గుడ్ కంటెంట్‌కు నో.. బ్యాడ్ కంటెంట్‌కు ఎస్..

by Sujitha Rachapalli |

సోషల్ మీడియాలో బ్యాడ్ కంటెంట్‌కే ఆదరణ.. మంచి వద్దని చెడుతో చెట్టా పట్టాలు.. సొగసుల వల విసిరితే పడిపోవుడే.. వేల రూపాలైనా సరే సబ్‌స్క్రిప్షన్ తీసుకునుడే.. తన్నుకుంటున్నారంటే లక్షల వ్యూస్.. క్రైమ్ చేస్తున్నారంటే మిలియన్ వీక్షణలు.. ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలంటే స్కిప్ నొక్కుడే

గుడ్ కంటెంట్‌కు నో.. బ్యాడ్ కంటెంట్‌కు ఎస్..
X

దిశ, ఫీచర్స్ : మంచి చెప్తే మనకు నచ్చదు. మంచిని మించిందేది లేదని చెప్తే.. ‘ఇగ నువ్వే చెప్పాలె’ అని కసురుకుంటరు. అదే ఏదైనా లంగ ముచ్చటో, దొంగ ముచ్చటో అయితే ‘ఏమైంది ఏమైందీ’ అని చెవులు కొరుకుతరు. సొల్లు చెప్తే మనోళ్లకు వినసొంపుగా ఉంటుంది. వాడకట్లలో, అరుగుల మీదనో నడిచే ఈ పనికిరాని ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కి యమ జోరుమీద నడుస్తున్నాయి. మసాల కంటెంట్‌కు అలవాటుపడి మంచి సమాచారాన్ని లెక్క చేస్తలేరు.

మంచి కంటెంట్‌కు పాతరేసి..

నడుస్తున్నది సోషల్ మీడియా జమానా కాబట్టి సమాచారం కోసం మనం దాదాపు దాని మీదనే ఆధారపడుతాం. సోషల్ మీడియాలో రకరకాల కంటెంట్ ఉంటుంది. అక్కెరకొచ్చే ముచ్చట, అక్కెరకురాని ముచ్చట అంతా ఒకేచోట ఉంటుంది. దీంతో దేన్ని ఎంచుకోవాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్ఫ్యూజ్‌లో మంచి కంటెంట్‌కు పాతరేసి బ్యాడ్ కంటెంట్ వీక్షణకు బారులు తీస్తుంటారు. తప్పెవరిది? అంటే.. ముమ్మాటికీ మనదే. అంగట్లో కూరగాయల కోసం వెళ్లినప్పుడు అక్కడ పుచ్చు టమాటాలుంటయి.. మంచి టమాటాలుంటయి.. కాకపోతే అన్నీ కలిసిపోయి ఉంటాయి. పుచ్చులేరేస్తవా లేదా ఆ పుచ్చు టమాటాల్లోంచి మనకు అవసరమొచ్చే మంచి టమాటాలు తీసుకుంటమా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది.

సొల్లుకు సొంగ కారుస్తూ..

నిజానికి జనాల మెంటాలిటీ ఎట్ల తయారైందంటే.. బ్యాడ్ కంటెంట్‌ను బాజాప్తా అన్నట్లు ఎంకరేజ్ చేస్తుంటారు. అదే గుడ్ కంటెంట్ అయితే అస్సలు నచ్చదన్నట్లుగా స్కిప్ చేస్తుంటారు. దీనికి ఉదాహరణ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే మసాలా కంటెంటే. గొర్రె జనాల్ని ట్రాప్ చేసే కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఇన్‌స్టాలో. సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ వీడియోస్‌కి తెగ రెస్పాండ్ అవుతుంటారు. ఎందుకంటే ఆ వీడియోస్‌లో సొల్లు చెప్పేది అమ్మాయిలు. ఆ మాటలకు సొంగ కార్చేది మనం. అట్లా జనాలను ఎర్రిపప్పలను చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు చాలామంది. మనొళ్లు మాత్రం ఎక్కడ ఏ చేప దొరుకుతుందా అని కాస్కొని కూర్చుంటారు. జనాలకు తెలియని విషయం ఏంటంటే అదంతా సంపాదనలో ఒక ట్రిక్. మన బలహీనతతో సంపాదించే ఐడియా.

అర్థమయ్యే కంటెంట్ మాకొద్దు..

