- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్త్రీలకు ఇల్లు అవసరమా? సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న చర్చ
ప్రస్తుతం సోషల్ మీడియాలో "స్త్రీలకు ఇల్లు అవసరమా" అనే చర్చ నడుస్తోంది. చూడటానికి ఇది చిన్న విషయంలాగే కనిపించినా దీనిని అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న వెనుక ఆవేదన అర్థం అవుతుంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో "స్త్రీలకు ఇల్లు అవసరమా" అనే చర్చ నడుస్తోంది. చూడటానికి ఇది చిన్న విషయంలాగే కనిపించినా దీనిని అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న వెనుక ఆవేదన అర్థం అవుతుంది. నిజానికి ఈ చర్చ ఇప్పటిది కానప్పటికీ... ఇటీవల కడలి రౌతు అనే రచయిత ఒక ఇంటర్వ్యూలో 'మహిళలకు వారికంటూ సొంత ఇల్లు ఏదీ ఉండదు. తండ్రి, భర్త, కొడుకు ఇంట్లో ఆమె బతకాల్సి వస్తుంది' అంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి స్త్రీలకు ఇల్లు అనే అంశం తెర మీదకు రావడమే కాదు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే 1992 లోనే ప్రముఖ రచయిత కవనశర్మ రాసిన "ఆమె ఇల్లు" కథ కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అప్పుడే కాదు ఇప్పటికీ ఆ అంశం ఇంకా తాజాగా ఉండటానికి కారణం.. మహిళలకు వారికంటూ సొంత ఇల్లు లేకపోవడమే.
ఆడపిల్ల పుట్టగానే బరువు అనుకునే వాళ్లు కొందరైతే, లక్ష్మీదేవి పుట్టిందని కొందరు అనుకొని మురిసిపోతారు. కానీ చివరకు వచ్చేసరికి ఆమెకు పెళ్లి చేసి పంపి ఇంక అదే నీ ఇల్లు అంటారు. పెళ్ళిచేసుకొని వెళ్లిన అత్తగారింటి మీద కూడా తనకు ఎలాంటి హక్కులు ఉండవు. ఆ ఇంట్లో అత్త మామలు, భర్తకు కోపం వచ్చినపుడు, గొడవ జరిగినపుడు మా/నా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపో అని అంటారు. పోనీ అదే బాధలో కన్నవాళ్ళ ఇంటికి వెళ్తే.. అదే నీ ఇల్లు, ఏదేమైనా నువ్వు అక్కడే ఉండాలి అంటారు. గొడవలు జరగకపోయినా ఆ ఇంటి మీద ఏమైనా హక్కులు ఉంటాయా అంటే.. ఆమె భర్త తర్వాత కూడా ఆ ఇల్లు, ఆస్తిపాస్తులు కొడుక్కు చెందుతాయి గాని, ఆమెకు గాని కూతురుకు గాని చెందవు అంటారు.
ఆ కుటుంబం అద్దె ఇంట్లో ఉన్నా గాని అది భర్త ఇల్లు అవుతుంది గాని ఆమె ఇల్లు అవదు. ఇంటి కిరాయి కట్టి లేదా తన డబ్బులతో ఆ ఇల్లు కొన్నా, ఈఎంఐ కట్టినా.. అది బాధ్యత అంటారు గాని, ఆ ఇల్లు ఆమెది అని మాత్రం అనరు. ఆ ఇంటిలో ఆమె మాట చెల్లదు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరినీ సమానంగా చదివించి, పెంచిన కుటుంబంలో కూడా.. ఇల్లు విషయం వచ్చేసరికి అంతా ఒకేలా ఆలోచిస్తారు. వేలాది ఏళ్ల నుంచి మాత్రమే కాదు ఇంత టెక్నాలజీ పెరిగి, మహిళలు అంతరిక్షంలోకి వెళ్లి విజయాలు సాధిస్తున్న ఈ కాలంలో కూడా ఇంకా మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షకు ఇది నిదర్శనం.
