- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురితప్పని భారత జేమ్స్‌బాండ్ అజిత్ డోవల్
అది ఖలిస్థాన్ ఉగ్రవాదం పంజాబ్ అంతటా వ్యాపించి ఉన్న సమయం. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదులు అడ్డా వేసి కేంద్రానికి సవాల్ విసిరిన పరిస్థితి.

దిశ, స్పెషల్: అది ఖలిస్థాన్ ఉగ్రవాదం పంజాబ్ అంతటా వ్యాపించి ఉన్న సమయం. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదులు అడ్డా వేసి కేంద్రానికి సవాల్ విసిరిన పరిస్థితి. అప్పుడు ఓ రిక్షావాలా తరచుగా స్వర్ణ దేవాలయం లోకి మంచినీరు కోసం వెళ్తూ లోపల ఉన్న తీవ్రవాదులతో మాటామంతి కలిపేవాడు. కొద్ది రోజులకి అకస్మాత్తుగా సైన్యం స్వర్ణ దేవాలయంపై దాడి చేసి అందులో దాగి ఉన్న కీలక ఉగ్రవాది జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలాతో పాటు అనేక మందిని మట్టుపెట్టింది. అత్యంత రహస్యంగా పూర్తిస్థాయి భద్రత లో ఉన్న తమ సమాచారం బయటకు ఎలా వెళ్లిందో అర్థం కాని పరిస్థితి ఉగ్రవాదులది. అయితే అసలు విషయం ఏంటంటే అప్పటివరకు తమతో మాటామంతి కలిపిన ఆ రిక్షావాలా ఒక ఐపీఎస్ ఆఫీసర్. మారు వేషంలో వచ్చి సమాచారాన్ని అంతా సేకరించి సైన్యానికి అందించిన ఆఫీసర్ పేరే అజిత్ దోవల్. అప్పటికి ఇప్పటికీ దేశానికి ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ఆ మాస్టర్ స్పై పై స్పెషల్ స్టోరీ మీకోసం..
అజిత్ కుమార్ దోవల్ 1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించారు. ఆయన తండ్రి సైన్యంలో పని చేశారు. దీంతో ఆయన విద్యాభ్యాసం మిలిటరీ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత ఆగ్రా యూనివర్సిటీ నుండి డిగ్రీ, ఎకనామిక్స్‌లో పీజీ చేసారు. ఇక అజిత్ దొవల్ 23 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎంపికై కేరళ క్యాడర్‌కి నియమించబడ్డారు.
నాలుగేళ్లకే ఐబీలోకి..
కేరళ క్యాడర్ లో నాలుగేళ్ల పాటు పనిచేసిన అజిత్ దోవల్.. కేంద్ర సర్వీసులోకి మారుతూ ఇంటెలిజెన్స్ బ్యూరో లోకి వెళ్లారు. వస్తూవస్తూనే అప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో పాతుకుపోయిన మిజో నేషనల్ ఆర్మీ (MNA)లో సభ్యుడిగా చేరారు. తన టాలెంట్‌తో ఆర్మీ అధినేత బైక్చుంగకి ఎంత సన్నిహితుడిగా మారి చివరకు 200 ఏళ్లుగా ఇబ్బంది పెట్టిన ఆ సమస్యను శాంతి ఒప్పందం ద్వారా పరిష్కరించారు. ఈ అద్భుత ఆపరేషన్ చేసినందుకు అతి పిన్న వయసులోనే ఇండియన్ పోలీస్ మెడల్‌ని దక్కించుకున్నారు.
ఈసారి రిక్షావాలాగా..
పంజాబ్ ఖలిస్థాన్ ఉగ్రవాదం పెచ్చుమీరి.. స్వర్ణ దేవాలయం కేంద్రంగా కార్యకలాపాలు చేపడుతుండటంతో.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ దేవాలయం సిక్కులకు అత్యంత పవిత్రమైనది కావడంతో సైన్యం కూడా కాస్త ఆచితూచి ఆపరేషన్ నిర్వహించాలని భావించింది. లోపల ఎక్కడెక్కడ ఉగ్రవాదులు నక్కి ఉన్నారు? వారి వద్ద ఉన్న ఆయుధాలు ఏవి? వారని ఎలా లొంగదీసుకోవాలని సైన్యాధికారులు ఎత్తుగడలు వేస్తున్నారు. వారికి పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి దోవల్ రంగంలోకి దిగారు. ముందుగా రిక్షావాలాలా స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి.. ఐఎస్ఐ గూఢచారిలా వారిని నమ్మించాడు. వారికి సంబంధించిన పూర్తి సమాచారం దశలవారీగా సేకరించి సైన్యానికి అప్పగించాడు. వారి బలంపై పూర్తి అంచనాకు వచ్చిన సైన్యం ఒకరిని కూడా మిగిల్చకుండా అందరినీ తుదముట్టించింది. ఈ ఆపరేషన్‌కి గాని దోవల్‌కి అరుదైన గుర్తింపు లభించింది. కేవలం సైన్యంలో పనిచేసే వారికి మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మక ‘కీర్తి చక్ర’ అవార్డుని ఒక పోలీసు అధికారిగా అందుకున్నారు.
సీక్రెట్ ఏజెంట్‌గా పాక్‌లో ఏడేళ్లు
ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న మొదటిరోజు నుంచి డోవల్ కు పాక్ చర్యలపై అంచనాలు 100 శాతం కచ్చితత్వంతో ఉండేవి. పూర్తిగా ఉగ్రవాదాన్ని నమ్ముకున్న సైనిక దేశం రానున్న రోజుల్లో ఎలా కుప్పకూలనుందో ఆయన గతంలోనే అనేసార్లు వివరించారు. పాకిస్తాన్‌లో దాదాపు 7 ఏళ్లపాటు అండర్ కవర్ ఏజెంట్‌గా పనిచేశారు. ఎన్నో కీలకమైన సైనిక రహస్యాలు సాధించిన భారత సైన్యానికి అందించాడు.
