Disha Special: జానపదానికి జేజేలు..! యూట్యూబ్‌లో దుమ్ములేపుతోన్న ఫోక్ సాంగ్స్

by Kema Shiva Kumar |

టాలీవుడ్ సంగీత ప్రపంచంలో గత కొంతకాలంగా ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది.

Disha Special: జానపదానికి జేజేలు..! యూట్యూబ్‌లో దుమ్ములేపుతోన్న ఫోక్ సాంగ్స్
X

టాలీవుడ్ సంగీత ప్రపంచంలో గత కొంతకాలంగా ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు సినిమా పాటల హవా కొనసాగేది. కానీ, ఇప్పుడు యూట్యూబ్ వేదికగా జానపద పాటలు ఊహించని రీతిలో దూసుకుపోతున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని జానపద పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో టాలీవుడ్ సినిమాలకు సైతం గట్టి పోటీనిస్తున్నాయి. ఎందుకంటే తెలుగు నెటివిటీకి దగ్గరగా.. పల్లె అందాలు, సంప్రదాయాలు, స్థానికతకు పెద్దపీట వేయడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, గత కొంతకాలంగా సినిమాల్లో వచ్చే సాంగ్స్ తెలుగు నెటివిటీని మిస్ అవ్వడమే కాకుండా, అర్థంపర్థం లేదని లిరిక్స్‌తో జనాలకు విసుగువచ్చేలా మ్యూజిక్ కంపోజిషన్ ఉండటం కూడా ఒక కారణం కావొచ్చు. ఒక సినిమాలో 5 నుంచి 6 పాటలు ఉంటే.. అందులో ఒకటో రెండో మాత్రమే జనాలకు నచ్చుతున్నాయి. దీనికి తోడు సినిమాల్లో ఐటం సాంగ్స్ కల్చర్ పెరిగిపోవడం, వల్గర్(అశ్లీలత, బూతులు) పెరిగిపోవడం వలన ఇంట్లోని వారు ఒకే చోట కూర్చోని చూడలేని, వినలేని స్థితికి టాలీవుడ్ సాంగ్స్ చేరుకున్నాయి. అందుకే జనాలు జానపద పాటలవైపు మొగ్గు చూపారనడంలో అతిశయోక్తి లేదు. - సాయికుమార్ కట్ట

‘జానపదం’ అనే పదం తెలుగులో ‘జన’ (ప్రజలు) మరియు ‘పద’ (పాట లేదా వచనం) అనే రెండు పదాల నుంచి వచ్చింది. జానపదం అనేది ‘ప్రజల పాట’ లేదా ‘ప్రజల సంగీతం’ అని అర్థం. ఇది ఒక సాంస్కృతిక వ్యక్తీకరణ. ఇందులో గ్రామీణ ప్రజల జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలు, భావోద్వేగాలు, కష్టసుఖాలు ప్రతిబింబిస్తాయి. జానపద పాటలు సాధారణంగా సరళమైన భాషలో, స్థానిక సంగీత లయలతో రూపొందుతాయి. ఇవి తరతరాలుగా సంక్రమిస్తూ వస్తుండగా.. జానపదం అనేది కేవలం సంగీతం లేదా కథనం మాత్రమే కాదు, అదొక గ్రామీణ జన సముదాయం యొక్క గుండె చప్పుడు, వారి జీవన సారాంశంగా పరిగణించవచ్చు.

జానపదమే.. సర్వజనుల పదం

మానవ జీవనశైలిలో మార్పులు, టెక్నాలజీ అధిక వినియోగం వలన ప్రజాజీవనం ఒత్తిడితో కూడిన సవాళ్లను ఎదుర్కొంటున్నది. మొన్నటివరకు సినిమా సంగీతం వింటూ వచ్చిన జనాలు.. ఎందుకో ఇదివరకటి మాధుర్యాన్ని పొందలేకపోతున్నారనేది ప్రధాన ఆరోపణ. సరిగ్గా అదే టైంకు యూట్యూబ్‌లో జానపదాలు మంచి అనుభూతిని కలిగించాయి. దీంతో వారి మైండ్ సెట్ మారింది. ఒక్కసారిగా ప్రజలకు వారి మూలాలను ఈ పాటలు తెలిసొచ్చేలా చేశాయి. పల్లెవాతావరణం, మాట్లాడే యాస, సొంతూరిపై మమకారం, లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా జానపదాలు సంక్లిష్టమైన సంగీతం లేకుండా, సరళమైన లయలతో, హృదయాన్ని తాకే భావాలు.. ప్రేమ, విరహం, ఆనందం, కష్టం వంటి అంశాలను కలగలిపి సామాన్యులను కట్టిపడేశాయి.

