DISHA Special: వైఫ్ ఈక్వెల్ టు నైఫ్..! భర్తలారా పారాహుషార్?

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-30 05:59:10  IST  )

దాంపత్య జీవితం చాలా ప్రత్యేకమైనది. భారతదేశంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు, వారి సంస్కృతులు.. సంప్రదాయాలు, అభిప్రాయాల సమ్మేళనం.

DISHA Special: వైఫ్ ఈక్వెల్ టు నైఫ్..! భర్తలారా పారాహుషార్?
X

దాంపత్య జీవితం చాలా ప్రత్యేకమైనది. భారతదేశంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు, వారి సంస్కృతులు.. సంప్రదాయాలు, అభిప్రాయాల సమ్మేళనం. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే, భారతీయ వివాహ వ్యవస్థకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ చాలా వరకు పెద్దలు కుదిర్చిన వివాహాలే జరుగుతున్నాయి. అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమ వివాహాలకు కూడా అత్యంత ప్రాధాన్యత లభిస్తున్నది. అయితే, మనదేశంలో శతాబ్దాలుగా మహిళలపై జరుగుతున్న గృహ హింస గురించి వింటూనే ఉన్నాం.. కళ్లారా చూస్తూనే ఉన్నాం. కానీ, మారుతున్న కాలమాన పరిస్థితులు కావచ్చు.. సోషల్ మీడియా ప్రభావమో లేదా సినిమాలు, సీరియల్స్ ప్రభావమో తెలియదు కానీ.. గత కొంతకాలంగా భర్తలపై భార్యల అకృత్యాలు పెరుగుతున్నాయి. అనుకోని అతిథిలా మూడో వ్యక్తి ఎంట్రీతో కాపురాలు కూలుతున్నాయి. కొందరు వివాహితలు.. భర్తతో పాటు పిల్లలను సైతం కడతేరుస్తున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. గృహహింస అంటే భార్యలపై జరుగుతున్న అకృత్యాలే కాదు.. భర్తలపై కూడా జరుగుతున్నాయని ఇటీవల జరిగిన అనేక ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్త్రీ, పురుషులకు ఇద్దరికీ చట్టాల్లో సమాన హక్కులు కల్పించే అవకాశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. - కట్ట సాయికుమార్

విదేశాల్లో దాంపత్య జీవితానికి ఎక్స్‌పైరీ డేట్ చాలా త్వరగా ఉంటుంది. కానీ, భారతీయ వైవాహిక జీవితాల్లో ఎక్స్‌పైరీ డేట్ అన్న మాటేలేదు. ఒక్కసారి మూడుముళ్లు వేస్తే జీవితాంతం వారు కలిసి ఉండాల్సిందే. అభిప్రాయబేధాలు వచ్చి, విడిపోదామని అనుకున్నా.. ఇక్కడి మూలాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలు, పద్ధతులు అడ్డొస్తాయి. విదేశాల్లో దంపతుల మధ్య సఖ్యత లేకపోతే వారు ఎవరి దారి వారు చూసుకుంటారు. వారికి నచ్చిన భాగస్వాములను చూసుకుని మరల కొత్తగా జీవితం ప్రారంభిస్తారు. కానీ, మనదేశంలో సొసైటీకి భయపడి.. పేరెంట్స్, పిల్లల కోసం దంపతులు తమ మధ్య సఖ్యత లేకున్నా బలవంతంగా కలిసి ఉండే వారు చాలామందే ఉన్నారు. అలాంటివారిలో కొందరు వివాహేతర సంబంధాలకు ఆకర్షితులు కావడంతో.. ఇంటి గొడవలు కాస్తా హత్యల వరకూ వెళ్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు పరిశీలిస్తే.. భర్తల హత్యల వెనుక కేవలం వివాహేతర బంధాలు ఒకటే కాకుండా.. ఆర్థిక ప్రయోజనాలు, ఆస్తి కోసం, ప్రభుత్వ ఉద్యోగ బదాలయింపు, వేధింపులు ఇలా అనేక కారణాలు ఉండటం గమనార్హం.

