- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dish Special: జనరిక్ మెడిసిన్.. సేమ్ క్వాలిటీ.. తక్కువ ధర!
సునీల్‌కు నీరసంగా ఉంటుండటంతో డాక్టర్ వద్దకు వెళ్లాడు.

సునీల్‌కు నీరసంగా ఉంటుండటంతో డాక్టర్ వద్దకు వెళ్లాడు. పరీక్షల్లో షుగర్ వ్యాధి ఉన్నదని తేలింది. వ్యాధిని అదుపులో ఉంచేందుకు వైద్యుడు గ్లిమ్ ప్రైడ్ 2 ఎంజీ+ మెట్ ఫార్మిన్ 500ఎంజీ కాంబినేషన్ మాత్ర వాడాలని సూచించాడు. దానిని ఆ ఆస్పత్రిలోనే ఉన్న మందుల దుకాణంలో కొంటే నెలకు సరిపడా మాత్రలకు దాదాపు రూ.1000 బిల్లు అయ్యింది. ప్రతి నెలా ఒక రకం గోళీలకే ఇంత బిల్లు అయితే, మిగితావి కొనాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడ్డాడు సునీల్.
అనిల్ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. షుగర్ వ్యాధికి గోళీలకు ప్రతినెలా భారీగా డబ్బులు ఖర్చు అవుతున్నాయని తన మిత్రుడు కలిసి చెప్పుకుని బాధపడ్డాడు. అతడు వెంటనే సమీపంలోని జనరిక్ మందుల దుకాణానికి తీసుకువెళ్లి గ్లిమ్ ప్రైడ్ 2 ఎంజీ+ మెట్ ఫార్మిన్ 500ఎంజీ కాంబినేషన్‌లో 15 మాత్రలు ఉన్న ఒక షీట్ కు రూ.30 చొప్పున 4 షీట్లను రూ.120కి ఇప్పించాడు. తనకు అయ్యే ఖర్చులో దాదాపు 10శాతమే కావడంతో ఆశ్చర్యపోయాడు. కానీ, ఈ మందులు వాడితే పనిచేస్తాయో? లేదోనన్న అనుమానం మొదలైంది. అందుకే అవి సగం ఇవి సగం వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
60 ఏండ్ల ప్రమీల బీపీ వ్యాధితో బాధపడుతున్నది. ఆమెకు అమ్లోడపీన్ 5 ఎంజీ అనే మాత్రలు వాడాలి. 10 మాత్రలు ఉండే షీట్‌కు రూ.50నుంచి రూ.100వరకు అవుతుంది. అయితే, ఆమె కొడుకు జనరిక్ మందుల షాపులోకి తీసుకెళ్లి రూ.5 ఒక షీటు తీసుకువచ్చాడు. అంత తక్కువ ధర ఉన్న మందులు తెచ్చేసరికి ఆమె అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ధరతో సంబంధం ఉండదని.. ఫార్ములా మాత్రమే చూసుకోవాలని చెప్పినా ఆమె ససేమిరా అనడంతో రూ.100 ధరతో మాత్రలు తెచ్చేసరికి ఆమె శాంతించింది.
ఈ మూడు సందర్భాల్లో ఒకే రకం ఫార్ములా ఉన్న మందులకు ధరల్లో ఇంత వ్యత్యాసం ఎలా సాధ్యమైంది. అసలు జనరిక్ మందులు వాడటం సరైందేనా? జనరిక్ GENERIC అంటే నాసిరకం గోళీలు అన్న వాదన ఎంతవరకు నిజం? మరి ప్రభుత్వం కూడా జనరిక్ మందులను ఎందుకు ప్రోత్సహిస్తున్నది? మనకు చికిత్స చేసే వైద్యులు మాత్రం జనరిక్ షాపుల్లోని మందులను ఎందుకు రిఫర్ చేయడం లేదు.? జనరిక్ మందులపై నిజానికి బోలెడన్ని సందేహాలు ఉన్నాయి. ఇవి వాడితే జబ్బులు తగ్గుతాయా? తక్కువ ధరకు తయారైన మందుల్లో బలం ఎలా ఉంటుందని దబాయించేవాళ్లు కూడా లేకపోలేదు. కానీ, మీరో నిజాన్ని మరిచిపోతున్నారు. కాదు.. కాదు.. మనకి తెలియకుండా చేస్తున్నారు. ఎందుకంటే మనం వాడుతున్న మందులన్నీ దాదాపు జనరిక్ మందులే.. ఇది పచ్చినిజం. పెద్ద పెద్ద కంపెనీల పేర్లతో మందులు అమ్ముతున్నా.. వాటిని బ్రాండెడ్ జనరిక్ అంటారే తప్ప.. అవి ఆవిష్కరించినవి ఏమాత్రం కావు. పైగా మందుల ఫార్ములా కనిపెట్టిన కంపెనీకి ఎల్లకాలం సొంతంకాదు. ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఎవరైనా దానిని సొంతంగా తయారు చేసుకోవచ్చు. భారతదేశంలో ఇందుకు చట్టబద్ధత ఉన్నది. ఈ నేపథ్యంలో అసలు జనరిక్ అంటే ఏమిటి? బ్రాండెడ్ జనరిక్ అంటే ఏమిటి? ఒరిజినల్ ఫార్ములాలను ఏ దేశాల్లో తయారు చేస్తున్నారు? అక్కడ తయారైన మందులు మన ఒంటికి ఎలా పడుతున్నాయి? ఈ అంశాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం. - ఎస్పీ హరీశ్
ఒరిజినల్ ఫార్ములాను మార్చకుండా అదే కాంబినేషన్‌లో మందులను తయారుచేయడాన్ని జనరిక్ అంటారు. అంటే కాపీ కొట్టడం అన్నమాట. ఒక వ్యాధి నివారణకు మందు తయారు చేయాలంటే విస్తృత పరిశోధన అవసరం. ఎంతోమంది రోగుల డేటాను వారి వయస్సు, ఇతర వ్యాధుల సంక్రమణ, రోగ నిరోధకశక్తి వంటి అంశాల ఆధారంగా సేకరించాల్సి ఉంటుంది. ఇందుకు వందలకోట్ల ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ మందు తయారీకి వాడే మూలకాలను యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ అంటారు. అవి సరైన పాళ్లలో వాడుతూ వ్యాధి తగ్గుతున్నదా? ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా? అన్నది చెక్ చేయాలి. ఇలా చేసేందుకు ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. ఇదంతా పూర్తయ్యాక ప్రభుత్వ పర్యవేక్షణలో మూడు దశల్లో చేసే క్లినికల్ ట్రయల్స్‌కు కూడా కనీసం 5నుంచి 7ఏళ్లు పడుతుంది. ఇలా ఎన్నో వ్యయం, సమయం వెచ్చించాల్సి వస్తుంది కాబట్టే ఒరిజినల్ మందులకు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
మార్కెట్‌లోకి మందును రిలీజ్ చేసే పూర్తి ఫార్ములాను సదరు కంపెనీ ప్రభుత్వానికి అప్పగిస్తుంది. దీనికి పేటెంట్ తీసుకుంటుంది. ఈ పేటెంట్ కాలపరిమితి పూర్తయ్యాక ప్రభుత్వం ఫార్ములాను విడుదల చేస్తుంది. అప్పుడు మందుల తయారీలో అనుభవం ఉన్న ఎవరైనా దానిని అదే ఫార్ములాతో తయారు చేసుకోవచ్చు. దానినే జనరిక్ అంటారు. ఇలా తయారైన మందులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) పరీక్షిస్తుంది. అన్ని రకాల ట్రయల్స్‌లో పాసయితేనే ఆ మందు మార్కెట్ లో రిలీజ్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. ఈ మందులు వందకు వందశాతం ఒరిజినల్ మందులతో సమానంగా పనిచేస్తాయి. ఈ మందుల్లో ఒకే రకమైన పదార్థాలు ఒకే రకమైన మోతాదుల్లో ఉంటాయి. అందుకే వీటిని బయో ఈక్వివలెన్స్ అంటారు. తొలుత 2008లో UPA ప్రభుత్వం ‘జన్ ఔషధి పథకం’ను ప్రవేశపెట్టింది, దీని లక్ష్యం జనరిక్ మందులను సరసమైన ధరలో ప్రజలకు అందించడం. ఈ పథకాన్ని 2015లో మోదీ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన’గా మార్చి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింది.
డాక్టర్లు ఎందుకు రికమెండ్ చేయరు?