సినిమా పాటలకు తక్కువేమీ కాదు..

జానపదాలు ఇటీవలి కాలంలో సినిమా పాటలను బీట్ చేసే స్థాయికి చేరుకున్నాయి. మేకర్స్ సైతం డబ్బులకు వెనుకాడకుండా ఔట్‌పుట్ మీద పెద్దమొత్తంలో ఫోకస్ పెట్టడంతో సినిమా పాటల స్థాయిని అందుకుంటున్నాయి. గతంలో వచ్చిన ఫోక్ సాంగ్స్‌కు ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో కేవలం లోకల్ డప్పులు, గజ్జెల సప్పుళ్లతో మ్యూజిక్ రికార్డింగ్ అందించేవారు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం సినిమా ఆడియోకు ఎలా స్టూడియో రికార్డింగ్ ఉంటుందో.. వీటికి సైతం అదే రేంజ్ మెయింటేన్ చేస్తున్నారు. ఆధునికత కలబోసి జానపద పాటలను లేటెస్ట్ బీట్స్, డ్యాన్స్ వీడియోలతో మిక్స్ చేసి ప్రజలకు అందిస్తున్నారు. సినిమా పాటలతో పోటీ పడుతున్నందున నగరాల్లో ఒత్తిడితో కూడిన జీవనం, యాంత్రికత నుంచి తప్పించుకునేందుకు జనాలు గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించే జానపద పాటల వైపు మొగ్గుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో స్థానిక భాష, యాస, సంగీతం ద్వారా తమ గుర్తింపును చాటుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఫలితంగా జానపద పాటలకు క్రేజ్ పెరిగింది.

లోకల్ సాంగ్స్.. పొలిటికల్ జోష్

ఫోక్ సాంగ్స్‌కు ప్రస్తుతం ఎంతటి క్రేజ్ ఉందంటే పొలిటికల్ పార్టీస్ సైతం ఎన్నికల వేళ తమ ‘పార్టీ, అజెండా’ ప్రజలకు తెలిసేలా ప్రత్యేక పాటలను రాయించుకుని మరీ ఓట్లు అడిగేందుకు ప్రజల్లోకి వెళ్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో నాటి అధికార బీఆర్ఎస్ ‘గులాబీల జెండాలే రామక్క’ అనే సాంగ్‌ను తీసుకుని రాగా.. దానికి సుమారు 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎన్నికల టైంలో ఎవరిని కదిలించినా అదే పాట హమ్ చేస్తూ కనిపించేవారు. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం సీఎం రేవంత్ పేరు మీద ‘మూడు రంగుల జెండా వట్టి సింగమోలే కదిలినాడు’ అనే సాంగ్‌ను తెచ్చింది. నల్గొండ గద్దర్‌ (నరసన్న) పాడిన పాట ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లింది. దీనికి 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘అధికార పార్టీని నిగ్గదీసి అగిడే మొనగాడు’ అనే లిరిక్స్ ప్రజల్లోకి చేరువకావడం కూడా రాష్ట్రంలో అధికార బదిలీకి మరో కారణంగా చెప్పవచ్చు. ఇక ఏపీలోనూ వైసీపీ, తెలుగుదేశం పార్టీలు సైతం పోటాపోటీగా నల్గొండ గద్దర్ ద్వారా పాటలు ప్రత్యేకంగా పాడించుకుని ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అలా కింది స్థాయి ప్రజలను కదిలించేలా, తమవైపునకు తిప్పుకునేందుకు ఫోక్ సాంగ్స్ పొలిటికల్ పార్టీస్‌కు వరంలా మారాయి.

సినిమాల్లోనూ ఫోక్ సాంగ్స్ హవా..

