- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పావురాల వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందా?.. ఇక దూరంగా ఉండాల్సిందేనా..?
సోమేశ్ ఓ ఇంజినీరింగ్ కుర్రాడు. శక్తి తక్కువగా ఉండటంతో ప్రతిరోజూ సమీపంలోని పార్క్ వెళ్లి వాకింగ్ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడున్న పావురాలకు బియ్యం నూకలు ఆహారంగా వేయడం చేస్తున్నాడు.

సోమేశ్ ఓ ఇంజినీరింగ్ కుర్రాడు. శక్తి తక్కువగా ఉండటంతో ప్రతిరోజూ సమీపంలోని పార్క్ వెళ్లి వాకింగ్ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడున్న పావురాలకు బియ్యం నూకలు ఆహారంగా వేయడం చేస్తున్నాడు. అయితే, కొద్దిరోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్న అతడు అకస్మాత్తుగా జబ్బు పడ్డాడు. పరీక్షలు చేయిస్తే హిస్టోప్లాస్మోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అతడి రోజువారీ దినచర్యను తెలుసుకుని.. వ్యాధికి కారణం చెప్పడంతో సోమేశ్ తోపాటు అతడి కుటుంబసభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. పావురాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో హిస్టోప్లాస్మోసిస్ తోపాటు సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుందని దీనివల్లే జబ్బు పడ్డాడని చెప్పారు. పావురాల వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందా? అని ఆ కుటుంబం జాగ్రత్త పడసాగింది.
రజని ఓ గృహిణి.. తన మూడేళ్ల కొడుకును ప్రతిరోజూ సాయంత్రం అపార్ట్ మెంట్ కిందికి తీసుకువచ్చి కాసేపు ఆటలాడిపిస్తుంది. తన కొడుకు అక్కడున్న పావురాల వద్దకు వెళ్లగానే అవి ఎగిరిపోతున్న దృశ్యం ఆమెకెంతో నచ్చేది. కొద్దిరోజులకే బాబు అనారోగ్యం పాలయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స చేయించారు. అతడికి క్రిప్టోకాకస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు చెప్పారు. పక్షుల రెట్టలనుంచి ఈ ఇన్ ఫెక్షన్ వస్తుందని చెప్పడంతో.. తన కొడుకు పావురాలతో ఆడుకున్న దృశ్యాలు కళ్లముందు కదలాడాయి. అంతే అప్పటినుంచి పావురాలకు దూరంగా ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నది.
నిజానికి పావురం అంటేనే స్వేచ్ఛకు సంకేతంగా, శాంతి దూతగా ఊహించుకుంటాం. ఆకాశంలో గుంపులుగా ఎగురుతుంటే ఈ ఉరుకు పరుగుల జీవితంలోనూ ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. మనమూ అలా ఎగిరిపోతే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది. పైన చెప్పిన ఉదాహరణలు చూస్తే.. పావురాల వల్ల ఇంతటి నష్టం జరుగుతుందా? అని భయం కలుగుతున్నది. మరోవైపు పిచ్చుకలు, గోరింకల వంటి పక్షులు అంతరిస్తుంటే పావురాల సంతతి ఎందుకు పెరుగుతున్నది. రేడియేషన్, కాలుష్యం ఎలా తట్టుకుంటున్నాయి? వీటికి బియ్యం, జొన్నలు ఇవ్వడం వల్ల కలిగే నష్టం ఏమిటి? పావురాలకు ఆహారం ఇవ్వొద్దని పుణె మున్సిపాలిటీ అధికారులు ఎందుకు హెచ్చరిస్తున్నారు. ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తామని ఎందుకు వీధివీధినా పోస్టర్లు వేస్తున్నారు. లండన్ లో అయితే 100పౌండ్లు (మన కరెన్సీలో రూ.లక్షపైనే) ఫైన్ వేస్తారు. అయితే, స్వేచ్ఛ, శాంతికి ప్రతిరూపమైన పావురంతో మనిషికి ఎలాంటి ముప్పు పొంచి ఉన్నది. పావురం వల్ల మనిషి నష్టమా..? లేక మనిషి వల్లనే పావురం నష్టపోతున్నదా? పావురంపై ‘దిశ’ ప్రత్యేక కథనం. - సాయికుమార్ కట్ట
పావురాలు.. అడవులు, పల్లెలకంటే ఎక్కువ నగరాల్లోనే కనిపిస్తుంటాయి. ఎంత ఎక్కువమంది జనం ఉంటే అక్కడ పావురాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. నిజమే మీరెప్పుడైనా పల్లెల్లో పావురాలు ఉండటాన్ని గమనించారా? లేదనే సమాధానం వస్తుంది కదా. ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. గతంలో పావురాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నా.. నగరాల్లో ఉన్నవి మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. మనం వాటికి బియ్యం, జొన్నలు ఇతరత్రాలు దాణాగా ఇస్తుంటాం. ప్రకృతిలో లభించే చక్కటి పోషకాహారం తీసుకోవాల్సిన జీవులు.. ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటే ఎలా? ఈ అంశంపైనే ఇప్పుడు పక్షుల ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. పావురాలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయని.. భవిష్యత్తులో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే, పావురాల్లో అరుదైన స్థితిని చూడవచ్చు. ఒకవైపు మనుషులు ఇచ్చే ఆహారం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గి పావురాల జీవితకాలం తగ్గుతుండగా.. మరోవైపు ఇబ్బడిముబ్బడిగా గుడ్లు పెడుతూ సంతతి పెంచుకుంటున్నాయి. ఈ పరిస్థితి మరే జీవిలోనూ కనిపించదంటే అతిశయోక్తి కాదేమో.. తన ఆనందంకోసం అనవసరంగా ఆహారం అందిస్తూ పావురానికి మనిషి తీరని నష్టం చేస్తుండగా.. పావురం తన వ్యర్థాలతో మనిషికి కూడా నష్టం చేస్తున్నది. అందువల్ల పావురానికి కృత్రిమ ఫీడింగ్ ఆపి.. సొంతంగా ఆహారం సంపాదించుకునేలా స్వేచ్ఛనిస్తే పావురం కూడా మనిషికి పర్యావరణానికి హితంగా మారుతుంది.
పావురాలు.. ఎన్ని రకాలు
దేశంలో పావురాలు ఐదు రకాలు. ఇందులో ముఖ్యమైనది మన హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కనిపించేవి రాక్ పావురాలు. ఇవి బూడిరంగులో ఉండి మెడపై మెరిసే ఈకలు ఉంటాయి. మనుషులకు దగ్గరగా ఉంటాయి. స్నేహపూర్వకమైనవి. వాటికి దాణా ఇస్తే చేతులు, భుజంపై వాలతాయి. తెలుపు రంగు పావురాలను స్నో, హిల్ పావురాలు అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా హిమాలయాల వద్ద కనిపిస్తాయి. చల్లని వాతావరణంలోనే జీవిస్తాయి. గ్రీన్ ఇంపీరియల్ జాతి పావురాలు ఎక్కువగా ఈశాన్య భారతంతోపాలు అండమాన్ దీవుల్లో కనిపిస్తాయి. ఆకుపచ్చ ఈకలు వీటి ప్రత్యేకత. ఎల్లో ఫుటెడ్ గ్రీన్ పావురం.. ఇవి అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటి కాళ్లు పసుపు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ ఐదు రకాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నవి రాక్ పావురాలే. మనుషుల మధ్య జీవించడం వాటికి వరమూ కావొచ్చు శాపమూ కావొచ్చు.
పావురాలతో ప్రమాదం
జనావాసాల్లో పావురాలను పెంచడం వల్ల మనుషులకు తీవ్రమైన అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉన్నదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా పావురాల రెట్టలు కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకాకస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, సాల్మొనెల్లా లాంటి బ్యాక్టీరియా పక్షుల రెట్టల ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, ఇప్పటికే శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. పావురాల రెట్టలో యూరిక్ ఆమ్లం అధిక స్థాయిలో ఉంటుంది. ఇది గాలిలో కలిసి మనిషి ఊపిరితిత్తుల్లో చేరి ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కారణం అవుతుంది. దగ్గు, జ్వరం, చాతి నొప్పి లక్షణాలుగా కనిపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే మెదడు, వెన్నెముకకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.
చిన్నారుల్లోనూ తీవ్ర సమస్యలు
చిన్నపిల్లల్లో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. దీర్ఘకాలంగా జ్వరం, శ్వాస ఆడకపోవడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గినా బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పిల్లల్లో మెదడుకు ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉన్నది. శ్వాస సంబంధిత వ్యాధులు నగరాల్లో పెరగడానికి కాలుష్యం తర్వాత పావురాలే కారణమని వైద్యులు చెప్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
క్యాన్సర్ ప్రమాదం ఉన్నదా?
సోషల్ మీడియాలో పావురాలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని వీడియోలు చేస్తున్నారు. నిజానికి పావురాలతో క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకాకస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు పావురాలే కారణమని వైద్యులు సైతం చెప్తున్నారు. అంతేకానీ, క్యాన్సర్ వ్యాప్తికి పావురాలకు ఎటువంటి సంబంధం లేదని వైద్యులు, పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
పావురాలకు ఫీడింగ్ సరైనదేనా?