ఒకాయన మంచి ఉద్దేశంతో ఉంటాడు. ఇయాలరేపు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకోవడం మామూలు ముచ్చటకాదు. చేతిలో లక్షల రూపాయలు పెట్టుకొని ఉండాలి. అందుకే తనొక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి దాని ద్వారా అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన సమాచారం అందిస్తున్నాడు. అదీ.. ఉచితంగా. చాలా చక్కగా.. అందరికీ అర్థమయ్యేలా కంటెంట్ ఇస్తుంటాడు. పాపం.. రోజుకు ఆరేడు గంటలు దీనికే కేటాయిస్తుంటాడు. జనాలకు అక్కెరకొచ్చే సమాచారమైతే అందిస్తున్నాం.. ఇయాల కాకపోయినా ఇంకో ఆర్నెళ్లకైనా మన ఛానెల్ నిలదొక్కుకోదా అనే నమ్మకం పెట్టుకుంటాడు. కానీ ఆర్నెళ్లు కాదు.. సంవత్సరమైనా ఆ చానెల్ క్లిక్కయ్యింది లేదు.. అతడికి నాలుగు పైసలు సంపాదించి పెట్టిందీ లేదు.

గాల్లో తేలిపోయి గంతులేస్తాం..

ఒకావిడ పచ్చళ్ల పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తోంది. ఛానెల్ పెట్టిన నెల రోజులకే మానిటైజేషన్ స్టార్టయింది. ఎందుకు? ఆమె పచ్చళ్లతో పాటు మధ్య మధ్యలో ముచ్చట పెడుతుంది. ‘హాయ్.. ఎలా ఉన్నారు’ అని అడగ్గానే మనం ఉబ్బితబ్బిపోతాం. ‘డిన్నర్ అయిందా’ అని అడగ్గానే గాల్లో తేలిపోతాం. ‘మీకోసం మంచి మంచి పచ్చళ్లు తీసుకొచ్చినా’ అనగానే ఐదారు ఆర్డర్ పెడతాం. వీడియో అయిపోయేవరకు చూస్తాం. లైక్ చేస్తాం. షేర్ చేస్తాం. కామెంట్ చేస్తాం. గంట గుర్తును గప్పాగప్పా నొక్కుతాం. ముగ్గురికి మరో ముగ్గురు అన్నట్టు చైన్ సిస్టంలో ఆ వీడియోను షేర్ చేసే పనిలో బిజీ అయిపోతాం. ఇంట్లోవాళ్లు ఏదైనా పనిచెప్తే ‘చల్ నడువ్.. నేను చాలా బిజీగా ఉన్నా.. నాకు వీలు కాదు’ అని తప్పించుకొని పచ్చళ్ల వీడియో తన్మయత్వంలో మునిగిపోతాం.

మంచిని ఎంకరేజ్ చేయం..

‘డబ్బులు ఆదా చేయడం ఎలా?’.. ‘పొదుపుకు పది సూత్రాలు’.. వంటి కంటెంట్ కనిపిస్తే వెంటనే స్కిప్ చేస్తాం. ‘హా.. డబ్బులెట్ల ఆదా చేయాల్నో నువ్వే చెప్పాలి ఇగ.. ఆ మాత్రం మాకు తెల్వదా?’ అని కామెంట్లు చేస్తాం. పట్టుమని పది సెకన్లు కూడా ఈ కంటెంటును చూడం. ‘పొదుపుకు సూత్రాలు తెలిస్తే నువ్విక్కడ పోస్టులు పెట్టుకుంట ఎందుకు కూసుంటవ్’ అని గుడ్ కంటెంటును లైట్ తీసుకుంటాం. అయ్యో.. మన కోసమే చేస్తుండుగా ఎంకరేజ్ చేస్తే ఇంకిన్ని పనికొచ్చే వీడియోల చేస్తడు కదా అనే ఆలోచనే రాదు. ఒకవేళ ఎవరికైనా వస్తే.. ‘ఆడో పెద్ద వేదాంతి.. వీడో సిద్ధాంతి.. బాగ మోపైండ్రు పోన్రీ’ అని చులకనగా మాట్లాడుతుంటారు. జనాల ఆలోచనా విధానం ఇలా ఉంది కాబట్టే గుడ్ కంటెంట్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

కాసులుపెట్టి కండ్లకద్దుకొని..

