- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రీ బస్సుకు జై.. ఫ్రీ బడికి నై.!
ఎక్కువ ఫీజులుంటే.. ఎక్కువ చదువు చెప్తరనే అభిప్రాయం ప్రజల్లో ఉంది

ఫ్రీ బస్సు అనంగనే..
కారున్నొళ్లు కూడా సర్కారు బస్సెక్కుతుండ్రు.
ఫ్రీ రేషన్ అనంగనే..
పైసలున్నొళ్లు కూడా ప్రభుత్వ సరుకులు తీసుకుంటుండ్రు.
ఫ్రీ ఆపరేషన్ అనంగనే..
లక్షలున్నొళ్లు కూడా ఆరోగ్యశ్రీని ఆసరా చేసుకుంటుండ్రు.
మరి ఫ్రీ స్కూల్ కూడా ఉంది కదా.?
అది ప్రభుత్వానిదే కదా.?
గవర్నమెంట్ స్కూల్ అనంగనే ఎందుకు దూరం జరుగుతుండ్రు.?
డ్రైవర్ మీదున్న నమ్మకం టీచర్ మీద లేకనా.?
సర్కారు స్కూళ్లల్ల సదువు సక్కగ చెప్పరనా.?
- దాయి శ్రీశైలం
మార్కెట్లో ఏదైనా వస్తువు తక్కువ ధరకు దొరికితే దానిమీద జనాలకు లక్షాతొంబై అనుమానాలుంటయి. "తక్వకెందుకు ఇస్తుండొచ్చు.? అవి మంచివేనా.? లేక కరాబైనయా.?" అని ఆలోచిస్తుంటరు. అదే వస్తువును రంగు రంగు లైట్లకింద పెట్టి స్టిక్కరేసి అమ్మితే "అబ్బా.. మంచి బ్రాండ్" అని ఎగబడి కొంటరు. స్కూల్ల ముచ్చట కూడా ఇట్లనే ఉంది. ప్రైవేటు స్కుళ్లల్ల బాగా చెప్తరనీ.. ప్రభుత్వ పాఠశాలలో ఏమీ చెప్పరనుకుంటారు జనాలు.
ఫీజు ఎక్కువుంటే మంచి స్కూలా.?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఒక స్కూల్ ఓపెన్ అయింది. "మాది గ్లోబల్ స్కూల్.. మొత్తం 20 ఎకరాలు. ఇంటర్నేషనల్ సిలబస్.. పానిండియా ఫ్యాకల్టీ.. ఏసీ బస్సులు.. రవిశాస్త్రి టీమ్ క్రికెట్ కోచింగ్ ఇస్తాడని యాజమాన్యం చెప్తోంది. ఎల్కేజీ స్టూడెంట్‌కి దాంట్లో ఫీజెంతో తెలుసా.? అక్షరాల రెండు లక్షల యాబైవేలు. ట్రాన్స్‌పోర్ట్ ఫీజు కాకుండానే. స్కూల్ ఫీజ్ లక్షల్లో ఉంది కాబట్టీ.. అలాంటి స్కూల్లో చేరిస్తే తమ పిల్లలకు మంచిగా చదువొస్తుందని చాలామంది అడ్మిషన్ కోసం వెళ్తున్నారు. ఇంతకుముందు సంవత్సరానికి రూ.40వేలు ఫీజున్న స్కూల్లో చదివించడానికే ఎన్నో ఇబ్బందులు పడ్డవాళ్లే ఈ కొత్త స్కూల్ భవనాలను చూసి టెంప్టయిపోతున్నారు. "అప్పుసప్పు చేసైనా సరే.. దాంట్లోనే చదివించాలి" అని రోజూ ఆ స్కూల్ చుట్టే తిరుగుతున్నారు.
ఎందుకు అంత కష్టం.?