పెళ్లంటే భయపడుతున్న నేటితరం..

సొసైటీలో జరుగుతున్న ప్రస్తుత నేరాలను చూసి పెళ్లికాని యువకులు జంకుతున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే అమ్మాయిలు దొరకడం లేదని.. వారి రిక్వైర్‌మెంట్స్ వింటే పెళ్లి మీద విరక్తి పుడుతోందని.. ఇక అరేంజ్ మ్యారేజ్ చేసుకుందామంటే తనకు లవర్ ఉంటే వాడితో కలిసి ఎక్కడ తమను చంపుతారో అనే భయం వేస్తోందని కొందరు యువకులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే విషయమై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఇన్ స్టాలోనూ రీల్స్ వైరల్ అవుతున్నాయి. అసలు పెళ్లి, రిలేషన్ అంటేనే నమ్మకం పోయిందని.. పెళ్లికి బదులు పెట్స్‌ను పెంచుకోవడం నయమని మరికొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ‘కుక్కచావు చచ్చేకంటే కుక్కను పెంచుకోవడం ఉత్తమం’అని ఫేస్ బుక్ లో స్టోరీలు పెడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సమాన హక్కుల మాటేమిటి?

నిజానికి స్త్రీ, పురుషులు ఇద్దరికీ చట్టంలో సమాన హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ -14 చట్టం ప్రకారం దేశ ప్రజలందరూ సమానమేనని సూచిస్తున్నది. అలాగే, ఆర్టికల్ 15 కేవలం మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధిస్తుంది. కాగా, సమాజంలో మహిళలు నేటికీ ఎదుర్కొంటున్న కొన్ని ప్రతికూలతల నుంచి రక్షించేందుకు చట్టం వారికి ప్రత్యేక రక్షణను కల్పిస్తున్నది. అందుకే ఆర్టికల్-15 క్లాజ్ 3 కింద వారికోసం కొన్ని ప్రత్యేక చట్టాలు రూపొందించబడ్డాయి.

* గృహ హింస చట్టం-2005 (గృహ హింస నుంచి మహిళలను రక్షణ కల్పిస్తుంది)

* వరకట్న నిషేధ చట్టం- 1961 (వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ నిషేధిస్తుంది)

* లైంగిక వేధింపుల నుండి మహిళల రక్షణ -2013 (పనిచేసే స్థలంలో మహిళలకు వేధింపుల నుంచి రక్షణగా నిలుస్తుంది)

* సమాన వేతనాల చట్టం-1976 (ఒకే విధమైన పనికి స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఉండాలని నిర్దేశిస్తుంది)

ఈ చట్టాలు ప్రత్యేకంగా మహిళల హక్కులను పరిరక్షిస్తున్నప్పటికీ, పురుషులకు కూడా అనేక సాధారణ చట్టపరమైన హక్కులు ఉన్నాయి. నేర చట్టాలు, ఒప్పంద చట్టాలు, ఆస్తి చట్టాలు స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా వర్తిస్తాయి. అయితే, భారతదేశం పురుషాధిక్యత సమాజం కావడంతో మహిళల సంరక్షణకు ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. ఇవి మహిళలకు పురుషుల నుంచి ఎదురయ్యే ప్రతిఘటనల నుంచి ప్రత్యేక రక్షణగా నిలుస్తున్నాయి.

కలిసి బతకలేనప్పుడు..

