తియ్యని ట్రాప్‌లో.. తీరొక్క కథలు!

by Sujitha Rachapalli |

చాటింగ్‌తో చీటింగ్.. వీడియో కాల్‌తో లూటింగ్.. బోర్ కొడ్తుందా అంటూ బోల్తా కొట్టిస్తరు.. మత్తెక్కించే మాటలతో జేబులకు చిల్లు పెడుతరు.. లస్ట్ మాయలో లక్షణమైన కెరీర్ ఆగం.. సొసైటీలో టాప్‌లో ఉన్నా ట్రాప్‌లకు బలి.. తియ్యని మాటలకు సాంతం హరీ..

తియ్యని ట్రాప్‌లో.. తీరొక్క కథలు!
X

దిశ, ఫీచర్స్ : జమానా చాలా మారిపోయింది. జనాలు పై పై ఆనందాలకు పడిపోతున్నారు. కమ్మగా మాట్లాడితే కరిగిపోతున్నారు. తియ్యగా తేనె పూసి మాట్లాడితే హాయి పొందుతున్నారు. మాయా ట్రాప్‌లో పడి నిండా మునిగిపోతున్నారు. థ్రిల్లు కోసం పాకులాడి జేబుకు చిల్లు పొడుచుకుంటున్నారు. అవాంఛిత ఆనందాల ట్రాప్‌లో పడి ఇల్లు, సంసారం ఆగం చేసుకుంటున్నారు. చాటింగ్ పేరుతో చీటింగ్.. వీడియో కాలింగ్‌తో లూటింగ్ అవుతున్నారు.

తియ్యటి మాటలకు తిక్కలోడైపోయాడా?

ఒకతను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్.. పెద్ద జీతం.. కెరీర్ మంచి ట్రాక్ మీదుంది.. అన్నీ ఉన్నాయి కదా? ఇప్పుడు మనోడికి ఆనందం కావాలి. అదే పరమానందం కావాలి. దాని కోసమే ఆలోచిస్తుండగా ఓ అమ్మాయితో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఆన్‌లైన్ పరిచయమంటే.. కథ ఎట్లుంటదో తెలుసు కదా? అయ్యగారి ఆత్రాన్ని వెంటనే పసిగట్టింది ఆ అమ్మాయి. రోజూ తనతో ఫోన్‌లో గంటల కొద్దీ మాట్లాడేలా చేసుకుంది. తియ్యగా మాట్లాడేసరికి తిక్కలోడైపోయాడు మనోడు. మత్తెక్కిన మగాడిలా మారిపోయాడు. పిచ్చి పీక్స్‌లోకి వెళ్లిపోయి పీకల్లోతు మునిగిపోయాడు. ఆనంద లోకంలో విహరిస్తూ జేబు బరువును మర్చిపోయాడు. మోజులో పడిపోయి మొదటికే మోసం చేసుకున్నాడు. కట్ చేస్తే అదొక హనీ ట్రాప్. సారువాడు సాంతం సమర్పించుకున్నాకే మేలుకున్నాడు.

గుండె నిండా గుడి గంటలు మోగినట్లేనా?

ఇదింకా గమ్మతి ముచ్చట. కడప జిల్లా బద్వేల్‌‌లోని గూడెం గ్రామానికి చెందిన అశోక్‌కు ఇన్‌‌స్టాగ్రామ్‌లో పూజిత రెడ్డి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మనోడు వెల్ సెటిల్డ్. మంచి శాలరీ.. మంచి పొజిషన్లో ఉన్నాడు. డబ్బుకు కొదువలేదు. ఇలాంటి సమయంలో పూజిత తన గుండె నిండా గుడి గంటలు మోగిస్తూ రావడంతో ఉబ్బి తబ్బి పోయాడు. నిన్నా ఇయాల కాదు 2023లో ఏర్పడిన పరిచయం ఇది. మూడేళ్లు గడిచాయి. ఈ మూడేళ్లలో మనోడు ఒక్కసారి కూడా పూజిత మొఖం చూడలేదు. తియ్యని కబుర్లకు కక్కుర్తిపడి కాలాన్నే మర్చిపోయాడు. అడిగినప్పుడల్లా అకౌంటుకు డబ్బులు సమర్పించుకున్నాడు. కట్ చేస్తే.. అసలు పూజిత రెడ్డి అనే అమ్మాయే లేదు. అదొక ఫేక్ ఇన్‌స్టా అకౌంట్. అది కూడా అశోక్ వాళ్ల ఊరికి చెందినోడే.. అది కూడా తెలిసిన వ్యక్తే క్రియేట్ చేసింది.

