టించడం.. అనుమానాల్ని రేకెత్తించడం అన్నట్టు. ముందు ఒక రాయేస్తాడు. అది ఓకే అయితే నో ప్రాబ్లం. ఓకే కాకపోతే పెంట చేసి కూసుంటాడు. "మీరేం వర్రీ కాకుండ్రీ.. నేనున్నా కదా" అని ఏదో చేస్తు్న్నట్టు యాక్టింగ్ చేసి "మనోడు తోపురా భయ్" అనిపించుకుంటాడు. పతారె చూపించుకోవడానికి వాళ్ల ముందే ఎస్సైకి కాల్ చేస్తా.. ఎమ్మార్వోతో మాట్లాడతాడు.. అవసరమైతే ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి "వీడురా పెద్ద మనిషీ" అనే సింపథీ సంపాదిస్తాడు.
మంచి జరిగితే మాదే..
"సావుకు అదే డప్పు.. పెండ్లికి అదే డప్పు" కొట్టినట్లు పనేదైనా వాళ్లే కనిపిస్తారు. అందరికంటే ముందు వరసలో కుర్చీలేసుకొని కూసుకుంటారు. అంతా తామే చేస్తున్నట్లు.. అన్నింటికీ మేమున్నాం అనే ధైర్యమిచ్చినట్లు హల్ చల్ చేస్తుంటారు. పెండ్లి సంబంధాలు కుదర్చడమే కాదు.. తెగదెంపులు చేసే పనికి కూడా ఈ పెద్ద మనుషులే దర్శనమిస్తుంటారు. కాపురం నిలబడితే "మేం మంచి సంబంధం చూపించినం కాబట్టే నిలబడ్డదీ" అని గొప్పలు చెప్పుకొనీ.. ఏవైనా తగాదాలొస్తే "సంబంధమైతే చూస్తంగానీ కాపురమైతే మీరే చెయ్యాలి కదా" అని తప్పును అవతలి వాళ్లపై వేస్తుంటారు. "నువ్వు నిప్పు రాజెయ్యి.. నేను సల్లారుస్తా" అన్నట్లు రెండువైపులా ఉండే పెద్దమనుషులు కూడబలుక్కొని అదెటూ తెగకుండా ఒకరు ఎడ్డెమంటే.. ఇంకొకరు తెడ్డెమని కాలయాపన చేస్తుంటారు.
ఏండ్లకేండ్లు తెగక..
మన ఊర్లల్ల జనాలకో పాడలవాటుంది. తుమ్మినా దగ్గినా పెద్ద మనుషుల దగ్గరికి పోదాం అంటుంటారు. ఆ పెద్ద మనుషులేమో పక్కోడి అవసరాన్ని సొమ్ము చేసుకొని ఆ సమస్య మీదనే పడి బతుకుతుంటారు. కొన్ని కొన్నిసార్లు చిన్న సమస్య కూడా ఏండ్లకేండ్లు అయినా పరిష్కారం కాదు. "పెద్ద మనుషులల్ల పెట్టినం.. వాళ్లే తెంపుతరు" అని తడిబట్టేసుకొని జనాలుంటరు. అసలు దాన్ని సాల్వ్ చేసే ఉద్దేశమే ఉంటే అన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకుంటారనే చిన్న లాజిక్ ఆలోచించరు జనాలు. మరీ ఘోరంగా గొర్రె పంచాయితీ.. బర్రె పంచాయితీని కూడా సంవత్సరాలు.. నెలలు పరిష్కారం కాకుండా వాళ్ల పబ్బం కోసం వాయిదాలేసే పెద్ద మనుషులు మన మధ్యలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లనే జనాలు నమ్ముకొని బతుకుతుంటారు.
పోలీస్ బూచీతో భయపెట్టిస్తారు..
మనలో చాలామంది చదువుకున్నా.. విద్యా వంతులైనా.. ఎందుకోగానీ పోలీస్ స్టేషన్ అనంగనే పుట్టెడు భయపడతారు. స్టేషన్లో ఉన్న ఎస్సై.. కానిస్టేబుల్ కంటే ఎక్కువ విద్యావంతులే అయుంటారు కానీ.. ఖాఖీ డ్రెస్సును చూస్తే నోటిమాట రాదు. కానీ.. మన ఊర్లల్ల పెద్ద మనుషులు చాలామటుకు పదో తరగతి కూడా చదివి ఉండరు. కానీ వాళ్లు పోగానే కానిస్టేబుల్ "నమస్తే అన్నా" అంటాడు. ఎస్సై పేరు పెట్టి పిలుస్తాడు. ఏం తెలవకున్నా ఏసీపీతో కూడా మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తాడు. అప్పుడో కేస్.. ఇప్పుడో కేస్ పనిమీద వస్తుంటాడు కాబట్టీ రైటర్‌కు ఐదో పదో చేతిలో పెడతాడు. అందుకే పెద్ద మనిషి రాగానే రైటర్ లేచి నమస్తే పెడుతుంటాడు. మనముందు "జర మావొళ్లే చూస్కో సార్" అని చెప్తడు. బయటికి పోయినంక "వాళ్లను అట్లనే తిప్పాలె సార్" అని చెప్తాడు.