పాత టార్గెట్.. ఈ సారి గురి తప్పలేదు
ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ను విడిపించడానికి పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉగ్రవాదులు IC-814 అనే ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని 24 డిసెంబర్ 1999 న హైజాక్ చేశారు. దానిని అఫ్గాన్‌లోని కాందహార్‌కు మళ్లించారు. అక్కడ వారితో చర్చలకు జరిపేందుకు వెళ్లిన బృందంలో దోవల్ కూడా ఉన్నారు. అయితే ప్రయాణికుల భద్రత దృష్ట్యా అప్పట్లో మిలిటరీ ఆపరేషన్‌కి దూరంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న ‘ఆపరేషన్ సిందూర్’లో నాటి కాందాహార్ హైజాక్ మాస్టర్ మైండ్.. మసూద్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజహర్‌ని విజయవంతంగా మట్టుపెట్టగలిగారు.
ఏకంగా పది మంది కుటుంబ సభ్యులు దాడుల్లో మరణించిన తరువాత మసూద్ మానసిక స్థైర్యంపై ఏ లెవెల్‌లో దెబ్బ పడి ఉంటుందో ఊహించొచ్చు. ఇది దోవల్ స్టైల్ ప్రతీకారానికి మచ్చుతునక. అంతేకాదు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్లు పదులసంఖ్యలో బైక్‌పై వచ్చే గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. అందుకే ఉగ్ర ముఠాల నాయకులు బైక్ పై వచ్చే వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు భయపడి పారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారిని అంతలా భయపెట్టిస్తున్న అదృశ్య శక్తి కూడా అజిత్ అని అంటారు.
10 ఏళ్లుగా జాతీయ భద్రతా సలహాదారుగా..
అటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో దీర్ఘ కాలిక అనుభవంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సొంత నెట్‌వర్క్ ఉన్న అజిత్ దోవల్ ఈ పదేళ్లలో అనేక క్లిష్ట సమయాల్లో కీలక నిర్ణయాలతో తన మార్క్ చూపించారు. ఐస్ఐస్ ఆక్రమణలో ఉన్న ఇరాక్‌లోని తిక్రిత్ నగరంలో చిక్కుకుపోయిన 46 మంది ఇండియన్ నర్సులను విజయవంతంగా వెనక్కి తీసుకురాగలిగారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోని నాగాలాండ్ వేర్పాటువాదులతో పాటు యూరి, పుల్వామా ఉగ్రదాడుల తర్వాత ఊహించని రేంజ్‌లో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. ‘సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇలా ఉండాలి’ అనే విధంగా దేశం దాటి మరీ ఉగ్రవాదులని వాళ్ల స్థావరంలోనే విజయవంతంగా మట్టుపెట్టి రాగలిగారు. దీంతో అటు కేంద్రంలోని పెద్దలకు, ఇటు దేశంలోని ప్రజలకు అజిత్ దోవల్‌పై నమ్మకం వంద రెట్లు పెరిగింది. దీంతో 2019లో మరోసారి ఆయనను అదే పదవికి ఎంపిక చేశారు.
ఈసారి మరింత పదునుగా..
జమ్మూకశ్మీర్‌కి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఆయన పాత్ర అత్యంత కీలకం. సమాచార సేకరణ విశ్లేషణలో అనుసరించిన విధానాలు కేంద్రానికి ఆర్టికల్ 370 రద్దు విషయంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆర్టికల్ రద్దు సమయంలో కేంద్రం చేసిన ఓ ప్రకటన పాక్‌ను ముచ్చెమటలు పట్టించేలా చేసింది. అది కూడా దోవల్ వ్యూహాత్మక శక్తికి నిదర్శనం. అదే సంపూర్ణ కశ్మీర్.. పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ కూడా భారత్‌లో అంతర్భాగమేనని ప్రకటించడం.. పాక్‌కు మింగుడు పడనివిషయం.
పాక్‌కు మాస్టర్ స్ట్రోక్..
దశాబ్దాలుగా ఉగ్రవాదాన్నే నమ్ముకున్న పాకిస్తాన్‌కి ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు దోవల్. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత సివిల్ మాక్ డ్రిల్ పేరుతో దేశవ్యాప్తంగా హోం మంత్రిత్వ శాఖ తరపున కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటన వచ్చేలా చేసి పాకిస్తాన్ ఆర్మీ, రాజకీయ నేతలను ఏమార్చారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్, ఇతర ఉగ్రవాదుల క్యాంపులపై అర్ధరాత్రి దాడులతో కాళరాత్రిగా మార్చేశారు.
తిరిగి తేరుకునేలోపే అన్ని దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడి దౌత్యపరంగా ఎలాంటి సమస్య రాకుండా వ్యవహరించారు. ఇప్పటికీ ఆపరేషన్స్ సిందూర్‌లో ప్రతి మూమెంట్‌ని ఎప్పటికప్పుడు ప్రధానికి అందిస్తూ ఆపరేషన్ విజయవంతంలో సమర్థంగా తన పాత్రను పోషిస్తున్నారు. అందుకే దోవల్ భద్రత, వ్యూహాత్మక రక్షణ విషయంలో ‘అంతర్జాతీయ నిధి’ అంటూ ఓ సమావేశంలో ఇండియాలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి పొగిడారు. దీనిని బట్టి తెలుస్తుంది ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ విలువేంటో