ఆనంద విహారంలో అంత మజానా?

ఎట్లుంది అశోక్ సారువాడి ఆనంద గుళిక. గూబ గుయ్యిమన్నది కదా మనోడికి. అయ్యగారు లేని పూజిత కోసం మొత్తం సమర్పించుకున్నది ఎంతో తెలుసా? 81 లక్షల 67 వేలు. తియ్యగా మాట్లాడేసరికి మనోడికి స్వర్గంలో తేలుతున్నట్లు.. రంభా ఊర్వశిలతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. లెక్కాలేదు పత్రం లేదు. ఎంత అడిగితే అంత.. ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు హుండీలో వేస్తూనే వెళ్లాడు. ఒకసారి కాకపోతే ఒకసారి ‘పూజితా.. నీ మొఖం చూడకపోతీ.. ఒకసారి కలుద్దాం’ అని అడిగే సాహసం చేయలేకపోయాడు. ‘వద్దు’ అని వయ్యారంగా మాట్లాడగానే మనోడు ఆనంద డోలికల్లో విహరిస్తూ ఊహా ప్రపంచంలో ఏండ్లకేండ్లు బతికాడు. తేనె అంతా అయిపోయాక తేరుకొని అయ్యో మోసపోయాను అని శోకసముద్రంలో మునిగిపోతే ఏం ఫాయిదా అశోకూ?

మత్తెక్కి చిత్తయ్యేదాక చూసుకోరా?

జనాలను బురిడీ కొట్టించడానికి కేటుగాళ్లు రకరకాల పద్ధతులు వాడుతున్నారు. ఒకరకంగా చేపలకు వలేసినట్లు వేస్తున్నారు. ఏ చేప దొరికితే ఆ చేపను పొట్టు పొట్టు రాకి కోసి కారం పెడుతున్నారు. పక్కోడికి కూడా ఇట్లా జరిగిందని చెప్పుకోలేకుండా అయిపోతుంది పరిస్థితి. వెనక్కి అయితే అస్సలు రాలేం. ముందుకు వెళ్లడం ఒక్కటే మార్గం. ట్రాప్‌లోనే క్రాక్ అయిపోవడమే. కమ్మని కబుర్లకు కాసులు సమర్పించుకోవడమే. సొల్లు కారుస్తూ సొంగ తుడుచుకోవడమే. మాయ మాటలకు మత్తెక్కిపోయి చిత్తయ్యేదాక చూసుకోవడమే ఇక చేసేదేం లేదు. ఒకప్పుడు చదువురాని వాళ్లు ఇలా నిండా మునిగేవాళ్లు. కానీ ఇప్పుడు చదువుకున్నవాళ్లే ఉంటున్నారు. వాళ్లెంత టాప్‌లో ఉన్నా ట్రాప్‌కు బలైపోతున్నారు.. వయసుతో కూడా సంబంధం లేకుండా ఆగమైతున్నరు.

ఊ కొట్టాలిగానీ ఉహూ అంటారా?

వయసు ప్రస్తావన వచ్చింది కాబట్టీ ఇప్పుడొక తాత సంబరం గురించి చూద్దాం. అమీర్‌పేటకు చెందిన 81 సంవత్సరాల వృద్ధుడు రామా..కృష్ణా.. అంటూ శేష జీవితాన్ని గడుపుతున్నాడు. పిల్లలంతా ఎక్కడోళ్లక్కడ సెట్ అయ్యారు. మనవలు.. మనవరాండ్లకు కూడా పెండ్లిళ్లయ్యి పిల్లలు కూడా అయ్యారు. అట్లా ఒంటరిగా గత జ్ఞాపకాలతో బతుకుతున్న ఈ తాతకు ఉన్నట్టుండి ఒకరోజు ఒక కాల్ వచ్చింది. ఫోన్లో మాట్లాడింది ఒక 30 ఏండ్ల యువతి. తన పేరు మాయా రాజ్‌పూత్‌గా పరిచయం చేసుకుంది. అలా ప్రతి రోజూ కాల్స్, వాట్సప్ వీడియో కాల్స్ వస్తున్నాయి. తాతకు ఇదంతా అర్థం కాలేదు. ముసలితనానికి కుసుమ గుడాలు ఎందుకు అనే ఆలోచనే రాలేదు. కమ్మని మాటల మాయలో పడిపోయాడు. ఊ కొడుతున్నాడేగానీ ఉహూ అనడం లేదు.