పావురాలకు ఆహారం ఇస్తే మంచిదని చాలామంది భావిస్తుంటారు. మన హైదరాబాద్‌లో గల్లీగల్లీకి కిలోల కొద్దీ పావురాలకు మేత వేస్తుంటారు. అవి అక్కడికే గుంపులు గుంపులుగా వచ్చి తింటుంటాయి. మరి, పక్షులకు ఆహారం ఇవ్వడం సరైనదేనా? అన్న విషయం మాత్రం తెలుసుకోరు. ఎక్కువగా బియ్యం నూకలు మరికొందరు మిగిలిన అన్నం, రొట్టెముక్కలు కూడా ఆహారంగా వేస్తుంటారు. మనం ఇచ్చే ఆహారం ఏది సహజమైనది కాకపోవడంతో పావురాల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటున్నది. ఇతర అనేక రోగాలబారిన పడుతున్నాయి. పిచ్చుకలు ఇతర పక్షులు పట్టణాల్లో ఉన్నా అవి తమ ఆహారాన్ని వేట ద్వారానే సాధించుకుంటాయి. ప్రకృతిసిద్ధంగా లభించేవే తీసుకుంటాయి. కానీ, పావురాలు మాత్రం అలా కాదు. అందుబాటులో ఉన్న ఆహార వనరులకు అనుగుణంగా మారాయి. కాలుష్యాన్ని, రేడియేషన్ ను తట్టుకునేలా రోగ నిరోధకశక్తిని పెంచుకున్నాయి. వైరస్ మ్యుటేషన్ జరిగినట్టు.. పావురాల్లోనూ అత్యంత కఠిన పరిస్థితుల్లో బతికేందుకు ఎదురొడ్డుతున్నాయి.
నష్టాలు
తగ్గుతున్న వేట: ఏ ప్రాణి అయినా సొంతంగా ఆహారం సంపాదించుకోవడం ప్రకృతి ధర్మం. ప్రాణులు తాము తినే ఆహారం కోసం అలుపెరగకుండా పోరాటం చేయాలి. కానీ, పావురాలు తమ సహజ లక్షణాన్ని వదిలిపెట్టాయి. గింజలు, కీటకాలను తినాల్సిన పావురాలు మనుషులు అందించే బియ్యం, నూకలపై ఆధారపడుతున్నాయి. దీనివల్ల స్థిరమైన ఆహార వనరు లభించడంతో పునరుత్పత్తి రేటు పెరిగింది. ఫలితంగా మిగితా పావురాల జాతులు అతి తక్కువ గుడ్లు పెడుతుండగా.. రాక్ పావురాలు మాత్రం ఏడాది డజన్ గుడ్లు పెడుతున్నాయి.
పెరిగిన పోటీ: నగరాల్లో పావురాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో వాటిలో వాటికే పోటీ పెరుగుతున్నది. ఆహారం, గూడు కోసం స్థలాలు దొరకడంలేదు.
పోషకాహార లోపం: మానవులు ఇచ్చే ఆహారం (ఉడికించిన బియ్యం, రొట్టె)లో పావురాల సహజ ఆహారం కంటే తక్కువ పోషక విలువలు ఉంటాయి. దీర్ఘకాలంలో ఇది వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.
జీర్ణ సమస్యలు: పావురాల జీర్ణవ్యవస్థ సహజంగా లభించే గింజలు, పండ్లకు అనుగుణంగా ఉంటుంది. కృత్రిమ ఆహారం వల్ల జీర్ణ సమస్యలు, ఊబకాయం లేదా ఇతర జీవక్రియ సమస్యలు తలెత్తవచ్చు. మనుషులు పావురాలకు ఉడికించిన బియ్యం ఆహారంగా ఇస్తుంటారు. కానీ, పావురాల జీర్ణవ్యవస్థ సహజంగా లభించే పొడి గింజలకు అనుకూలంగా ఉంటుంది. ఉడికిన బియ్యం తినడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. గట్టి రెట్టలు ఏర్పడి.. జీర్ణవ్యవస్థలో అవరోధాలకు దారితీస్తుంది.
పచ్చి జొన్నలు/బియ్యం: పచ్చి జొన్నలు సహజ గింజలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి తక్కువ హాని కలిగిస్తాయి. అయితే, అధిక మోతాదులో తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది, ఎందుకంటే ఇవి వాటి రోజువారీ ఆహార వైవిధ్యాన్ని సరిపోనంతగా భర్తీ చేయవు.
