- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థర్టీ ఫస్ట్.. డర్టీ తాగుడు.!
న్యూ ఇయర్ స్వాగతం తాగుడుతోనే

దిశ, ఫీచర్స్: తాగడం.. దానికో పేరు తగిలించడం బాగా అలవాటైపోయింది మనకు. రోజూ తాగేది తాగుతనే ఉంటాం. మల్లా శని.. ఆదివారాల్లో వీకెండ్ పార్టీ అని పేరు పీకలదాక తాగి ఊగుతాం. నెలరోజులూ ఏదో ఒక సందర్భం క్రియేట్ చేసుకొని తాగుతనే ఉంటాం. నెలాఖర్లో మంథ్ ఎండ్ పార్టీ అని ఫుల్టు తాగుతాం. ఇట్లా ఏడాది పొడవునా దావతనో.. పండుగనో తాగుతనే ఉంటాం. మల్లా సంవత్సరం ఆఖర్న.. థర్టీఫస్ట్ దావత్ అని కక్కేదాక తాగి తందనాలడుతాం.
కరువులో ఉన్నట్లు కక్కేదాక తాగడమేనా.?
అదేందోగానీ.. డిసెంబర్ థర్టీఫస్ట్ అనంగనే జనాలంతా ఆగమాగమైతుండ్రు. ఎవ్వరినోట విన్నా "ఎట్లజేద్దాం.. ఏంజేద్దాం" అన్న ముచ్చట్లే వినిపిస్తున్నయి. పెండ్లి కార్యానికి ఉరుకులాడినట్లే ఉరుకులాడుతుండ్రు ఒకొక్కరు. బిజీబిజీ క్షణం తీరికలేకుండా ఫోన్లు మాట్లాడ్తుండ్రు. పిలిచినా పలకకుండా బైకుల మీద రయ్ రయ్యిమని పోతుండ్రు. ఇప్పుడైతే పండుగల్లేవు. పెండ్లీలు పేరంటాలు చేస్తందుకు మంచి రోజులు కూడా లేవు. వీళ్ల ఆరాటం పోరాటం చూస్తుంటే అంతకన్న పెద్ద ప్లానేదో ఉన్నట్లు హుషారు మీద కనిపిస్తుండ్రు. ఈ హుషారంతా మందు తాగడం కోసమే. మందు రోజూ తాగేదే అయినా.. డిసెంబర్ 31 అంటే వేరే లెవల్ జోష్ ఉంటది జనాలకు. దినాం తాగేది ఒకెత్తయితే ఆరోజొక్కనాడు తాగేది ఇంకొక ఎత్తు. కరువులో ఉన్నట్లు కక్కేదాక తాగడమే థర్టీఫస్ట్ స్పెషాలిటీ అన్నమాట.
యుగాంతమైనట్లు ఎగబడటమేంది.?
ఏంతాగుడో ఏమో. థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే అదేదో యుగాంతం అయిపోతున్నట్లు ఎగబడుతున్నారు జనాలు. ఒకరికొకరు పోటీలు పడి మరీ తాగుతుంటారు. అవేమన్నా అంతర్జాతీయ తాగుడు పోటీలైనట్లు. "ఒక్కరోజు ఏషం మూతిమీసాలు గీక్కున్నట్లు".. ఇయర్ ఎండ్ పార్టీ అని చెప్పి సంవత్సరమంతా కష్టపడి సంపాదించుకున్న పైసలను అడ్డగోలుగా ఖర్చు పెడతారు. అదేం సంతోషమో.. అదేం తృప్తోగానీ ఒకొక్కడు కక్కేదాక తాగుతాడు. అసలు తాగుడే పెద్ద బేకార్ పనిరా అయ్యా అంటే.. వీళ్లు దాన్నొక సంబరంగా జరుపుకునుడే తారీఫ్ ముచ్చట. సరే.. ఆ తాగుడు కథ రోజూ నడిచేదే కదా.? బుద్ధికొద్దీ రెండ్రోజులకో మూడ్రోజులకో అందరూ తాగుతున్నదే కదా.? అది చాలదన్నట్టు మీదికెల్లి ఇయర్ ఎండ్ పేరుచెప్పి పీకలదాక తాగి ఎగురుడెందుకు.?
