Disha Special: ముంబై ఎటాక్స్ మాస్టర్ మైండ్.. ఆ ఒక్కడే!

by Shiva |
Disha Special: ముంబై ఎటాక్స్ మాస్టర్ మైండ్.. ఆ ఒక్కడే!
X

2008, నవంబర్ 26న దేశ ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన ఉగ్రవాదుల దాడి.. యావత్ భారతదేశాన్నే కలవరపెట్టింది. 26వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రారంభమైన మారణహోమం 29వ తేదీ ఉదయం 8గంటల వరకు కొనసాగుతూనే ఉన్నది. 10మంది ఉగ్రవాదులు ముంబైలోని 12చోట్ల బాంబు దాడులు, కాల్పులతో దేశాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. కలలో కూడా ఊహించని రీతిలో జరిగిన ఈ దాడిలో 166మంది చనిపోయారు. దాడికి పాల్పడినవారిలో తొమ్మది మంది భద్రతాబలగాల కాల్పుల్లో మరణించగా.. అజ్మల్ కసబ్ అరెస్టయ్యాడు. కోర్టు తీర్పు అనంతరం ఉరిశిక్షకు గురయ్యాడు. దాడికి పాల్పడింది.. చనిపోయిన పది మంది ఉగ్రవాదులే అయినా.. వీరి వెనుక మాస్టర్ మైండ్స్ వేరే ఉన్నారు. వారే అసలు సిసలు నేరస్థులు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ఆ సంస్థ ఆపరేషనల్ కమాండర్ సాజిద్ మీర్, సైనిక కమాండర్ జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ దాడికి ప్రధాన సూత్రధారులు. ముంబైలో దాడి చేయాలన్న పథకం వీరిదైతే.. ఏయే ప్రదేశాల్లో దాడి చేయాలి? ఉగ్రవాదులు దేశంలోకి ఎలా చొరబడాలి? సముద్రమార్గంలో వచ్చాక ఎక్కడ దిగాలి? ఏయే మార్గాల్లో వెళ్లాలి? ఈ ప్రణాళిక అంతా డేవిడ్ కొల్ మన్ హెడ్లీ అలియాస్ దావూద్ సయ్యద్ గిలానీ అనే వ్యక్తిది. ఆ అసైన్‌మెంట్‌కు అతడు పెట్టుకున్న కోడ్ నేమ్ మిక్కీ మౌస్. - హరీశ్ ఎస్పీ

ఇతడికి భారతదేశానికి వెళ్లేలా సహాయం చేయడంతోపాటు అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసిన వ్యక్తి తహవూర్ హుస్సేన్ రానా. ఇటీవలే అతడిని భారత్‌కు అమెరికా అప్పగించింది. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. మరోవైపు ఈ ఘాతుకానికి అన్ని విధాలా సహాయం అందించిన డేవిడ్ హెడ్లీ ఇప్పుడు అమెరికా జైల్లో సురక్షితంగా ఉన్నాడు. చట్టాలు అడ్డుపెట్టుకుని భారత్ కు రాకుండా అమెరికాలో తలదాచుకుంటున్నాడు. అసలు ఈ డేవిడ్ హెడ్లీ ఎవరు? ఎందుకు ఇదంతా చేశాడు? అమెరికా అతడికి ఎందుకు సహకరిస్తున్నది? అన్న అంశాలు వివరంగా తెలుసుకుందాం.

తండ్రి పాకిస్తానీ.. తల్లి అమెరికన్

సయ్యద్ సలీం గిలానీ పాకిస్తానీ దౌత్యవేత్త. కొంతకాలం అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయంలో పనిచేశాడు. అక్కడ ఎలిస్ సెర్రిల్ హెడ్లీ అనే యువతి సెక్రటరీగా పనిచేస్తున్నది. వీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరికి పుట్టిన బిడ్డే.. డేవిడ్ కొల్ మన్ హెడ్లీ. అతడికి తల్లిదండ్రులు దావూద్ సయ్యద్ గిలానీ అనిపేరు పెట్టారు. ఇతడు 1960, జూన్ 30న వాషింగ్టన్ డీసీలో పుట్టాడు. అప్పటి చట్టాల ప్రకారం అమెరికా పౌరసత్వం వచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకే సయ్యద్ సలీం గిలానీ తన అమెరికా భార్య, కొడుకుతో పాక్ వచ్చేశాడు. రేడియోలో పనిచేశాడు. ఎలిస్ పాక్ లో ఇమడలేక సయ్యద్ తో విడాకులు తీసుకుంది. అయితే, పాక్ చట్టాల ప్రకారం పిల్లల నిర్వహణ తండ్రిదే కావడంతో.. హెడ్లీని వదిలి అమెరికాకు చేరింది. హెడ్లీ ఇస్లామాబాద్ లోని ప్రతిష్ఠాత్మకమైన సైనిక విద్యాసంస్థ క్యాడెట్ కాలేజ్‌లో చదువుకున్నాడు. తహవూర్ హెస్సేన్ రానాతో స్నేహం కూడా అక్కడే మొదలయ్యింది.

