- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఎవడెట్ల పోతే మాకేంది.?
మనమైతే ఫుల్ హ్యాపీ.
ఎవడేం పుణ్యానికి ఇస్తలేడు.
ప్రమోషన్ చేస్తున్నాం.
పైసలొస్తున్నాయి.
బస్ అంతే.
అది మంచిదా.? మనిషిని చంపేదా.?
హాని చేసేదా.. ఆగం పట్టించేదా.?
ఇవన్నీ జాన్తా నై.
పైసా ఫేకో.. తమాషా దేఖో.
నువ్వు పైసలిస్తే నీక్కూడా ప్రమోషన్ చేసిస్తా.
మేమున్నదే అందుకు.. మేం చేసేదే ఇదీ.
మీమిట్లనే ఉంటాం.!
- దాయి శ్రీశైలం
ఎవరండీ వీళ్లంతా.? ఒకడు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తాడు. ఒకడు గుట్కాను ప్రమోట్ చేస్తాడు. ఇంకొకడు సిగరెట్‌ను ప్రమోట్ చేస్తాడు. తంబాకును ప్రమోట్ చేస్తాడు. ఆల్కహాల్ ను ప్రమోట్ చేస్తాడు. సబ్బు.. షాంపు.. నూనె.. ఉప్పు.. పప్పు ఇట్లా అన్నింటికీ ప్రమోషన్ చేసి మీ సావు మీరు సావుండ్రి అని మన మొఖాన పడేస్తారు. ప్రమోషన్ చేసినందుకు లక్షల్లో ఫీజు తీసుకొని చేతులు దులుపుకుంటారు. కానీ అనుభవించేది మనమే.!
నీకింత.. నాకింత
వాళ్లంతా చూడటానికి పెద్ద పెద్ద స్టార్స్. లక్షలాది అభిమానులుంటారు. వాళ్లంటే పడి సచ్చే.. కోసుకునే ఫ్యాన్స్ ఉంటారు. అంత ఫేమ్ ఉంది కాబట్టీ.. ఆ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకోవడానికి మార్కెటింగ్ నిపుణులు ప్రమోషన్ ఎరేస్తారు. ఆ ఎర మనమీదే. ఏంలేదు సింపుల్.. ఫలానా బెట్టింగ్ యాప్ గురించి ప్రమోషన్ చేయాలంతే. నీకింత.. నాకింత. లెక్క క్లియర్. అభిమాన స్టార్ ప్రమోట్ చేసిండంటే మనం ఊకుంటమా.? పైసలు పెట్టుడే.. బెట్టింగ్ ఆడుడే. ఇక్కడ ప్రమోషన్ చేసిన స్టార్ బాగనే ఉంటాడు. మార్కెటింగ్ చేయించినోడు బాగనే ఉంటాడు. ఎవడి ప్యాకేజీ వాడికి. ఆగమయ్యేది మాత్రం కామన్‌మ్యానే. "నేను చేసిన ప్రమోషన్ మంచిదా కాదా.? దానివల్ల ఎవరైనా ఆగమవుతున్నారా.? బాగుపడుతున్నారా.?" ఇవేవీ పట్టింపు ఉండదు.
ఇంకెందరు ముఖేష్‌లు.?