డబ్బులతో పాటు మతిపోగొట్టే కంత్రీ కంటెంట్ అంటే జనాలకు మస్తు క్రేజీ. పైసలు సంపాదించే కంటెంట్ సూడమంటే ఆపసోపాలు పడుతుంటారు. కానీ పైసలు సమర్పించుకొని ఫలారం కొనుక్కునే కంటెంట్‌నైతే కండ్లకద్దుకొని చూస్తుంటారు. ‘జాకెట్ రత్నమాల విప్పుతుందా.. వేమన్ విప్పుతాడా’ అని టెంప్ట్ చేసి ఆశల టెంటేసే కంటెంట్ కనిపిస్తే ‘తర్వాత తర్వాత’ అంటూ తర్వాత ఏం జరుగుతుందో అని తల్లడిల్లిపోతుంటారు. కానీ ఆశ దోశ అప్పడం వడ అన్నట్లుగా వాడెందుకు దాన్ని ఫ్రీగా అందిస్తాడు. ‘రత్నమాల జాకెట్ ఎవరు విప్పారో తెలుసుకోవాలంటే మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకొండి.. రూ.500తో సబ్‌స్క్రిప్షన్ తీసుకొని మరిన్ని వీడియోలు చూసి ఆనందించిండి’ అని జేబుకు చిల్లుపెట్టి మనల్ని మైకంలో ముంచి జోలపాట పాడుతాడు.

చెడుతో చెట్టాపట్టాల్..

‘ఆరోగ్యానికి ఆరు సూత్రాలు’.. ‘మీ హెల్త్ మీ చేతుల్లోనే’ అని ఎవరైనా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తే వాళ్లకు స్టార్టింగ్లోనే సకల సమస్యలు వెంటాడుతాయి. జనాల ఆరోగ్యం కోసం మంచి కంటెంట్ ఇవ్వాలని సమయం, డబ్బు, మెంటల్ ఎఫర్ట్ పెడితే దానిని ఎంకరేజ్ చేసేవాళ్లు లేక కంటెంట్ క్రియేటర్ల ఆరోగ్యమే పాడయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. పాపం ఎవరైనా డాక్టర్ జనాల కోసం కంటెంట్ ఇద్దామనుకుంటే ‘డాక్టర్లకు ఇదోరకం దందా. హాస్పిటల్స్‌లో దోచుకున్నది సరిపోతలేదన్నట్టు కొత్తగా సోషల్ మీడియాకు వచ్చిండ్రా’ అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఏ కంటెంట్ తమను సేవ్ చేస్తుంది.. ఏ కంటెంట్ నిలువునా ముంచుతుందీ అనే సోయి లేకుండా మంచిని వద్దనుకొని చెడుతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్లే ఎక్కువ కనిపిస్తుంటారు.

పులిహోర కలుపుతూ ఫుల్‌టైం సబ్‌స్క్రిప్షన్..

‘హలో ఏం చేస్తున్నారు.. ఇంట్లో ఉండి బోర్ కొడుతుందా.. మీకు కొత్త ప్రపంచం చూపిస్తాం’ అని వలేసి వయ్యారంగా మాట్లాడితే అది విని సమ్మగా ఉంటుంది మనకు. అలాంటి సైలెంట్ కంటెంట్ కోసం సప్త సముద్రాలన్నీ దాటిపోయి శోధిస్తుంటాం. సొల్లు కారుస్తూ సోయిదప్పిన కామెంట్లు చేస్తుంటాం. కాంటాక్ట్ నంబర్ కావాలని కక్కుర్తి వేషాలేస్తాం. ‘చాలా అందంగా ఉన్నావు.. మీదే కాలేజ్? నీ కండ్లు బాగుంటయి. నీ పెదాలు బాగుంటయి’ అని పులిహోర కలుపుతూ ఫుల్ టైం సబ్‌స్క్రయిబర్ అవతారమెత్తుతాం. సేమ్ ఇలాంటి ఎంకరేజ్మెంటే గుడ్ కంటెంట్, యూజ్‌ఫుల్ కంటెంట్ ఇచ్చేవాళ్లకు చేస్తే బాగుంటుంది కదా? వాళ్లిచ్చే కంటెంట్ కూడా మనకోసమే కదా? ఇంకా చెప్పాలంటే మన క్షేమం కోరేవాళ్లే కదా? మరి ఎందుకు అలాంటి కంటెంట్‌ను డిస్కరేజ్ చేస్తున్నాం?

పిచ్చిపట్టినట్లే ఎగబడి..

