రేడియో ధార్మికత పనిపట్టే ఫంగస్.. ఇకపై ఎలాంటి అణువిపత్తులు వచ్చినా నో టెన్షన్

by Muthe.Rajitha |

ఇటీవల రష్యా శాస్త్రవేత్తలు చెర్నోబిల్ రియాక్టర్ గోడలపై అరుదైన నల్లని ఫంగస్‌లను కనుగొన్నారు.

రేడియో ధార్మికత పనిపట్టే ఫంగస్.. ఇకపై ఎలాంటి అణువిపత్తులు వచ్చినా నో టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్ : మనిషి ప్రకృతిని ఎంత నాశనం చేస్తూ పోయినా.. ప్రకృతి మాత్రం మానవునికి ఏదోక సహాయం చేస్తూనే ఉంటుంది. మనిషి తన స్వార్థం కోసం కనిపెట్టిన అణు పదార్థాలు... ఇపుడు ప్రపంచానికి అత్యంత తీవ్ర సమస్యగా తయారయ్యాయి. న్యూక్లియర్స్ పదార్థాలతో ఎంత ఉపయోగం ఉందో.. అంతకంటే ఎక్కువగా మానవ మనుగడకే ముప్పుగా దాపురించాయి. రష్యాలో జరిగిన చెర్నోబిల్ అణువిపత్తే ఇందుకు పెద్ద ఉదాహరణ. 1986 ఏప్రిల్ 26న జరిగిన చెర్నోబిల్ అణు విపత్తులో చెలరేగిన రేడియో ధార్మిక పదార్థాల వల్ల వేలాది మంది మరణించగా.. లక్షలాది మంది దాని ప్రభావానికి గురయ్యారు. ఇప్పటికీ దాని ప్రభావంతో నమోదయ్యే క్యాన్సర్ కేసులు ఎక్కువే.

ఈ అణు విపత్తు చేసిన తీరని గాయాన్ని దాదాపు 4 దశాబ్దాల తర్వాత ప్రకృతి మాన్పుతోంది. ఇటీవల రష్యా శాస్త్రవేత్తలు చెర్నోబిల్ రియాక్టర్ గోడలపై అరుదైన నల్లని ఫంగస్‌లను కనుగొన్నారు. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ గదుల గోడల మీద క్లాడోస్పోరియం స్ఫేరోస్పెర్మమ్, క్రిప్టోకాకస్ నీయోఫార్మన్స్ వంటివి పెరుగుతున్నట్లు కనుగొన్నారు. సాధారణ ఫంగస్‌లకు భిన్నంగా, ఈ జీవులు అధిక రేడియేషన్‌లో కేవలం జీవించడమే కాక, వృద్ధి చెందాయి కూడా. రేడియోట్రోఫిక్ ఫంగస్‌లని పిలిచే ఇవి, మానవ చర్మంలో కనిపించే మెలనిన్ అనే వర్ణకాన్ని అధికంగా కలిగి ఉంటాయి. ఈ మెలనిన్ ఫంగస్‌ రేడియేషన్ నుండి కాపాడడమే కాక, గామా కిరణాల వంటి అయనీకరణ రేడియేషన్‌ను గ్రహించి, ఉపయోగకరమైన శక్తిగా మార్చుతున్నట్టు తేల్చారు.

ఈ రేడియోసింథసిస్ విధానం మొక్కల్లో సూర్యకాంతితో జరిగే ఫొటోసింథసిస్ విధానాన్ని పోలి ఉంటుంది. అయితే 2018–2019లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రయోగాల్లో మెలనైజ్డ్ ఫంగస్ రేడియేషన్‌ను తగ్గించడమే కాకుండా.. సాధారణ వాతావరణంతో పోలిస్తే రేడియోఆక్టివ్ పరిస్థితుల్లో బాగా వృద్ధి చెందగలదని నిరూపించబడింది. 1.7 మిమీ మందంతో కూడిన ఫంగస్ పొర 2% కంటే ఎక్కువ కాస్మిక్ రేడియేషన్‌ను అడ్డుకున్నట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ మందమైన ఫంగస్ పొరలు అంతరిక్ష ప్రయాణాల్లో, ముఖ్యంగా మార్స్ మిషన్లలో జీవ రేడియేషన్ షీల్డ్‌లుగా పనిచేయగలవని అంచనా వేస్తున్నారు.

ఈ ఫంగస్‌ల ఆవిష్కరణ బయోరిమీడియేషన్, అంతరిక్ష ప్రయాణ రక్షణ కవచాలు, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో మనుగడ సాగించడం వంటి అంశాలను అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు ఆసక్తిని రేకెత్తించింది. త్వరలోనే ఈ ప్రయోగాలు మానవాళిని అణువిపత్తుల నుంచి రక్షిస్తాయని వారు అభిప్రాయ పడుతున్నారు.

Next Story