పిల్లలను బాగా చదివించాలని ఆశపడటం తప్పు కాదు. కానీ ఫీజులు ఎక్కువున్న స్కూళ్లల్లనే చదువు బాగా చెప్తరనే భ్రమల్లోంచి జనాలు బయటికి రావాలి. ఇప్పుడు అప్పుసప్పు చేసో.. లేక అదలు బదలు చేసో పెద్ద పెద్ద బిల్డింగులున్న స్కూల్లో చేర్పి్స్తామనుకోండి. ఇట్లా ఎన్నేండ్లు అప్పు సప్పుచేసి చదిస్తరు.? ఇంటర్ వరకు అదే స్కూల్లో ఉంటుంది కాబట్టీ మొత్తం సమర్పించుకోవాల్సింది కోటి రూపాయలకు తక్కువుండదు. ఇంకా ప్రతీ సంవత్సరం 10శాతం ఫీజు పెరుగుతుంది. ప్రతీ సంవత్సరం ఒక్కో ఇన్‌స్టాల్మెంట్లో ఎంతలేదన్నా రూ.70 వేలకంటే తక్కువ ఉండదు. ఏదో ఆవేశంకొద్దీ రెండు మూడేండ్లు కష్టపడి చదివిస్తాం. ఆ తర్వాత స్థోమత లేక మధ్యలోనే ఆపేస్తం. అప్పుడు పిల్లల పరిస్థితి అటుగాకుండా.. ఇటుగాకుండా అయిపోతుంది.
ప్రకటనలే పాఠాలు చెప్పవు కదా.?
యాజమాన్యాలకు చదువొక బిజినెస్. 20 ఎకరాల విస్తీర్ణం అంటారు. పెద్ద పెద్ద బిల్డింగులంటారు. బిల్డింగులు చదువు నేర్పిస్తయా.? స్కూల్ 20 ఎకరాలుంటేంది.? 30 ఎకరాలుంటేంది.? పిల్లలకు కావాల్సింది చదువు కదా.? అయినా వాళ్లదేం పోయింది బాస్.. ఆకర్షణ కోసం ఎన్నో చెప్తారు. "మా వద్ద డొనేషన్లు లేవు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. అత్యాధునిక వసతులు, నిపుణులైన బోధనా సిబ్బంది, విశాల భవనాలు" అని ఏవేవో చెప్తారు. ఇంకా కొందరైతే "మీకు నచ్చకపోతే అడ్మిషన్ వాపస్ తీసుకోండి" అని అంటారు. అదేమైనా షర్టా లేక ప్యాంటా.. ఒకసారి ట్రయల్ చేసి నచ్చకపోతే తిరిగి ఇచ్చేయడానికి.? చదివించాలనే తాపత్రయం ఒక్కటే కాదు.. ఎక్కడ చదివించాలి.? ఎలా చదివించాలి అనేది చాలా ముఖ్యం.
సామాన్యుడు చదివే స్కూల్సేనా ఇవి.?
మనొళ్లకు "వద్దు" అని చెప్తే కూడా సమస్యనే. "మీవొళ్లనైతే మంచి స్కూళ్ల సదివిస్తవ్. మమ్మల్నేమో వద్దని చెప్తవా" అని అంటరు. మంచి స్కూలంటే వాళ్ల దృష్టిలో ఎంతసేపూ ఎక్కువ ఫీజులు గుంజే స్కూలు. ఎక్కువ విస్తీర్ణముండే స్కూల్. "మీకెలాంటి బర్డెన్ ఉండదు. మేం అందరిలెక్క కాదు" అని చెప్పేది చెప్పుకుంటనే "అప్లికేషన్ ఫీజు రూ.5,000, యాన్యువల్ ఫీజు రూ.30,000, వన్ టైం ఫీజు రూ.40,000, కేషన్ డిపాజిట్ రూ.20,000 అని అదీ ఇదీ వేసి మన జేబుకు చిల్లు పెట్టాలనుకుంటాడు. ఇంకేమన్నంటే "భోజనం మాదే.. డ్రెస్ మేమే ఇస్తాం. బుక్స్ మేమే ఇస్తాం" అంటారు. అదిచూసి "ఫుడ్ వాళ్లే పెడ్తరంటా.. స్కూల్ యూనిఫాం వాళ్లే ఇస్తరంటా.. బుక్స్ వాళ్లవేనంటా" అని మురిసిపోతరు మనొళ్లు. ఔనండీ.. మన పిల్లలకు మనం తిండిపెట్టి.. బట్టలిప్పించలేమా.?
పాన్ ఇండియా టీచరే కావాలా.?
