కేంద్ర, రాష్ట్రాల మధ్య చిచ్చు.. అసలేంటీ "ఎరువుల" వివాదం?

by Muthe.Rajitha |

కేంద్ర, రాష్ట్రాల మధ్య చిచ్చురేపిన ఎరువుల కొరత గొడవకు అసలు కారణం తెలుసుకుందాం.

కేంద్ర, రాష్ట్రాల మధ్య చిచ్చు.. అసలేంటీ ఎరువుల వివాదం?
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర, రాష్ట్రాల మధ్య చిచ్చురేపిన ఎరువుల కొరత గొడవకు అసలు కారణం తెలుసుకుందాం. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. భారత్ లో వ్యవసాయం ఎక్కువగా వర్షాలపై ఆధారపడి ఉంటుంది. మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు. మనదేశంలో పండే పంటల్లో ముఖ్యమైనవి వరి, గోధుమ, పత్తి, మిర్చి, మొక్కజొన్న, సోయాబీన్, చెరుకు వంటి పంటలు పండిస్తారు. అయితే ఆయా పంటలకు నీరు ఎంత ముఖ్య అవసరమో ఎరువులు కూడా అంతే అవసరం. పంటలు బాగా పెరగడానికి, చీడ పీడలను తట్టుకునేందుకు యూరియా, DAP (డై అమోనియం ఫాస్ఫేట్), MOP (మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వంటి ఎరువులను వాడతారు.

అయితే ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎరువుల కొరత వేధిస్తోంది.పంటలు మొదలు పెట్టాక అవసరం అయిన ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల గొడవలు కూడా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల వానలు సైతం లెక్క చేయకుండా లైన్లో నిలబడుతున్నారు. ఇంకోచోట ముందురోజు రాత్రే వచ్చి లైన్లోనే నిద్రపోతున్నారు. అయితే ఎందుకు ఈ ఎరువుల కొరత వస్తోంది? అసలు ఎరువులు పంపిణీ చేసే బాధ్యత ఏమిటీ? అన్ని రాష్ట్రాలకు ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ ప్రాతిపదికన ఎరువుల పంపిణీ జరుగుతుంది? తెలంగాణలో ఇంతగా ఎరువుల కొరత ఎందుకువచ్చింది అనే విషయాలు తెల్సుకుందాం.

మనదేశంలో రైతులకు ఎరువులు పంపిణీ చేసే బాధ్యత ప్రధానంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ సంస్థలైన ఎరువుల శాఖ (Department of Fertilizers)ది. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలు, సహకార సంఘాలు, ఎరువుల తయారీ సంస్థలు, పంపిణీదారులది కూడా కీలక పాత్ర.

*ఎరువుల ఉత్పత్తి, దిగుమతి, సరఫరా, సబ్సిడీలు వంటి చర్యలన్నీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఎరువుల్లో ముఖ్యంగా యూరియా, DAP (డై అమోనియం ఫాస్ఫేట్), MOP (మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వంటి ప్రధాన ఎరువుల సరఫరా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది.

*రాష్ట్ర స్థాయిలో ఇక రాష్ట్రంలో ఎరువుల పంపిణీని సమన్వయం చేసుకోవడం, రైతుల అవసరాలను అంచనా వేసి కేంద్రానికి నివేదికలు పంపడం వంటి పనులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.

*గ్రామీణ స్థాయిలో రైతులకు ఎరువులను అందజేసేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), రైతు సేవా కేంద్రాలు, లైసెన్స్ పొందిన డీలర్లు బాధ్యత వహిస్తాయి.

అయితే 2018 నుండి, ఎరువుల సబ్సిడీలు DBT (Direct Benefit Transfer) వ్యవస్థ ద్వారా రైతులకు నేరుగా బదిలీ చేయబడుతున్నాయి. DBT ద్వారా రైతులు సబ్సిడీ రేట్లతో ఎరువులను కొనుగోలు చేయగా.. డీలర్లకు సబ్సిడీ మొత్తం తిరిగి చెల్లించబడుతుంది.




రాష్ట్రాలకు వాటా ఎలా నిర్దారిస్తారు?