ఈ మధ్య ఒక వీడియో వైరలైంది. భార్యాభర్తలు ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటారు. భార్యేదో పాట పాడుతుంటుంది. దానికి తగ్గట్టుగా భర్త ‘జింపుచకా జింపుచకా’ అని నోటితో ఏవో వాయిద్యాలు వాయిస్తూ ఉంటాడు. కామెంట్లు చదువుతూ ‘ప్లీజ్ రాజుగారు.. కామెంట్ చేయండి సబ్‌స్క్రయిబ్ చేసి మమ్మల్ని ఆదరించండి’ అంటే జనాలు పిచ్చిపట్టినట్లు ఆ వీడియోలకు ఎగబడ్డారు. వాటిలో ఏమైనా సరుకుందా అంటే ఏం లేదు. అంతా ఉత్తదే డబ్బా. భార్య తానా అనడం.. భర్త తందానా అనడం. అంతా భభ్రజమానం భజగోవిందం. కానీ జనాలు వాళ్లను ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. అంతేగాదు.. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి డబ్బులు కూడా బాగనే పంపించారు. ఇదే స్పీడు.. ఇంతే ఎంకరేజ్మెంట్ జనాలకు అవసరమొచ్చే కంటెంట్‌కు ఇస్తరా? ఇవ్వరు. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.. పసిపిల్లల ప్రాణం పోయేలా ఉంది.. మీకు తోచిన సహాయం చేయమంటే చేయం.. ఇదేదో బోగస్ లాగా ఉందని వెంటనే స్కిప్ చేస్తం. బోగస్ అయితే అయిందిలే.. ఒకవేళ నిజమే అయితే ఎట్ల ఎంతో కొంత సాయం చేద్దాంలే అనుకోం.. ఎందుకంటే అది మంచి కంటెంట్ కదా.. మంచి చేసేందుకు కదా.. మనకు నచ్చదు.

అక్కడ గుడ్ కంటెంట్‌కు ఆదరణ..

మన దగ్గరే ఇలా ఉందా? దునియా మొత్తం ఇట్లనే తయారైందా తెలుసుకుంటే మనకు సమస్య తీవ్రత మీద ఇంకింత స్పష్టత వస్తుంది. అలా చూస్తే అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాల్లో సోషల్ మీడియా యూజర్లు ఇష్టపడే కంటెంట్ గురించి ఒకసారి చూద్దాం. హూట్ స్క్వైట్, స్ప్రౌట్ సోషల్, డేటా రిపోర్టల్, వియ్ ఆర్ సోషల్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. అమెరికాలో ఎక్కువగా టిక్‌టాక్, ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి షార్ట్ ఫామ్ వీడియో కంటెంట్ టాప్‌లో ఉంది. వీటిలో ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్, ఇన్‌స్ట్రక్షనల్ ఎక్కువగా ఉంటాయి. ఈ కంటెంట్ కోసం యూట్యూబ్‌ 84%.. ఫేస్‌బుక్‌ 71%.. ఇన్‌స్టా 50%+.. టిక్‌టాక్‌ను 37% వాడుతున్నారు అమెరికన్లు. అక్కడ గుడ్ కంటెంట్‌కు ఆదరణ చాలా ఎక్కువ.

గవర్నమెంట్ సెన్సార్‌షిప్..

గుడ్ కంటెంట్లో భాగంగా అమెరికన్ యూజర్లు నెంబర్ వన్ టాప్ ప్రయారిటీ హ్యూమన్ కంటెంట్‌కు ఇస్తున్నారు. బ్యాడ్ కంటెంట్ విషయానికొస్తే సెన్సేషనల్, నెగెటివ్, ఏఐ స్లాప్, ఓవర్-ప్రమోషనల్ కంటెంట్ ఉంటుంది. నెగెటివ్ ఆర్టికల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతున్నా ఏఐ యాడ్స్ ఉపయోగించే బ్రాండ్స్‌ను అవాయిడ్ చేస్తారు. ఇక చైనా విషయం చూస్తే.. ఎక్కువగా షార్ట్ వీడియోస్, డౌయిన్, టిక్‌టాక్ వంటి లైవ్ స్ట్రీమింగ్ వీడియో కంటెంట్ ఎక్కువగా ఇష్టపడుతారు. ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్ట్ డెమోస్ లైఫ్‌స్టయిల్ రివ్యూస్‌‌‌‌‌‌కి కూడా ఆదరణ ఎక్కువే. గుడ్ కంటెంట్ అంటే ఈ కామర్స్ ఇంటిగ్రేటెడ్, హెల్త్, వెల్‌నెస్ కంటెంట్ ఇంటరాక్షన్ రేట్స్ టాప్‌లో ఉంటున్నాయి. గవర్నమెంట్ సెన్సార్‌షిప్ వల్ల నెగెటివ్, పొలిటికల్ బ్యాడ్ కంటెంట్ చాలా తక్కువ.

విశ్వసనీయతకే యూజర్ల మొగ్గు..