ముసలి తాతకు ముచ్చెమటలా?

‘బోర్ కొడుతుందా’ అనగానే తాతగారు బోల్తా పడిపోయారు. ‘ఒంటరిగా ఫీలవుతున్నారా’ అని వేసిన తుంటరి వేషాలకు తన మనసును తునా తునకలు చేసుకున్నాడు. కానీ ఏ ఒక్కనాడు కూడా ‘ఏయ్ ఎవరు నువ్వూ.. నాతో నీకేం పనీ? అసలు నా నెంబర్ నీకెవరు ఇచ్చారు’ అని ఒక్కసారి కూడా అడగలేకపోయాడు. కథ మాంచి ఊపు మీదికొచ్చింది. తాతను పైసలు అడగడం మొదలు పెట్టారు. అతడు మాట్లాడిన వీడియో కాల్స్ క్లిపింగ్స్‌తో అతడు సదరు యువతితో శృంగారంలో పాల్గొన్నట్లు వీడియో క్రియేట్ చేసి లక్షల రూపాయలు గుంజారు. అలా మన తాతగారు రూ. 7.11 లక్షలు సమర్పించుకున్నారు. ఎవరికి చెప్పుకోగలడు? ఏమని చెప్పుకోగలడు? చూశిండ్రు కదా తియ్యటి తేనె మాటలు 80 ఏళ్ల ముసలి తాతకు ముచ్చెమటలు ఎట్లా తెప్పించాయో?

డబ్బులు కడితే అంతా చూడొచ్చనా?

ఈ మధ్య ఓ యాంకర్ లొల్లి నడుస్తోంది కదా? అదెందుకనుకుంటున్నారు? అందాల ఆరబోత కార్యక్రమం చిలికి చిలికి పెద్దగైంది. తనకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. దీనినే క్యాష్ చేసుకోవడానికి హాట్ హాట్ ఫొటోలు పెడుతోంది. శాంపిల్ కింద కొన్ని హాటెస్ట్ ఫొటోలు పెట్టింది. ఐతే ఇక్కడొక కండీషన్ పెట్టింది విష్ణు ప్రియ. ఇవి శాంపిల్స్ మాత్రమే డబ్బులు కడితే అంతా చూడొచ్చనే ఆఫర్ వదిలింది. నెలకు రూ.399 అంటా. అంటే ఆమె అందాల ఆరబోతను వీక్షించాలంటే నెలకు నాలుగు వందల రూపాయలు సమర్పించుకోవాల్సిందే అన్నమాట. ఇదో రకం ట్రాప్‌ అన్నమాట. కమ్మని కబుర్లతోనే కాదు.. కస్సుమనే ఫొటోలతో కూడా కాసులు సమర్పించుకునే స్కీముందని చెప్తోందన్నమాట.

సమర్పించుకొని సంబర పడాలా?

ఈ మధ్య కొన్ని యాప్స్ మోపయ్యాయి. ‘హలో.. ఇంట్లో ఒంటరిగా ఉన్నారా? అస్తమానం రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా’ అనే ఒక యాడ్ వస్తుంది. టైం వేస్ట్ చేయొద్దంటున్నారు కాబట్టీ ఇదేదో యాపారం యాడ్ అయుండొచ్చు అని జనాలు ఆసక్తిగా చూస్తారు. కట్ చేస్తే అదొక మాయల ట్రాపింగ్. బోర్ కొడుతుందా.. ఒంటరిగా ఫీలవుతున్నారా అని వెంటపడీ ‘ఫ్రెండ్’ యాప్‌లు తొక్క యాప్‌లు అని చెప్పి ఎట్రాక్ట్ చేస్తారు. వాళ్ల ఆఫర్ ఏంటంటే గంటకు వందనో రెండు వందలో సమర్పించుకొని ముచ్చట పెట్టాలన్నమాట. అంటే ఒక మగాడు అమ్మాయితో ముచ్చట పెట్టాలంటే ఆన్‌‌లైన్లో పైసలు సమర్పించుకోవాలి. ‘హాయ్’ అని తియ్యగా మాట్లాడగానే.. ‘బంగారం’ అని భ్రమలో పెట్టగానే ఐస్‌లా కరిగిపోయి అప్పనంగా సమర్పించుకోవడమే దీని ఉద్దేశం.

