- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జెండా పాతిన బలూచిస్తాన్.. ప్రాంతీయ ఉద్యమాలతో జయకేతనం
పాకిస్తాన్ నుంచి ఇటీవలే స్వాతంత్రం ప్రకటించుకున్న బలూచిస్తాన్ ప్రజలు గతంలో భారతదేశంలో కలువాలని భావించారని మనలో ఎంతమందికి తెలుసు?

పాకిస్తాన్ నుంచి ఇటీవలే స్వాతంత్రం ప్రకటించుకున్న బలూచిస్తాన్ ప్రజలు గతంలో భారతదేశంలో కలువాలని భావించారని మనలో ఎంతమందికి తెలుసు? స్వాతంత్యానికి ముందు భారత్, పాక్ విభజన సమయంలోనే బలూచ్ లోని కలాత్ నాయకులు భారత్ లో విలీనం అవుతామని చెప్పినా నెహ్రూ వద్దన్నారా? తొలుత స్వతంత్ర కలాత్ కు మద్దతు ఇచ్చినా జిన్నా.. ఆ తర్వాత కొంతకాలానికే పాక్ లో విలీనానికి సైన్యంతో ఒత్తిడి తెచ్చారా? ఇప్పుడు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తే.. భారత ఆగర్భశత్రువు పాక్ కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఇప్పటికే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా అవతరించింది. దీనికి 1971లో భారత్ చేసిన యుద్ధమే కారణం.. ఇప్పుడు మరోసారి పాక్ వెన్నెముక విరిచేసేందుకు భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ కారణం అవుతున్నదా? అసలు బలూచిస్తాన్ ప్రజలు పాక్ పై ఎందుకు తిరగబడుతున్నారు? ఈ అంశాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం. - శరత్ చంద్ర
1947లో బ్రిటిష్ వారు భారత ఉపఖండం నుండి నిష్క్రమించే వరకు బలూచిస్తాన్.. నాలుగు స్వతంత్ర రాచరిక సంస్థానాలను కలిగిఉన్నది. మాక్రాన్, ఖరాన్, లాస్ బేలా, కలాత్ రాష్ట్రాలు ప్రధానంగా 'ఖాన్ ఆఫ్ కలాత్' పాలనలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు స్వతంత్రంగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ రాజ్ అధీనంలోనే ఉన్నాయి. 1876 లో జరిగిన కలాత్ ఒప్పందం ప్రకారం.. ఈ నాలుగు రాష్ట్రాలతో సంబంధాలు నిర్వహించటానికి బ్రిటిష్ వారు ప్రత్యేకంగా బలూచిస్తాన్ ఏజన్సీని స్థాపించారు. ఇప్పుడు ఉన్న పాకిస్తాన్‌తో 1947 వరకు బలూచిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇది బ్రిటీష్ హయాంలోకూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేది. 1947లో బ్రిటిష్ అధీనంలో ఉన్న స్వతంత్ర రాజ్యాలను పాకిస్తాన్, భారత్‌లో విలీనం కావటానికి వారికే స్వాతంత్రం ఇచ్చారు.
