- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha Special: యవతను కబళిస్తోన్న బెట్టింగ్ భూతం.. రూ.8.20 లక్షల కోట్లు దాటిన టర్నోవర్
ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ యాప్‌లకు బలవుతున్న ఘటనలు పెరిగిపోయాయి.

ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ యాప్‌లకు బలవుతున్న ఘటనలు పెరిగిపోయాయి. బెట్టింగ్ మాఫియా వలలో చిక్కి చాలామంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారాలన్న అత్యాశతో కొందరు శక్తికి మించి అప్పులు చేస్తున్నారు. కానీ, కోటీశ్వరులు అవ్వడం అటుంచితే ఎంతోమంది డబ్బులు పొగొట్టుకుని, చేసిన అప్పులు కట్టలేక రోడ్డున పడుతున్నారు. ప్రాణాంతక వ్యసనంగా మారిన ఈ అక్రమ బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టడంలో ఇప్పటికీ ప్రభుత్వాలు గానీ, చట్టాలు గానీ పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ బెట్టింగ్ యాప్స్ ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకోగా, సాధ్యమైనంత వరకు పోలీసు వ్యవస్థ, ప్రభుత్వాలు వాటిపైన కొరడా ఝుళిపిస్తూనే ఉన్నాయి.
గతంతో పోలిస్తే గత కొన్ని నెలల కాలంలో ఈ బెట్టింగ్ యాప్‌లను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ స్వలాభం కోసం భారీగా ప్రచారం కల్పిస్తున్నారు. వాటి ఫలితాలను అంచనా వేయకుండా క్షణాల్లో వేలాది సొమ్మును గెలవొచ్చు అంటూ వీడియోలు చేస్తూ సామాన్యులను ప్రభావితం చేస్తున్నారు. టెక్నాలజీపై అవగాహన లేని చాలామంది అది నిజమని నమ్మి, యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని మోసపోతున్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం, అథ్లెటిక్ ఈవెంట్ల వృద్ధితో ఈ రంగంలోకి నిధుల ప్రవాహం అధికం అవుతున్నది. నియంత్రణలు ఉన్నప్పటికీ, మనదేశంలో అక్రమ బెట్టింగ్, జూదం వ్యాపారం వేగంగా పెరుగుతున్నది. - సత్య గోపి
ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్ సీజన్ కారణంగా దేశంలో ఆన్‌లైన్ అక్రమ బెట్టింగ్ యాప్‌ల ఆదాయం మళ్లీ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంచనాల ప్రకారం, సాధారణంగా దేశంలో 15 కోట్ల మంది తరచుగా బెట్టింగ్‌లలో పాల్గొంటారు. కానీ, ఐపీఎల్ సమయంలో ఈ సంఖ్య ఏకంగా 39 కోట్ల వరకు చేరుతోందని నివేదికలు చెబుతున్నాయి. 2024 నాటి నివేదికల ప్రకారం.. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల మార్కెట్ రూ. 8.20 లక్షల కోట్లు దాటనుంది. ఈ బెట్టింగ్ యాప్‌లు 30 శాతం వార్షిక రేటుతో పెరుగుతున్నాయి. కేవలం నాలుగు బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు పరిమ్యాచ్, స్టేక్, 1ఎక్స్‌బెట్, బ్యాటరీ బెట్ యాప్‌లు 2024, అక్టోబర్-డిసెంబర్ మధ్య మూడు నెలల్లో 160 కోట్ల వెబ్‌సైట్ విజిట్స్ అందుకున్నాయని నివేదిక పేర్కొంది. ఇది ఫేస్‌బుక్, మెటా, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మూడు నెలల్లో వచ్చే 4.28 కోట్ల విజిట్స్ కంటే అనేక రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ బెట్టింగ్ యాప్‌లు సామాన్యులను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రూ. 100 పెడితే రూ. 1,000 లాభం అంటూ నమ్మిస్తాయి. మొదట్లో తక్కువ మొత్తంతో ప్రారంభించి ఆ తర్వాత లక్షలాది రూపాయలను వారి నుంచి దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగులలో పాల్గొనే వారిలో 99 శాతం మంది చేతులు కాల్చుకుని ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఎంతోమంది ఆన్‌లైన్ బెట్టింగులో భారీగా సంపాదించవచ్చని ఆశపడి, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్లిపోతున్నారు.
బెట్టింగ్ యాప్‌లలో రకాలు
- స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్‌లు: ఈ యాప్‌లు వినియోగదారులు క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, ఇతర క్రీడలపై బెట్టింగ్‌లు వేయడానికి అనుమతిస్తాయి.
- ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌లు: ఈ యాప్‌లు వినియోగదారులు వివిధ క్రీడలకు సంబంధించి టీమ్‌లను ఎంచుకునేందుకు, రియల్-లైఫ్ స్పోర్ట్స్ ఈవెంట్‌ల ఆధారంగా ఇతర యూజర్లతో కలిసి ఆడేలా రూపొందిస్తారు.
- ఆన్‌లైన్ క్యాసినో యాప్‌లు: ఈ యాప్‌లు పోకర్, బ్లాక్‌జాక్ లాంటి వివిధ క్యాసినో గేమ్‌లు ఆదేలా ప్రోత్సహిస్తాయి.
కంపెనీలపై పన్నుల భారం
చట్టబద్ధంగా రియల్-మనీ గేమింగ్ యాప్‌లను నిర్వహించే డ్రీమ్11, పోకర్‌బాజీతో సహా చట్టపరమైన ఆర్ఎంజీ సంస్థలు 28 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. అయితే, పరిశ్రమపై విధిస్తున్న అధిక పన్నులను తగ్గిస్తే పోటీ మెరుగవుతుందని, అక్రమ బెట్టింగ్ యాప్‌ల పెరుగుదలను కట్టడి చేయవచ్చని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కానీ, దీనిపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఉండటంలేదు.
బెట్టింగ్ యాప్‌ల చుట్టూ సమస్యలు
బెట్టింగ్ యాప్‌లు సులభంగా ప్రచారం పొందుతున్నప్పటికీ, వాటి చుట్టూ అనేక చట్టవిరుద్ధమైన సమస్యలు ఉన్నాయి.
- లైసెన్స్ లేని కార్యకలాపాలు: అనేక బెట్టింగ్ యాప్‌లు సరైన అనుమతులులు లేకుండా కార్యకలాపాలను నిర్వహించడం.
- మనీ ల్యాండరింగ్: బెట్టింగ్ యాప్‌లను తరచుగా మనీ ల్యాండరింగ్ కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేయడానికి వీలును కల్పిస్తాయి. కొన్నిసార్లు చట్టవిరుద్ధమైన యాప్‌లు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌కు మార్గాలుగా కూడా పనిచేస్తాయి.
- మ్యాచ్ ఫిక్సింగ్: బెట్టింగ్ యాప్‌లు మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలతో సంబంధాలు కలిగి ఉంటాయి. ఇటువంటి కార్యకలాపాలు క్రీడల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి ఆటగాళ్లు, జట్లకు లంచం ఆఫర్ చేస్తాయి.
బెట్టింగ్ యాప్‌ల చట్టబద్ధత
మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో పరిమిత స్థాయిలో అనుమతులున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కొన్ని చట్టాలు రూపొందించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్‌లపై పూర్తిస్థాయిలో నిషేధం అమల్లో ఉంది. సిక్కిం, గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం నియంత్రిత స్థాయిలో అమల్లో ఉన్నాయి.
బెట్టింగ్ యాప్‌లపై అమలవుతున్న చట్టాలివే
* కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను కట్టడి చేసేందుకు ఐటీ చట్టం 2000, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) నిబంధనల కింద కేసులు నమోదు చేస్తున్నది.
* ఐటీ యాక్ట్, 2000 చట్టం కింద ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహించే వెబ్‌సైట్లకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 1,00,000 జరిమానా ఉంటుంది. ఇక ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొంటే ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ. 50,000 జరిమానా ఉంటుంది.
* ప్రీవెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ), 2002 చట్టం ప్రకారం బెట్టింగ్ ద్వారా మనీ ల్యాండరింగ్ చేస్తే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు, స్వాధీనం చేసుకున్న సొమ్మును సీజ్ చేస్తారు.
* ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999 ప్రకారం, ఆన్‌లైన్ బెట్టింగ్‌తో సహా విదేశీ మారకపు లావాదేవీలను నియంత్రిస్తుంది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నియంత్రణ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహించడం లేదా పాల్గొనడం చట్టవిరుద్ధం. దీనికోసం తెలంగాణ గేమింగ్ (అమెండ్‌మెంట్) యాక్ట్, 2017, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ (అమెండ్‌మెంట్) యాక్ట్, 2020 తీసుకొచ్చాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొంటే ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా ఉంటుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నట్టు తేలితే రెండేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా ఉంటుంది.
బ్యాన్ చేయడంలో చిక్కులు..