మనదేశంలో రాష్ట్రాలకు ఎరువుల వాటా ఖచ్చితమైన శాతం గాని నిర్దిష్ట పరిమాణంగా గాని ఏదీ లేదు. కానీ రాష్ట్రాల వ్యవసాయ అవసరాలు, సాగు విస్తీర్ణం, పంటల రకాలు, రైతుల డిమాండ్ ఆధారంగా రాష్ట్రాల వాటాను నిర్ధారిస్తారు. ప్రతిఏటా ఈ వాటా శాతం మారుతూ ఉండవచ్చు. ప్రధాన ఎరువులైన యూరియా, DAP, MOP వంటి వాటా ఆయా రాష్ట్రంలో సాగు చేయబడే భూమి విస్తీర్ణం, సాగు విస్తీర్ణం ఆధారంగా అంచనా వేస్తారు. ఉదాహరణకు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధిక వ్యవసాయ ఉత్పాదకత కలిగిన రాష్ట్రాలు ఎక్కువ ఎరువుల వాటాను పొందుతాయి. పంటలను బట్టి కూడా ఎరువుల వాటా మారుతుంది. వరి, గోధుమ, నూనె గింజలు, చెరకు, బంగాళదుంప వంటి పంటలకు అవసరమైన ఎరువుల వాటాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు వరి సాగు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్) యూరియా ఎక్కువగా అవసరమవుతుంది. అలాగే సీజనల్ డిమాండ్ ను బట్టి కూడా వాటా ఉంటుంది. ఖరీఫ్ (జూన్-సెప్టెంబర్), రబీ (అక్టోబర్-మార్చి) సీజన్లలో ఎరువుల డిమాండ్ మారుతుంది కాబట్టి ఎరువుల వాటా కూడా మారుతుంది. అన్ని రాష్ట్రాలు తమ సీజనల్ అవసరాలను కేంద్రానికి ముందే నివేదిస్తాయి.

2023-24 డేటా ప్రకారం...కేంద్ర ఎరువుల శాఖ నివేదికల ప్రకారం, భారతదేశంలో వార్షిక ఎరువుల వినియోగం సుమారు 60 మిలియన్ టన్నులు. దీనిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు అత్యధిక వాటాను (సుమారు 40-50% కలిపి) కలిగి ఉన్నాయి. అయితే దేశంలో అత్యధిక ఎరువుల వాటా పొందే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది ఒక్కటే సుమారు 12-15 మిలియన్ టన్నుల ఎరువులను వినియోగిస్తుంది. ఎందుకంటే ఇది అతిపెద్ద వ్యవసాయ రాష్ట్రం కాబట్టి. ఈశాన్య రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తక్కువ వాటాను (సుమారు 5-10%) పొందడానికి గల కారణం వాటి వ్యవసాయ విస్తీర్ణం తక్కువ ఉండటం. మొత్తానికి రాష్ట్రాల నుంచి వచ్చిన ఎరువుల అవసరాల అంచనాల నివేదికను ముఖ్య ప్రయారిటీగా పరిగణిస్తుంది కేంద్రం. పంటల సాగు విస్తీర్ణం, పంటల రకాలు, నీటిపారుదల సౌకర్యాలు, గత సంవత్సరాల ఎరువుల వినియోగ డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలు రూపొందించి, కేంద్రానికి పంపిస్తాయి. ఇలా రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, తమవద్ద ఉన్న నిల్వలు, దిగుమతులను సరిచేసుకొని ఎరువుల వాటాలను కేంద్రం నిర్దారిస్తుంది.

ఎరువుల కొరతకు కారణాలివే :

దేశంలో వస్తున్న పంటల ఆధునిక టెక్నాలజీ, నీటి పారుదల లభ్యత పెరగడం, హైబ్రిడ్ విత్తనాల వాడకం భారీగా పెరగడం వల్ల ఏడాదికి రెండు నుంచి మూడు పంటలు పండించే స్థితికి దేశ వ్యవసాయం అభివృద్ధి చెందింది. అయితే పంటలు ఎక్కువయ్యే కొద్దీ ఎరువుల వాడకం కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ఎరువుల ఉత్పత్తికి, వాడకానికి భారీ అంతరాయం ఏర్పడి కొరతకు దారి తీస్తోంది. అలాగే రైతులకు ఎరువుల వాడకం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అవసరం అయిన దానికంటే ఎక్కువ ఎరువులు వాడటం వల్ల కూడా ఎరువుల కొరతకు కారణం అవుతోంది. ఇక మరికొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్ వల్ల కూడా కృత్రిమ కొరత ఎదురవుతోంది.అంతేకాదు సేంద్రీయ ఎరువుల వాడకం కంటే రసాయన ఎరువుల వైపు రైతులు మొగ్గు చూపడం కూడా ఒక కారణమే.




