- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో దీపాల కాంతి.. వీధిలో పటాకుల వాంతి.!
సుతిల్ బాంబులు అంటించి సుక్కలదాకా పంపిస్తాం

దిశ, ఫీచర్స్: దీవిల పండుగంటే వ్రతం.. నోము.. కథనే కాదు. అంతకంటే పెద్దకతే ఉంటది పటాకులతోటి. పటాకుల కాడ మనం అస్సలు తగ్గం. లచ్చింబాంబులు పేల్చి లచ్చిందేవిని స్వాగతిస్తాం. థౌజండ్ వాలా కాల్చి ఠారెత్తిస్తాం. బాంబులు కాల్చకుండా బయటికి వెళ్లాలంటే నామోషీ మనకు. గాల్లోకి రాకెట్లు విసిరేసి గంభీరంగా నవ్వుతాం. తోక పటాకులు కాల్చి పక్కింట్లోకి పారేస్తాం. సుతిల్ బాంబులు అంటించి సుక్కలదాకా పంపిస్తాం. ఇవన్నిటితోనే కదా దీవిలకు దివిటీ పట్టేది.?
పొగలుగమ్మే పటాకుల మోత..
పండగపూట పటాకులు పేల్చే ట్రెండ్ చానారోజుల నుంచి నడుస్తున్నదే. ఐతే.. రాన్రానూ దీపావళి అంటేనే పటాకుల పండగలెక్క తయారైంది. ఒకటో క్లాస్ చదివే పిలగాడు కూడా "ఉ..హూ డాడీ నాకు క్రాకర్స్ కావాలే" అని అడుగుతాడు. క్రాకర్సంటే స్పెల్లింగ్ కూడా రాదు వాడికి. కానీ.. దీపావళినాడు వాటినెట్లయినా పేల్చాలని మెంటల్లీ ఫిక్సయిపోతాడు. కొందరైతే ఒకరెండ్రోజులు మొత్తం వాటికే కేటాయిస్తారు. "పటాకులంటే మాకు పానం. పొద్దుగాల ఆరింటికే లేస్తాం. ఎవరి పటాకులు వాళ్లు రెడీ చేసుకుంటాం. పొద్దుమూకిందంటే ఇంట్ల ముందు పొగలు కమ్మేటట్లు పటాకుల మోత మోగిస్తాం. మా పటాకుల మేమే యజమానులం" అనే రేంజిలో ఉంటుంది దీవిలనాటి పోరగాళ్ల సంబరం.
మనల్నెవడ్రా ఆపేది.?
పటాకులు కాల్చడం మన సంప్రదాయంలో భాగమే కావచ్చు. కానీ దాన్నే ఆసరగా చేసుకొని విజృంభిస్తుంటారు కొందరు. ఏదో శాస్త్రానికి కొన్ని కాల్చుదామని అనుకునేవాళ్లుండరు. ఎవరెక్కువ పటాకులు కాలిస్తే వాళ్లే గొప్పొళ్లు.. వాళ్లదే విజయం అనే పోటీ ధోరణి ఎక్కువ కనిపిస్తుంటది. అందుకే "వాళ్లేం పటాకులు తీసుకొచ్చారు.? వీళ్లేం పటాకులు తీసుకొచ్చారు.? ఎన్ని పైసలు ఖర్చయినై" అని తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువైతది. "మా ఇష్టమొచ్చినట్లు కాలుస్తం.. మనల్నెవడ్రా ఆపేది" అనే తెగింపుతో ఉంటారు. ఫైర్ క్రాకర్స్ కాల్చేది ఆనందం కోసమే అయినా.. దాన్ని పోటీగా తీసుకొని కొట్లాటలు.. పంచాదుల వైపు మళ్లించి ఘర్షణ వాతావరణం కలిగిస్తుంటారు కొందరు. "నవ్వులువొయ్యి నువ్వులైనట్లు" వినోదం కాస్త విషాదమూ అవుతుంది.
పక్కింట్లోకి వేసి పకపకలు..