సినిమాల్లోనూ ప్రస్తుతం ఫోక్ సాంగ్స్‌కు భలే క్రేజ్ పెరిగింది. మొన్నటివరకు ఐటం సాంగ్స్ మీద ఆసక్తి చూపించిన మ్యూజిక్ డైరెక్టర్స్ వాటి స్థానాన్ని జానపదాల మీదకు నెమ్మదిగా షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జనాల ఇంట్రెస్ట్ వారికి అర్థమైపోయింది. అందుకే ఐటం సాంగ్స్‌ ఇచ్చే కిక్కు కంటే ఫోక్ సాంగ్స్ ఇచ్చే కిక్కు వేరని సినీ నిర్మాతలు సైతం గుర్తించారు. అందుకే ఇటీవల ‘సారంగ దరియా’ (లవ్ స్టోరీ), ‘దిగు దిగు దిగు నాగా’(వరుడు కావలెను), ‘రాములో రాములా’(అల వైకుంఠపురంలో), ‘గున్నా గున్నా మామిడి’(రాజా ది గ్రేట్), ‘నాది నక్కిలీసు గొలుసు’ (పలాస),‘కాటమరాయుడా కదిరి నర్సింహుడా’ (అత్తారింటికి దారేది), ‘దారి చూడు దమ్ము చూడు’ (కృష్ణార్జున యుద్ధం) ‘ఆగట్టునుంటావా’ (రంగస్థలం), ‘బావొచ్చాడోలమ్మ’ (పలాసా), ‘వస్తానంటివో పోతానంటివో’ (శ్రీకారం) వంటి సినిమాల్లో ఏరికోరి మరి ఫోక్ సాంగ్స్‌ను పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు వాటికున్న క్రేజ్.

ఫోక్ సింగర్స్‌కు సినిమా చాన్సులు..

మొన్నటివరకు ఫోక్ సాంగ్స్ పాడిన సింగర్స్ ప్రస్తుతం సినిమాల్లోనూ చాన్సులు కొట్టేస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో జానపదాలు పాడిన మధుప్రియ(సంకాంత్రికి వస్తున్నాం), మంగ్లీ (అల వైకుంఠపురం), మౌనిక యాదవ్ (పుష్ప), లక్ష్మీదాస్ (పుష్ప-2), పెంచల్ దాస్ (కృష్ణార్జునయుద్ధం), సూరన్న (భీమ్లానాయక్), కిన్నెర మొగులయ్య (భీమ్లానాయక్), ఘంటల వెంకటలక్ష్మి (రంగస్థలం), శివనాగులు (రంగస్థలం) ఇప్పటికే వెండితెరపై తమ గాత్రానికి ఉన్న పవర్ ఏంటో చూపించారు. అప్ కమింగ్‌లో చాలా మంది యువ ఫోక్ సింగర్స్.. యూట్యూబ్ సింగర్స్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వారిలో శిరీష, కనకవ్వ, రామురాథోడ్, జంగిరెడ్డి సునీత, ఇంద్రవతి, ప్రభ, లావణ్య, దివ్యమాలిక, రోహిణి వంటి వారు ఉన్నారు. వీరికి కూడా త్వరలో సినిమా చాన్సులు వచ్చే అవకాశం లేకపోలేదు.

ఫ్యాషన్ కమ్ ఇన్‌కమ్ సోర్స్..

