- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరుగు పొరుగు.. కనుమరుగు.!
పొరుగువారి గురించి పట్టించుకునే తీరిక లేకుండా పోతోంది. ఇక సంభాషణలకు అవకాశమెక్కడిది.?

దిశ, ఫీచర్స్: లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటాం. అందమైన అపార్ట్‌మెంట్ అని మురిసిపోతాం. విశాలమైన గేటెడ్ కమ్యూనిటీ అని గ్రేట్‌గా చెప్పుకుంటాం. ఏ అవసరం వచ్చినా బయటకు వెళ్లే పనేలేదని సంబరపడతాం. ఈస్ట్ ఫేస్.. నార్త్ ఫేస్ అని సెలెక్టివ్‌గా ఉంటాం. కానీ.. పక్కింట్లో ఎవరుంటున్నారు.? ఎదురింట్లోకి ఎవరు దిగారు.? అసలు మన చుట్టూ ఉంటున్నదెవరు.? వాళ్లేం చేస్తుంటారు.? మనమెంత వరకు క్షేమంగా ఉన్నామనేది మాత్రం అస్సలు పట్టించుకోం.
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..
గేటెడ్ కమ్యూనిటీస్.. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల వల్ల లగ్జరీ.. సెక్యూరిటీ.. ప్రైవసీ ఉంటాయని అనుకుంటాం. కానీ.. కొన్ని సంఘటనలను బట్టిచూస్తే అవెంతవరకు సేఫ్ అనేది అర్థంకాని పరిస్థితి. రోజువారీ ఒత్తిడే అనుకోండి. లేదా వర్క్ ఫ్రమ్ హోం కల్చరే అనుకోండి. ఇంకేదైనా కావచ్చు. ఈ గేటెడ్ కమ్యూనిటీస్.. అపార్ట్మెంట్లలో ఉండేవారి మధ్య ఎక్కువగా డిజిటల్ కనెక్టివిటీ ఉంటుంది. దానికే జనాలు అలవాటు పడిపోతున్నారు. ఈ క్రమంలో ఇరుగు పొరుగు మధ్య సంభాషణల.. సామూహిక కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా పక్కింట్లో ఎవరుంటున్నారు.. ఏం చేస్తుంటారనే ముచ్చట తెలియడం లేదు. మనుషుల కన్నా భద్రతా వ్యవస్థలపై ఆధారపడటం వల్ల పొరుగువారి గురించి పట్టించుకునే తీరిక లేకుండా పోతోంది. ఇక సంభాషణలకు అవకాశమెక్కడిది.?
ఏదైనా జరిగితేనే తెలిస్తుందా.?
అపార్ట్‌మెంట్ కల్చర్ వల్ల మన ఇరుగు పొరుగున ఎవరు నివాసం ఉంటున్నారు. మన కాలనీలో నివసిస్తున్నొళ్లు ఎవరు.. వాళ్లెక్కడి నుంచి వచ్చారనే కనీస అవగాహన లేకుండా బతికేస్తున్నాం. కాలనీలో ఏదైనా జరగరాని సంఘటన.. హత్యలు.. నేరాలు జరిగితే అయ్యో అని అప్పుడు ఆశ్చర్యపోతుంటారు. అదికూడా అప్పటివరకే చర్చించుకొని వదిలేస్తుంటారు. ఆ తర్వాత ఎప్పటిలాగానే ఇంటికి తాళం.. నోటికి తాళం. ఒకప్పుడు ఊర్లలో ఏ ఇంట్లో ఎవరుంటున్నారు.. వాళ్లకు ఎంతమంది పిల్లలు.. ఏం పని చేస్తుంటారు అనే విషయాలు ఎవరూ అడగకపోయినా చెప్పుకునేవాళ్లు. ఒకరికొకరు పని లేకున్నా పలకరించుకునేవాళ్లు. ఇప్పుడు ఒకే అపార్ట్‌మెంటులో పక్క ఫ్లాట్లో ఎవరు ఉంటున్నారని అడిగితే.. ఏమో మాకేం తెలుసు అనే విధంగా మారిపోయింది పరిస్థితి.
