- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచంపై పగబట్టిన ఆగస్టు నెల
ఆగస్టు 5, 2025 మధ్యాహ్నం, ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామంలో ఖీర్ గంగా నది తీరం.. వందలమంది పర్యాటకులు చార్ ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రికి ప్రయాణిస్తూ, అక్కడ కొద్దిసేపు విరామం కోసం ఆగారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆగస్టు 5, 2025 మధ్యాహ్నం, ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామంలో ఖీర్ గంగా నది తీరం.. వందలమంది పర్యాటకులు చార్ ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రికి ప్రయాణిస్తూ, అక్కడ కొద్దిసేపు విరామం కోసం ఆగారు. అంతలోనే ఎదో భారీ శబ్దం వినబడుతోంది. అంతకంతకూ ఆ భీకర శబ్దం దగ్గరకు వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం ఏమిటో గ్రహించిన స్థానికులు ప్రాణ భయంతో పరుగందుకున్నారు. ఎదురుగా దూసుకువస్తున్న ఉప్పెనను చూసి వారి మెదడు పనిచేయడం ఆగిపోయింది కాసేపు. క్షణాల్లో తేరుకొని పరుగందుకునేలోపే ఆ ఉపద్రవం కొంతమందిని మింగేసింది. మరికొంతమంది మాత్రం ఎలాగోలా ప్రాణాలు దక్కించుకున్నారు. అదే క్లోడ్ బరస్ట్ వల్ల సంభవించిన భారీ వరద. వరద అంటే అలంటి ఇలాంటి వరద కాదు, కొండలమీది నుంచి పెద్ద పెద్ద బండలను, బురదను తోసుకువచ్చి ధరాలీ గ్రామాన్ని క్షణాల్లో అమాంతం మింగేసింది.
ఆగస్టు 12, 2025 సాయంత్రం, స్పెయిన్ లోని మాడ్రిడ్ సమీపంలోని ట్రెస్ కాంటోస్... ఎక్కడినుంచి మొదలైందో ఓ కార్చిచ్చు ఊరివైపు దూసుకువస్తోంది. దానికి తోడు బలమైన గాలులు, అగ్నికీలలు పరుగుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. అక్కడే ఉన్న ఓ గుర్రపుశాలలో వందలాది పెంపుడు గుర్రాలు ఎటు పోవాలో దిక్కుతోచకుండా అల్లాడుతున్నాయి. గుర్రపుశాల సంరక్షకులు మంటలను లెక్కచేయక, ఎగసిపడి అగ్నిలోకి దూకి, గుర్రాలను కట్టివేసిన తాళ్లను వేగంగా విప్పేసారు. అయితే అప్పటికే వారికి మంటలు అంటుకోవడం, ఆ గుర్రపుశాల పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో వారు అగ్నికి ఆహుతి అయ్యారు.
ఈ రెండు వేరు వేరు ఘటనలు. కానీ జరిగింది ఆగస్టులోనే. ఇవే కాదు గడిచిన ఆగస్టు నెలలో ప్రపంచం అంతటా వరుస ప్రమాదాలు. వందలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోగా, లెక్కలేనంత ఆస్తినష్టం సంభవించింది. భారతదేశంలో ఇది వర్షాకాలం కాబట్టి ఇక్కడ క్లౌడ్ బరస్ట్, అల్పపీడన ద్రోణుల వాళ్ళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఊళ్లను తుడిచిపెట్టుకుపోతున్న వరదలు, ల్యాండ్ స్లైడ్స్ కు లెక్కేలేదు. ఆసియా ఖండంలోని దాదాపు అన్ని దేశాల పరిస్థితి ఇలాగే ఉంది. అమెరికా, యూరప్ ఖండాల్లో ఇపుడు తీవ్ర వేసవికాలం. చిన్న నిప్పురవ్వ కూడా లక్షలాది హెక్టార్ల అడవులు, గడ్డిభూములు తగలబడుతూ.. నివాసాలను, వన్యప్రాణులను కాల్చి బూడిద చేస్తున్నాయి.
ప్రపంచంలో గత ఆగస్టులో జరిగిన భారీ విపత్తుల వివరాలు ఇవే :
వరదలు, టైఫూన్లు :
*ఆగస్టు 14న జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని చాసోటి గ్రామంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల మచైల్ మాత ఆలయానికి వెళ్ళే యాత్రికులు తుడిచిపెట్టుకుపోయారు. 1500 మంది యాత్రికులు వరదలు వచ్చిన ప్రదేశంలో ఉండగా.. వారిలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మరో 100 మంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు.