తెలంగాణలో ఎందుకు కొరత :

అన్ని పెద్దరాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్రంలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, పసుపు వంటి పంటలు పండిస్తారు. ఈ పంటలకు యూరియా, DAP, మరియు MOP వంటి ఎరువుల అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువే. రాష్ట్రానికి కావాల్సిన ఎరువుల వాటా వ్యవసాయ సాగు విస్తీర్ణం, పంటల రకాలు, సీజనల్ డిమాండ్ ఆధారంగా నిర్ణయించి కేంద్రానికి నివేదిక పంపిస్తుంది ప్రభుత్వం. తెలంగాణలో ఏడాదికి సుమారు 10-12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతున్నట్టు డేటా వివరాలు చెబుతున్నాయి. ఇందులో యూరియా సుమారు 60-65% ఉండగా DAP 20-25%, మిగిలింది MOP తోపాటు ఇతర సంక్లిష్ట ఎరువులు వినియోగించబడుతున్నాయి. అలాగే సీజనల్ కేటాయింపుల ప్రకారం.. ఖరీఫ్ సీజన్ (జూన్-సెప్టెంబర్)లో ఎరువుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్లో వరి, పత్తి సాగు ఎక్కువగా జరుగుతుంది. రబీ సీజన్ (అక్టోబర్-మార్చి)లో మొక్కజొన్న ఇతర పంటలకు కూడా ఎరువులు అవసరమవుతాయి.

అయితే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం 9.8 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) యూరియాను కేటాయించగా.. ఏప్రిల్-ఆగస్టు వరకు 8.3 లక్షల టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 5.32 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేయగా.. మరో 2.98 లక్షల టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలో అనేక చోట్ల ఎరువుల కొరతతో రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. ఎరువులు పంపిణీ చేసే సహకార సంఘాల ముందు, డీలర్ల ఔట్ లెట్స్ ముందు గంటలకొద్దీ బారులు తీరుతున్నారు. కొన్నిచోట్ల వర్షాలను సైతం లెక్కచేయకుండా లైన్లలో నిలబడుతుండగా.. మరికొన్నిచోట్ల ముందురోజే వచ్చి లైన్లలో నిద్రపోతున్నారు.




అయితే ఈ ఎరువుల కొరత ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వం సరిగా సమన్వయం చేయకపోవడం వల్లే ఈ కొరత అని, డీలర్లు కావాలని సరుకును బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుంటే అడ్డుకోలేకపోయారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. గత ప్రభుత్వం ముందుచూపుతో కేవలం కేంద్రం మీదనే ఆధారపడకుండా ఇతర రాష్ట్రాల వద్ద మిగిలిన ఎరువులను కూడా సేకరించి సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎరువులు అందజేశామని, ప్రస్తుత ప్రభుత్వానికి ముందు చూపు లేదని, అందువల్లే ఎరువుల తీవ్ర కొరత ఏర్పడిందని విమర్శలు చేస్తున్నాయి. ఎరువులను సమయానికి కోరినంత మేరకు కేంద్రం పంపిణీ చేయడకపోవడం వల్లే ఈ సమస్యలని ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలపై కావాలనే ఈ చిన్నచూపు చూస్తూ, రాష్ట్రం ముందు దోషుల్ని చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కూడా ఆరోపణలు చేస్తోంది.

ఏది ఏమైనా పంటలు మొదలు పెట్టి ఎరువుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అన్నదాతలను ఆదుకోవడం కేంద్ర, రాష్ట్రాల పూర్తి బాధ్యత. ఈ దేశంలో రైతు బాగుంటేనే దేశబాగు అని గుర్తించి, కావాల్సిన ఎరువులు త్వరగా సరఫరా చేయాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నారు సామాన్య ప్రజలు.

Next Story