- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా గొప్పలు.. కన్నొళ్ల తిప్పలు.!
"కొడుకేం పన్జేస్తుండే" అని అడిగితే.. "పన్జేశే కర్మెందుకే.? పెద్ద సదువు కోసం అమెరికా పంపిన" అని గొప్పలు చెప్పుకుంటారు చాలామంది.

అంత బాగనే ఉందిగానీ.. అక్కడికెళ్లి ఏం చేస్తారు మనొళ్లు.?
మనదో ఆశ.
పిల్లల్ని ఫారిన్ పంపించాలి.
ఫారిన్లో చదివితే లైఫ్ సెటిలైతది అనీ.
నిజమే కదా.?
ఈ రోజుల్లో పిల్లలకు మనమిచ్చే అతిపెద్ద ఆస్తి చదువొక్కటే.
అందుకే ఎంత కష్టమైనా..
ఎంత ఖర్చయినా సరే అనుకుంటాం.
ఇన్నేళ్లుగా కాపాడుకున్న భూమినీ అమ్మేస్తాం.
అవసరమైతే అప్పులు చేస్తాం.
మనం సాధించలేనిది మన పిల్లలు సాధించాలని ఆశపడతాం.
మన ఆశయాలను వాళ్ల ద్వారా సాధించుకోవాలనుకుంటాం.
వాళ్లు ఉన్నతంగా ఎదగాలనుకుంటాం.
అంత బాగనే ఉందిగానీ..
అక్కడికెళ్లి ఏం చేస్తారు మనొళ్లు.?
- దాయి శ్రీశైలం
"కొడుకేం పన్జేస్తుండే" అని అడిగితే.. "పన్జేశే కర్మెందుకే.? పెద్ద సదువు కోసం అమెరికా పంపిన" అని గొప్పలు చెప్పుకుంటారు చాలామంది. కోటీశ్వరుడైనా.. కూలీపని చేసేవాళ్లకైనా "పిల్లల్ని బయటి దేశం పంపియ్యాలె" అనే ఆశ ఉంటుంది. "మనమే అత్తెసరు సదువులు సదివితిమి.. వాళ్లనైనా మంచిగ ఫారిన్ల సదివియ్యాలెగా" అనేది వాళ్ల ఆరాటం. తప్పులేదు. కానీ.. దానివల్ల ఏం కోల్పోతున్నామో గుర్తిస్తే మంచిది.
"అ" అమెరికా.. "ఆ" ఆస్ట్రేలియా
మనొళ్లకు కొంచెం "డాలర్ సోకు" ఎక్కువైంది. ఎంతలా అంటే ఎల్కేజీలోనే "ఇంటర్నేషనల్ సిలబస్" ప్రిఫర్ చేస్తున్నారు. ఏబీసీడీల టైంలోనే "ఫారిన్ చదువు"ల రుద్దుడు మొదలవుతోంది. అదేందో.. పిల్లలు కూడా "నీ లక్ష్యమేంటి" అని అడిగితే "అమెరికాలో సెటిలైపోవాలనుంది" అని అంటున్నారు. ఇదెలా అంటే.. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ అలా ప్రిపేర్ చేస్తున్నారు. "అ" అమ్మ.. "ఆ" ఆవు అనేది మర్చిపోయి "అ" అమెరికా.. "ఆ" ఆస్ట్రేలియా.. "ఇ" ఇంగ్లండ్".. అనేవి ఒంటబట్టిస్తున్నారు. కొందరైతే ఇంకా ఘోరం. "నేను మీ దగ్గరే ఉంటా" అని పిల్లలు మారాం చేస్తే.. "మొద్దు మొకపోడు.. ఫలానా పండుగాడు చూడు" అని చివాట్లు పెట్టి మరీ మైండ్ వాష్ చేస్తున్నారు. "మన ఖాన్దాన్ల ఫస్ట్ ఫారిన్ పొయ్యేది నువ్వేరా" ఊదరగొట్టి ఉషార్ చేస్తున్నారు.
