లంచాన్ని లాంఛనం చేసి లబోదిబోమనుడు ఎందుకయా.?

by Daayi Srishailam |

ఇచ్చెటోనికి "ఇగురం" లేకపోతే.. తీస్కునేటోడు "సగురం"గూడ కత్తిరించిపోతడు.

లంచాన్ని లాంఛనం చేసి లబోదిబోమనుడు ఎందుకయా.?
X

ఇచ్చెటోనికి "ఇగురం" లేకపోతే..

తీస్కునేటోడు "సగురం"గూడ కత్తిరించిపోతడు.

"లంచం తీస్కున్నోడు లత్కోర్" అంటంగానీ..

"ఇచ్చినోడు ఇగురం తప్పినోడు" అంటమా.?

ఐనా అట్లంటే మనొళ్లు ఊకుంటరా.?

"సమర్పించుకునేటోడు" లేకపోతే..

ఇక "పుచ్చుకునేటోడు" ఎక్కడుంటడు.?

బాగా అలవాటైపోయింది జనాలకు.

పని చేపించుకునుడు.. పైకం చేతిలో పెట్టుడు.

మీదికెల్లి "గుడ్‌‌విల్" అనే కవరింగొకటి.

ఏమన్నంటే "వాళ్లకు మాత్రం ఏడికెళ్లొస్తయీ" అనే ప్రేమ.

ఆలోచించండి.

లంచాలకు కంచమేస్తున్నది ఎవరు.?

లాపర్వయితే లబోదిబోమంటున్నదెవరూ.?

- దాయి శ్రీశైలం

"లంచం తీసుకునేటోడు" మంచోడని చెప్పడం లేదు. "లంచావతారులది తప్పుకాదనీ" అనడం లేదు. లంచం తీసుకున్నోడిది ఎంత తప్పో.. ఇచ్చినోడిది కూడా అంతే తప్పు అంటున్నాం."అవినీతికి ఆకలెక్కువ"ని తెలుసు కదా.? మరి అంతా తెలిసినంక "లంచాన్ని లాంఛనం" చేయడం ఎందుకు.? పీకల మీదికొచ్చినంక "అదిగో లంచం" అని మొత్తుకోవడం ఎందుకు.?

ఆశ చూపిందెవరు.?

బాలరాజు "ఏపీ బీసీ వెల్ఫేర్ ఆఫీసు"లో సీనియర్ అసిస్టెంట్ కొలువు చేస్తడు. అదే డిపార్ట్‌మెంట్లో పనిచేసే కుక్.. అటెండర్‌కి 2015 నుంచి ఇంక్రిమెంట్లు ఆగిపోయినయంటా. సర్వీస్ రికార్డు అప్డేట్ చేస్తే వాళ్ల సమస్య సాల్వ్ అవుతుంది. ఇద్దరు కలిసి బాలరాజు దగ్గరికి వెళ్లారు. "సార్.. మా సర్వీస్ రికార్డు అప్డేట్ చేయాలె.. ఇంక్రిమెంట్లు ఆగిపోయినయి.. ఉత్తగనే ఏం చెయ్యొద్దు.. అంతపూర్తి అర్సుకుంటంగానీ" అని ఆశ చూపించారు. పైసలిస్తా అంటే ఎవడన్నా వద్దంటడా.? మనోడు రూ.25 వేలు అడిగితే సరే అన్నారు. "తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టు" బాలరాజు ఇంకొంత ఆశ పడ్డడు. సరే ఇస్తామని చెప్పి.. ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కట్‌చేస్తే.. బాలరాజు రూ.25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

లంచం ఇస్తేనే పనా.?