అధిక కార్బోహైడ్రేట్లు: బియ్యం, జొన్నలు ఎక్కువగా కార్బోహైడ్రేట్లను అందిస్తాయి. పావురాలు ఈ ఆహారంపై ఆధారపడితే, అవసరమైన దానికంటే ఎక్కువ శక్తి పొంది, ఊబకాయం సమస్య ఎదుర్కోవచ్చు. పైగా వాటి శరీరంలో ఆమ్ల స్థాయులు పెరుగుతాయి. అంతిమంగా పావురాల రెట్టల్లోని ఆమ్లస్థాయి కారణంగానే మళ్లీ మనుషులకు హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకాకస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, సాల్మొనెల్లా లాంటి బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఇది వారి ప్రాణాలకు కారణం అవుతుంది.
రోగాల వ్యాప్తి: ఒకేచోట ఎక్కువ పావురాలు గుమిగూడి ఆహారం తినడం వల్ల రెట్టలు, ఈకల ద్వారా బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి వ్యాపిస్తాయి, ఇది వాటి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతున్నది.
ఇతర జాతులకు హాని: పావురాలు మానవ ఆహారంపై ఆధారపడి జనసంఖ్యలో ఆధిపత్యం సాధిస్తే, ఇతర పక్షులైన పిచ్చుకలు, గోరింకలకు ఆహారం, నివాసం కోసం పోటీ పడాల్సి వస్తుంది. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నది.
పావురాలు మ్యుటేట్ అయ్యాయా?
పావురాల్లో కొన్ని ముదురు బూడిద లేక లేత గులాబీ రంగులో కనిపిస్తాయి. ఈ రంగులు ఎలా మారుతున్నాయి? కొందరు మాత్రం కరోనా వైరస్‌లా పావురాలు సైతం మ్యుటేట్ అవుతున్నాయా? అన్న సందేహాలను పరిశోధకులు నివృత్తి చేశారు. సాధారణంగా జన్యు మార్పుల వల్లనే పావురాల్లో రోగ నిరోధకశక్తితోపాటు రంగు మారిందన్న వాదనలకు అంతగా బలం లేదని స్పష్టం చేశారు. కేవలం పరిస్థితులను బలంగా ఎదుర్కోవడంతోనే రోగ నిరోధకశక్తి పెరిగిందని.. రంగు మార్పులకు పర్యావరణ ప్రభావమే బలమైన కారణంగా చెప్తున్నారు.
పెరుగుతున్న సంతతి..
ప్రపంచవ్యాప్తంగా 300కిపైగా పావురాల జాతులు ఉన్నా.. వీటిలో చాలా జాతులు అంతరించాయి. కానీ, రాక్ పావురాలు మాత్రం సంతతిని పెంచుకుంటున్నాయి. వీటివల్ల పట్టణాల్లో ఇతర పక్షుల ఉనికి కూడా ప్రమాదంలో పడుతున్నది. అవి తినే సహజసిద్ధమైన ఆహారాన్ని కూడా ఇవే తినేస్తుండటంతో అవి ఆకలితో చనిపోతున్నాయి. అడవుల్లో గద్దలు తదితర వేటాడే పక్షులతోపాటు జంతువుల కారణంగా వీటికి ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేది. కానీ, పట్టణాల్లో నివాసం కారణంగా వీటికి ఎటువంటి నష్టం జరుగడంలేదు. పైగా ఆహారం కూడా కష్టపడుకుండానే లభిస్తున్నది. సాధారణ పావురాలు ఏడాది కనీసం డజను గుడ్లు పెడతాయి. నిజానికి మనుషులు పెడుతున్న ఆహారం తినడం వల్ల పావురాల్లో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నాయి. వేట కష్టం లేకపోవడంతో కదలడమే కష్టంగా మారి బరువెక్కుతున్నాయి. గతంలో పావురాల జీవితకాలం 12నుంచి15ఏండ్లు కాగా, ఇప్పుడు గరిష్ఠంగా రెండు నుంచి మూడేళ్లు బతుకుతున్నాయి. కానీ, తమ జాతిని కాపాడుకునేందుకు రోగనిరోధక శక్తి ఉన్నసమయంలోనే గరిష్ఠంగా గుడ్లు పెడుతున్నాయి. దీంతో పావురాలు త్వరగా చనిపోతున్నా.. సంతతి మాత్రం భారీగా పెరుగుతున్నది. కానీ, ఇది ఎంతకాలం అన్నది ప్రశ్నార్థకంగా మారింది.