దేనికోసం ఈ రిస్క్.?
పైసలున్నొళ్లకు ఫారిన్ చదువు పెద్ద ముచ్చటేం కాదు. కానీ.. చేతిలో పట్టుమని పది లక్షలు కూడా లేనొళ్లకు పెద్ద సమస్యే. ఎందుకంటే ఫారిన్ చదువు ఐదుకూ.. పదికీ అయ్యేది కాదు. తక్కువలో తక్కువ 50 లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఆ డిపాజిట్ అనీ.. ఈ డిపాజిట్ అనీ బ్యాంకులోనే 40 లక్షలు జమ చెయ్యాలి. ఆ ఖర్చూ ఈ ఖర్చూ ఇంకో 10 లక్షలు అవుతుంది. తలకు మించిన భారం అవుతుందని తెలుసు. తాహతుకు మించి ఖర్చు పెడుతున్నామనీ తెలుసు. కానీ.. అమెరికాలో చదివించాలి.. లండన్ యూనివర్సిటీలో చేర్పించాలి అనే ఆశ.. ఆసక్తితో రిస్క్ ఎంతయినా భరిస్తున్నారు. "పిల్లలకన్నా ఎక్కువేముందీ" అని స్థోమతను.. ఆర్థిక వనరులను లెక్క చేయకుండా "పిల్లల ఫారిన్ చదువుల లెక్కలు" సరిచేస్తున్నారు.
ఐతే.. పొలం అమ్మేయాలా.?
"పక్కింటి పుంటికూరకు రుచెక్కువ" అన్నట్లు మనొళ్లు విదేశీ విద్య అనగానే ఎగిరి గంతేస్తుంటారు. మన దగ్గర ఎంతుందీ.. ఏముందీ అనేవేవీ పట్టించుకోరు. రూరల్ ఏరియాల నుంచి పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్న చాలామంది తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే.. "ఎకరం అమ్మినా.. రెండెకరాలు అమ్మిన" అనేమాట. "ఎహే.. మావోనికి అక్కడ జాబొస్తే సంవత్సరంలనే కొనేస్తడు" అనే ధీమా ఒకటి. "పోంగనే పార్ట్ టైం జాబ్ దొరుకుతదంటా.. వాళ్ల ఖర్సు వాళ్లే వెల్లదీసుకుంటరు.. మనల్నేం అడగరు" అని లోపలేదో భయమున్నా బయటికి మాత్రం ఇట్లా గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. వాస్తవానికి అక్కడ కొలువు సంగతేందోగానీ.. ఆ ఫీజు.. ఈ ఫీజు అని చెప్పి నెలనెలా ఇంటి దగ్గర్నుంచే డబ్బులు వేయించుకుంటారు. దానికి మల్లా కొత్తగా ఇంకో అప్పు.
కన్సల్టెన్సీ కడుపు నిండితే చాలా.?
చదువు కోసం ఫారిన్ వెళ్లే చాలామంది "కన్సల్టెన్సీ"లను నమ్ముకునే వెళ్తారు. "వెళ్లగానే అక్కడ టెంపరరీ రూమ్ సెట్ చేస్తాం. టెనెంట్ ఇల్లిప్పిస్తాం. పార్ట్ టైం జాబ్ చూస్తాం. కాలేజీ సీట్ ఓకే చేస్తాం. యూనివర్సిటీ నుంచి ఏ సమస్యా రాకుండా మా మనిషి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు" అనే దొంగ బొంకులు బొంకి.. అకౌంట్లోకి సరిపడా డబ్బులు వేయించుకుంటారు మధ్యవర్తులు. వన్స్.. వాళ్ల అకౌంట్లోకి డబ్బులు పడ్డాయంటే ఇక మెల్లమెల్లగా దూరం పెరుగుతూనే ఉంటుంది. ప్రతీది చేస్తున్నా.. చూస్తున్నా అని అంటారు. పార్ట్ టైం జాబ్ చూస్తా అన్నొళ్లు అసలు కంటికి కూడా కనిపించరు. ఇట్లా బ్రోకర్లను, ఏజెన్సీలను నమ్ముకొని ఫారిన్ వెళ్లి జేబు ఖాళీ చేసుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు. మోసపోయామని తెలిసినా "పిల్లల కోసమే కదా" అని సాంత్వన వెతుక్కుంటాం.