బిజినెస్ చేసెటోడు బిజినెస్ యాంగిల్లోనే ఆలోచిస్తడు. అంగట్లో బర్లను.. గొర్లను బేరం చేసినట్లే ఉంటది వాడి యవ్వారం. కానీ.. పైసా పెట్టేది మనం. బాధ్యత ఉండాల్సింది మనకు. వాళ్ల లెక్కలు వాళ్లకుంటయి. సందు దొరికితే ముక్కు పిండాలనుకునే బాపతులే ఉంటరు ఏ బిజినెస్లో అయినా. ఫీజులు ప్రతిభను నిర్ణయించలేవు. "గ్లోబల్ స్కూల్స్".. "ఇంటర్నేషనల్ స్కూల్స్" అనే ట్యాగ్‌లైన్లు ఒక విద్యార్థిని ముందుకు నడిపించలేవు. "కేంబ్రిడ్జి సిలబస్".. "ఓక్రిడ్జి" బోధన అనేవే ర్యాంకులను తీసుకురాలేవు. "పాన్ ఇండియా టీచర్లు" ఉన్నంత మాత్రాన ఫలితాలు అద్భుతంగా రావు. బోధించే సత్తా.. విద్యార్థులను తీర్చిదిద్దే నైపుణ్యం ఉండాలెగానీ.. వాళ్లు పాన్ ఇండియా అయితేందీ.. పక్కూర్లో ఉండే టీచరైతే ఏంది.?
సర్కారు బడి చేసిన పాపమేంటి.?
మనొళ్లు మంచి మేధావులు. ఫ్రీగా ఏది దొరికినా వదులుకోరు. చూస్తున్నం కదా.. ఫ్రీ బస్సులు అనేసరికి కార్లున్నొళ్లు కూడా వాటిని షెడ్డులోనే పెట్టి బస్సులల్ల ఎట్ల తిరుగుతున్నరో.? ఫ్రీ బస్సు అనేసరికి పని లేకున్నా.. టైంపాస్ కోసం కూడా ప్రయాణం చేసేవాళ్లు చాలామందే ఉన్నారు. ఎవరైనా అట్లా అడిగితే.. "నీకేందీ.? నీ బస్సు అయినట్లే చేస్తున్నవ్. గౌర్మెంట్ బస్సు.. మా ఇష్టమొచ్చినట్లు పోతం" అని అంటరు. సరే.. ఇప్పుడది ఫ్రీ బస్సు కాబట్టీ.. గవర్నమెంటిస్తుంది కాబట్టీ మాగ్జిమమ్ వాడుతుండ్రు. మరి.. సర్కారు బడి ఏం పాపం చేసింది. దాన్నికూడా సర్కారే నడుపుతుంది కదా.? మీ పిల్లల్ని సర్కారు స్కూళ్లల్ల చేర్పిస్తుండ్రా.? ఏ రుబాబుతో ఫ్రీ బస్సులల్ల పోతుండ్రో.. అదే రుబాబుతో ఫ్రీ స్కూళ్లల్ల పిల్లల్ని చదివించొచ్చు కదా.?
సర్కారు బడి దేంట్లో తక్కువ.?
సర్కారు స్కూళ్లో సదివిస్తరా.? ప్రైవేట్లనే వేలకు వేలు పెట్టి సదివిస్తరా అనేది మీ ఇష్టం. "మేం మామూలు స్కూళ్లనే సదివి.. మా పిల్లలు మామూలు స్కూళ్లనే సదివితే దానికి అర్థమేముంటది.? మాదంటే ఎట్లనో అట్ల అయిపోయింది.. మా పిల్లలైనా మంచి స్కూళ్లల్ల సదవొద్దా" అనే వాళ్లూ ఉన్నారు. అందుకే.. ప్రైవేట్ స్కూళ్లో వద్దని ఆపే ప్రయత్నం చేస్తలేం. కాకపోతే.. ఎందుకూ ఈ వెంపర్లాట అంటున్నాం. ప్రైవేటు స్కూల్.. ప్రభుత్వ పాఠశాల కంటే దేంట్లో ఎక్కువ.? ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేరా.? సదుపాయాలు లేవా.? భవనాలు లేవా.? ఎందుకు వాటిని వద్దనుకుంటున్నారో ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తే మంచిది. మీ కంపారిజన్లో జెన్యూనిటీ పాటించి డిసిషన్ తీసుకోవడం ఉత్తమం అని చెప్తున్నాం.
ఎప్పుడైనా వెళ్లిన మొఖమేనా.?