ఎదురుపడకుండా ఏండ్లకేండ్లు..
ఇరుగు పొరుగు సంప్రదాయం కనుమరుగవడానికి ప్రధాన కారణం.. ఎవరో గురించి మనకెందుకులే అనుకోవడం. పరిచయం పెంచుకుంటే ఎవరేమనుకుంటారో అనే భావన వల్ల ఒకరికొకరు అస్సలు పలకరించుకోరు. కనీసం హాయ్.. బాయ్ అని కూడా తలూపలేని పరిస్థితి కనిపిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీలు సెక్యూర్‌గా కనిపించినా.. సీసీటీవీ.. సెక్యూరిటీ గార్డ్ వ్యవస్థ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా అవగాహన లేకపోవడంతో సస్పిషియస్ యాక్టివిటీస్ మిస్ అవుతున్నాం. ఇంకో రకంగా అర్బన్ లైఫ్ స్టయిల్ కారణం. ఐటీ ప్రొఫెషనల్స్.. ఫ్యామిలీలు బిజీగా ఉండటం వల్ల సామాజిక ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల పక్కింటొళ్లు.. ఎదురింటొళ్లు ఏం చేస్తుంటారో మనకు తెలియదు. కనీసం పిల్లలు.. పిల్లులు కూడా డ ఉంటుంటారు.
మన ఫ్లాట్ కంఫర్ట్‌గా ఉంటే చాలు అంతే..
ఒక ఘటనను పరిశీలిద్దాం. అది ఆగస్టు 18. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దయార్గూడలో 12 ఏండ్ల అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఆమెనెవరో దారుణంగా హత్య చేశారు. మరీ ఘోరంగా 20 సార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చినవాళ్లే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కానీ విచిత్రంగా పక్కింట్లో ఉండే 14 ఏండ్ల వయసున్న యువకుడు ఈ ఘోరానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అప్పటివరకు వాడెవడో.. ఏ ప్లాట్లో ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. ఒకరికొకరు ముఖ పరిచయం ఉంటే వాడేంటో.. వాని కథేందో తెలిసేది కదా.? ఫ్లాట్స్ చేసినవాడికేమో ఫ్లాట్ అమ్ముడయ్యిందా.. పైసలొచ్చాయా అనేదే ముఖ్యం. మనకేమో మన ఫ్లాట్ కంఫర్ట్‌గా ఉందా లేదా అనేదే ముఖ్యం.
ఘటన జరిగాక అయ్యో అనే పరిస్థితి ఉండేదా.?
మరో ఘటన.. సెప్టెంబర్ 10న కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో 50 ఏళ్ల రేణూ అగర్వాల్‌ను వాళ్లింట్లో పనిచేసే కుక్.. వాడి దోస్తు కలిసి హత్య చేశారు. తాడుతో కట్టేసి.. ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి.. గొంతు కోశారు. ఆ తర్వాత బంగారు.. ఇతర నగలు దోచుకుని వెళ్లిపోయారు. రేణూ అగర్వాల్ ఇరుగు పొరుగుతో అస్సలు పరిచయం పెంచుకోలేదు. ఆమె ఏం చేస్తుందో కూడా పక్కింటొళ్లకు తెలియదు. ఈ కమ్యూనిటీ గ్యాప్‌నే పసిగట్టిన కుక్.. దొంగతనానికి ప్లానేశాడు. ఆ వంటవాడు రోజూ వస్తుంటాడు పోతుంటాడు కాబట్టీ ఎవరూ డౌట్ పడలేదు. ఇంకోటి వాడసలు వంటవాడా లేక వాళ్లింట్లో మనిషా అనే కనీస అనుమానం కలగలేదు. ఇరుగు పొరుగు ఒకరికొకరు పరిచయం ఉంటే ఇలా జరిగేదా.? ఘటన జరిగాక అయ్యో అనే పరిస్థితి ఉండేదా.?
అడిగే పరిస్థితి లేకపోవడం వల్లే..