పెట్రోల్ బంకులో చేయడానికేనా.?
ఎలాగోలా పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. గంటకు మూడు నాలుగు వేల రూపాయల సంపాదన. ఊర్లో ఉన్నప్పుడు లోపలున్న చీపురు పుల్ల బయట పెట్టరు. అక్కడ చేసే కొలువులేంటో తెలుసా.? పెట్రోల్ బంకుల్లో.. కొరియర్ ఏజెన్సీలో.. షాపింగ్స్ మాల్స్‌లో.. రెస్టారెంట్లలో పని చేస్తారు. అదే ఊర్లో అయితే.. "ఛీఛీ.. నేనా.. ఆ పనా" అని బిల్డప్ ఇస్తుంటారు. పేరెంట్స్ కూడా "మా పిల్లలు అలా కాదు. పాదాలకు మట్టి అంటకుండా పెంచినం" అని గొప్పగా చెప్తుంటారు. పని సొంత దేశంలో అయినా.. పరదేశంలో అయినా ఒక్కటే. మనం విలువ ఇస్తున్నది డాలర్‌కి అంతే. సొంతూర్లో పెట్రోల్ బంకుల్లో పనిచేసేవాళ్లను ఎంత తక్కువ చేసి చూస్తాం.? కానీ అక్కడ మనం చేసేది కూడా అదే పని కదా.? పెట్రోల్ బంకులో చేయడానికేనా మనం సర్వం ధారపోసింది.?
అప్పులు తీరేదెట్లా మాష్టారూ.?
పిల్లల కోసమే కదా ఉన్న ఎకరం అమ్మి పెట్టింది.? మీదికెల్లి అప్పుడో రెండు ఇప్పుడో రెండు పది లక్షల దాక పంపుతారు. వాళ్ల ఫారిన్ చదువు కోసమే పొలం అమ్మి, అప్పుచేసి కుప్ప పెడితే వాళ్లేమో అక్కడ "నావి నాకే సరిపోతలేవు. మీకెట్లా పంపాలె. ఏదో ఒకటి చేసి అప్పులైతే లేకుండా చూడుండ్రీ. ఐనా.. మంది అందరూ పెడ్తలేరా.? మీరొక్కరే పెడ్తున్నట్టూ ఊ అంటే ఆ అంటే అంతా నీకు పెట్టినం అని అంటరు" అని నిష్టూరమాడుతుంటరు. పాపం చెమటోడ్చి జీవితమంతా ధారపోస్తే వాళ్లకు తోడుగా ఉండాల్సింది పోయి ఏవేవో చెప్తుంటారు. చూశారా.. తాహతుకు మించి, స్థోమతను మరిచి ఫారిన్ పంపిస్తే తర్వాత వాళ్ల స్వరం ఎలా మారుతుందో.? అంత బాగనే ఉందిగానీ.. మరి అయ్యగారికోసం చేసిన అప్పెలా తీరాలి.?
ఎంత అదృష్టమో కదా.?