ఇటీవలి కాలంలో జానపద పాటలు ఫ్యాషన్‌తో చేసే వారికంటే ఫేమస్ అవ్వాలని.. ఆదాయ వనరు కోసం కూడా కొందరు యూట్యూబ్ వైపు మళ్లుతున్నారు. సొంతంగా యూట్యూబ్ చానెల్స్ క్రియేట్ చేసుకుని పెట్టబడి పెట్టి అంతకుమించి రెవెన్యూను పొందుతున్నారు. అందుకు యూట్యూబ్ ఓ మంచి ప్లాట్‌ఫాంగా ఉపయోగపడుతున్నది. కెరీర్ మొదట్లో రామురాథోడ్ అనే సింగర్.. ఒక జానపద సాంగ్ పాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా అది వైరల్ అయ్యింది. దీంతో జనాల పల్స్ అర్థం చేసుకున్న అతను యూట్యూబ్‌లో వరుసగా సాంగ్స్ అప్‌లోడ్ చేస్తూ లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు. తను సంపాదిస్తూనే నలుగురికి ఉపాధి సైతం కల్పిస్తున్నాడు. ఫోక్ సాంగ్స్ మీద తనకున్న ఫ్యాషన్.. ఇప్పుడు లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతోంది. తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏకంగా సినిమాల్లోనూ పాటలు పాడే స్థాయికి చేరుకున్నాడు. అలా చాలా మంది యూట్యూబ్ చానెల్స్ పెట్టుకుని ఫోక్ సాంగ్స్‌కున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. సొంత టాలెంట్ లేకపోయినా బయట పాటలు రాయించుకుని.. కంపోజ్ చేయించి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి రెవెన్యూ పొందుతున్నారు.

సినిమా పాటలు VS జానపదాలు..

జానపదాలకు ఉన్న క్రేజ్ వేరే.. ప్రస్తుత రోజుల్లో సినిమా సాంగ్స్ వచ్చినా వీటికి ఉన్న ఆదరణను పొందలేకపోతున్నాయి. మూవీ సాంగ్స్‌ను ప్రమోట్ చేసే చానళ్లకు సబ్‌స్క్రైబర్స్ మిలియన్లలో ఉన్నా ఆ పాటలకు పెద్దగా వ్యూస్ రాబట్టలేకపోతున్నాయి. ఇటీవలి కాలంలో తండేల్ మూవీలో (బుజ్జితల్లి సాంగ్-89మిలియన్స్), దేవర మూవీలో (చుట్టమల్లే సాంగ్-323 మిలియన్స్) మినహా ఏవీ అంతగా వ్యూస్‌ను రాబట్టలేకపోయాయి. కానీ, వీటిని ప్రమోట్ చేసే చానెళ్లు పేరుమోసిన మ్యూజిక్ సంస్థలవి. మిలియన్లలో వీటికి సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అయినప్పటికీ పెద్ద హీరోలు, బడా మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు కూడా గంటల నుంచి వారంలోపు కూడా మిలియన్ల వ్యూస్ రాబట్టలేకపోతున్నాయి. ఎందుకంటే వ్యూయర్స్‌కు ఏది కావాలో సినీ ఇండస్ట్రీ గుర్తించలేకపోవడమే కారణం. అలాంటిది ఫోక్ సాంగ్స్ మాత్రం అలా ఆన్‌లైన్‌లోకి రాగానే ఇలా మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. వీటిని ప్రమోట్ చేసే యూట్యూబ్ చానెళ్లకు పెద్దగా సబ్ స్కైబర్లు కూడా ఉండటం లేదు. మహాఅయితే 3 నుంచి 7లక్షలలోపే ఉంటున్నాయి. అయినప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. సాంగ్ విడుదలైన వారం నుంచి నెలలోపే మిలియన్ల వ్యూస్‌ను అందుకుంటున్నాయి. అందులో టాప్-10 సాంగ్స్‌ను ఒకసారి పరిశీలిద్దాం..

01. సొమ్మసిల్లి పొతున్నవే చిన్నరాములమ్మ -288 మిలియన్స్ (ఎంఎస్ అడ్డా)

02. ఓ పిలగ వెంకటేశ్ -250 మిలియన్ (భవ్య ట్యూన్స్)

03. రాను బొంబాయికి రాను -174 మిలియన్ (రాథోడ్ ట్యూన్స్)

04.శెనిగచేళ్ల నిలబడి -100+ మిలియన్స్ (ఈ96టీవీ ఫోక్)

05. బావళ్ల నా బావళ్ల -111+ మిలియన్స్ (సై టీవీ)

06. ఎర్రాఎర్రా రుమాల్ -119+మిలియన్స్ (కొండా వ్లాగ్స్)

07. తిన్నతిరం పడుతలే -100+ మిలియన్స్ (సై టీవీ)

08. ఉంగురం -86+ మిలియన్ (ఎంవీ మ్యూజిక్)

అవకాశాలు వస్తున్నాయ్..