ఒక మహిళ పెళ్లయ్యాక తన భర్తను కాదని వేరే వ్యక్తిని ఇష్టపడిందంటే పెళ్లికి ముందు సదరు వ్యక్తి ఆమెకు ఇష్టం లేకపోవచ్చని తెలుసుకోవాలి.. లేదా దాంపత్య జీవితంలో అభిప్రాయాలు భిన్నంగా అయినా ఉండాలి. అర్థం చేసుకునే మనస్తత్వం లేకపోవడం కూడా ఓ కారణమే. దీనికితోడు పెళ్లికి ముందు తల్లిదండ్రుల ఇష్టానుసారం, ఒత్తిడితో అమ్మాయి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. కానీ, పెళ్లాయ్యాక పరిస్థితులు వేరుగా ఉంటాయి. అమ్మాయి ఇష్టాలను తెలుసుకోకుండా పరువు కోసం, మంచి లైఫ్ ఉంటుందని పేరెంట్స్ బలవంతంగా చేసిన పెళ్లిళ్లల్లో కొన్ని మాత్రమే నిలుస్తున్నాయి. మిగతావి పెటాకులవుతున్నాయి. భార్యభర్తల మధ్య సఖ్యత లేని సమయంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు సొసైటీలో ఇలాంటి అనార్థాలు చోటుచేసుకునే ఆస్కారం తగ్గే చాన్స్ ఉంది. ఇటీవలి కాలంలో ప్రేమ విహహాలు ఎక్కువకాలం నిలవడం లేదు. చాలామంది ప్రేమ పెండ్లి విషయంలో తల్లిదండ్రులను ఎదురించడంలో చూపే శ్రద్ధ.. జీవితాన్ని లీడ్ చేయడంపై చూపరు. అందుకే చాలా ప్రేమ పెళ్లిళ్లు అర్ధాంతరంగానే ముగిసిపోతుంటాయి. మరోకోణంలో ఆలోచిస్తే.. ప్రేమ పెళ్లిళ్లల్లో తల్లిదండ్రుల జోక్యం ఉండదు కాబట్టి.. దంపతులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటున్నారు. అరేంజ్డ్ పెళ్లిళ్లలో దంపతుల మధ్య తీవ్రమైన అభిప్రాయ బేధాలు ఉన్నా.. వారిని కలిసి ఉండేలా ఒత్తిడి చేస్తుంటారు.. ఇందులో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేది అమ్మాయిలేనని తెలిసిందే.

పురుషుడిపై సమాజ దృక్కోణం..

ప్రస్తుత సమాజంలో స్త్రీల మాదిరి పురుషులు కూడా ఇబ్బందులు, వేధింపులను ఎదుర్కొంటున్నారు. కానీ, మహిళలపై ఈ సమాజం చూపించే ఆదరణ, కరుణను వారు పొందలేకపోతున్నారు. అందుకే పురుషులపై సామాజిక దృక్పథమే కారణం. ఎటువంటి బాధ కలిగినా ఏడవకూడదు అనే భావన, ఇంట్లో సమస్యలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి, చెప్పుకుంటే హేళన చేస్తారనే భయం, భార్య వేధింపులపై ఫిర్యాదు చేసే ధైర్యం లేకపోవడం.. అవమాన భారాలు వంటి అంశాలు పురుషులను మానసికంగా కుంగదీస్తున్నాయి. ఈ విషయాలపై సమాజం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దృష్టి కోణంలోనూ స్త్రీతో సమానంగా పురుషులను చూడాల్సి ఉన్నది. ఒకప్పుడు మహిళలు ఎదుర్కొన్న గృహహింసను.. ఇప్పుడు తామూ ఎదుర్కొంటున్నామని కొందరు పురుషులు సోషల్ మీడియాలో తన గోడును వెల్లగక్కుతున్నారు. అటువంటి వారిపై ఈ సమాజం చులకన భావంతో ఉండరాదు. వారు ఎదుర్కొంటున్న అవమానాలు, ఇబ్బందులు ఫిర్యాదు చేసేలా సొసైటీ వారికి మనోధైర్యం కల్పించాలి. పోలీసు వ్యవస్థ, కోర్టులు సైతం వారికి అండగా నిలవాల్సి ఉన్నది.

చట్టం దుర్వినియోగం..