అదృష్టం బాగుండి చదువు విజయవంతంగా పూర్తవుతుంది. ఫ్రెండ్స్ ఏర్పడతారు. పరిచయాలు ఎక్కువౌతాయి. మొత్తానికీ ఓ జాబ్ కూడా దొరుకుతుంది. పేరెంట్స్ అప్పుడు ఎంతో ఖుషీ అవుతారు. "హమ్మయ్యా.. ఇక బిందాస్ ఉండొచ్చు" అని రిలాక్స్ అవుతారు. ఈ లోపే తెలిసినవాళ్లెవరో పెండ్లి సంబంధం తీసుకొస్తారు. "చాతనైనప్పుడే నెత్తిలో నాలుగిత్తులేస్తే బాగుంటది" అని అమ్మానాన్న కూడా సంబరపడతారు. కానీ.. మనొళ్లకు సొంతూరికి వచ్చే ఉద్దేశమే ఉండదు కదా.? అందుకే ఫారిన్ వెళ్తున్న అమ్మాయి/అబ్బాయినే పెండ్లి చేసుకోవడానికి ఫిక్సవుతారు. సిటీలో మంచి ఫ్లాటు, ఊర్లో ఎకరం పొలం ఇచ్చే సంబంధం దొరుకుతుంది. రెక్కలు ముక్కలు చేసుకొని ఫారిన్ పంపించిన పిల్లలకు ఇలా కలిసి రావడం చూసి ఫ్యామిలీ మురిసిపోతుంది.
పెళ్లయితే మీతోనే ఉన్నారా.?
విదేశాల్లో ఉండే పెండ్లి పనులు సమీక్షిస్తారు మనొళ్లు. మ్యారేజ్ వారం రోజులు ఉందనగా రావచ్చనేది ప్లాన్. "నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డా.. అన్నీ మేం చూసుకుంటాం" అనే భరోసా ఇస్తారు అమ్మానాన్న. ముహూర్తం సమయానికి వచ్చి పెళ్లి చేసుకుంటారు. వారం రోజులు గుడికీ గోపురాలకు తిరుగుతారు. "ఊర్లో నాకు కంఫర్ట్‌గా లేదు.. అత్తగారు రాసిచ్చిన ఫ్లాట్లో ఉంటాం" అని చెప్తే పంపిస్తారు. నెల రోజులవుతుంది. పేరెంట్సే అప్పుడో ఇప్పుడో వెళ్లి చూసొస్తారు. నెల రోజుల తర్వాత మెల్లగా తట్టా బుట్టా సర్దేసి పరదేశం పయనం కడతారు. "ఇప్పుడే వద్దులే బిడ్డా" అని ఎంత బతిమిలాడినా వినకుండా వెళ్లిపోతారు. పోయినంక "ఇన్నిరోజులు లీవ్స్ పెట్టిన కదా కొద్ది రోజులు బిజీగా ఉంటా ఫోన్ చేయకండీ" అని చెప్తారు.
ఆర్నెళ్లకు కాదు.. ఆరేండ్లకైనా రారు.!
ఆర్నెళ్లకు వస్తామన్నొళ్లు ఆరేండ్లయినా రారు. మనవళ్లు, మనవరాళ్లతో గడపాలనే ఆశ అడియాశ అయిపోతుంది. వారానికోసారి వీడియో కాల్ చేసి వాళ్ల మురిసిపోవడమే కానీ ప్రత్యక్షంగా పలకరించే ఛాన్సే లేదు. "అంత కష్టపడి చదివించి ఇట్లా వీడియోకాల్ మాట్లాడటానికారా" అని అంటే.. "ఎప్పటికీ మీతోనే ఉండాల్నా.. మీ లెక్కనే గొర్లు, బర్లు కాయాల్నా" అని కోపం అవుతారు. "ఇలాంటి మాటలంటే అసలు కాల్స్ చేయడమే బంద్‌జేస్తం" అని బెదిరిస్తారు. "ఎందుకొచ్చిన పంచాయితీలే" అనుకొని అడగడం మానేస్తారు. ఆ వారానికోసారి చేసే కాల్స్‌లో కూడా "ఇంటి కిరాయి ఏం చేస్తుండ్రు.? పొలం లీజుకు ఎవరికిచ్చిండ్రు" అనేవే అడుగుతారు కానీ.. "ఎలా ఉన్నారమ్మా.. ఏం చేస్తున్నారు నాన్నా.. ఆరోగ్యమెలా ఉంది" అని అడిగిన పాపాన పోరు.
