అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న బౌద్ధుల ప్రపంచ శాంతి యాత్ర

by Muthe.Rajitha |   (  Updated:2026-01-07 18:38:41  IST  )

ముందుండి నడిపిస్తున్న ఈ అలోక ఎవరు?

అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న బౌద్ధుల ప్రపంచ శాంతి యాత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో జరుగుతున్న బౌద్ధ సన్యాసుల ప్రపంచ శాంతి యాత్ర ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. "వాక్ ఫర్ పీస్ (Walk for Peace)" పేరుతో సాగుతున్న ఈ యాత్రలో మొత్తం 19 మంది బౌద్ధ సన్యాసులు పాల్గొంటున్నారు. వీరితో పాటు అలోకా అనే ఒక కుక్క కూడా ఈ యాత్రలో భాగం కావడం ప్రపంచ మీడియాను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రపంచంలో శాంతి, కరుణ, సమానత్వం, మానవుల మధ్య సామరస్యం పెరగాలనే ఉద్దేశంతో కొంతమంది బౌద్ధ బిక్కువులు దాదాపు 2,300 మైళ్ళ(3700 కిలోమీటర్లు) ప్రపంచ శాంతి యాత్రను చేపట్టారు. అక్కడక్కడా ఆగుతూ ప్రజలతో మాట్లాడుతూ.. శాంతి ప్రార్థనలు చేస్తూ ముందుకు ఈ యాత్ర సాగుతోంది.

ఎక్కడ, ఎప్పుడు మొదలైంది?

2025 అక్టోబర్ 26న టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ వర్త్ నగరంలోని హుయాంగ్ డావో విపస్సన సెంటర్ నుంచి 19 మంది సన్యాసులు ప్రపంచ శాంతి కొరకు ఈ యాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్ర టెక్సాస్, అలబామా, జార్జియా సహా మొత్తం 10 అమెరికా రాష్ట్రాల గుండా సాగుతోంది. ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ భవనాల దగ్గర ఆగి, శాంతి సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి అట్లాంటా నగరానికి చేరుకోగా.. రానున్న ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలోని యూఎస్ క్యాపిటల్ వద్ద యాత్ర ముగుస్తుంది. మొత్తం యాత్ర వ్యవధి సుమారు 110 నుంచి 120 రోజులు కాగా.. కొంతమంది సన్యాసులు చెప్పులు లేకుండానే నడవడం విశేషం.

ప్రజల బ్రహ్మరథం

ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్నవారు భిక్కు పన్నకార. ఆయన హుయాంగ్ డావో విపస్సన సెంటర్ వైస్ ప్రెసిడెంట్. యాత్రలో పాల్గొంటున్న సన్యాసులు లావోస్, తైవాన్, వియత్నాం వంటి దేశాల నుంచి వచ్చారు. వీరు కేవలం అవసరమైన వస్తువులనే తీసుకుని ప్రయాణిస్తున్నారు. టెంట్లు, పరుపులు వంటి కనీస సామగ్రితోనే జీవిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక బౌద్ధ సన్యాసులు 2–3 రోజుల పాటు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. యాత్ర సాగుతున్న దారిని గూగుల్ మ్యాప్స్ ద్వారా లైవ్‌గా కూడా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి యాత్ర గురించి తెలుసుకుంటున్న ప్రజలు.. వీరి యాత్రకు దారిపొడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.

ఎవరీ అలోకా..?

ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణ అలోకా అనే కుక్క. ఇది 4 ఏళ్ల ఇండియన్ పరియా జాతికి చెందిన కుక్క. 2025లో భారతదేశంలో జరిగిన 112 రోజుల శాంతి యాత్ర సమయంలో.. ఒక వీధి కుక్కగా బౌద్ధ యాత్రతో కలిసింది. అప్పటి యాత్రలో అనారోగ్యాలు, ప్రమాదాలు ఎదురైనా వెరవకుండా బౌద్ధ సన్యాసుల వెంట నడిచింది. ఇప్పుడు అమెరికాలో కూడా అదే విధంగా బౌద్ధ బిక్షువుల ముందుండి నడుస్తోంది. అలోకా అంటే సంస్కృతంలో “కాంతి” అనే అర్థం. ఈ కుక్క నుదిటిపై గుండె ఆకారంలో గుర్తు ఉండటం కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చింది. స్వయంగా బుద్ధ భగవానుడే కుక్క రూపంలో ముందుండి నడిపిస్తున్నాడు అని నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు. అలోకకు, బౌద్ధుల యాత్రకు ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షల మంది అభిమానులు ఉండగా.. వీరికి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ శాంతి యాత్రకు ప్రతీకగా మారిన అలోక... సహనం, ధైర్యానికి చిహ్నంగా నిలుస్తోంది.

Next Story