అప్పటికే బలూచిస్తాన్ ఏజెన్సీలో ఉన్న నాలుగు సంస్థానాలను నియంత్రిస్తూ 'కలాత్ ఖాన్' అని పిలువబడే మీర్ అహ్మద్ యార్ ఖాన్ ప్రముఖ స్థానంలో ఉన్నారు. విభజనకు ముందు రోజుల్లో కలాత్ ఖాన్‌కు ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా న్యాయసలహాదారుగా ఉండేవారు. ఆ తరువాత జిన్నా, కలాత్ ఖాన్‌ను పాకిస్తాన్‌లో చేరమని కోరాడు. అప్పటి బలూచిస్తాన్ నాయకులు స్వతంత్రంగా ఉండటానికే సిద్ధపడ్డారు. 1947, ఆగస్టు 4న ఢిల్లీలో జరిగిన సమావేశంలో అప్పటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బ్యాటన్, కలాత్ ఖాన్, స్వతంత్ర పాకిస్తాన్ కోసం డిమాండ్ చేసిన ముహమ్మద్ అలీ జిన్నాతోపాటు భారత భావి ప్రధానిగా అప్పటికే ఎంపిక అయిన జవహర్‌లాల్ నెహ్రూ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఖాన్ భారత్ లో విలీనం అవుతామని లేదా స్వతంత్రంగానే ఉంటామని స్పష్టం చేశాడు. పాక్ లో అంతర్భాగం కావడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశాడు. ఖాన్ ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారు. భారత్ కు కలాత్ కు మధ్య ఉన్న స్వతంత్ర ప్రావిన్సులు పాక్ లో కలిసి ఉన్నాయని.. దూరం నుంచి పాలన సాగించడం సరికాదని ఖాన్ కు సర్దిచెప్పాడు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయేలా ఉన్నదని భావించిన జిన్నా కలాత్ స్వతంత్ర దేశంగా ఉంటే తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టంచేశాడు. దీంతో కలాత్ రాజ్యాన్ని మీర్ అహ్మద్ యార్ ఖాన్ 1947 ఆగస్టు 12న స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. కలాత్ రాజ్య పార్లమెంట్ 1947 డిసెంబర్ 14 నుంచి 1948 ఫిబ్రవరి 25 వరకు పాకిస్తాన్‌తో విలీనం కావడాన్ని పలుమార్లు తిరస్కరించింది. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం ఒత్తిడి, సైనిక బలప్రయోగం కారణంగా కలాత్ రాజ్యాన్ని 1948 మార్చి 27న పాకిస్తాన్‌లో విలీనం చేసింది. సైన్యం ఒత్తిడితో ఖాన్ ఆఫ్ కలాత్ విలీన ఒప్పందంపై సంతకం చేశాడు, 1948 ఏప్రిల్ 15న పాకిస్తాన్ సైన్యం బలూచ్‌లో ప్రవేశించి.. పాలన మార్పు పరిణామాలకు మార్గం సుగమం చేసింది.
భారీగా సహజ వనరులు
కోటి యాభై లక్షల జనాభా కలిగిన బలూచిస్తాన్ అనేక సహజ వనరులు కలిగిఉంది. సహజవాయువులో పాకిస్తాన్‌కు రెండవ పెద్ద వనరు. బొగ్గు, రాగి, గోల్డ్ మైన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇనుపరాయి, బరైట్, మార్బుల్, క్రోమేట్ లాంటి తరగని గనులతో 'ఫ్రూట్ బాస్కెట్ ఆఫ్ పాకిస్తాన్' గా పేరుగాంచింది. కళలలో, సంగీతంలో వైవిధ్యమైన నైపుణ్యం ఉంది. బలూచిస్తాన్ మూలాలు కలిగిన కొందరు కళాకారులకు భారత్‌లోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వారిలో బాలీవుడ్ నటులు ఖాదర్ ఖాన్, అమ్జద్ ఖాన్, రాజ్‌కుమార్, సురేశ్ ఓబెరాయ్, వివేక్ ఓబెరాయ్, తాజుర్ సుల్తానా (వీణ), జిభా భక్తియర్ (హెన్నా) లాంటి వారున్నారు. 2025 నాటికి సుమారు 64వేల మంది బలూచిస్తాన్ మూలాలు కలవారు భారత్‌లో నివసిస్తున్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎక్కువగా చూడవచ్చు.
కీలక ఒప్పందాలు..
1947లో బలూచిస్తాన్‌తో సంబంధించి కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి, అయితే ఇవి వివాదాస్పదంగా మిగిలాయి. ఈ ఒప్పందాలను పాక్ ఎప్పుడూ పాటించిన సందర్భాలు లేవు. పైగా తమ వనరులను వాడుకుంటూ తమను ద్వితీయ పౌరులుగా చూస్తున్నారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. పార్లమెంట్ లో తమకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని.. తూర్పు పాకిస్తాన్ లో పాక్ సైన్యం దురాగతాలు బలూచ్ లోనూ సాగిస్తున్నదని వారు వాపోతున్నారు. పాక్, బలూచ్ నేతలతో రెండు ఒప్పందాలు చేసుకున్నది. అందులో స్టాండ్ స్టిల్ ఒకటి, రెండోది ఢిల్లీలో జరిగిన మౌంట్‌బాటన్ నేతృత్వంలో జరిగిన మరో ఒప్పందం.. ఆ ఒప్పందాలు ఇలా ఉన్నాయి.