అదే ఉద్యోగం.. అదే యాపారం..
పెద్ద మనుషులం అని చెప్పుకొని గంభీరమైన జీవితాన్ని అనుభవించేవాళ్లకు ఫలానా ఆఫీస్ అని ఏదీ ఉండదు. మండల ఆఫీసులు.. మీసేవా సెంటర్లు.. ఇరానీ కేఫ్‌లు.. డాక్యుమెంటేషన్ కార్యాలయాలు ఇలా ఎక్కడైనా వాళ్లే కనిపిస్తారు. ఎప్పుడు ఫోన్ చేసినా "హా.. బిజీగా ఉన్నా. ఇక్కడొక డాక్యుమెంట్ కొట్టిస్తున్నా" అని అంటారు. వాస్తవానికి అక్కడ డాక్యుమెంట్ ఉండదు ఏం ఉండదు. జస్ట్ అట్లా మార్కెటింగ్ చేసుకొని ఏదో ఒక ఉపాధి పొందాలంతే. రేషన్ కార్డులు దరఖాస్తు చేయించరానొళ్లు.. ఆధార్లో పేర్లు అప్డేట్ ఎలా చేయాలో తెలవనొళ్లు.. బ్యాంకులో డబ్బులెలా డ్రా చెయ్యాలో తెల్వనొళ్లు.. ఇందిరమ్మ ఇల్లుకు బిల్లులకు ఎవరిని కలవాల్నో తెల్వనొళ్లు.. సహకార బ్యాంకులో లోన్ల కోసం మేనేజర్‌తో మాట్లాడరానొళ్లు ఎక్కుడుంటే వీళ్లక్కడుంటారు. వాళ్లకు అదే ఉద్యోగం.. అదే యాపారం.
ఇంట్లో మాత్రం ఈగల మోత..
"పొడుగు పొడుగు మీసాలు.. పోత్రాజు ఏశాలు" అన్నట్లు బయట "పెద్ద మనిషి"గా బిల్డపిస్తడుగానీ.. ఇంట్లో మాత్రం పరిస్థితేం బాగుండదు. మనోడు ఖద్దరేసుకొని తిరుగుతాడు కానీ.. పిల్లలకు మంచి బట్టలిప్పించలేడు. వాళ్లేమో ఉన్నదో లేనిదో అవే రేషన్ బియ్యం తింటూ కాలమెల్లదీస్తుంటారు. మనోడు మాత్రం ఊరుమీద పడి మూడు పూటలా బిర్యానీ తింటూ బ్రేవ్‌మంటుంటాడు. రోజుకో ఊరు తిరుగుతాడు. పోవడానికి కారు.. రావడానికి కారు.. అన్నీ ఫ్రీగానే వచ్చె. మీద మీద తిరిగి మీసం దువ్వితే పూట గడిచిపోతుంది. ఇక ఎలక్షన్లొస్తే అంతే కథ. ఇల్లు గుర్తుకు రాదు.. పిల్లలు గుర్తుకు రారు. పార్టీ ఫండెంతొచ్చింది.? ఓటుకెంత పంచాలి.? ఎన్కకెంతెయ్యాలి.? అనే లెక్కలేసుకొనే బిజీలో ఉంటారు. అందుకే ఆ పెద్ద మనుషులు సుఖ పురుషులు.
ఇంకెక్కడా ఉండదీ కల్చర్..
ఏ పనీ చేయకుండా.. ఎలాంటి రిస్క్ లేకుండా.. పెద్దరికం చేస్తూ బతికే కల్చర్ ఇండియాలో తప్ప వేరే ఇంకెక్కడా ఉండకుండొచ్చు. చేసుకుంటే పని ఉంటది. కానీ ఒళ్లొంచి పనిచేయబుద్ధి కాదు. కాళ్లకు మట్టి అంటొద్దు.. ఒంటికి చెమట రావద్దు. అట్లనీ లక్షలకు లక్షలేమైనా సంపాదిస్తరా అంటే అదీ ఉండదు. ఏ పూటకా పూట గడిస్తే చాలనుకుంటారు. ఆ పంచాయితీ.. ఈ పంచాయితీ.. ఆ కిరికిరీ.. ఈ కిరికిరీ అని అన్నింట్లో వేలుపెట్టి లేనిపోని సమస్యలు మీదేసుకొని అక్కెరకురాని పెద్దరికం అనుభవిస్తుంటారు. ఎవ్వరు కలిసినా "నమస్తే పెద్ద మనిషీ" అనే గౌరవమైతే దొరుకుతుంది. ఒకొక్కసారి వీళ్లను చూసి జాలిపడాలో.. బాధపడాలో కూడా అర్థంకాని పరిస్థితి. మనది మనకుండాలికానీ.. ఎంతసేపూ పరాన్నజీవిలా వేరేవాళ్ల అవసరం మీద ఎన్నిరోజులు బతుకుతాం చెప్పుండి.?
