- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Disha Special: తెలంగాణలో వ్యవసాయానికి 50 చట్టాలు.. మరి ఎలా ఉపయోగించుకోవాలి?
దేశంలో 60 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతుకు సేవలందిస్తే సాగు రక్షించబడుతుంది. సాగురంగంలో చట్టాల పాత్ర పెరుగుతుంది.

-శిరందాస్ ప్రవీణ్‌కుమార్
దేశంలో 60 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతుకు సేవలందిస్తే సాగు రక్షించబడుతుంది. సాగురంగంలో చట్టాల పాత్ర పెరుగుతుంది. కానీ ఆ చట్టాలు తెలిసి ఉండి, వాటిని వినియోగించుకోగలిగితేనే ఏరువాక సాగే పరిస్థితులు వచ్చాయి. దుక్కి దున్నే నాటి నుంచి పండించిన పంటను మార్కెట్లో అమ్మేదాకా రైతులు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉన్నాయి. తినడానికి తిండి కోసం పంటలు పండించే దశ నుంచి మార్కెట్ లో విక్రయించడం కోసం పండించే దశ వరకు వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే మారుతున్న సవాళ్లు.. ఆ మార్పులకు తగ్గట్టుగా సాగు సాఫీగా సాగడం కోసం పలు చట్టాలు, నియమాలు అమల్లోకి వచ్చాయి. వ్యవసాయ వ్యాపారీకరణ చట్టాల అవసరాన్ని మరింత పెంచింది. అందుకు తగ్గట్టుగా రైతుల మేలు కోసం ప్రభుత్వం పలు చట్టాలు చేసింది. ఆర్థిక సరళీకరణ, ప్రపంచ వాణిజ్య ఒప్పందాల కారణంగా గత ముప్పై ఏండ్లల్లో పదుల సంఖ్యలో కొత్త చట్టాలొచ్చాయి. భూమి, వ్యవసాయం, ఆహారానికి సంబంధించి ఇప్పుడు ఒక్కో రాష్ట్రం లో 200లకుపైగా చట్టాలు ఉన్నాయి. చట్టాలు తెలిసి ఉండి, వాటిని వినియోగించుకోగలిగితేనే వ్యవసాయం సాగే పరిస్థితులు వచ్చాయి. కేవలం తినడం కోసం పంటలు పండించిన రోజుల్లో చట్టాలతో పెద్దగా పని లేదు. భూమి శిస్తు వసూలు చేయడం ఆరంభమైన నాటి నుంచే సాగు చట్టాల అవసరం ఏర్పడింది. అప్పటి నుంచి నిన్నా మొన్నటి భూ సంస్కరణల వరకు లెక్కకు మించిన భూ చట్టాలు అమల్లోకి వచ్చాయి. భూ సమస్యలు కూడా మొదలయ్యాయి.
రైతు సాగు చేసుకుంటున్న భూమికి భద్రమైన హక్కులు కల్పిస్తే బంజరుభూమిలో బంగారం పండిస్తాడు. హక్కులు లేని భూమి మాగాణియైనా ఎడారిగా మారుతుంది. భూమి హక్కుల చిక్కుల వల్ల పంట దిగుబడి దెబ్బ తింటుంది. రైతులు ఆర్దికంగా నష్టపోతున్నారు. వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానం వినియోగం పెరగడం, హైబ్రీడ్, జన్యుమార్పిడి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరిగినప్పటి నుంచి ఈ అంశాలపై కూడా పలు నియమాలు అమల్లోకి వచ్చాయి. ప్రపంచ వాణిజ్య ఒప్పందాలు సాగు చట్టాలలో పెనుమార్పులు తెచ్చాయి. ఆర్థిక సరళీకరణ విధానాలు, సాగులో మేధోసంపత్తి హక్కుల గుర్తింపులాంటి పరిణామాలు వల్ల చట్టాలు వచ్చాయి. పంటల బీమా, పంట రుణాలు, మార్కెటింగ్, సాగు నీరు, సేంద్రీయ సాగులాంటి అంశాలపై చేసిన చట్టాలను కలుపుకొని ప్రతి రాష్ట్రంలో భూమి చట్టాలు కాక మరో యాభైకి పైగా చట్టాలు అమల్లో ఉన్నాయి. దేశంలోనే మొదటి సారి లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ(లీఫ్స్) రైతులకు ఉచిత న్యాయ సేవలందిస్తున్నది.