గేటెడ్ కమ్యూనిటీలో అయితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. మామూలుగా గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏమనుకుంటాం కమ్యూనిటీ గేట్ దాటి బయటి నుంచి చీమ కూడా రాదు అనే కదా.? అలా ఆలోచించేవాళ్లున్నారనే విషయం పసిగట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడొక విచిత్రమైన ఘటన జరిగింది. అక్టోబర్ 13న హయత్‌నగర్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్‌లోని సదాశివ గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం జరిగింది. దొంగలు రెండు ఇళ్లలో లక్షల రూపాయల విలువైన సొత్తును దోచుకున్నారు. పక్క పక్క ఇళ్లలో ఉంటున్నవారికి ఒకరికొకరు గురించి తెలియదు. కొత్తవారు వచ్చే అవకాశం లేదు.. ఒకవేళ కొత్తగా కనిపించినా అడిగే లేదా అనుమానస్పదంగా భావించే పరిస్థితి లేకపోవడం వల్ల లక్షల సొత్తు దొంగిలించి దర్జాగా ఎస్కేప్ అయ్యారు దొంగలు.
ఉగ్రవాదిని పసిగట్టలేనంత బిజీ..
నగరాలు.. పట్టణాలు విస్తరిస్తున్న క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి రకరకాల వ్యక్తులు వచ్చి బ్యాచిలర్ రూంలు.. హాస్టల్స్.. అపార్ట్‌మెంట్స్.. గేటెడ్ కమ్యూనిటీస్‌లో నివాసం ఉంటున్నారు. ఇండ్లు.. ఫ్లాట్లు అమ్మే లేదా కిరాయికిచ్చే వాళ్లు డబ్బు గురించే ఆలోచిస్తారు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు.? గుర్తింపు కార్డులున్నాయా.? అనేవి అస్సలు ఆరా తీయరు. జనాలు కూడా ఎవరితో మనకెందుకు.? అనుకొని ఎవరినీ పెద్దగా పట్టించుకోరు. జగద్గిరిగుట్ట ఏరియాలో ఒక వ్యక్తి ఇలాగే ఒక కిరాయిల్లు తీసుకొని పిల్లలకు ట్యూషన్లు చెప్తుండేవాడు. పాఠాలు చెప్తుండు కదా పెద్ద సారే అయుంటాడనుకున్నారు జనాలు. కానీ వాడు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు నిర్దారణయింది. అంటే.. ఒక ఉగ్రవాది మన మధ్యలో ఉంటే పసిగట్టలేనంత బిజీగా ఉన్నాం మనం.
చనిపోతే వాడకట్టంతా ఏకమయ్యేది..
ఇరుగు పొరుగంటే రక్త సంబంధంతో సమానంగా భావించేవాళ్లు ఒకప్పుడు. ఏ సమస్య ఉన్నా చెప్పుకునే చనువుండేది. ఒకరింట్లో నుంచి ఒకరు సరుకులు చేబదులు తీసుకునేవాళ్లు. అన్నం.. కూర కూడా అడక్కుండానే పెట్టుకొని వెళ్లేంత దగ్గరితనం ఉండేది. ఎవరైనా ఓ గంట కనిపించకపోతే "ఏందయ్యా పొద్దటి నుంచి కనవడలేదు" అని అడిగేవాళ్లు. ఏదైనా సమస్యుందేమో చెప్పుకోవడం లేదేమో అని మరీ మరీ కుచ్చికుచ్చి అడిగేవాళ్లు. ఇంట్లోకి వెళ్లిందే ఆలస్యం.. చాయ్ గానీ.. మంచినీళ్లుగానీ ఇచ్చినంకనే మిగతా ఏదైనా. పెండ్లి సంబంధాలు.. ఉద్యోగ అవకాశాలు చాలా మటుకు ఇరుగు పొరుగు కమ్యునికేషన్ వల్లనే ఫలించేవి. ఎవరింట్లో అయినా మనిషి చనిపోతే వాడకట్టంతా ముందుండి కార్యక్రమాలు నడిపించేవాళ్లు. దగ్గరుండి ఓదార్చేవాళ్లు.