బజార్ల నిలవెట్టి బనాయించుడే పద్ధతా.?
థర్టీఫస్ట్ దావత్ కోసం ఒకరికొకరు పోటీ పడుతుంటారు. యూత్ పోరగాళ్లను ఎవర్ని టచ్ చేసినా "మాది మేం సెట్ చేసుకున్నం. థర్టీఫస్ట్‌కి తానమాడుడే.. పొట్టుపొట్టుతాగి పొక్కిలి చేసుడే" అనే మాటలే వినిపిస్తుంటయి. తిప్పితిప్పి కొడితే వాళ్ల వయసు 17 కూడా ఉండదు. ఏ బస్తీ్కి ఆ బస్తీ పోరగాళ్లు జమయ్యి.. ఇంట్లో అమ్మానాన్నను బ్లాక్ మెయిల్ చేసుడు.. వెయ్యి రూపాయలు తెచ్చుకునుడు డీజే సౌండ్లతో అడ్డాపెట్టి ఆగమాగం చేసుడొక ట్రెండైపోయింది. వాళ్ల వయసుకు.. తాగే తాగుడుకు అస్సలు పొంతనే ఉండదు. బగ్గ తాగి బట్టలు చింపుకునుడు.. తెల్లారిందాక ఎగిరి తెగిన పతంగిలెక్క తిరుగుడు ఫ్యాషనైపోయింది. వాళ్లు జోష్‌లో ఉన్నప్పుడు ఎవరైనా అట్నుంచి వెళ్తే.. అంతే సంగతి ఇక. బజార్ల నిలవెట్టి బనాయించుడు.. బరి తెగించి మాట్లాడుడే ఈ 31 పండగ పద్ధతి.
సోయిలేకుండా తాగి సొమ్మసిల్లడమేనా.?
యూత్ పోరగాళ్లు ఒక్కరే కాదు. ఇయర్ ఎండ్ దావత్ అందర్నీ పట్టి పీడిస్తోంది. పెండ్లయి పిల్లలున్న 40 ఏండ్ల వయసువాళ్లయితే.. ఇల్లూ సంసారంతో బోరింగ్ కొట్టినట్లు.. ఆ బోరింగ్ నుంచి ఈ థర్టీఫస్ట్ దావతొకటే ఉపశమనం కలిగించేటట్లు ఫీలవుతుంటారు. వారం పదిరోజుల ముందే గోవా పోదామా.. గోదారి గట్టుకు పోదామా అని పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుంటారు. గోవాగీవా పోవడం కుదరని వాళ్లు ఊర్లోనే పెద్ద టెంటేవేసి దావత్ అరేంజ్ చేస్తారు. ఇగ అక్కడ రకరకాల చిత్రాలుంటాయి. ఒకాయన ఫారిన్ మందు అంటడు. ఇంకొకాయన మిలట్రీ మందు అంటడు. ఎంజాయ్మెంట్ ఒకరిది. ఫ్రస్టేషన్ ఒకరిది. ఇల్లును.. ఇల్లాలును.. పిల్లలను మర్చిపోయి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి.. ఉరుములే రానీ.. పిడుగులే పడని.. అవేవీ పట్టించుకోకుండా సోయిలేకుండా తాగి సొమ్మసిల్లి పండుకుంటారు.
ఏరులై పారించడమే సాంప్రదాయమా.?
ఊర్లళ్ల పెద్దమనుషులను కూడా ఈ థర్టీఫస్ట్ అనే గాలి సోకింది. వాళ్లకేమైందో వాళ్లుకూడా ఐదారుగురు కలిసి దావత్ చేసి తాగుతున్నారు. మామూలుగా అయితే ఏదైనా ఒక వస్తువుగానీ.. మనిషిగానీ.. ఆస్తిగానీ మన నుంచి దూరమైతుంటే మస్తు బాధయితది. ఆ బాధను మర్చిపోలేక తాగుతారు. ఇక్కడ విలువైన సమయం గడిచిపోతుంది. అంటే ఆ సంవత్సరం గడిచిపోతుంది మల్లారాదు అనే భావన ఎవరికైనా ఉంటుంది. అది ఒక భావన అంతే. దానిని మనొళ్లు భావోద్వేగంతో ముడిపెట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్స్ అయినా ఏం పోగొట్టుకున్నాం.. ఏం సాధించామన్న సోయి ఉండి చేసుకుంటే బాగుంటుంది. కానీ.. అట్ల చెయ్యం. అట్లచేస్తే మనం మనుషులమెందుకైతం.? అందుకే తాగుడుకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఏరులై పారించడమొక సాంప్రదాయంగా తాగుతారు.