సీనియర్ అసిస్టెంట్ బాలరాజు కావచ్చు. ఇంకొకరు కావచ్చు. లంచానికి ఆశపడి అడ్డమైన గడ్డి తినడం రోజూ చూస్తేనే ఉన్నాం. "వానొస్తే కరువుండదు.. పెనిమిటుంటే పేదరికం ఉండదు" అన్నట్లు లంచం లేకపోతే పని జరగదని మెజార్టీ ప్రజల అభిప్రాయం. "ఎవడూ ఉత్తగనే పని చేసిపెట్టరనీ.. వాళ్లకు మటుకు కుటుంబాలు ఉండవా.. కర్సులుండవా" అని ఆలోచించి లంచాలను చేజేతులా ప్రోత్సహిస్తున్నారు. అసలు "లంచం ఇవ్వకపోతే పని కాదు" అనే ఒక అభిప్రాయాన్ని సమాజంపై రుద్ది.. అడిగినా అడగకపోయినా.. చేతిలో పైసలున్నా లేకపోయినా లాంఛనంగా లంచాలిస్తున్నారు. "పనిచేసి పెట్టూ" అని అడిగేది అడుగుతూనే "ఎంత కర్సయితది" అని అడుగుతున్నారు. "పైసా ఫేక్ తమాషా దేఖ్" కల్చర్‌ను పెంచి పోషిస్తున్నారు.

తీసుకోకపోతే వేస్ట్

"ఇంటికి అవ్వ.. కొలతకు తవ్వ" అన్నట్లు "ఆఫీసరంటే కచ్చితంగా లంచం తీసుకోవాల్సిందే" అనుకుంటారు కొందరు. వాళ్ల సమస్యల్లా "లంచం వద్దు" అనడమే. తీసుకోకపోతే "ఆయ్నేం సార్‌రా.. పైసలొద్దంటడూ.? ఆయనతో పని కానట్టుంది" అనుకుంటారు. లంచం తీసుకునెటోడే లక్షణంగా పనిచేస్తాడనే అభిప్రాయంతో ఉంటారు. "పైసా తీసుకోనోడు" వాళ్ల దృష్టిలో వేస్ట్.. దద్దమ్మ. "అబ్బో పెద్ద సత్య హరిశ్చంద్రుడు.. ఇగ ఈయనొక్కడు లంచం తీసుకోకపోతే "కరప్షన్" ఆగిపోతదా.? ఆయనకేమైనా కిరీటాలు తొడిగి.. సాలార్ జంగ్ మ్యూజియంలో పెడతారా" అంటుంటారు. లంచం తీసుకునేవాడి గురించేమో "ఆ సార్ పైసల్ తీసుకున్నా.. పనిచేస్తడ్రా.. అట్లుండాలె సారంటే" అని మెచ్చుకుంటారు. ఎవడెక్కువ లంచం తీసుకుంటే వాడు అంత సమర్థుడు అనుకుంటారు.

అబ్బా.. ఏం ప్రేమండీ.?

"అయ్యకు పెండ్లి సంబరం.. అమ్మకు సవతి సంకటం" అన్నట్లు లంచం ఇస్తే పైసలు పోతయనే బాధ.. ఇవ్వకపోతే పని కాదేమోననే భయం రెండూ ఉంటాయి జనాలకు. ఇంకా కొంచెం డీప్‌గా వెళితే.. ఆ లంచం పుచ్చుకునేవాడికన్నా ఇచ్చేవాడికే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఎప్పుడు పనైపోతే అప్పుడే "పైసల కట్ట" ఇచ్చేయొచ్చని "లంచాన్ని" జేబులో పెట్టుకునే తిరుగుతాడు. "లంచావతారుల" మీద "ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తారు. అయ్యో.. కొంచెం ఎక్కువిచ్చేదుంటి. సరిపోతయో లేదో. సారేమనుకుంటుండో ఏమో" అని ఫీలైపోతుంటాడు. అసలు "లంచం ఇచ్చుడే తప్పురా నాయనా అంటే.. దానికంకా తక్వయినయో.. సరిపోతయో లేవో" అనే దెవులాటలా.? "అడ్డ జామీన్లకువోతె తెడ్డు దెబ్బలొస్తయి" అనేది ఆఖరికి తెలుసుకుంటారు.