నమ్మకంతో పిల్లల్ని వదిలేసి వెళ్లేవాళ్లు..
పాత రోజుల్లో ఇరుగు పొరుగు మధ్య ఏ విషయమూ సీక్రెట్ ఉండేది కాదు. ప్రతీ అంశాన్ని చర్చించుకునేవాళ్లు. "మీ అబ్బాయికి ఎన్ని మార్కులొచ్చాయి".. "ఈ రోజు మార్కెట్లో బెండకాయ కిలో రేటెంత ఉంది.?".. "అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందా? మాకు తెలిసిన ఒక మంచి అబ్బాయి ఉన్నాడు".. వంటి చర్చలు జరిగేవి. మొహమాటాలకు.. దాపరికాలకు తావుండేది కాదు. బంగారం గురించి పేపర్లో కాకుండా అమ్మలక్కల ముచ్చట్లలోనే తెలిసేవి. ఒకర్నిచూసి ఒకరు ఇగురంతో బంగారం కొనుక్కునేవాళ్లు. ఇంటికోసం డబ్బులు దాచుకునేవాళ్లు. "అక్కా.. నేను ఊరికెళ్తున్నాం పిల్లలు మీ ఇంట్లోనే ఉంటారు" అని నమ్మకంతో వదిలేసి వెళ్లేవాళ్లు. అంతే నమ్మకంతో వాళ్లుకూడా సొంత పిల్లల్లా చూసుకొని మంచి భోజనం పెట్టేవాళ్లు.. పేరెంట్స్ వచ్చేదాక కంటికి రెప్పలా చూసుకునేవాళ్లు.
వాట్సపే వారి కమ్యూనిటీ..
ఇప్పుడు ఇరుగు పొరుగంటే అంతా వాట్సప్ గ్రూప్‌లోనే. వాట్సప్ గ్రూపులో "హాయ్ గుడ్ మార్నింగ్" అనే మెసేజ్ ఫార్వార్డ్ చేసి అదే పెద్ద కమ్యూనిటీ అనుకుంటాం. "బృందావనం గేటెడ్ కమ్యూనిటీ" అని పేరుంటుంది కానీ.. ఒక్కరూ ఆ పేరుకు సార్ధకత తీసుకురారు. "ఈ రోజు అపార్ట్‌మెంట్ మీటింగ్ ఉంది. సభ్యులెవరైనా రాకపోతే రూ.500 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది" అని వాట్సప్‌లో వచ్చిన మెసేజీకి లైక్ సింబల్ క్లిక్ చేసి.. ఫైన్ కట్టడానికే మొగ్గు చూపుతారుగానీ.. ఆ మీటింగుకు పోరు.. అక్కడి చర్చల్లో పాల్గొనరు. కొందరేమో ఫైనెవడు కడతకాడని ఏదో పేరుకు వెళ్తారు.. అక్కడ ఉన్నంతసేపూ మొబైల్లో రీల్స్ చూసి.. చాయ్ తాగి తిరిగి తన ఫ్లాట్‌కొచ్చేస్తారు. ఇగో ఇవేనండీ ఇప్పుడు మనవాళ్లకు తెలిసిన కమ్యూనిటీ స్కిల్స్.. ఇరుగు పొరుగు సంబంధాలు.
ఎవరి ఫోన్లో వాళ్లు మొఖం పెట్టుకుంటారు..