అడిగినొళ్లను అడ్డగోలుగా తిడితే ఎట్లా.?
తాగుతరో.. తందనాలాడుతరో వాళ్లిష్టం. తాగినొళ్లు తాగినట్లుండక రోడ్లమీదికొచ్చి లొల్లివెడ్తరు. నిద్రవొయ్యినొళ్లు లేచి కూసునేటంత పెద్ద లొల్లి పెడతారు. తాగి బండి.. కారు నడుపుతారు. అడిగినొళ్లను అడ్డగోలుగా తిడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి నానా హంగామా చేస్తారు. నాకు వాడు తెలుసు.. వీడు తెలుసూ అని సతాయిస్తారు. వాళ్లకూ వీళ్లకూ ఫోన్ చేసి గోటితో పోయేదాన్ని గొడ్డండ్లదాక తెచ్చుకుంటారు. వాళ్లు ముందే పోలీసులు. ఊకుంటరా.? జరిమానాతో పోయేదాన్ని కోర్టు కేస్ దాకా తీసుకెళ్లి వాళ్ల ప్రతాపమేందో చూపించుకుంటారు. ఇంత జరిగినా అప్పటిదాక కలిసి తాగినోడు ఒక్కడు కూడా ఇటుదిక్కు మళ్లిచూడడు. అట్లుంటది మనొళ్లతోని ముచ్చట. నిమ్మళంగా ఉన్న దగ్గర్నే ఉంటే కథ ఇంతదాక రాకపోవు కదా.? కానీ తాగుడు అట్లుండనీయదు మరీ.
చిత్తుగా తాగి చిత్తడి చేయొద్దు కదా.?
న్యూ ఇయర్ పార్టీ వస్తుందనే సంతోషంలో కొందరు థర్టీఫస్ట్ నైట్ తెగ ఎంజాయ్ చేస్తారు. వాళ్ల దృష్టిలో ఎంజాయ్ అంటే తాగుడే. వాస్తవానికి మనం కొత్త సంవత్సరం సందర్భంగా చేసుకోవాల్సింది రివ్యూ. పోయిన సంవత్సరంలో అసలు ఏమనుకున్నాం.? ఏం చేశాం.? మనం అనుకున్న పనులు ఎంత వరకు సక్సెస్ అయ్యాయి.? పురోగతి ఏ విధంగా ఉంది.? వంటి విషయాలు సమీక్షించుకొని కొత్త సంవత్సరంలో వాటిని ఎంతమేర వేగవంతం చేయాలి.? ఇంకెంత హార్డ్‌వర్క్ చేసి జీవితంలో రాణించాలనేది ప్లాన్ వేసుకోవాలి. కానీ మనమేం చేస్తున్నాం.? భవిష్యత్ ప్రణాళికలను గాలికొదిలేసి.. బగ్గ తాగుడే లక్ష్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. తాగేదైనా ఒక పద్ధతి ప్రకారం ఉంటుందా అంటే అదేదీ ఉండదు. చిత్తుగా తాగి చిత్తడి చేస్తారు మనొళ్లు.
ప్రపంచంతో సంబంధం లేదు..
ఎంత తాగితే అంత గొప్ప అనే ఉద్దేశంతో ఉంటారు కొందరు. "అరే వాడు ఫలానా బ్రాండ్ తాగాడు.. మనం వాడికంటే మంచి బ్రాండ్ తాగాలి. వాళ్లు నాలుగు బాటిల్స్ తాగారు.. మనం ఆరు బాటిల్స్ తాగాలి. వాళ్లకంటే మనం దేంట్లో తక్కువ" అని పోటీలు పెట్టుకొని తాగి ఊగుతుంటారు. ఇది దేనికి ఉపయోగపడే పోటీ అనేది ఆలోచించే స్థితిలో ఒక్కరు కూడా ఉండరు. లోపల ఉన్న మందు అసలు అలా ఆలోచించనీయదు. వాళ్లకెంతసేపూ తాగుసోకే గానీ.. ఆలోచన సోకు ఉండదు. తాగితే ఉన్న మతి పోయినట్లు చేస్తుంటారు. ఎడ్డెమంటే తెడ్డమనడం.. తప్పును ఒప్పనడం ఒక్కటే వాళ్లకు తెలుసు. ఆ తాగుడేందోగానీ.. దాన్ని తాగుతున్నంతసేపూ ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టూ.. వాళ్లదో కొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్లు చేస్తుంటారు.