కొద్దిసేపట్లో సినిమా స్టార్ట్. "నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలాను. క్యాన్సర్ బారిన పడ్డాను" అనే యాడ్ ఒకటి వేస్తారు. వేయాలి. ఇలాంటివి వేస్తేనే ప్రజల్లో అవగాహన వస్తుంది. గుట్కా.. పాన్.. జర్దా.. తంబాకు నమిలేవాళ్ల వెన్నులో భయం పుడుతుంది. ఇంతవరకు ఓకే. కానీ.. వాటిని ప్రమోట్ చేసింది ఎవడండీ.? ఈ యాడ్ పూర్తయ్యాక వచ్చే సినిమాలో నటించిన హీరోనే కదా.? మరి వాళ్లు బాగనే ఉన్నారు కదా.? అసలు గుట్కా తినమన్నది.. దానిని ప్రమోట్ చేసి ఎరేసింది ఎవడు.? కొంచెమన్నా సోయి ఉండాలి కదా.? మనం దేనిని ప్రమోట్ చేస్తున్నాం.. అది జనాల్లోకి వెళ్లి ప్రజలనెంత పాడుచేస్తుంది అనేది ఆలోచించం. ఎంతసేపు మనం చేసే ప్రమోషన్‌కు ఎంతొచ్చింది.? అనే చూస్తాం. చేసేది పాన్ యాడా.. ఫాయిఖాన యాడా అనే పట్టింపొద్దా.?
నష్టం ఎవరికి.?
"ధూమపానం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల క్యాన్సర్.. గుండెపోటు.. ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి" అని ఆ హీరోలే చెప్తారు. మళ్లీ ఆ హీరోలే సిగరెట్లను యాడ్ ద్వారా ప్రమోట్ చేస్తారు. ఇదింకా చాలదన్నట్లు ప్రతీ సినిమాలో ప్రతీ హీరో ఐదు పది నిమిషాలకు ఓ సిగరెట్ తాగే సీన్లో కనిపిస్తాడు. అదిచూసి యూత్‌కు సిగరెట్ తాగడం ఒక ప్యాషనైపోయింది. మూతి మీద మీసం కూడా మొలవని పోరగాళ్లు ఇవాళ పొగాకు ఉత్పత్తులకు బానిసైపోతున్నారు. ఒకసారి సిటీ ఔట్స్‌కట్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్స్ పరిసరాల్లో చూడండి. కుప్పలు తెప్పలుగా తాగి పడేసిన సిగరెట్ పీకలు కనిపిస్తాయి. దీనికి కారణం ఎవడు.? అంతిమంగా ఎవడు తాగుతాడో వాడే కారణం.. నష్టం జరిగేది కూడా వాడికే. కానీ.. సెలబ్రిటీలు.. హీరోలు అని చెప్పుకునేవారు ఇలా చెడును ఎందుకు ప్రమోట్ చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న.?
పైసలొస్తే ఏదైనా చేస్తారా.?
"మందు బాబులం మేం మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం" అనే సీన్లు వాళ్ల సినిమాల్లో పెట్టుకొని ప్రేక్షకులతో చిందులేయిస్తారు స్టార్ హీరోలు. కానీ బయటనేమో మద్యపాన నిషేధం గురించి స్పీచులు దంచుతారు. వైన్సులు.. బార్ అండ్ రెస్టారెంట్ల ముందు ప్రమోషన్ యాడ్స్ పెద్ద పెద్ద అక్షరాలలో.. ఆకర్షించే డిజైన్లలో కనిపిస్తుంటాయి. వాటిలో ఉండేదెవరూ..? మళ్లీ ఇదే స్టార్ హీరోలు.. స్టార్ క్రికెటర్లు. నువ్వు అంత పెద్ద హీరోవే అయితివి. అంతపెద్ద క్రికెటరే అయితివి. వాటివల్ల వచ్చే డబ్బులు సరిపోక "ఓల్డ్ మంక్ తాగండీ.. ఓలలాడండి.. కింగ్ ఫిషర్ తాగండి.. కిక్కుతో ఉండండి" అని ప్రమోషన్లు చేస్తున్నారా.? అంటే పైసలొస్తే దేనికైనా ప్రమోషన్ చేస్తారా.? మీరు మందు బాటిల్స్ పట్టుకొని ప్రమోషన్ చేయడం వల్ల బయట ఎంతమంది పిల్లలు పాడవుతున్నారని ఆలోచించే ప్రయత్నం చేశారా ఎప్పుడైనా.?