కొందరుంటారు.. పక్కింట్లోకి పటాకులు విసిరేసి ఆనందం పొందుతారు. "అరే ఏందిసామీ.. పటాకులు కాల్చి మా ఇంట్ల పడేస్తరు. ఇదేం తరీఖ" అని అడిగితే "సూక్తి పాఠాలు" చెప్తుంటారు. "నేనేంజెయ్యాలె.. మీ ఇంట్లకు కావాలని ఏశినమా.? దానికేమన్నా కండ్లున్నయా.? శెవులున్నయా.? పేల్చినం.. అమాంతమొచ్చి మీ ఇంట్లవడ్డది. దానికే లొల్లివెడ్తే ఎట్లంకుల్" అని ఇకఇకలు పకపకలు పలికి వితండవాదం చేస్తుంటారు. రాకెట్ల లాంటివంటే గాల్లోకి ఎగురుతూ వెళ్తాయి కాబట్టీ.. అవి ఎక్కడికి ఎగిరేది.. ఎవరింట్లో పడేది మనకు తెలియదు.. అట్ల చెప్పడంలో ఒక అర్థముంది. కానీ మామూలు తోక పటాకులు కూడా అన్నీ కుప్పకుప్పనే పక్కింట్లో పడుతున్నయంటే దానర్థం కావాలనే వేస్తున్నట్టు కదా.?
బజార్లో బానసంచా ఎందుకు.?
క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలె. మనకు మన ప్రాణం ఎంత ముఖ్యమో.. అవతలి వాళ్లకూ వాళ్ల ప్రాణం అంతే ముఖ్యం. మనకు సంబరమైతే వేరేవాడి చెంప గిచ్చితే ఏం ఫాయిదా.? అదేం తరీఖ.? కాబట్టీ పటాకుల కాడకూడా జనాలు ఈ ఫార్ములాను పాటిస్తే మంచిది. దీపావళికో లేదా ఇంకోదైనా పండకకో.. ఊరేగింపుకో చూస్తనే ఉంటుంటాం. చాలామంది పబ్లిక్లో నే పటాకులు కాలుస్తుంటారు. పక్కింట్లో.. ఎదురింట్లో వేయడం కంటే కూడా ఇట్లా బజార్లో బానసంచా కాల్చుడే పెద్ద నేరం. మనకు కలిగిన సంబరాన్ని పదిమందికి తెలియజేయాలనే ఉద్దేశం మంచిదే కావచ్చు. కానీ బాంబులు విసిరి చెప్పాలనుకోవడమే ఇతరులకు అభ్యంతరకరం.. ప్రమాదకరం. ఉద్దేశం కరెక్టే అయ్యి దాన్ని ఆచరించడంలో ఫెయిలైనప్పుడు ఆ ఉద్దేశమే పెద్ద మీనింగ్ లెస్.
ఎన్ని పేలిస్తే అంత గ్రేట్..
పటాకుల సౌండ్స్ మంచివి కావు.. వాటి నుంచి విడుదలయ్యే పదార్థాలు ఆరోగ్యానికి కూడా అంత మంచివి కావనే ముచ్చట కామన్‌గా అందరికీ తెలిసిందే. కానీ కాల్చకుండా మనమెవరమూ ఉండలేం. ఎందుకంటే మనకు కిక్కు కావాలె. అట్టహాసం ఉండాలె. ఏదైనా జరిగినప్పుడు పట్టపట్ట పటాకులు కాల్చి సందడి చేయాలె. ఏదో శాస్త్రానికి పండగపూట ఐదారు కాల్చి సైలెంట్‌గా ఉన్నామా.. సంబరం తీరిందా అని అడ్జస్టయ్యే వాళ్లం కాదు. మనకు దేనికైనా లొల్లి ఉండాలె. లొటపెట సప్పుడూ ఉండాలె. అది పండగలప్పుడైనా.. పాడె ఎత్తినప్పుడైనా. ధన్నధన్న బాంబులు పేల్చి దడపుట్టిస్తుంటే మామూలుగా ఉండదు మన పతారె. అట్ల చేస్తెనే మనకు పండగల మీద ఎక్కువ ధ్యాసున్నట్లు.. మనుషుల మీద ఎక్కువ ప్రేమున్నట్లు.