నేర జీవితం ఇలా..

సవతి తల్లి సంరక్షణలో ఉండటం హెడ్లీకి ఇష్టం లేకపోయింది. దీంతోపాటు అతడి చర్మ రంగు అమెరికన్లను పోలి ఉండటం.. ఒక కన్ను గోధుమ రంగులో మరో కన్ను నీలి రంగులో ఉండటం కూడా స్థానికులనుంచి అతడిని వేరుచేసింది. అతడు పాకిస్తాన్ దేశీయుడే అయినా.. అందరూ అతడిని విదేశీయుడిలానే చూసేవారు. ఇంట్లోనూ ఇటు సమాజాన్ని ఎదిరించాల్సి రావడంతో 17 ఏండ్ల వయస్సులో తల్లి ఎలిస్ చెంత చేరాడు. అప్పటికే ఆమె ఫిలడెల్ఫియాలో కైబర్ పాస్ పబ్, మిస్ హెడ్లీ వైన్ బార్‌ను నడిపేది. తల్లి వద్దకు రావడంతో అతడు పాక్ పద్ధతులు, అలవాట్లనుంచి కొంత బయటపడేందుకు ఆస్కారం లభించింది. యుక్త వయస్సుకు రాగానే తల్లి నడుపుతున్న పబ్, బార్ వల్ల అతడికి డ్రగ్స్ తీసుకోవడం అలవాటైంది. అయితే, తాను పెరిగిన పాక్‌లో డ్రగ్స్ అతి తక్కువ ధరకే వస్తాయని.. వాటిని అమెరికా తీసుకువస్తే భారీగా లాభాలు వస్తాయని స్నేహితులు చెప్పడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు. కొన్నిసార్లు డ్రగ్స్ తేవడంలో సక్సెస్ అయినా, ఓ సారి మాత్రం డ్రగ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఏఈ)కి పట్టుబడ్డాడు. పాక్‌ ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో హెడ్లీ తండ్రికి ఉన్న పరిచయాలు, సైన్యంలో అతడి మిత్రులు పనిచేస్తుండటంతో అతడి ద్వారా కీలక సమాచారం సేకరించవచ్చని అమెరికా భావించింది. అందుకే అతడిని తీవ్రమైన శిక్షనుంచి తప్పించింది. అప్పటినుంచి వారు చెప్పిన పనులు చేస్తూ.. తన వ్యాపారం కూడా చేసుకోసాగాడు.

డబుల్ ఏజెంట్

పాక్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రవాద సంస్థలనుంచి సమాచారం సేకరించడంతోపాటు సైన్యం నిఘా ఉంచేందుకు అమెరికా హెడ్లీని ఒక పావుగా వాడుకోవాలని చూసింది. ఈ క్రమంలోనే అతడికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐలోని కొందరు అమెరికా అనుకూల అధికారులు పరిచయం అయ్యారు. వారి సాయంతో ఉగ్రవాద నాయకులతో సంబంధాలు పెంచుకున్నాడు. తాను సేకరించిన సమాచారాన్ని అధికారులకు అందివ్వడంతో అతడు పాకిస్తాన్ కి తరచూ వచ్చి వెళ్లేవాడు. అయితే, లష్కరేతాయిబా ఆపరేషనల్ కమాండర్ సాజిద్ మీర్ తో పరిచయం అతడిని ఉగ్రవాదం వైపు నడిపించింది. అమెరికా అందించే డాలర్ల కన్నా.. మతం ఇచ్చే మత్తు అతడిని ఎక్కువగా ఆకర్షించింది. దీంతో ఉగ్రవాదానికి తనవంతు సాయం చేయసాగాడు. ఈ విషయం అమెరికాకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. 2002 నుంచి 2005 వరకు పాక్ లో లష్కరేతాయిబా నిర్వహించిన ఐదు ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో పాల్గొన్నాడు. ఆయుధాల వాడకం, యుద్ధ తంత్రాలు నేర్చుకున్నాడు. తన పాకిస్తానీ వారసత్వాన్ని దాచేందుకు 2006 తన పేరును దావూద్ సయ్యద్ గిలానీ నుంచి డేవిడ్ కొల్ మన్ హెడ్లీగా మార్చుకున్నాడు.