జపాన్‌లో ఎక్కువగా ఇష్టపడే కంటెంట్ న్యూస్, ట్రెండ్స్, ఇన్ఫర్మేషన్, డిస్కషన్స్. ఇన్‌స్టాలో విజువల్ స్టోరీ టెల్లింగ్, ఇన్‌ఫ్లూయెన్సర్స్, లైఫ్‌స్టయిల్, సెలబ్రిటీస్, యూత్‌ఫుల్, క్రియేటివ్ కంటెంట్ ఎక్కువగా ఇష్టపడుతారు. ఇన్‌ఫర్మేటివ్, ఇన్‌ఫ్లూయెన్సర్ స్టోరీలను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సెన్సేషనల్ ట్రెండ్స్ కొంత వైరల్ అవుతాయి కానీ జపాన్ కల్చర్ వల్ల పొలైట్, అథెంటిక్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల బ్యాడ్, నెగెటివ్ ఎంగేజ్‌మెంట్ తక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే యూజర్లు విశ్వసనీయతకే మొగ్గు చూపుతారు. మనవాళ్లలా టైంపాస్ చేయరు. మనకున్నంత బ్యాడ్ ఒపీనియన్ వీళ్లకుండదు. సెన్సార్‌షిప్ వల్ల బ్యాడ్ కంటెంట్ చాలా తక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మన దగ్గర సెన్సార్‌షిప్ చాలా ముఖ్యం.

రివర్స్ మెకానిజం ఉండాలి: నరేంద్ర గోకవరపు, కంటెంట్ స్ట్రాటజిస్ట్

ఏ వ్యక్తి జీవితంలో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే జనాలు మంచి కంటే చెడునే గుర్తుంచుకుంటారు. తన జీవితంలో జరిగిన సంఘటనలను మాటిమాటికీ గుర్తు చేస్తుంటారు. ఈ పరంపరలోనే గుడ్ కంటెంట్, బ్యాడ్ కంటెంట్ ఎంపిక జరుగుతుంది. ఏఐ ఆల్గారిథమ్ కూడా ఇదే బేస్ చేసుకుని కంటెంట్ క్రియేషన్ చేస్తుంది. అందుకే రివర్స్ మెకానిజం ఉండాలి. చెడునెంత స్ప్రెడ్ చేస్తున్నామో.. మంచినీ అంతే చేయాలి.

మైండ్ సెట్ మారాలి: శ్రీనివాస్ మంజీరా, కంటెంట్ క్రియేటర్

సోషల్ మీడియాలో చాలా మటుకు బ్యాడ్ కంటెంటే ఎక్కువగా ఉంటుంది. కంటెంట్ క్రియేటర్లు ఊహించి.. ఉన్నదాన్ని వక్రీకరించి వ్యూస్ కోసం మంచిని చెడుగా నమ్మించడం ఎక్కువయ్యింది. గుడ్ కంటెంట్‌ కన్నా బ్యాడ్ కంటెంట్‌కు పెట్టే థంబ్‌నెయిల్స్ ఎక్కువగా వ్యూస్ వచ్చేలా ఉంటున్నాయి. మర్డర్లు.. చోరీల కంటెంట్ వైరల్ అయినంతగా గుడ్ కంటెంట్ కాలేక పోతోంది. జనాల మైండ్ సెట్ మారనంత వరకు ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుంది.

థ్రిల్ కోసం: వీరేందర్ చెన్నోజు, సైకాలజిస్ట్

సాధారణంగా మన బ్రెయిన్ చెడు వైపు త్వరగా అట్రాక్ట్ అవుతుంది. కామ్‌గా.. పీస్ ఫుల్‌గా.. బెటర్‌గా ఉండేవి ఎంతకని చూస్తాం అనే ఫీలింగ్‌తో స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికో.. ప్రశాంతత కోసమో బ్యాడ్ కంటెంట్ గురించి ఆలోచిస్తాం. మనలోని ఉత్సుకతను పసిగట్టి అలాంటి కంటెంటే క్రియేట్ చేస్తారు. మనం చేయలేం కాబట్టి ఎవరో ఒకరు చేస్తుంటే థ్రిల్ అనిపించి.. అవతలి వ్యక్తులు చేస్తున్న అడ్వెంచర్ కూడా మనమే చేస్తున్నామని ఫీల్ అవుతాం. మనం చేయనిది, చూడనిది ఇంకెవరో చేస్తుంటే తెలుసుకోవాలనే ఉద్దేశంతో బ్యాడ్ కంటెంట్‌కు అట్రాక్ట్ అవుతాం.

Next Story