పక్కవాళ్ల పరేషాన్‌తో మనకేంటి.?
సొసైటీలో ఉన్న అందరూ ఒకేలా ఉండరు. అందరి ధైర్యసాహసాలు ఒకే తీరుగా ఉండవు. పిల్లలుంటారు. ముసలొళ్లుంటారు. బలహీన మనస్తత్వం.. శారీరక రుగ్మతలున్నొళ్లుంటారు. అందరినీ ఒకేలా ట్రీట్ చేయలేం. అందరినీ ఒక్కగాటినే కట్టలేం. మనం మన హ్యాపీ కోసం బండిల్స్ కొద్ది పటాకులు ఒక్కసారే కాలుస్తాం. అది చేసే సౌండ్ ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న డీజే సప్పుళ్లకే గుండెదడ పుట్టి జనాలు సచ్చిపోతున్నారు. అలాంటిది హానికారక పదార్థాలను రిలీజ్ చేస్తూ.. ఏకకాలంలో భారీ పేలుడు శబ్ధం వస్తే చిన్న పిల్లలు, ముసలివాళ్లు, బలహీనమైన గుండె ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటనేది మనం ఆలోచిస్తామా.? మనకెంతసేపూ మన ఆనందమే కావాలె. పక్కవాళ్ల పరేషాన్‌తో మనకేం సంబంధం.?
కాకరబత్తులు కాలిస్తే తుస్సు పండగనా.?
ఖాయిష్‌తో పటాకులు కాల్చుకొని సైలెంట్‌గా ఉండెటోళ్లమేనా మనం.? మనం పటాకులు పేల్చి. చిచ్చుబుడ్లు ముట్టించి బర్ల మీదనో గొర్ల మీదనో వేయాలె. అట్లేస్తే అదో సంబరం. పటాకుల సప్పుడుకు బర్రె బెదిరిపోయి పాలు పిండేటాయ్నెను తంతే.. అది చూసి మనం మురిసిపోవాలన్నమాట. అట్ల ఏదో ఒకట తీటేశం చేస్తెనే దీపావళి గ్రాండ్‌గా జరుపుకున్నట్లు మనం. అట్లగాకుండా బుద్ధిగా నాలుగు భూచక్రాలు.. ఐదు కాకరబత్తీలు ముట్టించి గిరాగిరా తిప్పితే "తూనీ.. గదేం పండుగ సామీ.. సుర్ సుర్ బత్తీలు కాల్చి తుస్సు పటాకుల పండుగ చేసుకున్నవూ" అని ఎక్కిరిస్తుంటాం. దున్నపోతు తోకకు కాకరబత్తి అంటించి.. కుక్క మెడలో తోకపటాకుల లడీ వేలాడదీస్తే మనకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఎప్పుడు దొరకని మజా దొరుకుతుంది.
పటాకులతో పరాష్కమేంది.?
దీవిల పండుగకు అడ్డదిడ్డంగా క్రాకర్స్ పేల్చి క్రాక్‌మైండ్ గాళ్లమని నిరూపించుకుంటే అదొక తృప్తి మనకు. మన పటాకులు మన ఇష్టం అంతే. అందుకే కొందరు చేతుల్లోనే పేల్చేస్తుంటారు. ఎక్స్‌పరిమెంట్లు చేసి ఎకెసెక్కాలు చేస్తుంటారు. "పటాకులతోని పరాష్కమేంది వయా" అని అడిగితే.. "నీ మీదేస్త.. ఏమన్న చేస్తవా" అని పక్కొళ్లమీద పడేస్తుంటారు. "శిన్నప్పటి సంది పేలుస్తు్న్నా. ఇయాల కొత్తనా నాకు ఈ పటాకులు" అని ఓవర్ కాన్ఫిడెంటుతో పేల్చి పెంటలో వేస్తారు. అదికాస్త అంటుకొని గడ్డిలోకో.. దొడ్డిలోకో ఎగిరి రాజుకొని రాకాసి మంటలా ఎగిసిపడుతుంది. చూస్తుంటాం కదా.? ప్రతీ దీపావళికి "బానసంచా అంటుకొని గడ్డివాముకు నిప్పు".. "పటాకులు పేలి పశువుల దానా నష్టం" అనే వార్తలెన్ని వస్తయో.?