మీరు తాగండి చూద్దాం
అసలే ఎండాకాలం. నీళ్లెన్ని తాగినా దూప తీరదు. టీవీలో ఫలానా సూపర్‌స్టార్ చెప్తడు కదా ఫలానా చల్ల చల్లని కూల్ డ్రింక్ తాగితే క్షణాల్లో దూప తీరిపోయి ఎంతో హుషారొస్తుందని. ఏం చేస్తాం ఖర్మ కొద్దీ అదే తాగుతాం. అవును.. ఖర్మకొద్దే. తాజా పరిశోధన రిపోర్ట్ ఒకటి బయటకొచ్చింది. కూల్‌డ్రింక్స్‌లో మైకో ప్లాస్టిక్స్ ఉంటాయట. ఏడాదికి ఒక వ్యక్తి సగటున 41.13 లీటర్ల కూల్‌డ్రింక్స్ తాగుతున్నాడు. ఇవి జీవక్రియ.. హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయట. ఎట్లుంది కథ.? మరి ఈ మాత్రం భాగోతం వాటిని ప్రమోట్ చేసే స్టార్లకు తెలియదంటారా.? ఒకవేళ తెలియదనే అనుకుందాం.. ఒప్పందం కుదుర్చుకునే ముందు తెలుసుకుంటే ఏమైతుంది.? వాళ్లు మాత్రం తాగరు.. అడ్డమైన చెత్తనంతా తాగమని ప్రమోషన్ ద్వారా ఒత్తిడి చేస్తారు.
మీ పిల్లలు ఇవే తింటారా.?
పిల్లలు తినే బిస్కెట్లు.. న్యూట్రిషన్ ప్రొడక్ట్స్.. చిప్స్.. కుర్ కురేలు.. కరకరలు ఇవన్నీ తినమని చెప్పేది ఎవడు.? వాళ్లింట్లో పిల్లలకు ఇవే తినిపిస్తరా.? ఇది మంచిది.. ఇదే మంచిది అని చెప్పడం వల్లనే కదా జనాలు ఎగబడి తీసుకునేది. వీళ్లింతే బాస్.. గుడ్డిగా నమ్మేస్తారు. మీరైనా చూసుకోవాలి కదా.? ఇవాళ మార్కెట్లో దొరికే స్నాక్స్ అన్నింట్లోనూ అధిక మోతాదులు స్టెరాయిడ్స్ ఉంటాయి. వాటిలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. కొన్నింట్లో అధిక సోడియం.. చెక్కర శాతం అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును.. దంత సమస్యలను.. ఊబకాయ సమస్యలకు దారితీస్తాయి. ఇవన్నీ ఆ బ్రాండ్లను ప్రమోట్ చేసేవాళ్లకు తెలుసా.? వాళ్ల పిల్లలైతే ఇవే తింటారా.? అని ఆలోచించే మనస్తత్వం ఉందా ఒక్కరిలో అయినా.?
మీరు ఏది చెప్తే అదే..
ఒకడైతే దర్వాజ పలగ్గొట్టుకునే ఇంట్లోకి వస్తాడు. వచ్చీ రావడమే మీ టూత్ పేస్టులో ఉప్పుందా.. పప్పుందా.. కారముందా అని అడిగేస్తుంటాడు. మనం బొగ్గుతో పళ్లను తోముతుంటే బొగ్గు మంచిది కాదు.. ఆరోగ్యానికి హానికరం అని చెప్పిందే వాడు. ఇప్పుడేమో మా టూత్ పేస్టులో బొగ్గుంది అంటాడు. మనం ఉప్పు కలుపుకొని పళ్లు తోముతుంటే అలా తోమొద్దు అని చెప్పింది కూడా వాడే. ఇప్పుడేమో మా దాంట్లో ఉప్పుంది.. పాలకూర పప్పుంది అని చెప్తాడు. ఇవన్నీ చూసి జనాలు పిచ్చొళ్లు కావాలి. వాళ్లు చెప్పిందే నిజం అనుకొని సహజత్వాన్ని వదిలేసి ఈ సెలబ్రిటీలు ప్రమోట్ చేసే ఐటమ్స్ తీసుకోవాలి. ఇంతకూ ఆ ఐటమ్స్ వాళ్లు వాడతారా అంటే క్వశ్చన్ మార్కే. ఏ ప్రమోటర్ కూడా తాను ప్రమోట్ చేసే ఐటమ్‌ను ఉపయోగించడు. వాళ్లంతా ప్యాకింగ్ మీదుండే పట్టిక ఆధారంగానే తీసుకుంటారు.