అంత ఖాయిషెందుకో.?

"అవినీతికి పాల్పడటం తప్పు. లంచం తీసుకోవడం నేరం" అని తెలిసినా "లంచం" అడిగేటోన్ని ఎవరూ ప్రశ్నించరు. "సారుకు సాంతం సమర్పించుకుంటేనే" పనైతది అనుకుంటారు. ఎక్కడో ఒకచోట వందలో ఒకరిద్దరు మాత్రమే.. విసిగి వేసారి "యాంటీ కరప్షన్ బ్యూరో"కి సమాచారం ఇస్తారు. మిగిలినొళ్లంతా "అమ్యామ్య"ను అందలమెక్కిస్తున్నారు. వాళ్లంటే డబ్బులు ఎక్కువుండో లేదా.. పని తీవ్రత వలనో లంచమిచ్చి పని చేయించుకుంటున్నారు. కానీ పైసల్లేనొళ్ల పరిస్థితేంటి.? మనం అలవాటు చేసి చేతులు దలుపుకుంటాం. దీన్నే ఆసరగా చేసుకొని "లంచావతారులు" విజృంభిస్తు్న్నారు. "నిత్తె బూరెలుజేస్తే నిన్నెందుకు కొడ్తనే పెండ్లమా" అన్నట్టు పైసా ముడితేనే ఫైల్‌ను ముట్టుకుంటున్నారు. ఇగ.. లంచం విషయంలో తీసుకునేవాడికంటే ఇచ్చేవాడికే మస్తు ఖాయిష్ ఉంటదెందుకో.?

మంచొళ్లనూ చెడగొడుతూ..

"లంచం" పుచ్చుకునేవారు అన్ని విభాగాల్లోనూ.. అన్ని రంగాల్లోనూ ఉన్నారు. సమాజాన్ని కాపాడాల్సిన కలెక్టర్లు లంచాలకు మరిగి వ్యవస్థను మురుగుపట్టిస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్.. రెవెన్యూ డిపార్ట్‌మెంట్.. మెడికల్.. ఎడ్యుకేషన్ ఇలా అన్నింట్లో లంచావతారులున్నారు. ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసి.. ఒకే హోదాలో కొనసాగినప్పటికీ.. ఒక ఆఫీసర్ కోట్లకు ఎదిగితే ఇంకో ఆఫీసర్ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లు దివాళా తీసి ఉంటున్నారు. అలాంటివారిపై జనాలు జాలిచూపించి అడగకున్నా "గుడ్‌విల్" పేరుతో లంచం అలవాటు చేస్తున్నారు. బిల్స్ త్వరగా రావాలనీ.. సొంతూరికి ట్రాన్స్‌‌ఫర్ కావాలనీ.. ప్రమోషన్ పక్కా చేయాలని.. సర్టిఫికేట్ సకాలంలో అందాలనీ "సరిపడా కట్నం" చెల్లిస్తున్నారు. "తోటోడు తొడ కోసుకుంటే మనం మెడకోసుకోవాలె" అనే శాస్త్రం నేర్పిస్తున్నారు.

తప్పుచేసి తల దించుకుంటున్నారా.?