వైద్యులు మందుల పేర్లు రాయకుండా కేవలం కాంబినేషన్ మాత్రమే రాయాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించే ఆస్పత్రులు మందుల పేర్లు రాసినా.. వాటి కాంబినేషన్ తప్పనిసరిగా పేర్కొంటాయి. అందరికీ అర్థమయ్యేలా కంప్యూటర్ ప్రింటవుట్స్ ఇస్తుంటాయి. అయితే, జనరిక్ మందుల నాణ్యత విషయంలో చాలామంది వైద్యులకు విశ్వాసం ఉండకపోవడం కూడా ఓ కారణంగా చెప్తారు. అయితే, కొన్ని బ్రాండెడ్ మందులు వాడిన పేషెంట్లకు వ్యాధి త్వరగా నయం కావడాన్ని గమనించి.. వాటిని రిఫర్ చేసే అవకాశం కూడా ఉన్నది. బ్రాండెడ్ మందుల కంపెనీలు వైద్యుల వద్ద రిప్రజెంటేటివ్స్ పంపి ప్రచారం చేస్తుంటాయి. కొన్నిసార్లు వాళ్లు ఇచ్చే ఇన్సెంటివ్స్‌కు కూడా వైద్యులు ప్రలోభాలకు గురికావచ్చు. అయితే, క్లిష్టమైన కేసుల విషయంలో వైద్యులు తప్పనిసరిగా బ్రాండెడ్ మందులవైపే మొగ్గు చూపుతారు. కొన్ని సందర్భాల్లో ఒకశాతం కూడా రిస్క్ తీసుకోరు. కేంద్రప్రభుత్వం జనరిక్ మందుల వాడకాన్ని ప్రోత్సహిస్తుండటంతో చాలామంది వైద్యులు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
మార్కెట్‌లో అనేక నకిలీ వస్తువులు చెలామణి అవుతుంటాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో బ్రాండెడ్ షాపుల్లో తప్పితే ఎక్కడా కొనేందుకు మొగ్గుచూపరు. ఎందుకంటే ఇప్పుడు అమీర్‌పేట్, అల్వాల్, ఎర్రగడ్డవంటి ప్రాంతాల్లో రోడ్డు పక్కన నిలబడి వచ్చిపోయే వాళ్లకు ఐపాడ్స్, ఒరిజినల్ వన్‌ప్లస్, వీవో ఫోన్లు అని అమ్మే ప్రయత్నం చేస్తుంటారు. ఒరిజినల్ వస్తువు ధర రూ.20 వేల వరకు ఉంటే రూ.2 నుంచి 3 వేలకే ఇచ్చేస్తారు. తీరా ఇంటికి వెళ్లి చూస్తే అంతా డొల్లే. ఇలాంటి అనుభవాలు మనకు చాలా ఉండటంతో వైద్యం విషయంలో జాగ్రత్తగా ఉంటాం. అందుకే తక్కువధరకు మందులు వస్తున్నాయంటే వెంటనే కొనేందుకు కొంత ఆలోచన చేస్తాం. జనరిక్ విషయంలోనూ ఇదే జరుగుతున్నది. కానీ, ఏ మందులు కొనుగోలు చేస్తున్నా.. ముఖ్యంగా ఇవి చెక్ చేసుకోవాలి.
1. రెగ్యులేటరీల ఆమోదం: భారతదేశంలో మందుల విక్రయానికి కచ్చితంగా CDSCO సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం ఉందా లేదా? అన్నది తెలుసుకోవాలి. ప్రతి జనరిక్ మందుపై సంస్థ ఆమోదం తెలిపినట్లు వివరాలు ఉంటాయి. ఒకవేళ లేకపోయినా.. సరిగ్గా అర్థం కాకపోయినా.. ఆన్ లైన్ లో చెక్ చేసినా తెలిసిపోతుంది. సంబంధిత జనరిక్ మందుల దుకాణాదారును ఈవిషయం అడిగినా అతడు ఆన్ లైన్ లో ఆ వివరాలు చూపిస్తాడు.
2. కంపెనీ గుర్తింపు : ముందుగా కొనుగోలు చేస్తున్న మందులను ఏ కంపెనీ తయారు చేసిందో చెక్ చేయాలి. ఆ కంపెనీకి మార్కెట్‌లో గుర్తింపు ఉన్నదా? లేదా? తెలుసుకోవాలి. కొన్ని కంపెనీలు కలుషిత ఔషధాల విషయంలో కొన్ని వివాదాలు ఉండే అవకాశం ఉన్నది. అలాంటి వాటిని తీసుకోకపోవడం ఉత్తమం. దీనితోపాటు గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ ఉన్నదో? లేదో? చెక్ చేసుకోవాలి.
3. సర్టిఫైడ్ ఉత్పత్తులు: మందులే కాకుండా ఇమ్యూనిటీ బూస్టర్లుగా పనిచేస్తాయని మందుల షాపుల్లో ఎన్నో ఉత్పత్తులు అమ్ముతుంటారు. వాటిని DCGI (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) ఆమోదించిందా? లేదా? అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకున్నాకే తీసుకోవాలి.