బాధ్యత నీదా.. నాదా.?
పప్పులు.. ఉప్పులు.. నూనెలు.. మసాలాలు.. పొడులు.. ఇలా దేన్నీ వదలరు ప్రమోషన్ చేయడంలో. "వాళ్లు మస్తు చెప్తరు.. అంత మాత్రాన కొనుక్కోమని కాదు కదా" అనేవాళ్లు కూడా ఉన్నారు. మంచి లాజిక్ పాయింటే. కానీ.. వాళ్లే కొనమని ప్రమోట్ చేయకపోతే ఆ ఐటమేంటో కూడా మనకు తెలియదు కదా.? రోజూ వార్తల్లో చూస్తున్నాం కదా.. "నూనెల్లో జంతు కలేబరాల కొవ్వులు కలుపుతున్నారు.. పొడుల్లో స్టెరాయిడ్స్ కలుపుతున్నారు. మసాలాల్లో మోతాదుకు మంచి రంగులు వేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయి తీవ్ర అస్వస్థత" అనే వార్తలు. ఊకెనే అవుతుందా ఫుడ్ పాయిజన్.? దాంట్లో అడ్డమైన పదార్థాలు ఏమేం కలిపారో.. ఎవడికి తెలుసు. తెలుసుకోవాల్సింది వాటిని ప్రమోట్ చేసేవాళ్లే. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ వాళ్ల ఫేస్ వాల్యూతో మార్కెట్లోకి వెళ్తుంది. ఫలానా స్టార్ ప్రమోట్ చేశాడనే ఉద్దేశంతోనే ప్రజలు వాటిని తీసుకుంటారు.
- - కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్- 2019 ప్రకారం నాసిరకం ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే జైలుశిక్ష లేదా జరిమాన వేస్తారు.
- - ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్- 2006 ప్రకారం హానికారక పదార్థాల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే ఎఫ్ఎస్ఎస్ఐ చర్యలు తీసుకుంటుంది.
- - డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్- 1940 ప్రకారం కల్తీ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి.
- - డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ప్రకారం హానికారక ఉత్పత్తులు ప్రమోట్ చేసేవారిపై నిషేధం విధిస్తారు.
- - తెలంగాణ గేమింగ్ యాక్ట్- 2017 (సవరించిన) ప్రకారం ఆన్‌లైన్ బెట్టింగ్ లేదా జూదంను ప్రమోట్ చేయడం చట్ట విరుద్ధం.
- - కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్- 2019 ప్రకారం తప్పుదారి పట్టించే ప్రకటనలు.. ప్రమోషన్లు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి.
- - యూట్యూబ్.. ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్ ఫారమ్స్‌లో బెట్టింగ్ సంబంధిత కంటెంట్ ప్రమోట్ చేస్తే ఖాతాలు బ్యాన్ అవుతాయి.
- - ప్రమోషన్ల ద్వారా వచ్చే ఆదాయం చట్టబద్దమైన మార్గాల ద్వారానే ఉండలి.
- - మనీ లాండరింగ్ లేదా హవాలా వంటి అక్రమ లావాదేవీలుటే "ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్- 2002 కింద కఠిన శిక్షలు ఉంటాయి.