"ఇల్లిటం అల్లుడు ఇంటిల్లిపాదికీ మొగుడైనట్లు" లంచానికి మరిగినొళ్లు మస్తు ముదిరిపోతున్నారు. వారి కోరికలకు హద్దే ఉండట్లేదు. ఐదో పదో అంటే ఏమో అనుకోవచ్చు. లంచమే డెబ్బయ్ లక్షల రూపాయలంటే కథ ఎట్ల నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. లంచం తీసుకొని అరెస్టయి.. సస్పెండైనొళ్లు ఎంతమంది మారిపోయారు. ఎంతమంది సత్యహరిశ్చంద్రులయ్యారు.? అసలు వాళ్లు చేసింది తప్పు అనే భావనే లేదు. "హే.. వాన్దేముందిరా.. ఇట్ల జైలుకువొయ్యి అట్ల బైటికొస్తడు. మల్లా పెద్దొళ్లతోని మాట్లాడి కొలువెక్కుతడు" అనేంత దర్జాగా బతుకుతున్నారు. "లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆఫీసర్" అని రోజూ ఎన్నో వార్తలొస్తున్నాయి. డబ్బు.. పలుకుబడితో లంచం తీసుకున్నోడే లక్షణంగా కనిపిస్తున్నాడు.

తప్పెవరిది సారూ.?

ఒకడి అవసరాన్ని ఇంకొకడు క్యాష్ చేసుకోవడమే "లంచం". రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రెవిన్యూ ఆఫీసులో పనిచేసే ఆర్ఐ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎంతో తెలుసా.. అక్షరాలా పన్నెండు లక్షలు. అదికూడా వాళ్లకు బంధువుల దగ్గరేనంటా. ఇంకా అదే ఆఫీసులో ఓ కింది స్థాయి ఉద్యోగి పాత పహనీలు.. రికార్డులు అవసరం ఉండి ఎవరైనా ప్రజలు వెళితే మినిమం రెండువేలు ఇస్తేనే పనిచేసి పెడతాడు. ఒకవేళ ఎవరైనా రూల్స్ మాట్లాడితే అంతే ఇక వాళ్ల పని ఎప్పటికీ కాదు. "పొట్టోని నెత్తి పొడుగోడు కొడ్తే.. పొడుగోని నెత్తి పోషవ్వ కొట్టినట్టు" ఇలాంటివాళ్ల పని ఏసీబీ వాళ్లు పడుతున్నారు. ఇలా కిందిస్థాయి నుంచే అవినీతి జరుగుతోంది. లంచం విషయంలో తప్పెవరిది.? అవకాశం ఉంది కదా అని లంచం తీసుకునేవాడిదా.? అవసరం కాబట్టీ సమర్పించుకున్నోడిదా.?

మారండ్రా సామీ.!

లంచం.. లంచం.. లంచం. ఎందెందు చూసినా లంచం కనిపిస్తోంది. ఒకరకంగా సర్వాంతర్యామి అయిపోయింది. మంత్రి కొండా సురేఖ ఇదే ముచ్చట చెప్పారు కదా.? మంత్రులు పర్సెంటేజీల పేరుతో లంచం తీసుకుంటారు.. నేను తీసుకోను అనీ. కాంట్రాక్టర్లు.. వ్యాపారస్తులు.. సెటిల్మెంట్లు చేసేవాళ్ల లావాదేవీలో కోట్లలో ఉంటాయి కాబట్టీ.. పనుల వేగవంతం కోసం లంచాలు ఇస్తున్నారు. వాళ్లను చూసి కిందిస్థాయి ఉద్యోగులూ వాళ్ల స్థాయిలో లంచాలకు చెయ్యి చాచుతున్నారు. "ఎందుకొచ్చినవే ఎల్లవ్వా అంటే అందుకు కాదుతియ్ అగ్గికొచ్చినా అన్నట్టు" మేమిచ్చేది లంచం కాదు గుడ్‌విల్" అనీ కవరింగులిస్తున్నారు. రేషన్ కార్డులు.. ఫించన్లు వంటి చిన్న చిన్న పనులకూ లంచం తీసుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు సామీ.. జర మారండ్రా అయ్యా.!

లంచాల క్యాలెండర్.!

క్యాలెండర్లో ఎన్నిరోజులంటే అన్ని రోజులు "లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి" అనే వార్తలొస్తున్నాయి. ఒకసారి ఇది చూడండి.