వాస్తవానికి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నీ చట్టవిరుద్ధమైనవని చెప్పలేం. చట్టపరంగా గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని రెండు విధానాలు ఉంటాయి. గేమ్ ఆఫ్ ఛాన్స్ అన్నీ దాదాపు చట్టవిరుద్ధమైనవి. గేమ్ ఆఫ్ స్కిల్ అన్నీ దాదాపు చట్టబద్ధమైనవని చెప్పవచ్చు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఇటువంటి యాప్స్‌ను చట్టవిరుద్ధమైనవిగా ప్రభుత్వం ప్రకటించలేకపోతోంది. వాటిని బ్యాన్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో తెలియదు. ఈ రంగంలో జరిగే నేరాలు, వినియోగించే టెక్నాలజీ, సామాన్యుల భాగస్వామ్యం కారణంగా బెట్టింగ్ యాప్‌లను నియంత్రించడం అత్యంత సంక్లిష్టమైన విషయంగా ఉంది. బెట్టింగ్ చుట్టూ మనదేశంలో చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ చాలా పాతది. పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ఆఫ్ 1867 ఉన్నప్పటికీ, ఈ చట్టంలో ఆన్‌లైన్ బెట్టింగ్ లాంటి సంక్లిష్టత కలిగిన పరిశ్రమను నియంత్రించడానికి సరిపడా నిబంధనలు లేవు.
రక్షణ కవచంలా క్లౌడ్ ఫ్లేర్
ఆన్ లైన్ బెట్టింగ్ సర్వర్లను గుర్తించడం చాలా క్లిష్టతరమైన ప్రక్రియ. ఇండియాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై నిషేధం ఉన్నా.. అమెరికాలో అది చట్టబద్దమే.. అందువల్ల ఆ వెబ్‌సైట్‌లను బ్యాన్ చేసేందుకు చాలా ప్రయాస పడాల్సి వస్తున్నది. చాలా బెట్టింగ్ యాప్స్, వెబ్ సైట్లు క్లౌడ్ ఫ్లేర్ కంపెనీ సర్వర్లను వాడుతున్నాయి. ఈ సర్వర్లు అత్యంత పటిష్ఠ సైబర్ భద్రతతో ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ లో నగదు ప్రతి రోజు కోట్లలో జరుగుతుండటంతో వాటిని హ్యాక్ చేసేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. అందువల్ల వాటి భద్రతకు కంపెనీ అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాల నుంచి యాప్స్, వెబ్ సైట్లపై బ్యాన్ విధించాలని విజ్ఞప్తులు వచ్చినా.. వాటి ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. ఒకవేళ, భారత ప్రభుత్వం క్లౌడ్ ఫ్లేర్ ద్వారా ఆ యాప్ ను నిషేధించినా అదే పేరుతో మరో యాప్ రోజుల వ్యవధిలో ప్రత్యక్షం అవుతుంది. క్లౌడ్ ఫ్లేర్ తన కస్టమర్లపై ఎటువంటి నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెప్తున్నారు.
మైక్రో-బెట్టింగ్ సైట్‌ల బెడద..
ఇటీవలి కాలంలో టెక్నాలజీ వినియోగం కారణంగా రూ. 1 రూపాయితో కూడా బెట్టింగ్ వేసే అవకాశం కల్పించే మైక్రో-బెట్టింగ్ యాప్‌లు కొత్తగా భయపెడుతున్నాయి. ఇవి చాలా సాధారణంగా, చిన్న చిన్న అంశాలను, రోజువారీ వార్తలు, క్రీడలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా తక్కువ మొత్తం గెలిచేందుకు ప్రోత్సహించేలా ఉంటాయి. ఉదాహరణకు ఢిల్లీలో గాలి నాణ్యత, నాసా మార్స్ రోవర్ మిషన్, బీసీసీఐ సెక్రటరీ రిటైర్‌మెంట్ వంటి ప్రశ్నలతో చిన్న మొత్తాలను గెలిచేందుకు ఉసిగొలుపుతాయి.
టాస్క్‌ఫోర్స్ అవసరం
అక్రమ బెట్టింగ్ యాప్‌ల కార్యకలాపాలను నియంత్రించడానికి కొత్త జీఎస్‌టీ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పరిశ్రమ వర్గాల నుంచి సూచనలు అందుతున్నాయి. దీనికోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా, విదేశాల నుంచి జరిగే బెట్టింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చు. కఠినమైన చర్యలు తీసుకోకపోతే సామాన్యులు ఆర్థిక నష్టాలు, కష్టాలను ఎదుర్కోవడమే కాకుండా ప్రభుత్వానికి కూడా భారీ మొత్తంలో పన్ను నష్టం కొనసాగనుంది. చాలామంది బెట్టింగ్ యాప్‌లు, రియల్ మనీ గేమింగ్ యాప్‌లు ఒకటే అనుకుంటారు. కానీ, అవి భిన్న ప్రయోజనాలను కలిగి ఉంటాయి.