తాగుబోతులు మాత్రమే చేసుకుంటారా.?
డిసెంబర్ 31 ప్రతీ సంవత్సరం.. ప్రతీ క్యాలెండర్లో చివరి తేదీ. దీని ప్రత్యేకత అంతే. కానీ మనొళ్లు దాన్నొక తాగుబోతుల దినోత్సవంగా మార్చేశారు. డిసెంబర్ థర్టీఫస్టంటే తాగి ఊగేదినం అన్నట్లుగా తయారుచేశారు. దానివల్ల ఎవరైనా మంచిగా ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నా.. చూసేవాళ్లు ఈ తాగుడు గురించే అనుకుంటారో ఏమో అని దూరంగా ఉంటున్నారు. అంటే ఈ తాగుడు కల్చర్ అనేది మన కల్చర్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. అందరూ కూర్చొని సకుటుంబ సమేతంగా జరుపుకునే పండుగను ఇలా తాగుబోతులు మాత్రమే చేసుకుంటారే స్థాయికి తీసుకెళ్లారు. రోజు రోజుకూ ఈ ధోరణి పెరుగుతుందేగానీ ఏమాత్రం తగ్గడం లేదు. దీనివల్లనే మహిళలు.. పిల్లలు.. కుటుంబాలు చాలా వరకు ఈ సెలబ్రేషన్స్‌కి దూరమవుతున్నాయి.
తాగితేనే అది కొత్త సంవత్సరమా.?
మనం తాగనిది ఎప్పుడు.? పుట్టినా తాగుతున్నం. సచ్చినా తాగుతున్నాం. బర్త్ డేలకు తాగుతున్నం. పెండ్లిరోజులకు తాగుతున్నం. మధ్య మధ్యలో దసరా.. సంక్రాంతి.. బోనాలు.. ఇలా పండుగలకూ పబ్బాలకూ తాగుతున్నాం. అదీగాక రోజుకో రెండ్రోజులకోసారి సలి పేరు.. వాన పేరు.. మనిషి పేరు.. మర్యాద పేరు చెప్పి ఎంతో కొంత కడుపులకు వేస్తనే ఉన్నాం. అంటే తాగుడుకు ఎప్పుడూ చేదోడు వాదోడుగానే ఉంటున్నాం కదా.? మంచి చెడ్డ అనే తేడా లేకుండా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాం కదా.? సోయి తప్పినా సోపతిగానే భావిస్తున్నాం కదా.? మరి ఎప్పుడూ తాగనట్టూ.. ఇప్పుడే యుగాంతమైపోతునట్లు ఆ పోసుడేంది.? ఆ పోకడేంది.? తాగితేనే అది కొత్త సంవత్సరమా.? తాగి తలకువోసుకుంటేనే అది ఇయర్ ఎండ్ సెలబ్రేషనా.?
థర్టీ ఫస్ట్ అని చెప్పి ఈ డర్టీ తాగుడేంది.?
థర్టీఫస్ట్ తాగుడు మజాలో పడి ఆరోగ్యాన్ని చిత్తు చేసుకుంటున్నామనే సోయి ఉండదు మనొళ్లకు. ఇయర్ ఎండ్ మోజులో పడి సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నామనే సోయి ఉండదు. సంబంధాలు దెబ్బ తింటాయనే స్పృహ ఉండదు. ముఖ్యంగా జేబుకు చిల్లు పడుతుందని తెలిసినా లెక్క చేయం. ఎందుకంటే మల్లా ఆ సంవత్సరం రాదుకదా అనే సెంటిమెంటొకటి. మేమొక్కరమే చేస్తున్నమా.. దునియా మొత్తం చేస్తుందనదే కవరింగొకటి. ఏ సెలబ్రేషన్స్ లేకుండా ఇంట్లోనే కూర్చోవాలా అనే దబాయింపొకటి. ఇవన్నీ కలిసి డిసెంబర్ థర్టీ ఫస్టంటే తాగి ఊగే రోజు అనే పరిస్థితొచ్చింది. థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఎవరూ వ్యతిరేకం కాదు. ఆ సెలబ్రేషన్స్ తప్పని కూడా చెప్పడం లేదు. థర్టీ ఫస్ట్ అని చెప్పి ఈ డర్టీ తాగుడేంది అని అంటున్నాం.