ముంబై దాడులు

అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం లక్షంగా లష్కరేతాయిబా ముంబైపై దాడులు చేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో డేవిడ్ హెడ్లీని రెక్కీకి పంపింది. ఇందుకు ఐఎస్ఐలో మేజర్‌గా పనిచేస్తున్న ఇక్బాల్ తనకు హ్యాండ్లర్‌గా పనిచేశాడు. ముంబై వెళ్లేందుకు 25వేల డాలర్లు కూడా అందజేశాడు. ముందుగా అమెరికా వెళ్లిన హెడ్లీ.. చికాగోలో ఫస్ట్ వరల్డ్ అనే ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ను నడిపిస్తున్నాడు. లష్కరేతాయిబా సూచనల మేరకు ముంబై దాని బ్రాంచ్ ను ఏర్పాటుచేశాడు. దాని నిర్వహణ బాధ్యతలు హెడ్లీ చూస్తాడని లీగల్ డాక్యుమెంట్లు రెడీ చేయించారు. అమెరికా పౌరసత్వం ఉండటంతో హెడ్లీకి భారత్ లో ఎలాంటి ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఎదురుకాలేదు. వచ్చిరాగానే ముంబైని జల్లెడ పడుతూ లక్ష్యాలను ఎంచుకునే పనిలో పడ్డాడు.

విదేశీయులే టార్గెట్

ముంబైలో విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తాజ్ మహల్ ప్యాలెస్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్ హోటళ్లను హెడ్లీ మొదటి లక్ష్యాలుగా గుర్తించాడు. ఆ తర్వాత ఎక్కువ జనం ఉండే ప్రాంతాలైన ఛత్రపతి శివాజీ టెర్మినస్, లియోఫోల్డ్ కేఫ్‌ల్లో దాడులు చేయాలని ఎంచుకున్నాడు. ఉగ్రవాదులు సముద్రం ద్వారా వచ్చేందుకు కొలాబాలోని బడ్వర్ పార్క్ నే స్లమ్ ఏరియాను గుర్తించాడు. వారు సునాయాసంగా వచ్చేందుకు ఓ జీపీఎస్ పరికరం తీసుకువచ్చి కోఆర్డినేట్లు లష్కరేకు ఇచ్చాడు.

వీటిపైనా రెక్కీ..

మాతోశ్రీ, శివసేన చీఫ్ ఠాక్రే నివాసం: శివసేన నాయకుడు బాల్ ఠాక్రేపై దాడికి హెడ్లీ చాలా ప్రయత్నం చేశాడు. మాతోశ్రీలో రెక్కీ చేసేందుకు వీలుగా ఉద్ధవ్ ఠాక్రే పీఆర్‌వోను సైతం కలిశాడు. అయితే, అక్కడ కట్టుదిట్టమైన భద్రతను చూసి హెడ్లీ ఆ ఆలోచనను విరమించుకున్నాడు.

సిద్ధి వినాయక ఆలయం: హెడ్లీ ప్లాన్ ప్రకారం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక మందిర్ పై దాడి చేయాలని రెక్కీ చేశాడు. కానీ, అక్కడ భద్రతా సిబ్బంది ఎక్కువగా ఉండటం.. రాత్రి సమయంలో అక్కడ జనం ఎక్కువగా ఉండని కారణంగా ఆ ఆలయంపై దాడిని సిఫారసు చేయలేదు.

బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్: లష్కరే చీఫ్ సూచన మేరకు హెడ్లీ బార్క్ పరిసరాలను వీడియో తీశాడు. కానీ, అక్కడ భద్రత అధికంగా ఉండటం.. సైన్యం తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి ఆ ఆలోచన విరమించుకున్నారు.