ప్రతి కుటుంబం నివసించడానికి ఒక నీడ కావాలి కాబట్టి ఇల్లు అవసరం, మరి అలాంటపుడు ఆమెకు మాత్రమే ఎందుకు ఇల్లు అనేవాళ్ళు అనేకం. అయితే ఇంటిని ఎండా వాన నుంచి రక్షించుకునే ఒక గూడులాగా మాత్రమే చూడకుండా దానిని ఒక హక్కుగా భావించి, దాని మీద ఆధిపత్యం పురుషుడిదే అనే భావజాలం మహిళల మీద బలవంతంగా రుద్దడం మొదలైనప్పటి నుంచి తమకూ ఒక ఇల్లు ఉండాలనే ఆవేదన మహిళల్లో మొదలైందని చెప్పవచ్చు. అనాదిగా వస్తున్న మహిళల మానసిక బాధను ఇపుడు కడలి బయట పెట్టగానే చాలామంది ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతోపాటు వింత వాదనలు లేవదీస్తున్నారు.
ఇల్లు పురుషులది అయితే.. మరి మహిళలు 9 నెలలు మోసి పిల్లల్ని కంటే వాళ్ళు ఆమె పిల్లలు అన్నట్టా అని అజ్ఞానంతో ట్రోల్స్ చేస్తున్నారు. ఇంటిని, పిల్లలను ఒకే గాటన కట్టే అంశాలు కావు అవి. రెండూ పూర్తిగా వేర్వేరు. ఇది నా ఇల్లు అని చెప్పగలుతారు కానీ, వీళ్ళు నీ పిల్లలు మాత్రమే అనలేరు. ఇంకా చెప్పాలి అంటే అక్కడ కూడా పురుషుడికే క్రెడిట్స్ ఇస్తారు. పుట్టినవాళ్ళకి తండ్రి ఇంటిపేరు, గార్డియన్ లేదా పేరెంట్ దగ్గర తండ్రి పేరు, అడ్రస్ వద్ద కేరాఫ్ అని తండ్రి వివరాలను రాస్తారు. అసలు ఈ చర్చకు మూల కారణం ఏమిటో చూడకుండా, ఇందులో అంశాలు తమ ఈగోను దెబ్బ తీస్తున్న ఒకే ఒక కారణంగా స్త్రీలకు ఇల్లు అవసరం లేదు అనో ఎందుకు అనో కొట్టిపడేయడమో లేదా ఇలా ట్రోల్ చేయడమో చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ చేయడం వెనుక ఉద్దేశం మాత్రం.. మహిళల ఆవేదనను, బాధను చులకన చేయడమే.
చాలామంది మహిళలను నీకంటూ ఇల్లు ఉందా అని ప్రశ్నించినపుడు.. వారి మోహంలో నిర్వేదంతో కూడిన ఒక జీవం లేని నవ్వు కనిపిస్తుంది. దాని వెనకాల లెక్కలేని మానసిక హింస దాగి ఉంది అని అర్థం చేసుకోవాలి. మరికొంతమంది మహిళలు నోరువిప్పి చనిపోయాక స్మశానంలో మమ్మల్ని పూడ్చే ఆ ఆరడుగుల స్థలం తప్ప మాకంటూ ఏదీ లేదని కన్నీళ్లను దిగమింగుతూ చెప్పడం స్త్రీలకు ఇల్లు అవసరమా అనే ప్రశ్నకు గుండెల్ని మెలిపెట్టే సమాధానం అనుకోవాలి. నిజానికి ఇల్లు కావాలి అని కోరుకునేది ఆస్తిపాస్తులు వెనకేసుడానికి కాదని, అక్కడ మాత్రమే కదా.. "నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు.." అనే వాళ్ళు ఎవరూ ఉండనిది కదా అంటున్నారు.