చరిత్రను ఒకసారి పరిశీలిస్తే గృహ హింసను మహిళలే అధికంగా ఎదుర్కొనేవారు. అందుకే వారికి రక్షణ కల్పించేందుకు గహ హంస చట్టాన్ని తీసుకొచ్చారు. అయినప్పటికీ వారిపై వేధింపులు, దాడులు ఆగలేదు. నేటికీ గృహహింస కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే, ఇందులో కొన్ని కేసులు మాత్రం తప్పుదారి పడుతున్నాయని కోర్టులే అభిప్రాయం వ్యక్తంచేయడం అందరూ ఆలోచించాల్సిన విషయం. కొందరు మహిళలు తమ ఆర్థిక, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం కట్టుకున్న భర్తలపై డొమెస్టిక్ వయోలెన్స్ కేసులు పెట్టి భరణం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని.. కోరింది ఇవ్వలేదని మాటలతో వేధిస్తున్నారని బాధితులు కొందరు సోషల్ మీడియాలో ఆవేదన వెళ్లగక్కారు. ఉదా.. గతేడాది బెంగళూరులో అతుల్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన భార్య వేధింపులు తాళలేక 24 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మీద ఆరు కేసులు బనాయించిందని.. తన ఆస్తి కోసం ఆత్త, భార్య, బావమరిది వేధించడంతో పాటు బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.ఈ ఘటన తర్వాత మరో రెండు మూడు ఘటనలు ఇలాగే జరిగాయి. ఓ కేసులో భర్త నుంచి భార్య నెలకు రూ.6.20 లక్షల భరణం డిమాండ్ చేయగా.. మహిళా జడ్జి ‘నెలకు ఇంత ఎవరైనా ఖర్చుచేస్తారా? అలాంటి వారు సొంతంగా సంపాదించుకోవాలని’ చీవాట్లు పెట్టింది. ఈ కేసు ఉద్దేశపూర్వంగా నమోదు చేశారని కోర్టు సైతం అభిప్రాయపడింది. ఇటువంటి కేసుల వలన పురుషులపై ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకు గృహహింస చట్టం దుర్వినియోగం కాకుండా.. అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వివాహేతర సంబంధం నేరం కాదు: ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇటీవల ఓ భర్త తన భార్య ప్రియుడిపై కేసు వేయగా.. విచారణలో భాగంగా ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం వివాహేతర సంబంధం రాజ్యాంగ బద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ గుర్తుచేశారు. ఎఫైర్ అనేది నైతికతకు సంబంధించిన అంశమనీ, దాన్ని నేరంగా చూడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆమె గుర్తుచేశారు. తన భార్య మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని, వారిద్దరూ ఓ హోటల్లో శారీరకంగా కలిసారని మహిళ భర్త ఆరోపించగా.. ఈ కేసులో ప్రియుడిని మేజిస్ట్రేట్ కోర్టు విడిచిపెట్టగా, ఆ తీర్పును సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ప్రియుడికి మళ్లీ సమన్లు పంపింది. ప్రియుడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయగా అతనికి ఫేవర్‌గా తీర్పువచ్చింది.

భర్తలపై భార్యల అకృత్యాలు ఇలా..

* భర్తను ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి..

యూపీలోని మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్‌ను తన భార్య ముస్కాన్ రస్తోగి ప్రియుడు సాహిల్‌తో కలిసి హతమార్చింది. అనంతరం డెడ్ బాడీని ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి సిమెంట్‌తో సీల్ వేసింది. ఈ ఏడాది మార్చి 4న ఈ హత్య జరగగా.. దాదాపు 15 రోజుల తర్వాత విషయం వెలుగుచూసింది. సాహిల్ మృతుడి ఫ్రెండ్ అని.. అతనితో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకుందని పోలీసులు విచారణలో తేల్చారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

* రూ.8 కోట్ల ఆస్తి కోసం..

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రమేశ్, నిహారిక భార్యభర్తలు. అయితే, నిహారికకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త పేరు మీదున్న రూ.8 కోట్ల ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలని నిహారిక.. తన ప్రియుడితో ప్లాన్ చేసింది. భర్తకు మాయమాటలకు చెప్పిన నిహారిక.. తన ప్రియుడితో కలిసి కారులో రమేష్‌ను భువనగిరి శివారుకు తీసుకెళ్లి హత్యచేసింది.అనంతరం మృతదేహాన్ని ఊటీకి తీసుకెళ్లి.. హర్యానాకు చెందిన రాణా అనే వ్యక్తి సాయంతో కాఫీ ఎస్టేట్‌లో రమేశ్ మృతదేహాన్ని తగులబెట్టారు.