జోష్‌లో ఉన్నప్పుడు నిప్పు కానరాదా.?
పిల్లల చేతికి క్రాకర్స్ పట్టించడం.. మన చేతుల్లోనే పేల్చుకోవడం వల్ల ఎంతమందికి గాయాలైతలేవు చెప్పండి.? "ఒక్కరోజు సంబరం కోసం సవురమంతా గీకించినట్లు" ఉంటది మన కథ. జోష్‌లో ఉన్నప్పుడు నిప్పు కానరాదు.. నింగలం కానరాదు. జోరుమీద ఉన్నప్పుడు ఇల్లు మర్చిపోతాం.. ఒళ్లు మర్చిపోతాం. ఈ పొరపాటే.. ఈ ఏమరపాటే మన జీవితాన్ని లచ్చింబాంబులెక్క పేల్చేసి పేగులు బైటపడేస్తుంది. గంట సంబరం కోసం గాయాలు కొనితెచ్చుకోవడం ఎందుకనే సోయి మనకు ఉంటే ఏ దీవిలె పండుగ నాడు విషాదం జరగదు. బానసంచా మిస్ ఫైరయ్యి మనమీద పడ్డా ప్రమాదమే.. మన పక్కనున్నొళ్ల మీద పడ్డా ప్రమాదమే. అందుకే గాయాల పండుగ కాకుండా గంభీరమైన పండుగ జరుపుకోవాలనుకొని క్రాకర్స్ పేలిస్తే ఎంత బాగుంటుందో కదా.?
వాకిళ్లన్నీ పటాకుల పేపర్లతో నిండాలా.?
దీపావళి పండుగనీ ఇల్లంతా కడిగి.. గాలిచ్చి శుద్ధి చేసుకుంటాం. దర్వాజ బాజులకు బంతిపూలు అలంకరించి అందంగా తీర్చిదిద్దుతాం. గోడలకు రంగులు.. సున్నాలు వేయించుకుంటాం. అంత కష్టపడి.. అన్ని పైసలు ఖర్చుచేసి ఇంటినీ.. పరిసరాలను పండగకు ముస్తాబుచేసి ఆఖరికి పటాకులకు సమర్పయామి అనిపిస్తాం. ధూపమేస్తిమీ.. దీపమేస్తిమీ.. ఆ సుగంధ పరిమళాలు పరిసరాలు దాటేలోపే పటాకుల పేలుళ్లతో కమరు వాసన్నే వస్తుంది. రంగు రంగుల లైట్లే్స్తిమి.. రాత్రిపూట కూడా మెరిసేలా పూలు అలంకరిస్తిమి. కానీ.. పటాకులు పేలి ఎగిరిపడే పేపర్లే ఆ అలంకరణ కనపడకుండా కమ్మేస్తే ఇక ముస్తాబెందుకు.? అసలు దీవిలె పండగంటేనే శుచి.. శుభ్రత కదా.? మరి వాకిళ్లన్నీ ఈ పేపర్లతో నిండిపోవుడేంది.?
దీపావళికి ఎక్కువ
ఫైర్ క్రాకర్స్ వల్ల గాల్లోకి పార్టిక్యులేట్ మ్యాటర్, మెటల్స్, గ్యాసెస్ విషపదార్థాల రూపంలో విడుదలవుతాయి. దీపావళి వంటి పండగ రోజుల్లో ఇవి చాలా రెట్లు అధికమయ్యి పర్యావరణాన్ని పాడుచేస్తాయి. పటాకుల వల్ల రిలీజయ్యే వాటిలో అత్యంత కాలుష్యకారి పార్టిక్యులేట్ మ్యాటర్. దీనివల్లనే పాలిక్యులేట్ మ్యాటర్ సాంద్రత సాధారణ రోజుల్లో కంటే 2-35 రెట్లు పెరుగుతుంది. నైట్రోజన్ ఆక్సయిడ్లు.. కార్బన్ మోనాక్సయిడ్.. ఆమోనియా వంటివి రెగ్యులర్ రోజుల్లో తక్కువశాతంలోనే రిలీజవుతాయి. ఐతే.. దీపావళి వంటి బానసంచా ప్రధానంగా పేల్చే పండుగల్లో విపరీతంగా పెరుగుతాయి. పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు సాధారణ రోజుల్లో కంటే దీపావళి సందర్భంగా 7.5-10.3 రెట్లు ఎక్కువగా రిలీజవుతాయి.