1. స్టాండ్‌స్టిల్ ఒప్పందం: 1947 ఆగస్టు 11న, కలాత్, పాకిస్తాన్ మధ్య స్టాండ్‌స్టిల్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. కలాత్‌ను పాకిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా గుర్తించింది. బ్రిటిష్ ప్రభుత్వంతో కలాత్ కుదుర్చుకున్న ఒప్పందాలకు (1839-1947) కట్టుబడి ఉంటుందని తెలిపింది. ఈ ఒప్పందం కలాత్‌కు స్వతంత్ర హోదా ఇస్తుందని భావించారు.
2. ఆగస్టు 4, 1947 సమావేశం: ఢిల్లీలో జరిగిన సమావేశంలో లార్డ్ మౌంట్‌బాటన్, ఖాన్ ఆఫ్ కలాత్, ముహమ్మద్ అలీ జిన్నా, జవహర్‌లాల్ నెహ్రూ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే భారత్ లో విలీనానికి కలాత్ ఖాన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే, నెహ్రూ భారత్ కు బలూచిస్తాన్ కు మధ్య కొన్ని సంస్థానాలు ఉండటంతో దూరం నుంచి పాలించడం సరైంది కాదని తిరస్కరించారు. దీంతో జిన్నా కలాత్ స్వాతంత్ర్యానికి మద్దతు తెలిపారు. కలాత్ 1947 ఆగస్టు 5 నుంచి స్వతంత్రంగా ఉంటుందని.. ఖరాన్, లాస్ బెలా రాష్ట్రాలు కలాత్‌లో విలీనం కావాలని సమావేశంలో నిర్ణయించారు.
అయితే, ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ, పాకిస్తాన్ కలాత్‌పై ఒత్తిడి చేసింది. 1947 అక్టోబరులో, జిన్నా కలాత్‌ను పాకిస్తాన్‌తో విలీనం చేయాలని సూచించాడు, కానీ ఖాన్ దీనిని తిరస్కరించాడు, బలూచ్ తెగల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. చివరికి, 1948 మార్చి 27న, ఖాన్ ఒత్తిడిలో ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్‌పై సంతకం చేశాడు, దీనిని చాలా మంది బలూచ్ నాయకులు బలవంతపు విలీనంగా భావిస్తారు.
బలూచ్‌ను దోచుకున్న పాలకులు
సహజ వాయువులు, ఖనిజాలు, తీరప్రాంత విలువైన ఆస్తులు కలిగి ఉన్న బలూచిస్తాన్‌ను, రెండవ తరగతి పౌరులుగానే పరిగణించారు. పాకిస్తాన్ లో అత్యంత పేద, అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ఒకటిగా మిగిలిపోయింది. బలూచిస్తాన్ తీర ప్రాంతమైన గ్వాదర్, ఇప్పుడు చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో కీలకమైన పోర్టు. ఇక్కడినుంచే బలూచిస్తాన్ సహజవనరులను తరలించే పనిలో ఉన్నారు. ఆదివాసీ ప్రజల నుంచి లాక్కున్న భూములు వారికే చెందాలని.. బలూచిస్తాన్ సహజ సంపదలను దోచుకెళుతున్న చర్యలను తక్షణమే ఆపాలని.. చిన్న రైతుల భూములపై పన్నులను రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలనే తదితర డిమాండ్లతో బలూచిస్తాన్ ఆందోళన బాట పట్టింది. పాకిస్తాన్ ప్రభుత్వం వేలాది బలూచ్ కార్యకర్తలు, జర్నలిస్ట్‌లు, విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలను అపహరించి మాయం చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వంటి మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో సామూహిక సమాధులు బయటపడుతుండటంతో ప్రజల్లో ప్రభుత్వంపై అపనమ్మకం మరింత పెరిగిపోయింది. ఇలా పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రజలపై రాజకేయ అణచివేత, వనరుల దోపిడీ, చట్టవిరుద్ధ హత్యలు, బలవంతపు అదృశ్యాలు నిత్యకృత్యం అవుతున్నాయి. ప్రజల శాంతియుత ప్రదర్శనకు కూడా అనుమతినివ్వలేదు.