- - పిల్లలు తినే స్నాక్స్‌లో ఆర్టిఫిషియల్ కలర్స్ 0.01%- 0.1% ఉంటాయి.
- - సోడియం బెంజోయేట్ వంట ప్రిజర్వేటివ్‌లు 0.1% కంటే తక్కువగా ఉపయోగించబడతాయి.
- - BHA, BHT సాధారణంగా 0.02% (200 ppm) కంటే తక్కువగా ఉపయోగించబడతాయి.
- - ఇవన్నీ తక్కువ మోతాదుగానే కనిపిస్తాయి. కానీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
- - క్యాండీ.. చాక్లెట్లలో చక్కెర శాతం 20%- 70% వరకు ఉండవచ్చు. ఇవి ప్రమాదకరం.
- - ట్రాన్స్ ఫ్యాట్‌ను 2% కంటే తక్కువగా ఉంచాలని నిబంధన ఉంది.
- - 100 గ్రాముల చిప్స్‌లో 0.5- 2 గ్రాముల ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి.
- - చిప్స్, సాల్టెడ్ స్నాక్స్‌లో సోడియం 1–2% వరకు ఉంటుంది. ఇవన్నీ పిల్లల ఆరోగ్యా్న్ని పాడుచేసేవే.
కట్టడి చేయాలి: మణిదీప్
అడ్డమైన బ్రాండ్ల పేరు చెప్పి హీరోలు.. క్రికెటర్లు ప్రకటనకర్తలుగా ఏవేవో ప్రచారం చేస్తుంటారు. వాళ్లు చేసే ప్రమోషన్ దేని గురించో అనే సోయి లేకుండా.. కనీసం లేబుల్ చాట్ అయినా చెక్ చేసుకోకుండా ఈ ప్రమోషన్లకు ఓకే చేస్తారు. ఇవాళ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసినవారి పరిస్థితి చూశాం కదా.? అందర్నీ అలాగే కట్టడి చేయాలి.
వాళ్లు వాడరు కానీ: స్టిల్ విజయ్
బ్రాండింగ్ ప్రమోషన్ చేసేవాళ్లెవరూ వాటిని వాడరు. మనకు మాత్రం వాడమనీ.. అసలు దాన్ని మించింది ఇంకోటి లేదని ఇలా ఏదేదో ఊదరగొడుతుంటారు. వాళ్లేది చెప్తే యువత అది ఫాలో అవుతోంది. క్రికెట్ ఆడమంటే క్రికెట్ ఆడుతోంది.. బెట్టింగ్ పెట్టమంటే బెట్టింగ్ పెడుతుంది.. ఇలా ప్రతీది వారిని అనుసరించే చేస్తున్నారు.
చూసుకోవాలి: విష్ణుప్రియ, సైంటిస్ట్
ఇవాళ మార్కెట్లో దొరికే ప్రతీది కల్తీ.. నాసిరకం ఉంటున్నాయి. ప్రమోటర్లదేం పోయింది వాళ్లకు డబ్బులొస్తాయి కదా అందుకే ప్రమోట్ చేస్తారు. వాస్తవానికి అలా చేయొద్దు. అది బెట్టింగ్ యాప్స్ అయినా ఇంకోటి అయినా. పబ్లిక్ కూడా ప్రతీది చూసుకోవాలి. మనం అలర్ట్‌గా ఉంటే ఎవడూ ఏం చేయలేడు.
- Tags
- Promotion
- money
- betting apps
- gutka
- cigarettes
- tobacco
- alcohol
- soap
- shampoo
- oil
- salt
- dal
- stars
- fans
- following
- marketing
- experts
- cinema
- Mukesh
- ad
- health
- cancer
- heart attack
- lungs
- diseases
- heroes
- Consumer
- Protection Act
- Substandard Products
- Food Safety
- Drugs and Cosmetic
- Drug Controller
- Telangana Gaming Act
- YouTube
- Money Laundering
- Hawala
- Artificial Colors