రైతులకు న్యాయ సేవలు కావాల్సిన సందర్భాలు
- భూమి సమస్యలు ఉన్నప్పుడు
- నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వలన నష్టం వాటిల్లినప్పుడు
- బోరు/బావి కోసం అనుమతులు పొందాల్సినప్పుడు
- ఒప్పంద వ్యవసాయం చేస్తున్నప్పుడు, ఒప్పందం రాసుకునేటప్పుడు, వివాదం ఏర్పడినప్పుడు
- కొత్త వంగడాలు నమోదు, రైతు హక్కుల చట్టం క్రింద హక్కుల రక్షణ కోసం
- కార్మిక సమస్యలు ఏర్పడినప్పుడు
- మార్కెట్ లో ఉత్పత్తులు అమ్ముతున్నపుడు సమస్య వస్తే
- సేంద్రియ సాగు - సర్టిఫికేషన్ పొందడంలో, వివాదాలు వచ్చినప్పుడు
- పంటల బీమా అందనప్పుడు
- పంట రుణాల వివాదాలు వచ్చినప్పుడు
- ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందడంలో సమస్యలు
చట్టం రైతుకు చుట్టం కావాలంటే
న్యాయ సేవలపై అధ్యయనం: రైతుల న్యాయ సేవల అవసరాలను గుర్తించడంపై అధ్యయనం జరగాలి. ఇలాంటి అధ్యయనాలు జరిగితేనే రైతులకు అవసరమైన న్యాయసేవలను అందించడానికి తగు కార్యక్రమాలు రూపొందించడానికి వీలవుతుంది. అమెరికా లాంటి పలు పాశ్యాత్య దేశాల్లో ఎప్పటికప్పుడు అధ్యయనాలు నిర్వహించి, రైతులకు న్యాయ సేవలు అందించడానికి ప్రత్యేక కృషి జరుగుతున్నది.
న్యాయ సాధికారత: రైతులకు చట్టాలపై, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించాలి. చట్టాలను వినియోగించుకుని లబ్ధి పొందగలిగే నైపుణ్యం వారికి ఇవ్వాలి. వ్యవసాయ చట్టాలపై రైతులందరికీ అర్ధమయ్యే రీతిలో రకరకాల రూపాలలో సమాచారాన్ని రూపొందించాలి.
న్యాయ సాయం: రైతులకు సాగు సమస్యల పరిస్కారానికి ఉచిత న్యాయ సాయం అందించాలి. గ్రామాలలో అగ్రి లా క్లినిక్ లు ఏర్పాటు చేసి, అందులో పారాలీగల్ ను నియమించి వారి ద్వారా రైతులకు ఉచిత న్యాయ సేవలు అందించాలి.
సాగు చట్టాల అధ్యయన కేంద్రం : వ్యవసాయ చట్టాలపై అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
లీఫ్స్ ఏం చేస్తోంది?
రెండు శాతం జనాభా కూడా వ్యవసాయంలో లేని అమెరికాలో గత వందేళ్ల నుంచి వ్యవసాయ చట్టాలపై విస్తృత అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా న్యాయ కళాశాలలో వ్యవసాయ చట్టాలపై లా కోర్సులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై మాస్టర్స్ లా డిగ్రీ ఇచ్చే కోర్సు అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఉంది. బహుశా ప్రపంచంలో ఇది ఏకైక కోర్సు. ఈ విశ్వవిద్యాలయంలోనే అక్కడి ప్రభుత్వం సాగు చట్టాల అధ్యయన కేంద్రం, సాగు చట్టాల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. రైతులకు న్యాయ సేవలు అందించడానికి అమెరికాలో పలు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో కూడా రైతులకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి కృషి జరుగుతున్నది. 70 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడే మన దేశంలో చట్టాన్ని రైతు చుట్టం చేసే ప్రయత్నాలు ఎందుకు జరగడం లేదు? రైతులకు న్యాయ సేవలు అందించడానికి గాంధీజీ చంపారన్ సత్యాగ్రహ స్పూర్తితో లీఫ్స్ సంస్థ ప్రారంభమైంది. చంపారన్ ఉద్యమ సెంటినరీ (వందేళ్ల) ఉత్సవాల సందర్భంగా రైతులకు చట్టాలను చుట్టాలుగా చేయడమే లక్ష్యంగా రైతులకు న్యాయ సేవలు అందించాలనే లక్ష్యంతో లీఫ్స్ సంస్థ 2018 లో ప్రారంభించారు. చట్టాలపై అవగాహన కల్పించే అనేక కార్యక్రమాలు, న్యాయగంట పేరిట ప్రతి శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నది. ఉచిత సాగు న్యాయ నేస్తాల శిక్షణా కార్యక్రమాలను చేపట్టింది. భూ సమస్యలు ఉన్న రైతులకు భూమి చట్టాలు, రెవెన్యూ నిపుణులు, న్యాయవాదులతో న్యాయ సలహాలు అందించడానికి గ్రామాల్లో ‘భూన్యాయ శిబిరాల’ను నిర్వహించారు.