వీటితో పెద్ద సమస్యే
పటాకుల్లో ఉండే రసాయనిక పదార్థాల్లో ఆక్సిడేటివ్, ఇన్‌ఫ్లమేషన్ కణాలుంటాయి. ఇవి ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తాయి. సాధారణ గాలి కాలుష్యంలో ఉండే కణాల కంటే ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. ఆస్తమా, గుండె జబ్బుు ఉన్నవాళ్లకు వీటితో పెద్ద సమస్యే. ఒకవేళ ఇవి గనుక శరీరంలోకి వెళితే తక్కువ బరువున్న పిల్లలు పుడతారు. దీర్ఘకాలిక దగ్గు ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు.. లంగ్ క్యా్న్సర్ వంటివి వస్తాయి. పిల్లలు.. శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లయితే వీటివల్ల పెద్ద డేంజర్ జోన్లోనే ఉన్నట్టు లెక్క. కార్సినోజెనిక్ వంటి క్యాన్సర్ కారకాలు పటాకుల్లో ఉండే రసాయనిక పదార్థాల్లో ఉంటాయి. హెపటిక్.. న్యూరోలాజికల్ డిజార్డర్లు వస్తాయి. ఇలాంటి వాయువులతో కాలుష్యం జరిగి మరణాలూ ఎక్కువవుతుున్నాయి.
సంతోషంగా జరుపుకుందాం: డబ్బీకార్ పెంటోజి, పర్యావరణ పరిరక్షకుడు
పర్యావరణం బాగుండాలి. మన సంస్కృతీ సంప్రదాయాలు సజీవంగా ఉండాలని నేను, మా బృందం పలు సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. ఆటలు.. పాటల ద్వారా అవగాహన కల్పించాం. పండగను పండగలా జరుపుకోవాలి. కొందరు పక్షులు, జంతువుల సమీపంలో పటాకులు పేలుస్తుంటారు. ఆ శబ్దానికి అవి వేరే ప్రదేశానికి వెళ్లిపోతాయి. ఇంకా భారీ పటాకుల పేలుళ్ల వల్ల పొగ చెట్ల ఆకులపై పేరుకుపోయి ఫొటో సింథిసిస్‌ను తగ్గిస్తుంది. అజాగ్రత్తగా బాణసంచా వల్ల పెర్‌క్లోరేట్ వంటి పదార్థాలు నీళ్లలోకి చేరి ఆహార గొలుసును అస్థిర పరుస్తాయి.
అందరికీ సంబరమే: బజారు భిక్షపతి, సామాజిక కార్యకర్త
చాలారోజుల క్రితం జరిగిన ఘటన ఇది. మార్కెట్ ప్లేస్‌లో బాణసంచా పేల్చడం వల్ల ఒక వృద్ధురాలు ఆ శబ్దానికి భయపడి కింద పడిపోయింది. ఇక అప్పటి నుంచి ఆమెకు పటాకుల చప్పుడు వస్తే చాలు రెండు చెవులూ మూసుకొని అయ్యో అని మొత్తుకుంటుంది. ఆ ఘటన ఆమె మనసులో ఇప్పటికీ ఉండిపోయింది. అందుకే ఆ భయం. మన సంబరం ఇంకొకరికి విషాదంగా మారొద్దు. ఇలాంటి అజాగ్రత్తల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టీ దీపావళికి పటాకులు పేల్చే యువత ఒకసారి ఆలోచించి సంబరాలు జరుపుకుంటే మంచిది.