01.05.2025: శామీర్‌పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు కొట్టేసి తమ సెల్‌ఫోన్లు ఇప్పించాలని ఇద్దరు వ్యక్తులు ఎస్ఐ పరశురామ్‌ను కోరారు. అలా చేయడం కోసం రూ.2 లక్షలు తీసుకున్నాడు పరుశురామ్. అదీ చాలదన్నట్టు.. సెల్‌ఫోన్లు అప్పగించేందుకు మరో రూ.22 వేలు డిమాండ్ చేసి.. తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

06.05.2025: ములుగు జడ్పీ సీఈఓ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు అనారోగ్యంతో లీవ్ పెట్టాడు. తన మెడికల్ లీవ్ సెటిల్మెంట్‌ చేసి ట్రెజరీకి పంపాలని.. జడ్పీ సూపరిండెంట్‌ సుధాకర్.. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షనాఫీసర్ సౌమ్యారెడ్డికి అర్జీ పెట్టుకున్నాడు. దానికోసం రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి రూ.25 వేలు తీసుకుంటూ దొరికారు.

08.05.2025: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ సబ్ స్టేషన్ ఏఈ జ్ఞానేశ్వర్.. మిథిలా నగర్లోని ఒక బిల్డింగ్ ముందు ట్రాన్స్‌ఫార్మర్ కేవీ లైన్ మార్చేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు డిమాండ్ చేయగా రూ.30 వేలకు డీల్ కుదిరింది. దీంట్లో భాగంగా రూ.10 వేలు లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు.

10.05.2025: షాపూర్ పల్లోంజి నిర్మాణ సంస్థ టాక్సేషన్ ఫైల్ పెండింగ్‌ను క్లియర్ చేసేందుకు రూ.1.20 కోట్లు డిమాండ్ చేశాడు. ఇద్దరు మధ్యవర్తుల ద్వారా రూ.15 లక్షలు లంచం తీసుకున్నాడు. మరో రూ. 70 లక్షలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులకు దొరికిపోయాడు. లంచం ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చారు.

11.05.2025: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అవునూరు.. అగ్రహారం గ్రామాల మధ్య రూ. 8 కోట్లతో కాంట్రాక్ట్‌తో చెక్ డ్యాం కట్టాడొక కాంట్రాక్టర్. బిల్లుల చెల్లింపు కోసం ఈఈ అమరేందర్ రెడ్డి రూ.4 లక్షల లంచం తీసుకున్నాడు. ఇంకో రూ. 50 లక్షలు బిల్లులు రావాల్సి ఉంటే వాటికోసం రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు అమరేందర్.

15.05.2025: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ స్కానింగ్ సెంటర్ నిర్వహకుడిని రూ.25 లక్షలు లంచం డిమాండ్ చేసిన డీఎస్పీ, సీఐ ఏసీబీకి పట్టుబడ్డారు. పోలీసులతో సన్నిహితంగా ఉండే రేషన్ దందా చేసే డీలర్, ఓ ఆస్పత్రి నిర్వహకుడు మధ్యవర్తిత్వం వహించి స్కానింగ్ సెంటర్ పై కేసు నమోదు చేయకుం కోటి రూపయల డీల్ మాట్లాడారు.

ఏ దేశంలో.. ఏ శిక్ష.?

ఇండియాలో: లంచం ఇవ్వడం లేదా తీసుకోవడం చేస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం నేరం. 2018లో ఈ చట్టంలో సవరణ చేసి లంచం ఇచ్చే వ్యక్తికి కూడా శిక్ష వేయాలన్నారు. లంచం తీసుకున్నవారితో పాటు ఇచ్చిన వారికి కూడా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష అమలు చేస్తారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి సంస్థలు కేసులను పరిశీలిస్తాయి.