* ఈ జాగ్రత్తలు కేవలం జనరిక్ మందులు కొనుగోలు చేసినప్పుడే కాకుండా బ్రాండెడ్ షాపులో కొనుగోలు చేస్తున్న మందుల విషయంలోనూ పాటించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్న విషయాన్ని మరిచిపోవద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా లేకపోతే.. చివరికి ఇబ్బంది పడేది మనమే అన్న సంగతిని గుర్తుంచుకోవాలి.
బ్రాండెడ్ జనరిక్ కంపెనీలు
దేశంలో జనరిక్ మందులు తయారుచేసే ప్రధానమైన కంపెనీలు ఉన్నాయి. మార్కె్ట్‌లో వాటికి ఉన్న పేరు, బ్రాండింగ్ ఆధారంగా అవి జనరిక్ షాపుల్లో కన్నా ఎక్కువ ధర వసూలు చేస్తాయి. కానీ, ఫార్ములా అంతా ఒక్కటే. నీరసంగా ఉన్న వ్యక్తిని డాక్టర్ పాలు తాగమని చెప్పాడని అనుకుందాం. ఆ వ్యక్తికి మార్కెట్‌లో ఐదారు రకాల పాల ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. వెన్నశాతం లేనిపాలు, మీగడపాలు, ప్రొటీన్ పాలు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. అలాగే వాటి ధరలు కూడా చాలా తేడా ఉంటాయి. ఇదేరకంగా మందుల్లోనూ బ్రాండెడ్ మందులు ఎక్కువ ధరను వసూలు చేస్తున్నాయి. దేశంలో ప్రధానమైన జనరిక్ మందులు తయారుచేసే బ్రాండెడ్ కంపెనీల్లో సన్ ఫార్మాస్యూటికల్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, అరోబిందో ఫార్మా, సిప్లా, జైడస్ కాడిలా, టొరెంట్, గ్లెన్‌మార్క్, అల్కెమ్, మ్యాన్‌కైండ్ ప్రముఖమైనవి. ఒక మందు ఫార్ములాను కనిపెట్టింది ఒరిజినల్ మందుగా పేర్కొంటే.. వీటిని బ్రాండెడ్ జనరిక్ గా పిలుస్తారు. ఈ కంపెనీలు ఒరిజినల్ మందు ధరలో సగానికి ఇస్తుంటే.. బ్రాండింగ్ లేని కంపెనీలు 10శాతానికే మందులు విక్రయిస్తాయి. అందుకే ధరల్లో ఇంత తేడా ఉంటున్నది.
జనరిక్ మందుల చరిత్ర
మనదేశంలో జనరిక్ మందులకు సంబంధించిన విధానం అధికారికంగా 1970లో ప్రారంభమైంది. భారత పేటెంట్స్ చట్టం 1970తో జనరిక్ ఔషధాల ఉత్పత్తికి బీజం పడింది. దీనిని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం, ఔషధాలకు ‘ప్రొడక్ట్ పేటెంట్’ కాకుండా ‘ప్రాసెస్ పేటెంట్’ మాత్రమే ఇచ్చారు. అంటే, ఒక ఔషధాన్ని వేరే పద్ధతిలో తయారు చేస్తే, అది పేటెంట్ ఉల్లంఘన కాదు. ఈ విధానం వల్ల భారతీయ కంపెనీలు బ్రాండెడ్ ఔషధాలను రివర్స్ ఇంజినీరింగ్ చేసి, తక్కువ ఖర్చుతో జనరిక్ వర్షన్‌లను అందుబాటులోకి తెచ్చాయి. కొద్ది కాలానికే ఈ చట్టం భారతదేశాన్ని ‘ప్రపంచ ఫార్మసీ’గా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.