తాగితేనే సెలబ్రేషనా.?: చంద్రశేఖర్ చేగొండి (చేగొ), "దావత్ వితౌట్ దారు" ఫౌండర్
తాగితేనే సెలబ్రేషన్స్ అనుకుంటున్నారు జనాలు. సంతోషం కోసమే అనీ.. రోజువారి ఒత్తిళ్ల నుంచి కొంచెం రిలాక్స్ కోసమే అని.. ఈ అలవాటును సమర్ధించుకుంటారు. అయితే ఈ అలవాటు మనల్ని లోబర్చుకుంటుంది. మనిషికి అంత విల్ పవర్ ఉండదు. ఈ మత్తు వ్యసనం అనే పేరు మీద కాకుండా సంతోషం.. ఆతిథ్యం.. రిలాక్స్.. సోషలైజ్ కోసం థర్టీఫస్ట్ సెలబ్రేషన్స్ జరుపుకుంటే మంచిది. అందుకే ఇలాంటి సమయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. తాగుడు కాకుండా వేరే ఆప్షన్స్ వెతుక్కోవాలి. సకుటుంబంగా వేడుక చేసుకోవచ్చు. సరదాగా.. సంతోషంగా గడపవచ్చు.
ఫ్యాషనైపోయింది: శ్రీనివాస్ మంజీర, సామాజిక కార్యకర్త
ఒకప్పుడు తాగడం ఒక వ్యసనం. కానీ ఇప్పుడు అది ఫ్యాషన్. పెరిగిన సాలరీలు మారిన జీవన శైలి తాగడాన్ని ఒక వ్యసనంగా కాకుండా స్టేటస్ సింబల్‌గా మార్చి వేసింది. పుట్టినరోజు అనో.. బాధల్లో ఉన్నా అనో.. లవ్ బ్రేక్ అప్ అనో.. నిత్యం తాగాడానికి రక రకాల కారాణాల్ని సృష్టించుకొంటున్నారు. నిత్యం తాగేవాడు కూడా వీకెండ్ పార్టీలని.. పబ్బులల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే మనిషికి తాగడం ఎంత వ్యసనంగా మారుతుందో ఆలోచించుకోవచ్చు. ఇక న్యూ ఇయర్ పార్టీల గురించి అయితే చెప్పుకోవడమే వేస్ట్. ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ఆకర్షణల్లో పడి లక్షల్లో నష్టపోతున్నారు. తాగి డ్రైవ్ చేస్తున్నారు.
ఫ్యామిలీ సంబరం: నిఖిత నెల్లుట్ల, యాక్టివిస్ట్
బేసికల్‌గా నేను తాగుడు అనే ధోరణికి వ్యతిరేకం. తాగేవాళ్లంటే అస్సలు నచ్చదు. ఇలా ఎందుకంటున్నానంటే.. తాగి జీవితాలు ఆగంచేసుకున్నవాళ్లను ఎంతోమందిని చూశా. తాగడం వల్ల ఆరోగ్యం కరాబ్.. పైసలు కరాబ్.. టైం వేస్ట్. అదే ఎఫర్ట్ ఫ్యామిలీ మీద పెడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అసలు తాగుడే తప్పురా నాయనా అంటే.. రోజు తాగింది చాలదన్నట్టు న్యూ ఇయర్ పేరు చెప్పి పీకలదాకా తాగుతుంటారు. అలా తాగి తందనాలు ఆడటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో అర్థంకాదు. న్యూ ఇయర్ అంటే ఫ్యామిలీతో కలిసి చేసుకునే ఒక సంబరం.