అమెరికాలో: ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిద అమెరికా కంపెనీలులేదా వ్యక్తులు విదేశాల్లో లంచం ఇవ్వడం నిషేధం. అలాగే దేశీయంగా యాంటీ కరప్షన్ చట్టాలుంటాయి. కొన్నిసార్లు లక్ష డాలర్ల వరకు జరిమానా.. 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ ఈ కేసును పరిశీలిస్తాయి.

చైనాలో: యాంటీ కరప్షన్ రెగ్యులేషన్స్ ప్రకారం లంచం ఇవ్వడం తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు. చిన్న లంచాలకు మూడళ్లు.. భారీ లంచాలకు జీవతఖైదు విధిస్తారు. సెంట్రల్ కమిషనర్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ వీటిని దర్యాప్తు చేస్తుంది.

సింగపూర్‌లో: ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం లంచం ఇవ్వడం తీవ్రమైన నేరం. దీనికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష.. SGD 100,000 వరకు జరిమానా ఉంటుంది. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కేసులను పరిశీలిస్తుంది.

సౌదీ అరేబియా: ఇస్లామిక్ షరియా.. యాంటీ కరప్షన్ చట్టాల ప్రకారం లంచం ఇవ్వడం నిషేధం. ఇస్తే జరిమానాలు.. శిక్షలు వేస్తారు. కొన్ని సందర్భాల్లో బహిష్కరణ విధిస్తారు. నేషనల్ యాంటీ కరప్షన్ కమిషన్ ఈ కేసులను దర్యాప్తు చేస్తుంది.

అంతర్జాతీయ ఒప్పందాలు: ఓఈసీడీ యాంటీ బ్రైబరీ కన్వెన్షన్ ప్రకారం 44 దేశాలు సభ్యులుగా ఉన్న ఒప్పందంలో అధికారులకు లంచం ఇవ్వడాన్ని నిషేధించారు. యునైటెడ్ నేష్స్ కన్వెన్షన్ ఎగేనెస్ట్ కరప్షన్ ప్రకారం 180 దేశాలున్న ఒప్పందంలో అవినీతి.. లంచాలను తీవ్రంగా పరిగణించారు.

తప్పే కానీ: రాపోలు సత్య నారాయణ, సామాజికవేత్త

లంచం తీసుకోవడం.. ఇవ్వడం రెండూ తప్పే. రెండూ నేరమే. అయితే కామన్ మ్యాన్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక అవసరంగా మారిపోతుంది. ఎంతో కొంత ఇవ్వకపోతే పని కాదు అనే ఉద్దేశంతో ఇస్తున్నారు. తన అవసరం లంచం ఇచ్చేలా ప్రోత్సహిస్తుంది. ఆఫీసర్ల అవకాశం ఎవడి తాకత్ ఏంటి అని తెలుసుకోకుండా లంచాన్ని బాజాప్తాగా తీసుకుంటున్నారు. పైసలివ్వకపోతే పనిచేయరు అనే మైండ్‌సెట్‌తో జనాలున్నారు కాబట్టీ.. ఎవరు మారాలో ఆలోచించండి.

పాటించని వారే: నాగరాజు మున్నూరు, విశ్లేషకుడు

కొందరికి కొన్ని లోపాలుంటాయి. వాటిని కప్పి పుచ్చుకోవడం కోసం లంచం ఇవ్వడమే అనివార్యం అనుకుంటారు. ఇంకా కొందరేమో నిర్దేశించిన గడువుకు ముందుగా.. ఇతరుల కంటే ముందే తమ పని పూర్తికావాలనీ లంచాలి ఇవ్వజూపుతారు. వీళ్లంతా నిబంధనలు పాటించని రకం. ఇలా కాకుండా నిబంధనల్నీ కరెక్టుగా పాటించేవారు ఒక్కడికీ పైసా లంచం ఇవ్వరు. కాకపోతే వ్యవస్థ బాగా ముదిరిపోయింది కాబట్టీ ఇలాంటి వాళ్లు కూడా కొన్నిసార్లు లంచాలిస్తున్నారు.

Next Story