* ప్రియుడికి సుపారీ ఇచ్చి మరీ..

తన భార్య ఫ్లోరా ఫిట్‌గా ఉండాలని భర్త సుమంత్ రెడ్డి జిమ్‌లో చేర్పిస్తే ఆ జిమ్ ట్రైనర్‌ శామ్యుల్‌తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. కొద్దిరోజులకు ప్రియుడితో ప్రైవసీ కోసం ఏకంగా భర్త సుమంత్ రెడ్డినే తప్పించాలని భార్య ప్లాన్ చేసింది. ప్రియుడికి సుపారీ ఇచ్చి మరీ భర్తపై ఎటాక్‌ చేయించింది. వరంగల్‌ – భట్టుపల్లి ప్రధాన రహదారిపై డాక్టర్‌ సుమంత్‌ రెడ్డి కారును అడ్డగించి.. ఇనుప రాడ్లతో ముగ్గురు అటాక్ చేశారు. అతన్ని కిందకు లాగి రాడ్లతో బాదగా.. ఆస్పత్రిలో 8 రోజులు పోరాడి చనిపోయాడు. ఈ కేసులో ఫ్లోరా, శామ్యుల్, ఏఆర్ కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

* పామును కొనుక్కొచ్చి..

తన భర్త ఫ్రెండ్ అమర్ దీప్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రవిత అనే మహిళ.. ప్రియుడితో కలిసి భర్త అమిత్‌ను గొంతు నులిమి హత్య చేసింది. అపై పథకం ప్రకారం రూ.1000 పెట్టి తెచ్చిన పామును మంచంలో శవం పక్కన పడేశారు. ఉదయం చేసి తన భర్త పాము కాటుతో చనిపోయాడని రవిత అందరినీ నమ్మించాలని చూసిన ఘటన యూపీలోని మీరట్‌లో చోటుచేసుకుంది. అమిత్ బాడీకి పోస్టుమార్టం చేయగా అసలు విషయం వెలుగుచూసింది.

* భర్తతో 20 ఏళ్ల ఏజ్ గ్యాప్.. పిల్లలకు విషమిచ్చి!

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో చెన్నయ్య, రజిత దంపతులు ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన రజిత తన పాత ఫ్రెండ్ శివకుమార్‌ను కలుసుకుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడితో జీవించాలని భర్త, పిల్లలకు విషమిచ్చి చంపాలని ప్లాన్ చేయగా.. భర్త చెన్నయ్య మాత్రం తప్పించుకున్నాడు. ముగ్గురు పిల్లలు చనిపోయారు. రజిత కడుపునొప్పి నాటకం ఆడగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణలో రజితను దోషిగా తేల్చి ఆమె ప్రియుడిని సైతం అరెస్టు చేశారు.

* ఎక్కడ చంపుతారోనని.. భార్యకు ప్రియుడితో మరో పెళ్లి!

యూపీలోని సంత్ కబీర్ నగర్‌ కతార్ జోట్ గ్రామానికి చెందిన బబ్లూ.. గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను 2017లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. బబ్లూ వేరే రాష్ట్రంలో కూలీగా పనిచేస్తుండగా.. తన భార్య వికాస్‌ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త నేరుగా గ్రామ పెద్దలకు చెప్పి వారి సమక్షంలో తన భార్యను ప్రియుడికి ఇచ్చి మరో పెళ్లి చేయించాడు. పిల్లల పెంపకాన్ని తానే తీసుకున్నాడు. ఇలా ఎందుకు చేశావని మీడియా ప్రశ్నించగా.. తనకు ఎలాంటి హాని కలుగకూడదని.. ఇటీవల భర్తలను భార్యలు చంపుతున్నారని.. మీరట్‌లో ఏమి జరిగిందో తెలిశాక ప్రశాంత జీవనం కోసం ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.

Next Story