భద్రత కోసం మనమిపపుడు గేట్లు పెట్టుకున్నాం. ఆ గేట్ల మధ్యలో మనసుల మధ్య కూడా గోడలు పెరిగాయి. 500 ఫ్లాట్స్ ఉంటాయి. అంటే చిన్నపాటి ఊరే కదా.? వాట్సప్ గ్రూపులో వచ్చే రెగ్యులర్ మెసేజీలు ఏంటో తెలుసా.? ఎక్కువగా హ్యాపీ బర్త్ డే.. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మెసేజీలు. అలా కాకుండా ఎవరైనా కమ్యూనిటీ సమస్యలు పెట్టారనుకోండి ఒక్కరూ రిప్లయ్ ఇవ్వరు. ఎవరూ పేరు పెట్టి మాట్లాడరు. ఒకే అపార్ట్‌మెంటే.. పక్కపక్క ఫ్లాట్స్‌లో ఉండేవాళ్లే. ఎలాగూ ఇంటిదగ్గర మాట్లాడరు. కనీసం లిఫ్ట్‌లో ఒకరికొకరు తారసపడితే "హాయ్" అని ఒకరికొరు అనుకుంటారు. అంతే ఇగ.. అదే వాళ్లమధ్య పెద్ద కమ్యూనికేషన్ అంటే. వెంటనే ఎవరి ఫోన్లు వాళ్లు చేతిలో పట్టుకొని లిఫ్ట్ సెల్లార్లోకి వెళ్లంత సేపూ దాంట్లోనే మొఖం పెట్టి స్క్రోల్ చేస్తుంటారు.
ఇరుగు పొరుగు కనుమరుగేనా ఇక.?
హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్‌లో నుంచి ఏదో దుర్వాసన వస్తుంటే పక్కింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పలగ్గొట్టి చూస్తే ఒక పెద్ద మనిషి చనిపోయి కనిపించాడు. అదికూడా కుర్చీలో కూర్చునే. చనిపోయి నాలుగైదు రోజులు అయుంటుందని పోలీసులు అంచనా వేశారు. అంటే పక్కింట్లో ఒక పెద్దాయన ఒంటరిగా ఉంటున్నాడో.. పాపం ఆయనకు ఏం ఆపద ఉందో.. తిన్నాడో లేడో అనేది కూడా పట్టించుకునే నాథుడే లేడు ఈ రోజుల్లో. చనిపోయాక "ఒక ముసలాయ్న ఉండేది" అని చెప్తున్నారు. ఆ పెద్దాయన కూడా పక్కింటివాళ్లతో మంచి కమ్యూనికేషన్ మెయింటెన్ చేసి ఉంటే.. తన మనసులో బాధేంటో అయినా తెలిస్తుండె కదా.? ఇట్లాంటి మనస్తత్వాలు ఉంటున్నాయి కాబట్టే ఇరుగు పొరుగు కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది.
మొఖాలు చూసుకోకుండా పెంచుతున్నాం..
ఒకప్పుడు సాయంత్రం పిల్లలు వీధిలో ఆడుతూ కనిపించేవాళ్లు. ఇప్పుడు బయటకెళ్తే చాలు "ఛల్.. ఇంట్లోకి నడువ్" అని తరుముకొస్తున్నారు. దీంతో పోరగాళ్లు ఫోన్లకు అత్తుకపోయి పబ్జీ.. ఇన్‌స్టా రీల్స్‌లో బిజీ అయిపోయి.. పక్కింటి పిల్లోడి మొఖం కూడా తెలియకుండా పెరుగుతున్నారు. పండగకు.. పబ్బానికి కూడా పలకరింపులు ఉండవుగానీ.. "స్వీట్స్ కొరియన్ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశాం.. కావాలా" అని లింక్ షేర్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరే ఇద్దరితో కమ్యూనికేషన్లో ఉంటారు. ఒకరు సెక్యూరిటీ గార్డ్.. ఇంకొకరు మెయిడ్. సెక్యూరిటీ గార్డ్ "సార్.. గుడ్ మార్నింగ్.. కారు నెంబర్" అంటాడు. మెయిడేమో "అమ్మా.. ఏం వండాలి" అంటుంది. అంతకంటే వేరే మాటలేవీ ఉండవు. కనీసం వాళ్ల మొఖం కూడా సరిగ్గా చూడకుండా బతికే పరిస్థితులు.
ఇరుగు పొరుగంటే ఫ్లాట్ నెంబరేనా.?