‘ఆపరేషన్ సిందూర్’పై హర్షం
స్వతంత్ర బలూచ్ కోసం తాము పోరాటాన్ని తీవ్ర చేస్తున్న తరుణంలోనే పాక్ పై భారత్ ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్ ప్రారంభించడంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ సహా అక్కడున్న ప్రజలంతా హర్షాతిరేకాలు ప్రకటించారు. పహెల్గాం ఉగ్రదాడిని ఖండించారు.. పాక్ పై దాడిని స్వాగతించారు. పాక్ కాల్పుల విరమణ మోసపూరిత ప్రకటన అని.. యుద్ధవ్యూహంలో తాత్కాలిక ఉపాయమేనని ప్రకటించారు. పాక్ పై పోరాటాన్ని ఆపొద్దని విజ్ఞప్తులు కూడా చేశారు. 1971లో తూర్పు పాకిస్తాన్ ప్రజలకోసం యుద్ధం చేసిన భారత్.. నేడు తమకోసం కూడా చొరవ చూపాలని ప్రత్యేక బలూచ్ ఏర్పాటుకు ముందుకురావాలని వేడుకుంటున్నారు. కాగా, పాక్ ఆర్మీపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. దాదాపు 51 ప్రదేశాల్లో దాడులకు పాల్పడింది. బలూచ్ లోని కీలక పట్టణమైన క్వె్ట్టాకు పాక్ మధ్య ఏకైక రైలు మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని.. దాదాపు 200మంది సైనికులను హతమార్చినట్టు బలూచ్ ఆర్మీ ప్రకటించడం సంచలనం సృష్టించింది. పాక్ నిఘా కేంద్రాలు, స్థానిక పోలీస్ స్టేషన్లు, ఖనిజాలు రవాణా చేసే వాహనాలపై ఆకస్మిక దాడులు చేసింది. ఐఈడీ పేలుళ్లు, స్నైపర్ అటాక్‌లతో కాల్పులు పాక్ దళాలను లక్ష్యంగా చేసుకొని భద్రత పోస్టులను స్వాధీనం చేసుకుంటున్నది.
బలూచిస్తాన్ స్వతంత్ర ప్రకటన
బలూచ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రచయిత 'మీర్ యార్ బలూత్' బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించారు. ఇకనుంచి తమ దేశాన్ని ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’గా ప్రకటించారు. బ్రిటీష్ హయాంలోనే తాము స్వతంత్రంగా ఉన్నామని.. కొందరు నేతల దుశ్చర్యలతో తాము పాక్ ఆధీనంలో ఉండాల్సి వచ్చిందని.. ఇకనుంచి తమ పాలన తామే చేసుకుంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌పై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని భారతదేశాన్ని, అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు, డిమాండ్లు చేశారు. అందులో ముఖ్యమైనవి..
1. న్యూ ఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయానికి అనుమతించాలని భారత్‌ను కోరారు.
2. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ స్వాతంత్ర్యాన్ని గుర్తించాలని.. ఐక్యరాజ్యసమితి సమావేశానికి పిలవాలి.
3. బలూచిస్తాన్ కు శాంతి పరిరక్షక దళాలను పంపాలని, పాకిస్తాన్ సైన్యాన్ని ఖాళీ చేయించాలి.
4. ముంబైలో ఉన్న జిన్నా ఇంటిని, బలూచిస్తాన్ హౌస్‌గా మార్చాలి.