తిరగబడేదాక చూసుకుంటే.?
దేనికైనా ఒక హద్దుంటుంది. అతి అనర్థమే. పోలీస్ స్టేషన్లకు పోతే ఆలస్యమైతదీ.. లేనిపోని కేసులైతే.. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తదీ.. లేనిపోని లొల్లి ఎందుకనీ పెద్ద మనుషులల్ల పెడితే.. ఆ పెద్ద మనుషులు దాన్ని రబ్బర్ సాగదీసినట్లు సాగదీస్తే ఎవరు మాత్రం ఊకుంటారు. అందుకే ఈ మధ్య పెద్దమనుషుల తీరు నచ్చక మర్డర్లు అయిన ఘటనలు చూస్తున్నాం. విషయాన్ని అటు పోలీసుల దగ్గరికి వెళ్లనీయకుండా.. వీళ్లూ పరిష్కరించకుండా నాన్చితే ఎవరికైనా బాధుంటది కదా.? దానికితోడు పంచాయితీ పెట్టిన ప్రతీసారి వేలకు వేల రూపాయల ఖర్చు. అందుకే పెద్ద మనుషులూ జర పైలం. మీ పబ్బం గడవడం ఒక్కటే కాదు.. సమస్య పరిష్కారం కూడా ముఖ్యం. విసుగొచ్చేలా.. చిరాకు దొబ్బేలా మీ పెద్దరికం చూపించుకొని ప్రాణాల మీదికి తెచ్చుకోకండి.
అన్నింట్లోనూ: చంద్రకాంత్ మిరియాల, కామారెడ్డి
ప్రతీ ఊర్లో చూస్తుంటాం ఇలాంటి పెద్ద మనుషులను. నేను పరిశీలించిన దాని ప్రకారమైతే.. వాళ్లు మంది మీదనే బతుకుతారు. వాళ్లకు ఫలానా పని అంటూ ఏదీ ఉండదు. అన్నింట్లోనూ వేలు పెడతారు. ఎవరైనా చెప్పినట్టు వినకపోతే వాళ్ల వీక్నెస్ మీద కొట్టి బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఇక తాగుడు.. తినుడు గురించయితే లెక్కనే ఉండదనుకోండి.
విసిగిపోయి మళ్లీ వస్తుంటారు: దయాకర్, రాచకొండ పోలీస్ కమిషనర్ పీఆర్వో
ఊర్లల్లో పెద్ద మనుషుల మధ్యే సగం పంచాయితీలు సెటిల్మెంట్ అవుతుంటాయి. భూ తగాదాలు, ఆస్తి గొడవలు, భార్య భర్తల ఇష్యూలు ఇలా చాలా ఉంటాయి. అయితే వీటిలో ఆలస్యం జరిగి అటు తిరిగి మళ్లీ పోలీస్ స్టేషన్ వరకు వస్తుంటాయి. మరీ సీరియస్ కేసులైతే కమిషనరేట్ వరకు కూడా వస్తుంటాయి. ఇంత దాకా ఎలా వచ్చిందని దిగితే పెద్ద మనుషుల పేర్లు చెప్తుంటారు. కేవలం పెద్ద మనుషుల నిర్లక్ష్యం వల్లే ఎన్నో కేసులు పోలీసుల చేతికి రాక.. అటు పరిష్కారం కాక సాగుతూనే ఉంటాయి.
పూర్వ వైభవం రావాలి: రాసాల శ్రీకాంత్, సంస్థాన్ నారాయణపూర్
వాస్తవానికి పెద్దరికం అనేది చాలా మంచి పాత్ర. ఇప్పుడంటే ప్రతీదానికి సౌకర్యాలున్నాయి కానీ.. పాత రోజుల్లో ఎక్కడివి. ఐతే.. మనొళ్లు ఆ పాత్రను పాడుచేస్తున్నారు. "పెద్ద మనుషులు" అంటే ఊరుమీద బతికేవాళ్లు అనేలా వ్యవహరిస్తున్నారు. అలా కాకుండా పెద్దరికానికి పూర్వ వైభవం తెచ్చేలా వ్యవహరించి ప్రజలకు తలలో నాలుకలా ఉండాలని ఆశిస్తున్నా.