"పొద్దున లేస్తే సర్కారు బడి బేకార్.. అండ్లేం చెప్పరు. టీచర్లయితే ఊకెనే కూసొని ఫోన్లొత్తుకుంటరు" అని అంటరు చాలామంది. నిజమే. కానీ మన బాధ్యతగా పిల్లల్ని చదివించడానికో.. లేదా గవర్నమెంట్ స్కూళ్లల్ల సదువెట్ల చెప్తరనో ఒక్కసారైనా సర్కారు బడి గడప తొక్కినమా.? ఫోన్లు ముంగటేస్కొని టైంపాస్ చేసిన టీచర్లను నిలదీసినమా.? వాళ్ల అటెండెన్స్ రికార్డు చెక్ చేసే హక్కు మనకు లేదా.? ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడి విద్యా ప్రమాణాలు పాటించమని అడిగలేమా.? ఇవేవీ పట్టించుకోం. కానీ సర్కారు బడి మీదపడి శాపనార్థాలు పెడుతుంటాం. మనందరం సర్కారు బడిలో చదువుకొని ప్రయోజకులం అయ్యాం కదా.? వ్యవస్థను నిందించడం కాదు.. ముందు ప్రశ్నించడం నేర్చుకుంటే సర్కారు బడులు బాగుపడతాయి.
ఎందుకు చేర్పించాలంటే.?
చదువంటే ఓ మానసిక పరిణతి. ఓ స్వీయ ప్రేరణ. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటివి చెప్పడానికి ఎక్కువ అనుభవం, అర్హత ఉన్న టీచర్లుంటారు. ప్రైవేట్లో లేరని చెప్పడం లేదు. కానీ వాళ్ల టార్గెట్ ఎంతసేపూ ఓరియెంటెడ్ మెథడ్‌పైనే ఉంటుంది. దీనివల్ల పిల్లలపై మానసిక ఒత్తిడి పెరిగి స్కూలంటే ఆసక్తి చూపించరు. స్కూల్లో చేర్పించడమేకాదు అప్పుడప్పుడు వెళ్తుండాలి. కానీ మనవాళ్లు ప్రైవేట్ స్కూల్‌కైతే వారాని రెండుసార్లు వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలకు కనీసం నెలకోసారి పేరెంట్స్ మీటింగ్ ఉందంటే కూడా వెళ్లరు. టీచర్, అటెండర్, హెచ్ఎంతో కమ్యునికేషన్లో ఉండి.. ప్రతీది చర్చించే అవకాశం ఉంది. ప్రైమరీ స్టేజిలోనే ఆలోచించడం, అన్వేషణ, పరిశీలన, ఊహాశక్తి, భాషా వికాసం వంటివి పిల్లలకు అలవర్చాలి. సర్కారు బడిలో ఇవి ఎలాంటి ఫీజు తీసుకోకుండానే దొరుకుతయి.. కానీ ప్రైవేట్లో దొరుకుతయా.?
ఆరుట్ల స్కూల్ మారుతోంది
ఒకసారి ఆరుట్ల గురించి తెలుసుకోండి. ఇది రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఒక గ్రామం. ప్రతీ శనివారం ఈ ఊర్లో చదువుల జాతర సాగుతోంది. ఇదేదో ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ల జాతర కాదు. సర్కారు బడి బాగు కోసం చేస్తున్న ఊరుమ్మడి ఉత్సాహం. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు కట్టీ అలసిపోయి.. సర్కారు బడిని బాగుచేస్తేనే రేపటితరం విద్యాపరంగా బాగుపడుతుందని గ్రహించి ప్రభుత్వ పాఠశాలక పట్టంగడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో నుంచి తమ పిల్లలకు టీసీ తీసుకొని ఆరుట్ల మోడల్ స్కూల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలోనే నర్సరీ.. ఎల్కేజీ.. యూకేజీ ఉంటయా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండవా అని సవాలు చేస్తూ తమ ఊరి స్కూల్లో కూడా ప్రీ ప్రైమరీ స్కూలును డెవలప్ చేసి సర్కారీ బడిలో ఒక కొత్త తరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
అసలేంటి ఈ స్కూల్ కథ.?
బడిని బాగు పర్చుకోవాలనే ఆరుట్ల ప్రజల ఆకాంక్షను గుర్తించిన రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి "ఆరుట్ల పాఠశాల"ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. శిశు స్థాయి నుంచే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో నుంచి పదోతరగతి వరకు ప్రైవేటుకు ధీటుగా మార్చాలనుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ ఉంది, కంప్యూటర్లున్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, మంచి స్టాఫ్ ఉంది, ఇన్ని ఎకరాల్లో ఉంది అన్ని ఎకరాల్లో ఉంది అని అంటారు కదా మనొళ్లు. వాటన్నింటినీ ఇక్కడ కల్పిస్తున్నారు. మొత్తం ఆరెకరాల్లో ఈ స్కూల్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈ మోడల్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి స్కూళ్లను మండలానికి మూడు చొప్పున ఏర్పాటుచేసే లక్ష్యంతో అడుగులు పడుతున్నాయి.
ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
ప్రభుత్వ పాఠశాలలు అంటే మన ప్రధాన అనుమానం టీచర్లపైనే. పైలట్ ప్రాజెక్టు కాబట్టీ ఆరుట్ల స్కూల్ టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల కంటే మేం దేంట్లో తక్కువలేం అనిపించేలా అన్నింట్లో తర్పీదు ఇస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును ఆకునూరి మురళి నడిపిస్తుంటే.. స్పాన్సర్‌గా ముందుకొచ్చింది మాత్రం "సోషల్ డెమొక్రటిక్ ఫోరం" నుంచి పద్మషా. ఆమె ఆరుట్ల స్కూల్ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్ల విరాళాలు సేకరించి దశల వారీగా ఇస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు యాజమాన్యం ఉన్నట్లే ప్రభుత్వ పాఠశాలలకూ యాజమాన్యం ఉండాలని 26 మందితో "పేరెంట్స్ కమిటీ" ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరు. ఈ 26 మంది సభ్యులే కో ఆర్డినేట్ చేస్తారు.
నా కొడుకును చేర్పించా: లాలగారి జంగయ్య, ఆరుట్ల స్కూల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్
ప్రైవేట్ స్కూళ్లకంటే ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉండాలనే మా ఆకాంక్షను పరిగణనలోకి తీసుకొని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని నూతనంగా నిర్మిస్తున్నారు. ఆకునూరి మురళి సార్‌కు, పద్మ షా మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి కృషి ఫలిస్తుందనీ.. ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో నా ఇద్దరు కొడుకులకు ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాను. ఇంత పెద్ద ప్రాజెక్టు మా ఊరి నుంచి స్టార్టవుతున్నందుకు.. దాంట్లో నేను భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నా.
ప్రభుత్వ పాఠశాలకు ఓనర్‌షిప్: నూకం రాజు, కమిటీ మెంబర్
అసలు ఏముంటుందో ఏమో ప్రైవేట్ స్కూళ్లలో. వద్దు అంటే వినరు మనొళ్లు. అసలేంటి ఆ ఫీజులు. అన్ని ఫ్రీ రావాలి కానీ.. ఫ్రీగా వచ్చే చదువొద్దా.? ఇదేం లాజిక్.? ప్రభుత్వ స్కూల్ బాగుకోసం గతంలో స్కూల్ మేనేజ్మెంట్ చైర్మెన్‌గా చేశాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవాలనే ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి ఆరుట్ల స్కూల్ డెవలప్మెంట్ కమిటీలో చేరాను. ప్రైవేటు స్కూళ్లకు ఉన్నట్లుగానే సర్కారు బడులకు ఓనర్‌షిప్ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
శిక్షణ తీసుకుంటున్నాం: సిద్దగోని గిరిధర్, ప్రధానోపాధ్యాయుడు
మార్కుల ద్వారా పిల్లల నైపుణ్యాన్ని అంచనా వేయలేం. భాష, భావ వ్యక్తీకరణ మారిస్తే వాళ్లకే అర్థమవుతుంది. పాఠ్యేతర కార్యక్రమాల ద్వారా మంచి ప్రయోజనాలున్నాయి. అవి కేవలం ప్రైవేటు స్కూళ్లలోనే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులో ఉన్నాయని పేరెంట్స్ గ్రహించాలి. వ్యక్తృత్వం, చిత్రలేఖనం, కథలు చెప్పడం అనేవి రోజువారీ పాఠ్యాంశాలుగా బోధించి మంచి భావ వ్యక్తీకరణ రూపొందించాలని మేం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాం.
- Tags
- Free bus
- free ration
- Arogyasri
- government
- government school
- driver
- teacher
- fees
- Ranga Reddy
- Ibrahimpatnam
- global school
- international syllabus
- Pan India Faculty
- AC bus
- Ravi Shastri
- cricket coaching
- LKG
- student
- business
- donation
- admissions
- Cambridge syllabus
- Arutla
- State Education Commission
- Aakunuri Murali
- Pilot Project
- Telangana Public School
- Social Democratic Forum