చస్తే కూడా రారు పటేలా.!
పాపం.. పెద్దమనుషులకు వయసు మీద పడుతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. పిల్లల్ని చూడాలనిపిస్తుంది. కానీ వాళ్లురారు. చూసీ చూసీ ఏదైనా హాస్పిటల్‌లో చేర్చితే "అయ్యో పాపం" అనాల్సిందిపోయి.. "తిన్నదర్గక పోయిండ్రా.? చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్ల చేరితే పైసలు ఎవడు పెడ్తడు. ఇక్కడ మా కష్టాలు మాకున్నయి" అని చేతులెత్తేస్తారు. గాచారం బాగలేక పాపం పెద్ద మనిషి కాలం చేస్తే "ఇంత సెడన్‌గా అంటే ఎలా రావాలి" అని అనేవాళ్లూ ఉన్నారు. చావు సడెన్‌గా రాకపోతే వారంరోజుల ముందు స్లాట్ బుక్ చేసుకొని వస్తుందా.? ఇక తప్పదు కాబట్టీ "ఆన్ లైన్లోనే అంత్యక్రియలు" కానిచ్చేస్తారు. "ఒక్కరోజు కోసం వస్తే మల్లా 10 లక్షలు బొక్కా.. మీరే కానీయండి" అని చుట్టాలకు చెప్తారు. చస్తే కూడా రాలేనంత గొప్ప చదువుల కోసమే మన ఈ వెంపర్లాట.
ఇండియా నుంచి..
2022లో సుమారు 7.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 68.79% పెరుగుదలను సూచిస్తుంది. 2024లో ఈ సంఖ్య 13 లక్షలకు పైగా పెరిగిందని అంచనా. 2025లో 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని అంచనా. మనొళ్లు ప్రధానంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకేలను ఎంచుకుంటున్నారు. 2024లో కెనడాలో అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. 2023 విద్యా సంవత్సరంలో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఉద్యోగ అవకాశాలు
విదేశీ విద్య పూర్తి చేసిన భారతీయ విద్యార్థులకు కెనడా అనుకూలమైన పోస్ట్-స్టడీ వర్క్ వీసా విధానాలను అందిస్తుంది. ఇది 1-3 సంవత్సరాల పాటు ఉద్యోగం కోసం శోధించే అవకాశం కల్పిస్తుంది. అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ ద్వారా 1-3 సంవత్సరాల పాటు ఉద్యోగం చేయవచ్చు. ముఖ్యంగా స్టెమ్ కోర్సులు చదివిన వారికి. అయితే హెచ్-1బీ వీసా పొందడం సవాలుగా ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలిక ఉపాధి కష్టమవుతుంది. యూకేలో గ్రాడ్యుయేట్ వీసా పథకం ద్వారా విద్యార్థులు 2 సంవత్సరాల పాటు ఉద్యోగం కోసం శోధించవచ్చు. టెక్, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి.
ఎందుకు తిరిగి వస్తారు?
కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పోస్ట్-స్టడీ వర్క్ వీసాలు అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు అక్కడే ఉండటానికి ఆకర్షితులవుతున్నారు. ఇంకా మంచి జీతాలు, మెరుగైన జీవన ప్రమాణాలు, విద్యా రుణాలను త్వరగా తీర్చే అవకాశం విద్యార్థులను అక్కడే ఉండమని ప్రోత్సహిస్తాయి. ఉద్యోగ మార్కెట్‌లో అనుకూలత లేకపోవడం.. విదేశీ డిగ్రీలకు స్థానిక గుర్తింపు సమస్యలు.. కొన్ని రంగాల్లో పోటీతత్వం విద్యార్థులను తిరిగి రాకుండా నిరుత్సాహపరుస్తాయి. సుమారు 20% మంది విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఇండియాకు తిరిగి వస్తారని INTO సర్వే సూచిస్తోంది.
ఏమేం పనులు చేస్తారు.?