పక్కింట్లో ఉంటే ఒకప్పుడు వాళ్ల చుట్టాల గురించి కూడా తెలిసేది. ఇప్పుడు ఫ్లాట్ నంబర్ మాత్రమే తెలుసు. ఒకప్పుడు ఎవరింట్లోనైనా పెండ్లి జరిగితే వాడకట్టు మొత్తాన్ని వంట చేయనీయకపోయేది. ఇగ ఇప్పుడైతే కేటరింగ్ బుక్ చేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పోస్ట్ చేస్తేనే తెలుస్తుంది వాళ్లింట్లో ఏదో పార్టీ జరిగిందని. ఒకప్పుడు ఎవరికైనా జ్వరమొస్తే మొత్తం కాలనీ కాలనీయే వచ్చి చూసేది. అదే ఇప్పుడైతే.. పలకరించనే పలకరించరు. పాపం ఎవరికైనా అత్యవసరంగా పైసలు కావాల్సి వస్తే.. ఒకప్పుడు చేబదులుగా పైసా మిత్తీ లేకుండా సాయం చేసేవాళ్లు. కానీ ఇప్పుడంత సీన్ లేదు. ఒకవేళ ఇచ్చినా ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ అని అడుగుతారు. ఫైనల్‌గా.. ఇప్పుడు ఇరుగు పొరుగంటే ఒక ఫ్లాట్ నెంబర్.. దానికి ఆనుకొని ఉన్న గోడ మాత్రమే.
అన్నింటికీ వాట్సప్ గ్రూపే: శరత్‌బాబు బండారు, అన్నోజిగూడ
అపార్ట్‌మెంట్ కల్చర్ మనుషులను దూరం చేస్తోంది. నేనిప్పుడు అన్నోజిగూడలో ఉంటున్నా. ఆరేండ్లుగా ఇక్కడ ఉంటున్నా.. ఎవరితో పెద్దగా పరిచయాలు లేవు. ఇంకా ఆరేండ్లున్నా ఇలాంటి పరిస్థితే ఉంటుండొచ్చు. ఇక్కడ సమస్య నాదో.. ఇంకొకరిదో కాదు. మన జీవన విధానంలో మార్పుల వల్ల.. బిజీ వల్ల ఇలా మారిపోతున్నాం. ఇప్పుడు ఇరుగు పొరుగంటే వాట్సప్ గ్రూపే అన్నమాట.
అవి కవర్ చేస్తున్నాయి: ప్రవీణ్ రెడ్డి, కేపీహెచ్‌బీ కాలనీ
పక్కింటి కథలు ఫన్నీగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాంగానీ.. వాస్తవానికి ఈ రోజుల్లో ఒకర్నొకరు పట్టించుకునే సమయం లేదు. ఒకరకంగా ఈ కిటీ పార్టీలు.. గణేష్ ఫెస్టివల్.. గెట్ టుగెదర్స్ కొంతవరకు అపార్ట్‌మెంట్లో ఉన్నవాళ్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ను కవర్ చేస్తున్నాయి. అవిగూడ లేకపోతే ఇక అపార్ట్‌మెంట్లు.. గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఒకరికొరు ఏడాది పొడవునా మాట్లాడుకోవడాలు ఉండవు.
అంతా ఆర్టిఫీషియల్: సత్యనారాయణ వేల్పుల, తుర్కయాంజాల్
ఒకప్పుడు ఇరుగు పొరుగు మధ్య మంచి మానవ సంబంధాలు ఉండేవి. అవిప్పుడు కొరవడిన మాట వందశాతం కరెక్ట్. ఏదైనా జరగరానిది జరిగితేనే ఇరుగెవ్వరు పొరుగెవ్వరు అనేవి తెలుస్తున్నాయి. భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ఇరుగు పొరుగు సంప్రదాయం బాగుండేది. ఇప్పుడు జనాలంతా పాష్ కల్చర్‌కు అలవాటు పడి మనుషులతో కాకుండా వస్తువులతో జీవిస్తూ ఆర్టిఫిషియల్‌గా బతుకుతున్నారు.