*ఆగస్టు 23న పాకిస్తాన్‌లోని ఉత్తర ఈశాన్య ప్రాంతాలలో (ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, ఫైసలాబాద్, గుజ్రాన్వాలా, పెషావర్, మర్దాన్, ఆబాటాబాద్, కాశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్) పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అనేక ప్రాంతాలు వరదల్లో మునిగిపోగా, వందలమంది గల్లంతయారు. పాక్ లో ఆగస్టు నెల మొత్తం అత్యంత భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయని చెప్పాలి. గడిచిన నెల పాకిస్తాన్ కు పీడకలగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి అతియోక్తి లేదు.
*ఆగస్టు 24న టైఫూన్ కజికి వియత్నాం, థాయిలాండ్, లావోస్, కంబోడియా, మయన్మార్‌లో భారీ వర్షాలను కలిగించింది. ముఖ్యంగా లావోస్, కంబోడియా మధ్య గల మెకాంగ్ నది ఆ రెండు దేశాల్లో తీరని నష్టాన్ని కలిగించింది. వందలాది మంది ఆచూకీ లేకుండా పోగా, వేలాది మందికట్టుబట్టలతో మిగిలారు.
భారీ అగ్నిప్రమాదాలు
*ఆగస్టు 1న కాలిఫోర్నియాలో గిఫోర్డ్ ఫైర్ (సాన్ లూయిస్ ఒబిస్పో కౌంటీలో 131,589 ఎకరాలను వైల్డ్ ఫైర్ కాల్చివేసింది, ఇది 2025లో కాలిఫోర్నియాలో అతిపెద్ద అగ్నిప్రమాదంగా మిగిలింది. ఆగస్టు 14న కొలరాడోలో 180,000 ఎకరాలకు పైగా కాలిపోయాయి. ఇది 2020 తర్వాత అత్యంత తీవ్రమైన అగ్నిప్రమాద సీజన్‌గా నమోదైంది. ఒక చిన్న మెరుపు వల్ల మొదలైన డ్రాగన్ బ్రావో ఫైర్ జూలై 4న గ్రాండ్ కాన్యన్ లో 145,500 ఎకరాలను కాల్చివేసింది.
*ఆగస్టు 19 నాటికి, పోర్చుగల్‌లో 2,610 చదరపు కిలోమీటర్ల అడవి, ఫ్రాన్స్‌లోని ఆడ్ ప్రాంతంలో దశాబ్దాలలో అతిపెద్ద అగ్నిప్రమాదం 16,000 హెక్టార్లను కాల్చివేసింది. అల్బేనియాలో జూలై నుండి ఆగస్టు దాకా 34,000 హెక్టార్ల గడ్డిభూములు, నివాసాలు తగలబడిపోయాయి. వీటిలో 12 ప్రాంతాల్లో ఇంకా కాలిపోతూనే ఉన్నాయి.
*ఆగస్టులో ఆఫ్రికాలో 22 మిలియన్ హెక్టార్ల భూమి ఒక్క వారంలో కాలి బూడిదయ్యింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అగ్నిప్రమాదాల్లో 80 శాతం ఒక్క ఆఫ్రికాలోనే జరిగింది. అలాగే ఆగస్టు మొదటి రెండు వారాల్లో యుకెలో 40,000 హెక్టార్ల అడవి కాలిపోయింది. ఇది గ్లాస్గో నగరం కంటే రెండు రెట్లు ఎక్కువ.
ఇవన్నీ చూస్తుంటే ఒక్కటే అనిపిస్తోంది. ప్రపంచాన్ని ఆగష్టు పగబట్టిందా అని. ఈ ఏడాది మాత్రమే కాదు ఇలాంటి వరుస ఘటనలు 2019లో కూడా జరిగాయి. ఆ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో జరిగిన ఉపద్రవాలు.. లక్షల హెక్టార్ల భూమిని కాల్చివేయగా, లక్షలాది మంది రోడ్లపాలయ్యారు. అంతేకాదు నోరులేని వేలాది వన్యప్రాణులు మంటల్లో కాలి బూడిద అయ్యాయి. ఆ తరువాత 3 నెలలకు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పూర్తిగా తలకిందులు చేసిన విషయం తెలిసిందే. విచిత్రంగా ఈ ఏడాది కూడా అలంటి వరుస ఘటనలు జరగడం వెనుక మళ్ళీ ఏం ముంచుకు రానుందోనని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






