ట్రంప్ రాజ్యంలో "మానవ జూ".. జాత్యహంకారానికి పరాకాష్ట

by Muthe.Rajitha |   (  Updated:2025-08-28 09:41:14  IST  )

1800ల చివరి నుంచి 1900ల వరకు అమెరికా, ఐరోపా దేశాలలోని తెల్లజాతి అధికారులు ఆఫ్రికన్ జాతీయుల మీద జరిపిన దూరగతాలు మనవజాతికే మాయని మచ్చగా, జాత్యహంకారనికి పరాకాష్టగా మిగిలిపోయాయి.

ట్రంప్ రాజ్యంలో మానవ జూ.. జాత్యహంకారానికి పరాకాష్ట
X

దిశ, వెబ్ డెస్క్ : 1800ల చివరి నుంచి 1900ల వరకు అమెరికా, ఐరోపా దేశాలలోని తెల్లజాతి అధికారులు ఆఫ్రికన్ జాతీయుల మీద జరిపిన దూరగతాలు మనవజాతికే మాయని మచ్చగా, జాత్యహంకారానికి పరాకాష్టగా మిగిలిపోయాయి. ఆఫ్రికాలోని పలు తెగల ప్రజలను బానిసలుగా తీసుకువచ్చి పారిస్, హాంబర్గ్, ఆంట్‌వెర్ప్, బార్సిలోనా, లండన్, మిలన్, వార్సా, సెయింట్ లూయిస్, న్యూయార్క్ వంటి నగరాల్లో "మానవ జూ"లను సృష్టించారు. చాలా మంది ఆఫ్రికన్లను వారి స్వదేశాల నుంచి బలవంతంగా కిడ్నాప్ చేసి, లేదా కొనుక్కొని ఈ మానవ జూ ప్రదర్శనల కోసం తీసుకొచ్చారు. వారిని జంతువుల్లా బోనుల్లో ఉంచారు. కొన్నిసార్లు జూలోని కోతులు, చింపాంజీలతో కలిపి ఉంచారు. అసలు వారిని మనుషులుగా చూడటమే మానేసి, విచిత్ర జంతువుల్లా చూడటం మొదలు పెట్టారు. ఇది వారిని మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించింది.

ఈ బోనుల్లో బందీ జీవనం వల్ల చాలా మంది ఆఫ్రికన్లు అనారోగ్యాలకు గురయ్యారు. ఒక ఏడాది కాలంలోనే వందల మంది మరణించారు. వారి సహజ పరిస్థితుల నుంచి ఎత్తుకు వచ్చి, దయనీయ స్థితిలో, అత్యంత అమనవీయ స్థితిలో వారిని ఉంచడం వల్ల వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యి చనిపోయారు. కొంతకాలానికి అనేక స్వచ్చంద సంస్థలు చేసిన భారీ నిరసనల తరువాత వారందరికీ ఆ "మానవ జూ"ల నుంచి విముక్తి లభించినప్పటికీ.. వారంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. కొంతమంది ఎలాంటి ఆదరణ, తిండి లేక ఆకలికి మాడి చనిపోగా.. మరికొంత మంది ఆ ట్రామా నుంచి బయట పడలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

అయితే ఈ హృదయ విదారక ఘటనలపై ఇటీవల అమెరికా క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంది. 2020, మేలో అమెరికాలో నదిరోడ్డుపై పోలీసు అధికారులచేత అత్యంత క్రూరంగా చంపబడ్డ జార్జ్ ఫ్లాయిడ్ మరణం ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత శ్వేతాజాతీయుల జాత్యహంకార ధోరణులకు వ్యతిరేకంగా ప్రపంచం అంతా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, 1900లో ఏర్పాటు చేసిన దారుణమైన మానవ జూలపై స్పందించింది. ముఖ్యంగా1906లో కాంగోకు చెందిన ఓటా బెంగాను బ్రోంక్స్ జూలో ప్రదర్శనకు పెట్టిన విషయంపై ద వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ(డబ్ల్యూసీఎస్) క్షమాపణలు తెలిపింది. అప్పుడు మరోసారి మానవ జూలపై, కాంగోకు చెందిన ఓటా బెంగాను బ్రోంక్స్ గురించి వెలుగులోకి వచ్చింది.