1970 భారత పేటెంట్స్ చట్టం అమలులోకి వచ్చిన వెంటనే భారతీయ ఫార్మా కంపెనీలు జనరిక్ మందులను తయారు చేయడం ప్రారంభించాయి. ఈ సమయంలో సిప్లా, రాన్‌బాక్సీ (ప్రస్తుతం సన్ ఫార్మాలో ఒక భాగం), డాక్టర్ రెడ్డీస్ వంటి కంపెనీలు జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో పోటీ పడ్డాయి. 1990 నాటికి జనరిక్ మందుల ఉత్పత్తి వేగంగా పెరిగింది. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, యాంటీ-రెట్రోవైరల్స్ (HIV చికిత్స కోసం), ఇతర దీర్ఘకాల వ్యాధుల ఔషధాలు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. 2005 తర్వాత భారతదేశం WTO (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)లోని TRIPS (Trade-Related Aspects of Intellectual Property Rights) ఒప్పందానికి అనుగుణంగా పేటెంట్ చట్టాలను సవరించినప్పటికీ, జనరిక్ ఉత్పత్తి కొనసాగింది, ఎందుకంటే పేటెంట్ గడువు ముగిసిన ఔషధాల తయారీకి అనుమతి ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఒక ఔషధానికి పేటెంట్ సాధారణంగా 20 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఔషధం ఆవిష్కరించిన తేదీ నుంచి లేదా పేటెంట్ కు దరఖాస్తు చేసిననాటినుంచి లెక్కిస్తారు. అయితే, 1970 నుంచి 2005 వరకు భారతదేశంలో ఈ కాల పరిమితి 5నుంచి ఏళ్ల వరకు మాత్రమే ఉండేది. దీంతో జనరిక్ మందుల ఉత్పత్తి వేగవంతం అయ్యింది. 2005 తర్వాత TRIPS ఒప్పందం అమల్లోకి రావడంతో భారతదేశం కూడా ఔషధాలకు 20 సంవత్సరాల ప్రొడక్ట్ పేటెంట్‌ను అనుసరించాల్సి వస్తున్నది. అయితే, పేటెంట్ గడువు ముగిసిన తర్వాత లేదా ‘కంపల్సరీ లైసెన్సింగ్’ (సదరు పేటెంట్ కంపెనీ అనుమతితో) ద్వారానే జనరిక్ వర్షన్‌లను తయారు చేయడానికి అనుమతి ఉంది. 2012లో భారతదేశం మొదటి కంపల్సరీ లైసెన్స్‌ను నాట్కో ఫార్మాకు ఇచ్చింది. దీనిద్వారా బేయర్ కంపెనీ ఆవిష్కరించిన క్యాన్సర్ ఔషధం జనరిక్ వెర్షన్‌ను తయారు చేసింది. ఫలితంగా ధర 97% తగ్గింది.
ఆవిష్కరణలన్నీ అగ్రదేశాల్లోనే..
కొత్త ఔషధాల ఆవిష్కరణలో అగ్రదేశాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రపంచంలో సుమారు 50శాతం కొత్త ఔషధాలు అమెరికాలో కనుగొంటున్నారు. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, మెర్క్ వంటి కంపెనీలు ప్రముఖమైనవి. యూరప్ లో నోవార్టిస్, జర్మనీలో బేయర్, యూకేలో గ్లాక్సో స్మిత్ క్లైన్, ఆస్ట్రాజెనెకా ఉన్నాయి. ఇటీవల చైనాలోనూ కొత్త ఔషధాలపై విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నది. ఆ దేశానికి చెందిన సినోఫార్మ్ కంపెనీ ఆవిష్కరణలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.
డయాబెటిస్ చికిత్సలో వినియోగించే మెట్ ఫార్మిన్‌ను ఫ్రాన్స్, ఇన్సులిన్‌ను కెనడా, బీపీకి వాడే ఏస్ ఇన్ హిబిటార్స్‌ను అమెరికా, బీటా బ్లాకర్స్ యూకే లో కనుగొన్నారు. చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే అక్కడ ఆవిష్కరించిన మందులు మనకు పనిచేస్తాయా? అక్కడి పరిస్థితులు, జన్యుమార్పులు, వాతావరణం, ఆహారం వేరు అన్న వాదన ఉన్నది. అందుకే CDSCO ఆ మందులను భారతీయులకు సరిపోయేలా మార్పులు సూచిస్తుంది. యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ)తోపాటు డోసులను మార్చుతుంది. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్టులను కూడా ముందుగానే రోగులకు చెప్పేలా వైద్యులకు నిర్దేశం చేస్తుంది. అందుకు అనుగుణంగా అదనపు మందులను ఇవ్వాలని సూచించింది. అందుకే అమెరికాలో మెట్‌ఫార్మిన్ 15 టాబ్లెట్ల షీట్ 100 డాలర్లు (మన కరెన్సీలో 8500) ఉండగా.. మన వద్ద జనరిక్ షాపుల్లో రూ.30లోపే ఇచ్చేస్తున్నారు. పైగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) భారతదేశంలో అత్యవసర ఔషధాల ధరలను నియంత్రిస్తుంది. డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులకు వాడే మందులు ఎసెన్షియల్ మెడిసిన్స్ జాబితాలో ఉంటాయి, కాబట్టి వాటి ధరలు పరిమితంగా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది.






