- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mutation must : స్థిరాస్తి కొనగానే సరిపోదు.. మీ పేరిట మార్చుకోవడం చాలా ముఖ్యం!
Mutation must : స్థిరాస్తి కొనగానే సరిపోదు.. మీ పేరిట మార్చుకోవడం చాలా ముఖ్యం!

దిశ, తెలంగాణ బ్యూరో : మీరు ఇల్లు, ఫ్లాట్ కొంటున్నారా ? లేదా కొనుగోలు చేశారా ? రిజిస్ట్రేషన్ చేసుకున్నారా ? అయితే ఇదే సరిపోదు. ఆ తర్వాత ఆస్తిని మీ పేరిట బదిలీ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయంపై శ్రద్ధ వహించకపోతే కష్టం. మొన్నటి వరకు ధరణి, ప్రస్తుతం భూ భారతి వెబ్ పోర్టల్ అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ చార్జీలను ప్రత్యేకంగా తీసుకుంటారు. ఆస్తి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను స్థానిక రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాలకు పంపిస్తున్నారు. అక్కడే కొనుగోలు చేసిన స్థిరాస్తికి యజమానిగా పేరు రికార్డుల్లో నమోదు అవుతుంది. రెవెన్యూ భాషలో స్థిరాస్తి హక్కుల బదలాయింపును ‘మ్యుటేషన్’ అంటారు. మ్యుటేషన్ అంటే రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తి టైటిల్ మార్పు. అంటే ఆస్తి పత్రాలపై యజమానుల పేర్ల మార్పు. మ్యుటేషన్ అనేక సందర్భాల్లో జరుగుతుంది.
వారసత్వంగా స్థిరాస్తి సమకూరినా, ఆ విషయం అధికారికంగా నమోదు చేయాలి. ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేసినప్పుడు కూడా ఆస్తి పత్రాలపై కొత్త యజమాని పేరు నమోదు చేయించాలి. ఇది రెవెన్యూ రికార్డులతో పాటు స్థానిక పరిపాలన సంస్థ మున్సిపాలిటీ రికార్డుల్లోనూ నమోదు కావాల్సి ఉంటుంది. ఎవరైనా తనకు నచ్చిన వ్యక్తికి ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు కూడా ఆస్థి బదలాయింపు ప్రక్రియ జరుగుతుంది. కొనుగోలు చేసిన స్థిరాస్తికి సంబంధించిన స్థానిక పరిపాలన కార్యాలయం పన్ను విధింపు ఎవరి పేరుతో చేయాలో కూడా అధికారులు మ్యుటేషన్‌తోనే నిర్ణయిస్తారు. ఒకవేళ మ్యుటేషన్ జరగకపోతే గతంలో ఉన్న యజమాని పేరుతో పన్ను మదింపు చేస్తారు. అందుకే ఆస్తులు చేతులు మారినప్పుడల్లా దాని మ్యుటేషన్ తప్పనిసరిగా జరగాలి. తండ్రి నుంచి పిల్లలకు ఆస్తులు సంక్రమించినా, వారి తదనంతరం లేదా బతికి ఉన్నప్పుడే పిల్లల పేర్లతో ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసినా, ఇలా సదరు ఆస్తులకు కొత్త యజమానులు వస్తారు. ఈ విషయాన్ని అధికారికంగా రెవెన్యూ, మున్సిపల్ రికార్డుల్లో నమోదు చేయడమే మ్యుటేషన్. ఇది ఆస్తుల కొనుగోలు సందర్భంగా కూడా చేయాల్సి ఉంటుంది. మ్యుటేషన్ ప్రక్రియ జరిగితేనే ఒక ఆస్తిపై కొత్త యజమానికి పూర్తి అధికారం దక్కుతుంది. లేదంటే యాజమాన్య హక్కులు అసంపూర్ణంగా ఉంటాయి.