గతంలో ఆర్టిస్టులు సినిమా చాన్సుల కోసం, ఇండస్ట్రీలో పేరు సంపాదించుకునేందుకు చాలా కష్టపడేవారు. అందులో కొందరికి మాత్రమే గుర్తింపు, అవకాశాలు దక్కేవి. కానీ, యూట్యూబ్ పుణ్యమా అని అటు సింగర్స్, గల్లీ డ్యాన్సర్స్‌‌కూ ఉపాధి, మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం కొందరు ఫోక్ సింగర్స్ మార్కెట్లో వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి ఒక్కో పాటకు రూ.20 నుంచి 50 వేలు వసూలు చేస్తుండగా.. ఫోక్ సాంగ్స్ పాడి సినిమాల్లో చాన్సులు దక్కించుకున్న మంగ్లీ, మధుప్రియ లాంటి వారు దాదాపు రూ.2 లక్షలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సింగర్ రామురాథోడ్ కెరీర్ మొదట్లో రూ.10వేలు తీసుకోగా.. ఇప్పుడు రూ.లక్ష వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇక డ్యాన్సర్స్ జాను లిరీ వాంటి వారు మొదట్లో రూ.20 వేలు తీసుకోగా.. ప్రస్తుతం ఒక్కరోజుకు రూ.50వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జాను లిరీ ‘ఢీ’ ప్రొగ్రామ్‌లోనూ పార్టిసిపేట్ చేసి విన్నర్‌గా నిలవడంతో అటు బయట ఈవెంట్స్, ఫోక్స్ సాంగ్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. యూట్యూబ్ మోస్ట్ ఫేం, డ్యాన్సర్ నాగదుర్గ సైతం కెరీర్ మొదట్లో రూ.20 వేలు చార్జ్ చేయగా.. ప్రస్తుతం ఒక రోజుకు రూ.50వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇలా వీరి బాటలోనే చాలా మంది ఫోక్ సింగర్స్, డ్యాన్సర్స్ వారికున్న క్రేజ్‌ను బట్టి అవకాశాలు, ఆదాయం పొందుతున్నారు. కొందరు షార్ట్ ఫిలిమ్స్, బుల్లితెరపైనా సందడి చాన్సులు దక్కించుకుని సందడి చేస్తు్న్నారు.

జబర్దస్త్ టు ఫోక్ సాంగ్స్..

ఫోక్ సాంగ్స్‌కు ఎంత క్రేజ్ లేకపోతే మొన్నటివరకు జబర్దస్త్ కామెడీ షోలో చేసే కమెడియన్ నూకరాజు.. సొంతంగా యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి మరీ తన భార్యతో కలిసి ఫోక్ సాంగ్స్ చేస్తున్నాడు. (నూకరాజు ఆసియా1425) చానెల్‌లో 4 నెలల కింద వచ్చిన (గుట్టకింద గుంపు చెట్ల నిండా) అనే సాంగ్ 25 మిలియన్స్ వ్యూ్స్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్‌ను స్వయంగా నూకరాజు పాడగా.. తన భార్యతో కలిసి స్టెప్పులు కూడా వేశాడు. ఈ సాంగ్‌కు మంచి ఆదరణ దక్కింది. దీంతో అతని భార్య ఆసియా వేరే ఇతర ఫోక్ సాంగ్స్‌లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. దీంతో నూకరాజు ఫ్యామిలీ యూట్యూబ్‌ను రెవెన్యూ ప్లాట్‌ఫాంగా ఉపయోగించుకుంటోంది. జానపదం కొందరికి రెవెన్యూ తెచ్చే అంశంగా కనిపిస్తుంటే.. మరికొందరికి అది కేవలం సంగీతం కాదు. అదొక జీవన విధానం, సంస్కృతిని ప్రతిబింబించే గొంతుక. అయితే, ఆధునికతలోనూ వీటికి ఆదరణ పెరగడానికి అనేక కారణాలున్నాయి. ప్రజలు తమ మూలాలను, మట్టిని గౌరవించడంతో పాటు, ఆ గతాన్ని కొత్త రూపంలో ఆస్వాదించాలనే తపనే నేడు జానపదాలకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం.

Next Story