ముంబై విమానాశ్రయం: ఐఎస్ఐ హ్యాండ్లర్ మేజర్ ఇక్బాల్.. ముంబై విమానాశ్రయాన్ని టార్గెట్ చేయాలని హెడ్లీ సూచించాడు. కానీ, ఐదుసార్లు ముంబైకి వచ్చిన హెడ్లీ ప్రతిసారి అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉండటంతోపాటు వీఐపీల రాకపోకలతో భద్రత ఎప్పటికప్పుడు మారుతుండటంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాదని తిరస్కరించాడు.

అమెరికాలో అరెస్టు..

ముంబై దాడులు విజయవంతం కావడంతో హెడ్లీని లష్కరేతాయిబా సాయంతో అల్ ఖాయిదా నాయకుడు ఇల్యాస్ కశ్మీరీ సంప్రదించాడు. డెన్మార్ లోని జిల్లాండ్స్ పోస్టెన్ అనే పత్రిక 2005లో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా కార్టూన్ గీసిందని.. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరాడు. డెన్మార్క్ వెళ్లి ఉగ్ర లక్ష్యాలను సిద్ధం చేయాలని సూచించాడు. ఇందులోభాగంగానే డెన్మార్క్ వెళ్లిన హెడ్లీ 13 వీడియోలు తీశాడు. అక్కడే ఉన్న యూదులకు సంబంధించిన ఓ ప్రార్థనా మందిరంను కూడా వీడియో తీశాడు. ముంబైలో నారిమన్ హౌస్ పై దాడుల నేపథ్యంలోనే అలర్టయిన ఇజ్రాయెల్ నిఘా దళాలు.. డెన్మార్క్ లో హెడ్లీ తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. బ్రిటన్ కూడా హెడ్లీ కదలికలపై అనుమానం వ్యక్తం చేయడంతో అమెరికా కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పాక్ వెళ్తున్న హెడ్లీని అదుపులోకి తీసుకుని అతడి వద్దనున్న వీడియో ఫుటేజ్ పరిశీలించగా.. అందులో పత్రిక కార్యాలయం, యూదు ప్రార్థనామందిరాలకు సంబంధించిన వీడియోలు, డాక్యుమెంట్లు లభ్యం కావడంతో ఉగ్ర కుట్ర బయటపడింది. విచారణ సందర్భంలో భారత్ కు వెళ్లిన విషయంపై ఆరా తీయగా.. ముంబై దాడుల కుట్ర వెలుగు చూసింది. డెన్మార్క్ కుట్ర కేసులో హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది.

అమెరికా.. డ్రామా!

డెన్మార్క్ ఉగ్ర కుట్ర అంతా ఓ హెడ్లీ కాపాడేందుకు చేసిన కవర్ అని ఆ సమయంలో చాలా ఊహాగానాలు వచ్చాయి. భారత హోం సెక్రటరీ పిళ్లయ్ అమెరికా తీరును తీవ్రంగా ఎండగట్టారు. అమెరికా సహా అనేక దేశాల పత్రికల్లోనూ హెడ్లీని కాపాడేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నదని విమర్శలు వచ్చాయి. భారత దేశానికి హెడ్లీ వస్తే పాక్ లో అమెరికా చేసిన చర్యలన్నీ బయటపడుతాయని.. సైన్యంలో జోక్యం, ఉగ్రవాద శిబిరాలకు సాయం సహా భారత్ కు వ్యతిరేకంగా జరిగిన అనేక ఘటనల్లో చేసిన సాయం బయటకు వస్తుందనే భయంతోనే అమెరికా హెడ్లీని కాపాడుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.

బయటపడిన ఐఎస్ఐ పాత్ర

అమెరికా జైలులో ఉన్న హెడ్లీ 2016లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలోని ప్రత్యేక కోర్టుకు తన సాక్ష్యాన్ని అందించాడు. ముంబై 26/11 దాడిలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉన్నదని కుండబద్దలు కొట్టాడు. ఐఎస్ఐలో మేజర్ గా పనిచేస్తున్న ఇక్బాల్ తన హ్యాండ్లర్ అని, మరో మేజర్ సమీర్ అలీని కూడా కలిశానని ఇతడు కూడా దాడుల ప్రణాళిక భాగస్వామి అని పేర్కొన్నాడు. ఉగ్రవాదులకు శిక్షణ, ఆర్థిక మద్దతు ఐఎస్ఐ అందించిందని.. తనకూ 25వేల డాలర్లు అందాయని చెప్పాడు.