విదేశీ విద్య కోసం ఫారిన్ వెళ్లినవాళ్లు.. ఎక్కువగా లైబ్రరీ అసిస్టెంట్, రిటైల్ జాబ్స్, సూపర్‌మార్కెట్‌లలో క్యాషియర్, స్టాక్ క్లర్క్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, రెస్టారెంట్లలో సర్వర్, హోటల్ రిసెప్షనిస్ట్, ఫుడ్ డెలివరీ, కొరియర్ సర్వీసెస్, కేఫ్‌లు, బార్టెండర్, హోటళ్లలో క్లీనింగ్ స్టాఫ్, ట్యూటరింగ్ వంటి పనులు చేస్తున్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్ జాబ్స్‌పై ఆధారపడతారు. ఎందుకంటే ఆఫ్-క్యాంపస్ ఉద్యోగాలకు సీపీటీ/ ఓపీటీ అనుమతి అవసరం. కానీ ఇది చాలా కష్టమైన పనే.
అందరికీ దొరకవు: నరేంద్ర గోకవరపు, పొలిటికల్ లాబొరేటరీ అనలిస్ట్
తల్లిదండ్రులు పిల్లల్ని విదేశాలకు చదువుకోసం పంపించడం వెనుక ఆశలు, భవిష్యత్ భద్రత ఉంటాయి. ఖర్చు, భారం తట్టుకుని పంపిస్తారు ఎందుకంటే విదేశీ విద్య మంచి ఉద్యోగాలు, ఆర్థిక స్థిరత్వం ఇస్తుందని నమ్ముతారు. అయితే వెళ్లిన ప్రతి ఒక్కరికీ జాబ్ దొరకదు. జాబ్ దొరికన ప్రతి ఒక్కరూ చివరి వరకు నిలకడగా ఉండరు. ఇంటి దగ్గరేమే పేరెంట్స్ అప్పులు తీర్చలేకపోతుంటారు. అక్కడేమో పిల్లలు ఉద్యోగాల కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూస్తారు.
కౌన్సిలింగ్ అవసరం: వీరేందర్ చెన్నోజు, సైకాలజిస్ట్
తల్లిదండ్రులు పిల్లల్ని విదేశాలకు పంపడం వెనుక భావోద్వేగాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆసక్తితో, ఆశతో పంపిస్తారు. ఎందుకంటే అది పిల్లల భవిష్యత్‌ను ఉజ్వలం చేస్తుందని. పిల్లలు ఉన్నతంగా ఎదగాలని ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారు. కానీ పిల్లలు కొత్త జీవితం, పని ఒత్తిడిలో మునిగిపోతారు. కొన్నిసార్లు దూరం వల్ల భావోద్వేగ సంబంధాలు బలహీనమవుతాయి. వాళ్ల బిజీలో వాళ్లుంటారు. ఎవర్నీ తప్పుబట్టడానికి లేదు. కాకపోతే కుటుంబ సంబంధాలను నిర్వహించడానికి పిల్లలకు, పేరెంట్స్‌కూ కౌన్సెలింగ్ అవసరం.
ఆర్థిక పెట్టుబడి: మాయిని చంద్రకాంత్, కార్తికేయ కాలేజీ ప్రిన్సిపాల్
తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి పిల్లల్ని విదేశాలకు పంపడం ఆర్థిక పెట్టుబడిగా భావిస్తారు. ఒకరకంగా ఆశతో చేస్తారు. ఎందుకంటే విదేశీ డిగ్రీలు మంచి ఉద్యోగాలు, ఎక్కువ జీతాలు తెచ్చిపెడతాయి. అయితే పిల్లలు కెరీర్ బిజీలో పడి తల్లిదండ్రులను మరచిపోతారు. ఇది సమాజంలో పెరుగుతున్న సమస్య. ఇలాంటి భారాన్ని మోసేబదులు వ్యాపార అవకాశాలను పిల్లలకు చూపించి కుటుంబ సమతుల్యతను ప్రోత్సహించాలి.