సాంతం ఊడ్చేసినా సైలెంటవ్వాలా?

ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ప్రొఫైల్ చెక్ చేసుకొని నచ్చినవాళ్లతో చాటింగ్ చేయాలన్నమాట. దాంతో ఏమొస్తుంది అంటారా? సొల్లుకార్చే బ్యాచ్ ఒకటుంటది కదా.. అలాంటివాళ్లకు ఇలాంటివి అంటే మజా? సొంగ కారుస్తూ చాటింగ్ చేసే మజాలో డబ్బును లెక్క చేయరు. అదేం ఆనందమో ఏమో మరీ? మెల్లగా వీడియో కాలింగ్.. న్యూడ్ కాలింగ్ ట్రాప్‌లో పడతారు. కోర్కెల చిట్టాతో కోట్లు కొల్లగొడుతున్నా ఏం చేయలేని పరిస్థితి. లవ్ భ్రమలో లక్షలు పోగొట్టుకొని.. లస్ట్ మాయలో లక్షణమైన కెరీర్ ఆగం చేసుకుంటున్నారు. చాటింగ్ పేరుతో చీటింగ్.. వీడియో కాలింగ్‌తో లూటింగ్ చేసి సాంతం ఊడ్చేసి సైలెంటుగా బైబై చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చినా జనాలకు సోయి వస్తలేదు.

విలువల్లేకనే: శ్రీనివాస్ కందేటి, యాక్టివిస్ట్

ఇవి కేవలం మోసాలు కాదు. సమాజం కుళ్లిపోతున్న లక్షణం. ఒకప్పుడు చదువు లేని వాళ్లు లోభం.. అవివేకం వల్ల మోసపోయేవాళ్లు. కానీ ఇప్పుడు డాక్టర్లు.. ఇంజనీర్లు.. ఐటి వాళ్లు కూడా ఇలాంటి ట్రాపుల్లో పడుతున్నారంటే మనుషుల్లో వివేకం.. విలువలు కనుమరుగయ్యాయి. సోషల్ మీడియా ద్వారా రాత్రి పగలు మాయ మాటలు వస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో లక్షలు సంపాదించాలని.. విదేశీ మహిళలతో ప్రేమ అని.. స్టాక్ మార్కెట్‌లో రాత్రికి రాత్రే రాజు అవ్వాలని కలలు కంటున్నారు. ఫలితంగా కొందరు ట్రాపులో పడి ఇరుక్కోవడం జరుగుతుంది.

బలహీనతను పసిగట్టి: ప్రత్యూష, ఎంటర్ ప్రెన్యూర్

ఈ రోజుల్లో ఒంటరితనం.. పని ఒత్తిడి.. రిలేషన్‌షిప్ సాటిస్‌ఫాక్షన్ లేకపోవడం వల్ల ప్రజలు ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. స్కామర్లు ఈ బలహీనతను గుర్తించి కమ్మగా మాట్లాడి వాలిడేషన్ ఇచ్చి ట్రాప్‌లోకి లాగుతున్నారు. చాటింగ్ నుంచి ఎమోషనల్ అటాచ్‌మెంట్ తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది. వీడియో కాల్స్‌లో ఇమేజ్.. ఇంటిమసీ ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఒకప్పుడు కుటుంబం.. బంధాలు అనేవి ఉండేవి. ఇప్పుడు ఫోన్ పట్టుకుని కూర్చుంటే చాలు..ఎవరో అపరిచితులు తేనె పూసి మాట్లాడితే కరిగిపోతున్నారు.

Next Story