ముందే హెచ్చరించిన ఫైజా

హెడ్లీకి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అందులో రెండో పెళ్లి మొరాకో దేశానికి చెందిన ఫైజాతో లాహోర్ లో జరిగింది. అయితే, భర్త తీరుపై ఆమెకు అనుమానం ఉండేది. హెడ్లీ లేని సమయాల్లో అతడి కంప్యూటర్, డాక్యుమెంట్లు చూస్తే అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే ఆమె 2005లో అమెరికాలోని పాక్ ఎంబసీకి ఈ విషయాన్ని తెలిపింది. అయితే, అమెరికా అధికారులకు సమాచారం ఇచ్చారు తప్పితే ఎలాంటి విచారణ చేయలేదు. భారత్ కు తన భర్త ఎక్కువగా వెళ్తున్నాడని.. అక్కడ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తు్న్నాడని 2007లో నేరుగా ఎఫ్‌బీఐ కార్యాలయానికే వెళ్లి మరీ ఫైజా చెప్పింది. అయితే, హెడ్లీ అప్పటికీ పాక్ విషయంలో అమెరికాకు సహకరిస్తున్నాడన్న సానుభూతితో దీనినో భార్యాభర్తల మధ్య గొడవగానే అధికారులు కొట్టిపారేశారు. ఏడాది ముందుగానే ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం ఇచ్చినా.. అమెరికా అధికారులు పట్టించుకోలేదు. దాని ఫలితంగా 166మంది బలయ్యారు. అందులో ఆరుగురు అమెరికా పౌరులు కూడా ఉన్నారు.

హెడ్లీని ఎందుకు అప్పగించరు..

ప్లీ బార్‌గెయిన్ అగ్రిమెంట్: హెడ్లీ 2009లో అరెస్టు అయిన తర్వాత 2010 మార్చిలో 12 ఉగ్రవాద కుట్రలకు సంబంధించిన నేరాలను ఒప్పుకున్నాడు. దీంతోపాటు అమెరికా అధికారులతో సహకరించేందుకు ప్లీ బార్‌గెయిన్ కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కారణంగానే మరణశిక్ష నుంచి రక్షణ కల్పించడమే కాకుండా భారత్, పాక్ సహా ఇతర దేశాలకు అప్పగించేందుకు చట్టపరమైన అడ్డంకులు వస్తున్నాయి.

డబుల్ జియో పార్డీ: 1997లో భారత్-అమెరికా మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందంతోపాటు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని ఒకే నేరంపై రెండుసార్లు విచారణ చేయడం, శిక్ష విధించడం కుదరదు. ఇది కూడా చట్టపరమైన అడ్డంకిగా మారింది.

నిఘా సమాచారం: హెడ్లీ అమెరికాకు లష్కరేతాయిబాతోపాటు ఉగ్రవాద శిబిరాలు, ఐఎస్ఐ అధికారుల సమాచారం ఇచ్చాడు. పాక్ సంబంధించిన విషయాల్లో ఇంటెలిజెన్స్ పరంగా ఇతడు కీలకమైన అసెట్‌గా అమెరికా భావిస్తున్నది. ఇతడిని అప్పగిస్తే ఆ సమాచారం ఇతరులకు కూడా తెలిసే ప్రమాదం ఉన్నదని అనుమానిస్తున్నది.

తల్లిదండ్రుల డెత్ మిస్టరీ

హెడ్లీ అరెస్టయిన 2009లోనే అటు పాక్ లో తండ్రి సలీం సయ్యద్ గియానీ, ఇటు అమెరికాలో తల్లి ఏలిస్ ఇద్దరూ కొన్ని నెలల తేడాతో చనిపోయారు. ఈ విషయమై రెండు దేశాలు మౌనం వహిస్తున్నాయి. అవి సాధారణ మరణాలేనని పైకి చెప్తున్నా.. ఇంటెలిజెన్స్ మాజీ అధికారులు మాత్రం మిస్టరీ డెత్స్ గా అనుమానిస్తున్నారు. నిఘా సంస్థలతో అనుబంధం ఉన్న వారివే వారి కుటుంబసభ్యుల సాధారణ మరణాల కూడా వెనుక ఎన్నో అసాధారణ కారణాలు ఉంటాయని నర్మగర్భంగా చెప్తున్నారు.

Next Story

Most Viewed