లీఫ్స్ శ్రేయోభిలాషుల గ్రూప్ ను రూపొందించారు. ఇందులో వీరందరిని భాగస్వామ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు న్యాయ సేవలను అందించడం కోసం లీఫ్స్ సంస్థ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. గ్రామీణ యువతకు వ్యవసాయ చట్టాలపై శిక్షణ, సాగు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు, పల్లెల్లో సాగు న్యాయ శిబిరాలు లాంటి పలు కార్యక్రమాల నిర్వహణ ఈ అవగాహన ఒప్పంద ఉద్దేశ్యం.
ప్రభుత్వం ఏం చేయాలి
– ప్రతి గ్రామంలో రైతులకు ఉచిత న్యాయసేవలను అందించడానికి అగ్రి లా క్లినిక్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో ఒకరిద్దరు యువ రైతులకు సాగు చట్టాలపై శిక్షణ ఇచ్చి ఈ క్లినిక్ ల ద్వారా సాగు న్యాయ నేస్తాలుగా నియమించాలి. భూమి, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంటరుణాలు, పంటల భీమా, మార్కెట్లు, ఒప్పంద వ్యవసాయం ఇలా రైతులకు సంబంధించిని చట్టాలు, పథకాలు లాంటి అన్ని అంశాలపై సమాచారం ఈ క్లినిక్ ల ద్వారా అందించాలి. సమస్య వచ్చినప్పుడు తగిన న్యాయ సలహాలు, సహాయం ఈ క్లినిక్ ల ద్వారా అందించాలి.
– గ్రామాలలో సాగు న్యాయ శిబిరాలు నిర్వహించి రైతాంగానికి చట్టాలపై అవగాహన పెంచాలి. న్యాయ సలహాలు అందించాలి.
– అగ్రి లా కోర్సు: ప్రతి న్యాయ కళాశాలలో సాగు చట్టాలను బోధనా అంశంగా చేయాలి. వ్యవసాయ చట్టాలపై సాగు రంగంలో పనిచేసేవారందరికీ ఉపయోగపడేలా కోర్సులు రూపొందించాలి.
– ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలపై అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. సాగు చట్టాల గ్రంథాలయాలన్ని ఏర్పాటు చేసి ఆన్ లైన్ లో అందరికి అందుబాటులో ఉంచాలి.
మాకు తోడుగా రండి
అందరికీ బతకడానికి ఆహారం కావాలి. మన కోసమైనా అది పండించే రైతుకు అండగా నిలవాలి. అందరం కలిసి రైతులకు అండగా నిలుద్దాం. చట్టాన్ని వారికి చుట్టాన్ని చేద్దాం. ఎన్నో మార్గాల ద్వారా రైతులకు సాయం చెయొచ్చు. తెలంగాణలోనూ వ్యవసాయానికి సంబంధించి 50 చట్టాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వీటిలో అనేక మార్పులు, సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులు, వ్యవసాయం, చట్టాలు.. వీటిని లీగల్ కోణంలోనూ ఆలోచించాలి. ఉదాహరణకు మార్కెట్ చట్టంలో సెక్షన్11ఏ రైతులకు నష్టం కలిగించేలా ఉన్నది. అందుకే దాన్ని సవరించాలని తాము వ్యవసాయం, రైతు సంక్షేమ కమిషన్ తరపున ప్రభుత్వానికి ప్రతిపాదించాం. దేశంలోనే మొదటిసారిగా లీఫ్స్ సంస్థ ద్వారా రైతులకు ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. 2018 ఏప్రిల్ 10న ఈ సంస్థను ప్రారంభించిన నాటి నుంచి వేలాది మందికి శిక్షణ ఇచ్చాం. గ్రామాల్లో అగ్రి లీగల్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. మహాత్మాగాంధీ ఇండిగో రైతుల కోసం మొదలు పెట్టిన ఉద్యమమే స్వాతంత్రోద్యమంగా మారింది. ఇప్పుడు కూడా వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. లాయర్లు, స్టూడెంట్స్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులంతా కలిసి రైతుల కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏప్రిల్ 10 తేదీన ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సూచనలు అందించాలని కోరుతున్నాం.
- భూమి సునీల్, లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు, వ్యవసాయం/రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు






