- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతకనేర్చిన బడిపంతులు.. చదువు చెప్పడంపై కాకుండా సంపాదనపైనే ధ్యాసంతా.!
గవర్నమెంట్ టీచర్ కొలువు జీతం కోసమేనా.. భావి తరాన్ని తయారుచేయడం కోసం కాదా.?

"సర్కారు బడి" బతకాలె.
"పిల్లల సంఖ్య" పెరగాలె.
కానీ ఎట్లా.?
చదువు చెప్పాల్సిన టీచర్ దాన్ని పక్కకుపెట్టి..
"రియల్ ఎస్టేట్" దందా చేస్తేనా.?
"పాఠాలు"నేర్పాల్సిన పంతులు..
"చిట్టీల వ్యాపారం"లో బిజీ అయిపోతెనా.?
విద్యార్థుల "భవితకు ధీమా" కల్పించాల్సిన సార్లు..
"ఆరోగ్య బీమా" ఏజెంట్లుగా పనిచేస్తేనా.?
ఎట్ల సాధ్యమైతది.. "బడి బతకడం".?
"బడి బతకడం" కాదు..
ఇక్కడ "టీచర్లు బతికితే" చాలు.. వాళ్లకు జీతాలొస్తే చాలు.!!
ఇక.. "పిల్లలంటారా".?
"ఎవరి పిల్లలండీ".. వాళ్లేమైనా "సొంతం పిల్లలా".?
"స్కూలుకొచ్చినమా.? అటెండెన్సేసుకున్నమా.? పోయినమా.? అంతే బస్.!!
- దాయి శ్రీశైలం
"ఉన్నదున్నట్టంటే" కొందరికి కోపమొస్తది. "సర్కారు బడి" మీద లెస్స ప్రేమ చూపిస్తరుగానీ దాంట్లో చదువు చెప్పే టీచర్స్ పిల్లలనెందుకు "కార్పొరేట్ స్కూల్"లో వేస్తారని ఆలోచించినమా ఎప్పుడైనా.? అంటే వాళ్లు చెప్పే చదువుల మీద ముందు వాళ్లకే నమ్మకం లేదన్నట్టా.? "గవర్నమెంట్ టీచర్" కొలువనేది వాళ్లు జీతం తీసుకొని బతకడానికేగానీ.. భావి తరాన్ని తయారు చేయడం కోసం కాదన్నట్టా.?
జీతమెంత.? చదువెంత.?
"టీచర్" అనేది ఒక కొలువు కాదు. అదొక బాధ్యత. సొసైటీలో గవర్నమెంట్ టీచర్"లను ఎంతో గౌరవిస్తరు. వాళ్లు బాధ్యతగలవాళ్లు.. భావి తరాలను తయారుచేసేవాళ్లుగా కొనియాడుతారు. ఒకప్పుడు గవర్నమెంట్ టీచర్లను "బతకలేక బడిపంతులు" అంటుండె. అంటే.. అప్పటి అత్తెసరు జీతాలతో బతకలేని పరిస్థితి ఉండేదన్నమాట. కానీ గౌరవానికి మాత్రం ఎక్కడా తగ్గకపోయేది. ఇప్పటి గవర్నమెంట్ టీచర్లను "బతకనేర్చిన బడిపంతులు" అంటున్నారు. వేలల్లో, లక్షల్లో ఉంటుంది వాళ్ల జీతం. అంత బాగనే ఉందిగానీ "చారాణా కోడికి బారాణా మసాలా" అన్నట్టు వాళ్లు చెప్పే "పొడి పొడి చదువులకు" జీతం మాత్రం గట్టిగనే తీసుకుంటున్నారు. జీతం ఎక్కువగా తీసుకుంటున్నారని కాదు ఇక్కడ మా ఉద్దేశం.. తీసుకున్న జీతానికి తగ్గట్టు ఎందుకు పనిచేయడం లేదంటున్నాం.
ఉద్యోగమా.? బాధ్యతా.?
టీచర్లనెవరూ తీసిపారేయడం లేదు. వాళ్లను తక్కువ చూపించే ప్రయత్నం చేయడం లేదు. కానీ సొసైటీలో పలుచన ఎందుకవుతున్నారో ఆలోచించుకోండని చెప్తున్నాం. అసలు గవర్నమెంట్ టీచర్ చదివినంత చదువు, చేసిన పరిశోధన ప్రైవేటు స్కూల్ టీచర్లకు ఉందా.? లేదు కదా.? పీజీలు, పీహెచ్డీలు చేసినవాళ్లు కూడా గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో టీచర్లుగా పనిచేస్తున్నారు. చాలా సబ్జెక్ట్ ఉంటది.. కష్టపడి ఉద్యోగం సంపాదించారు. కానీ, దాన్నొక ఉద్యోగం అని భావించి పీఆర్సీలు, ఇంక్రిమెంట్లు, డీఏల కాడనే ఆగిపోతున్నారు. కొలువుంది కదా.? వచ్చి అటెండెన్స్ వేసుకుంటే సరిపోతుందిలే అనే నిర్లక్ష్యం చూపిస్తుంటారు చాలామంది గవర్నమెంట్ టీచర్లు. "ఇంటి దీపమని ముద్దాడితే మూతి మీసాలు కాలినట్టే" చేస్తున్నారు కొందరు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్లా.?
పిల్లలు సరిగ్గా చదవకపోతే "నీకు సదువుజెప్పిన సారెవ్వడ్రా" అని అంటరు. అంటే స్కూల్ కాంపౌండ్ నుంచి స్టూడెంట్ రూపంలో ప్రోడక్ట్ బయటకు వెళ్తే సొసైటీ మీద అదెంత ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సేమ్ టైం అది టీచర్ మీద ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరుస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. టీచర్లెప్పుడో చదువు చెప్పడం మానేశారు. చాలామంది "టీచర్ జాబ్"ను పార్ట్ టైంగా భావించి ఫుల్ టైం "రియల్ ఎస్టేట్ బ్రోకర్"లుగా పనిచేస్తున్నారు. ఏ స్టూడెంట్ నైపుణ్యమేంది.? ఎవరికి ఎలా లెసన్ చెప్పాలె.? అనేవి పెద్దగా తెలియవు కానీ, ఏ వెంచర్లో గజం భూమి ఎంత రేటుకు పోతుంది.? ఎంత కమీషన్ వస్తుంది.? అనేవి మాత్రం బరాబర్ తెలుస్తాయి. జాబ్ సంపాదించినంత మాత్రాన కూసుండవెట్టి జీతాలియ్యాల్నా ఏంది.?
ఇన్సూరెన్స్ ఏజెంట్లా.?
"కూసేటోడొచ్చి చేసేటోడిని చెడగొట్టినట్టు" గవర్నమెంట్ టీచర్ వ్యవస్థంతా పక్కదారి పడుతోంది. మాగ్జిమమ్ టీచర్లు టీచింగ్‌కు సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా కొందరు చేస్తుంటే, ఇంకా కొందరు "ఇన్సూరెన్స్ ఏంజెట్స్"గా మారిపోతున్నారు. వారి అవసరాల దృష్ట్యా ఎవరు ఏ పని చేసుకున్నా ఎవరికీ అవసరం లేదు. కానీ చేసే పనిని వదిలేసి, అదికూడా జీతం తీసుకుంటూ వేరే దానిపై వ్యామోహం ఎందుకు.? స్కూల్స్ రీ-ఓపెన్ కంటే ముందుగా "బడిబాట" కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లాల్సిందే అని ఉన్నతాధికారులు ఆర్డర్ చేస్తే వెళ్లారు కానీ, బడిబాట ద్వారా ఎంతమంది పిల్లల్ని కొత్తగా ఎన్‌రోల్ చేశారు.? ఎంతమంది పిల్లల్ని బడిబాట పట్టించారు.? "మీరు బాగనే చెప్తరులే" అని ఎంతమంది జనాలు ప్రశంసించారు.?
దయగల్ల టీచర్లు.!
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఒక స్కూల్‌లో ఒకబ్బాయి టెన్త్ ఫెయిలయ్యాడు. సప్లిమెంటరీలోనైనా పాస్ కావాలనే ఆరాటం. ఇంట్లో అడిగితే "నోటిఫికేషనొచ్చినప్పుడు పైసలు సార్‌కు ఇస్తలే" అని చెప్పిండ్రు. నోటిఫికేషనొచ్చింది.. లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. ఎంతైనా వాళ్ల స్టూడెంట్ కదా. ఫోన్ చేసి చెప్పడమో లేదా సమాచారం ఇవ్వడమో చేయాలి. పాపం.. కూలీనాలీ చేసుకునే కుటుంబం. పొట్టతిప్పల కోసం పొద్దుననంగా వెళ్లి రాత్రికి ఇంటికి చేరుకుంటారు. వాళ్లకు గుర్తులేనట్టుంది. పిల్లోడేమో మా నాయిన కట్టేశాడనే ధీమాతో ఉన్నాడు. తీరా హాల్ టికెట్ కోసం వెళ్తే "ఫీజు కట్టలేదు" అని పంపేశారు. ఎంతుంటది ఒక సబ్జెక్టుకు మహా అంటే రూ.1000 అనుకుందాం. టీచరో, హెడ్మాస్టరో ముందుగా కట్టేసి తర్వాత తీసుకుంటే ఎంత గౌరవం ఉండేది.
ఇదేనా నేర్పించేది.?
ఏ గవర్నమెంట్ స్కూల్లోనైనా చూడండి.. మాగ్జిమమ్ టీచర్లంతా రూ.10-15 లక్షల కార్లలో వస్తుంటారు. రోజూ పోసుకునే పెట్రోల్ ఖర్చంత కాదు ఒక విద్యార్థి సప్లిమెంటరీ ఫీజు విలువ. కానీ వాళ్లలా చేయరు. అందుకే జనాల్లో "టీచర్లు పిల్లికి బిచ్చమేయరు.. ఎంగిలి చేత్తోని కాకిని కొట్టరు" అనే అభిప్రాయం ఉంది. అంటే జేబులో నుంచి పది పైసలు కూడా తీయరు. అంతెందుకండీ.. వాళ్లంతా ఒకే స్కూల్‌కి వెళ్తారు. కానీ తోటి టీచర్‌ను కార్లో ఫ్రీగా ఎక్కించుకోరు. పెట్రోల్ బంక్ కాడ లెక్క క్లియర్ చేసుకున్నంకనే కార్ కదులుతుందట. స్కూల్లోనో.. మార్గమధ్యంలోనో వసూలు చేసుకుంటే ఎంత హుందాగా ఉంటుందనేది జనాల అభిప్రాయం. సరే అది వాళ్లిష్టం మనమేం చేస్తంగానీ.. ఇవేనా స్కూల్లో పిల్లలకు నేర్పించే ఆదర్శాలు అనేది ఇక్కడ పాయింట్.
ఇంతింతి కాదయా
"నిద్రపోయెటోన్ని లేపొచ్చుగానీ.. నిద్రపోతున్నట్లు నటించెటోన్ని ఎట్ల లేప్తం"? చౌటుప్పల్‌లో ఉండే ఒకతను ట్యూషన్లు చెప్పి, కూలీ పనిచేసి కష్టపడి టీచర్ ఉద్యోగం సంపాదించాడు. జాబ్ రాకముందు ఎన్నో ఆదర్శాలు బోధించేవాడు. "నేనే గనుక టీచర్‌నైతే విద్యావ్యవస్థను మార్చేసి.. సమాజాన్ని మేల్కొలుపుతా" అనే అతను ఇప్పుడు "మల్టీ లెవల్ మార్కెటింగ్"లో మోటివేషనల్ స్పీకర్. అది ఆయనిష్టం. టీచర్ ఉద్యోగంలో కంటే ఇక్కడ గ్రోత్ బాగుందని చేరాడు కావచ్చు. కానీ ఒకవైపు టీచర్ జాబ్‌లో నెలకు రూ.1లక్ష జీతం తీసుకుంటూ ఇంకోదిక్కు ఎంఎల్ఎం జాబ్ చేయడం కరెక్టేనా.? వీళ్లెంతసేపూ తమ జీతం, కుటుంబం, సంపాదన మాత్రమే చూసుకుంటున్నారు. కానీ తమపై నమ్మకంతో స్కూల్లో చేరిన పిల్లల భవిష్యత్ గురించి ఒక్క శాతమైనా ఆలోచిస్తున్నారా.?
వామ్మో టీచరా.?
"కుట్టెటోనికి కుడిదిక్కు.. చీదెటోనికి ఎడమదిక్కు ఉండొద్దు" అనేది పాత సామెత. ఇప్పుడు కొత్త సామెతను సృష్టించారు జనాలు. సోషల్ మీడియాలో చర్చకొచ్చే పాయింటేందంటే "టీచర్‌కు ఎటుదిక్కూ ఉండొద్ద"ట. పాపం.. అట్లంటే వాళ్లు ఫీలవుతారు. కానీ ఒక్కొకసారి గవర్నమెంట్ టీచర్లను దగ్గరగా చూస్తే నిజమే కదా అనిపిస్తుంది. మరీ కొందరు ఎట్ల తయారయ్యారంటే.. ఏదైనా ఫ్రీగా వచ్చే కార్యక్రమం ఉంటే అందరికంటే ముందు రెడీ అయుంటారు. కానీ వాళ్లు పెట్టేది ఏదైనా ఉందంటే మాత్రం పక్కోడికి కూడా సమాచారం ఇవ్వరు. ఇంట్లో కారు పెట్టుకొని కూడా లిఫ్ట్ మీదనో.. ఆర్టీసీ బస్సులో ఆఫ్ చార్జి తీసుకొనో వెళ్తుంటారు. అందరూ కాదుగానీ కొందర్ని చూస్తే.. వీళ్లతోని దోస్తాన్ లేదా సుట్టరికం పెట్టుకోవడానికి వామ్మో టీచరా అని భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు.
సామర్థ్యం లేదా.?
స్కూళ్లలో పాఠాలు చెప్పడం చేతగాదు కానీ.. బయట సొల్లు పురాణం చాలానే చెప్తుంటారు కొందరు టీచర్లు. ఒకసారి సోషల్ మీడియాలో చూడండి. రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతూ నోటితో అనరాని భాషను కూడా వాడుతూ పొలిటికల్ కామెంట్స్ చేస్తుంటారు. వాటిపై పెట్టే శ్రద్ధ ఏదో పిల్లలకు చదువు చెప్పడం మీద పెడితే "సర్కారు బడి" ఎందుకు బతకదు.? ఇవాళ ఒక్కో గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఎంతుంది.? తిప్పి తిప్పి కొడితే అన్ని తరగతుల్లో 100 మందికి మించడం లేదు. ఈ వందమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లున్నారు.? క్లాసుకో 15-20 స్టూడెంట్స్ ఉంటుండొచ్చు. పీజీలు, పీహెచ్డీలు చదివి ఎంతో నాలెడ్జ్, ప్రతిభ కలిగివున్న టీచర్లకు సంవత్సరానికో 20 మంది స్టూడెంట్స్ ను ప్రయోజకులను చేసే సామర్థ్యం లేదా.?
హర్టవ్వండి ప్లీజ్..
ఇంత చెప్పుకున్నాం కదా.? హర్ట్‌కాని టీచర్ ఎవరైనా ఉంటరా చెప్పండి.? ఎవరైతే నిజంగానే విధులను నిర్లక్ష్యం చేస్తున్నారో.. బాధ్యతగా పనిచేయడం లేదో వాళ్లు నిజంగానే హర్టవండీ. బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొస్తామంటే వద్దన్నవాళ్లు.. విధులు సక్రమంగా చేయమంటే యూనియన్‌తో చెప్పించుకునేవాళ్లు.. యూనియన్ పేర్లు చెప్పుకొని బయట విచ్చలవిడి రాజకీయం చేసేవాళ్లు.. ప్రశ్నించినందుకు ఎలక్షన్లో ప్రతాపం చూపించి పగ తీర్చుకునేవాళ్లు.. రిజిస్టర్లో సంతకం చేసి బయట బలాదూర్ తిరిగేవాళ్లు.. ప్రభుత్వ పాఠశాల మీదున్న నమ్మకాన్ని వమ్ముచేస్తున్నవాళ్లు నిజంగానే హర్టవండి. ఎందుకంటే మీరెట్లా ప్రైవేట్ స్కూళ్లతో పోటీపడరు. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పించే సాహసం చేయరు. కనీసం వచ్చిన పిల్లలకైనా సక్కగా చదువు చెప్పరు కాబట్టీ.. హర్ట్ అయినా నో ప్రాబ్లం.
నమ్మకం లేకుండా పోయింది: గొరిగె వెంకటేశ్, పోచారం
ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లల్ని చదివిద్దాం అని రెండేళ్లుగా అవగాహన నిర్వహిస్తున్నా. చాలామంది పేరెంట్స్ ముందుకొచ్చారు. ఈ సంవత్సరం ఎట్లయినా ఓ 10 మంది పిల్లల్ని చేర్పిద్దాం అనుకున్నాం. కానీ పేరెంట్స్ ఇప్పుడు సందేహిస్తున్నారు. "అసలు టీచర్లే సక్కగ రారంటా.. సదువు సరిగ్గా చెప్పరంటా.. చూసి చూసి మన ఆ టీచర్ల చేతిలో పెట్టి మన పిల్లల భవిష్యత్ ఎందుకు ఆగం చేసుకోవాలి" అని అని ప్రైవేట్లో చేర్పించారు.
ఎలా చేర్పించేది: అభినవచారి, మహబూబ్ నగర్
మాకు తెలిసినవాళ్లు గవర్నమెంట్ టీచర్లు చాలామంది ఉన్నారు. అందరూ అని చెప్పలేంగానీ కొందరైతే జాబ్ కంటే బిజినెస్‌పైనే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మాతోపాటు భూములు అమ్ముతుంటారు.. కొంటుంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంటది.. "వీళ్లు సక్కగుంటే మన పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు పంపిస్తం" అని. రోజూ అనుకుంటాం బడిని బాగుచేయాలని. కానీ ఏ నమ్మకంతో పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలి.?
జీతమే ముఖ్యమా?: చంద్రకాంత్ మిరియాల, అన్నా సాగర్, కామారెడ్డి
సర్కారు టీచర్లది చెప్పినా చెప్పకపోయినా జీతం వస్తుందనే ధీమా. చాలామంది ఆరోగ్య బీమా ఏజెంట్లుగా పనిచేస్తుంటారు. చిట్టీలు వేస్తుంటారు. వాళ్ల పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వడానికి.. కార్పొరేట్ స్కూళ్లలో చదివించడానికి వాళ్లు అలా తాపత్రయ పడుతుంటారు. మరి వాళ్లమీద నమ్మకంతో పాపం పేదవాళ్లు తమ పిల్లల్ని సర్కారు బడిలో చేర్పిస్తారు కదా.? మరి వాళ్ల పరిస్థితేంటి.? జీవితమే ముఖ్యమా వందలాది విద్యార్థుల జీవితాలు ముఖ్యమా అని ఆలోచించుకోవాలి.
అవగాహన ఉందా.?
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్టీఈ) 2009 ప్రకారం.. పిల్లలకు ఉచిత, నాణ్యమైన విద్యను అందించడం తప్పనిసరి. ఉపాధ్యాయులు ఈ బాధ్యతను నిర్వర్తించకపోతే వారిపై ఫిర్యాదు చేయొచ్చు. సెక్షన్ 24 ప్రకారం.. టీచర్లు తమ విధులను నిర్వహించడంలో విఫలమైతే వారిపై పరిపాలనా చర్యలు ఉంటాయి. కానీ ఎంతమందికి దీనిపై అవగాహన ఉంది. ఒకవేళ ఫిర్యాదు చేసినా యూనియన్లతో రంగంలోకి దిగి నిమిషాల్లో క్లీన్‌చిట్ తెప్పించుకుంటారు.
ధైర్యం చేస్తమా.?
ఆర్టీఈ యాక్ట్ ప్రకారం.. ప్రతీ స్కూల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఉండాలి. ఇది ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షిస్తుంది. ఏమైనా ఫిర్యాదులుంటే స్థానిక విద్యాధికారులకు తెలియజేసే రైట్ ఎస్ఎంసీకి ఉంది. కానీ ఎంతమందికి ఇది తెలుసు.? అసలు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్‌లే నిర్వహించరు. ఒకవేళ నిర్వహించినా అధికారులకు కంప్లెయింట్ చేసేంత ధైర్యం అసలుందా మనకు.?
సాహసం చేయగలమా.?
ఎంఈఓ, డీఈఓ పాఠశాలలను తనిఖీ చేసి ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉంది.? డ్యూటీకి సక్రమంగా వస్తున్నారా.? బయట వ్యాపకాలు పెట్టుకొని డుమ్మా కొడుతున్నారా అని మూల్యాంకనం చేస్తారు. ఒకవేళ నిజంగానే ఇవన్నీ ఉన్నాయని గుర్తిస్తే ఆధారాల ప్రకారం చర్యలు తీసుకుంటారు. కానీ ఇలా ఎక్కడ చేస్తున్నారు.? డ్యూటీకి రావడం లేదని నిలదీసే పాహసం చేస సహ ఉపాధ్యాయుడు.. ప్రధానోపాధ్యాయుడు ఉన్నాడా ప్రస్తుతం.?
ఆ ధైర్యం ఎవరికుంది.?
బయట వ్యాపకాల వల్ల బోధనను మర్చిపోయిన వాళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ లేదా డైట్ సంస్థలు శిక్షణ కార్యక్రమాలు ఇస్తాయి. కానీ ఇలా జరిగిన సందర్భాలను మనం ఎప్పుడైనా చూశామా.? యూనియన్ లీడర్లుగా వాళ్లు రాజకీయ రంగు పులుముకొని.. ఖద్దరు ధరించి ఏనాడో ఎడ్యుకేషన్ సిస్టంను పొలిటికలైజ్ చేశారు. అలాంటి వ్యవస్థను ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికుంది.?
- Tags
- School fees
- education
- income
- number of children
- real estate
- lessons
- chit business
- future
- health insurance
- agent
- salaries
- attendance
- government school
- corporate school
- liability
- society
- insurance
- notification
- supplementary
- fee
- multi-level marketing
- motivational speaker
- RTC bus
- PG
- PhD
- knowledge
- talent
- biometric
- teachers union