ఎవరీ ఓటా బెంగ?

ఓటా బెంగ.. కాంగోలోని ఇటూరి అడవుల్లో, ఎమ్‌బుటీ గిరిజన సమాజంలో 1883లో జన్మించాడు. భార్య, ఇద్దరు పిల్లలతో అతను నవ్వులు పంచుకునే జీవితం, ఒక్క క్షణంలో రక్తంతో తడిసిన గాయంగా మారింది. బెల్జియన్ సైన్యం అతని గ్రామంపై దాడి చేసి, అతని కుటుంబాన్ని, గ్రామస్తులను కిరాతకంగా చంపేసింది. అది ఓటా బెంగ గుండెలో ఎన్నటికీ తొలగని గాయం ఏర్పడింది. వేట నుంచి తిరిగి వచ్చిన ఓటా బెంగ తన కుటుంబ సభ్యుల, స్నేహితులు, సన్నిహితుల శవాల మధ్య నిలబడి ఏడ్చాడు. ఆ ఏడుపు ఓటా బెంగ గుండెలో ఎన్నటికీ తొలగని గాయాన్ని చేసింది. అంతేకాదు వ్యాపారుల చేతికి చిక్కిన ఓటా, ఒక వస్తువులా ఒక పౌండ్ ఉప్పుకి అమ్ముడుపోయాడు. ఈ దారుణమైన బానిసత్వం అతని జీవితాన్ని ఉక్కు పాదాల కింద తొక్కే తొలి అడుగు అయింది. అమెరికన్ మిషనరీ సామ్యూల్ ఫిలిప్స్ వెర్నర్ అతన్ని 1904లో అమెరికాకు తీసుకొచ్చాడు.

కానీ, అది రక్షణ కాదు. అది జాత్యాహంకారం. విలువైన వ్యాపారం యొక్క దిగజారుడుతనం. సెయింట్ లూయిస్ వరల్డ్ ఫెయిర్‌లో ఓటా బెంగను "మానవ ప్రదర్శన"లో ఉంచారు. అతని చిన్న ఎత్తు, గిరిజన ఆచారంగా పదును చేసిన దంతాలు, అతని సంస్కృతి.. ఇవన్నీ జనాన్ని ఆకర్షించే "వింత"లుగా మారి, జనం తండోపతండాలుగా మ్యూజియంలోని ఓటాను చూడటానికి వచ్చారు. పత్రికలు అతన్ని "ఆఫ్రికన్ కన్నిబల్" అని చిత్రీకరించాయి. ఈ చర్యలు మనుషుల్లోని మానవత్వాన్ని కాళరాత్రిలా చీకటిలోకి నెట్టేశాయి. తన గ్రామంలో నవ్వుతూ ఆడుకునే రోజులు, తన భార్య చేతి వెచ్చదనం, పిల్లల కిలకిల నవ్వుల నుంచి తెల్లజాతీయుల చూపులు ఓటా బెంగ గుండెపై మేకును దింపిన జ్ఞాపకాలుగా మిగిలాయి. అతను ఒక బోనులో, జనం కేరింతల మధ్య, తన గౌరవాన్ని కోల్పోతూ నిలబడ్డాడు. ఆ జాత్యాహంకార చూపులు, "సభ్యత" పేరుతో అతన్ని అవమానించిన వ్యాఖ్యలు, అతని ఆత్మను రోజూ కుంచించి వేశాయి.

1906లో బ్రాంక్స్ జూలో అతని జీవితం మరింత దిగజారింది. "మంకీ హౌస్"లో ఒక ఒరాంగుటాన్‌తో కలిపి ప్రదర్శనకు ఉంచారు. ఓటా బెంగ, ఒక మనిషి, తన గర్వంగా చెప్పుకునే సంస్కృతిని కలిగిన వ్యక్తి, ఇప్పుడు జంతువుతో సమానంగా చూడబడ్డాడు. శ్వేతాజాతీయుల జాత్యహంకారం.. జనం ఆనందం కోసం అతని ఆత్మను అమ్మేసింది. రోజూ వేలాది జంట కళ్లు అతన్ని "వింత జీవి"గా చూస్తుంటే, అతని మనసు ఏమై ఉంటుంది? ఆ బోనులో అతను నిలబడి, తన గతాన్ని, తన కోల్పోయిన వారిని గుర్తు చేసుకుని ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాడో? ఆ అవమానం, ఆ నిస్సహాయత, అతని గుండెను బరువెక్కించి, ఒంటరితనంతో నింపేసాయో. ఓటా బెంగ మనసు ఒక బందీఖానా. జాత్యాహంకారం అతన్ని మనిషిగా చూడని సమాజంలో, బానిసత్వం అతని స్వేచ్ఛను దోచుకున్న గతంలో, ఎథిక్స్‌లేని వ్యాపారం అతని గౌరవాన్ని అమ్మేసిన జ్ఞాపకాల్లో, అతను చిక్కుకుపోయాడు. ప్రతిరోజూ అతను తన కోల్పోయిన కుటుంబాన్ని, తన గ్రామాన్ని, తన గుర్తింపును గుర్తు చేసుకుని, మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని నవ్వు ఎప్పుడో కాంగో అడవుల్లోనే మిగిలిపోయింది.

అనేక నిరసనల తర్వాత అతన్ని బ్రూక్లిన్‌లోని అనాథ ఆశ్రమానికి తరలించారు. అక్కడ కూడా ఓటా సివిలైజేషన్ లో భాగం కాలేదు. జాత్యాహంకార సమాజంలో అతను ఎప్పటికీ "అవుట్‌సైడర్"గానే మిగిలాడు. 1910లో వర్జీనియాలోని లించ్‌బర్గ్‌కు వెళ్లి, ఆంగ్లం నేర్చుకుని, స్థానికులతో కలిసే ప్రయత్నం చేశాడు. కానీ, అతని మనసులో ఒక గాఢమైన కోరిక.. తన స్వదేశానికి తిరిగి వెళ్లడం. అతను కాంగో అడవుల గాలిని, తన గిరిజన సంగీతాన్ని, తన ప్రజల స్పర్శను కోరుకున్నాడు. కానీ, మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఓడలు రాక నిలిపివేయడంతో, ఆ కలకు దూరమయ్యాడు.

1916, మార్చి 20న, ఓటా బెంగ తన బాధలను ముగించుకోవాలని నిర్ణయించాడు. ఒక తుపాకీతో కాల్చుకొని జీవితాన్ని ముగించాడు. అతని వయసు 33. ఆ క్షణంలో ఓటా ఏమి ఆలోచించి ఉంటాడో. తనవాళ్ళ జ్ఞాపకాలు అతనికి చివరి స్వాంతన కావచ్చు. అతని మరణం, జాత్యాహంకారం యొక్క క్రూరత్వానికి, బానిసత్వం యొక్క దుర్మార్గానికి, మానవత్వం లేని వ్యాపారానికి ఒక శాశ్వతమైన నిదర్శనంగా మిగిలింది. ఇది కేవలం అతని కథ మాత్రమే కాదు. ఒక కన్నీటి గాధ. అది మనిషి ఆత్మను చీల్చే, గుండెను బరువెక్కించే, మానవాళి చరిత్రలో మచ్చగా నిలిచిన ఒక అంతులేని విషాదం.


Next Story