మేఘ్ బెనర్జీ... 70 ఏళ్ల మార్గదర్శకత్వం

by Sujitha Rachapalli |

చరిత్ర చూసుకుంటే.. శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు ముందుగా పిచ్చి పనులుగానే హేళన చేయబడ్డాయి. సైంటిస్ట్ మేఘ్ బెనర్జీని కూడా చాలా మంది అలాగే అనుకున్నారు. కానీ పరిమిత వనరులు, నిధులతో ఆయన చేసిన ప్రయోగం సక్సెస్ అయింది.

మేఘ్ బెనర్జీ... 70 ఏళ్ల మార్గదర్శకత్వం
X

దిశ, ఫీచర్స్ : చరిత్ర చూసుకుంటే.. శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు ముందుగా పిచ్చి పనులుగానే హేళన చేయబడ్డాయి. సైంటిస్ట్ మేఘ్ బెనర్జీని కూడా చాలా మంది అలాగే అనుకున్నారు. కానీ పరిమిత వనరులు, నిధులతో ఆయన చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఇప్పటికీ ఆయన ఫార్మూలాపై ఆధారపడి ఇండియాలో ఎక్స్‌పరిమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది బెంగాలీ సైంటిస్ట్ భారతదేశంలో మొదటి కృత్రిమ వర్షాన్ని సృష్టించిన చరిత్ర కాగా అప్పటి పరిస్థితులు ఇప్పటి సిట్యుయేషన్స్ గురించి తెలుసుకుందాం.

ఢిల్లీ విషపూరిత గాలిని శుభ్రం చేయడానికి విమానాల ద్వారా క్లౌడ్ సీడింగ్ వైపు మొగ్గు చూపక ముందే.. కలకత్తాకు చెందిన సైంటిస్ట్ హైడ్రోజన్ బెలూన్లు, రసాయనాలు, దృఢనిశ్చయంతో వర్షం కురిపించడానికి ప్రయత్నించారు. ఆయనే డా. సుధాన్ష్ కుమార్ బెనర్జీ. భారతదేశపు మాజీ మెటీరియాలజికల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్. ఎంతోమంది అవాస్తవికమని తోసిపుచ్చిన ప్రశ్నను సంవత్సరాల తరబడి అనుసరించారు. భారతదేశం తన సొంత విధానంలో వర్షం కురిపించగలదా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు.

వర్షం తయారీ యంత్రం నిర్మాణం

క్లౌడ్ సీడింగ్ అప్పటికి ఇంకా కొత్త రంగం. 1940ల చివరలో అమెరికాలో ఈ సాంకేతికతను ప్రదర్శించారు. బెనర్జీ 1950ల ప్రారంభంలో అమెరికా వెళ్లి ఈ ప్రయోగాలను బాగా అధ్యయనం చేశారు. ఖరీదైన విమానాలు లేకుండా, భారతదేశంలో చౌకగా అమలు చేయవచ్చని ఆయన భావించారు. కలకత్తాలోని జాదవ్‌పూర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎత్తైన గాజు క్లౌడ్ చాంబర్‌ను రూపొందించి.. నియంత్రిత పరిస్థితుల్లో వర్షం సృష్టించడానికి ప్రయోగాలు చేశారు. దాదాపు రెండేళ్లు ఈ ప్రయోగాలు జరిపిన తర్వాత.. సిల్వర్ అయోడైడ్, డ్రై ఐస్, ఉప్పు వంటి సీడింగ్ ఏజెంట్లతో ఫార్ములాను మెరుగుపరిచారు. తర్వాత బహిరంగ ప్రాంతాల్లో ప్రయోగాలు చేశారు.

చరిత్ర సృష్టించిన బెలూన్

1952లో బెనర్జీ బృందం హైడ్రోజన్ నింపిన బెలూన్లను తయారు చేసి.. వాటిలో చిన్న మెకానిజం ద్వారా సిల్వర్ అయోడైడ్ ఆవిరి, డ్రై ఐస్, నియంత్రిత గన్‌పౌడర్ ఛార్జ్‌ను ఉంచారు. బెలూన్లు మేఘాల ఎత్తుకు చేరగానే సీడింగ్ మెటీరియల్ విడుదల అయ్యేలా ఏర్పాటు చేశారు. మాన్సూన్ సీజన్‌లో కలకత్తా పైన నుంచి ఈ బెలూన్లను విడుదల చేయగా.. ఆశ్చర్యపరిచే ఫలితాలు వెలువడ్డాయి. అనేక ప్రయోగాల తర్వాత వర్షం కురిసింది. ఈ పద్ధతి బెనర్జీని భారతదేశంలో మొదటి కృత్రిమ వర్షం కురిపించిన వారిలో ఒకరిగా చేసింది.

‘మేఘ్ బెనర్జీ’ బిరుదు

సైంటిస్ట్ బెనర్జీ చేసిన ఫలితాల కారణంగా ఆయనను సహచరులు ‘మేఘ్ బెనర్జీ’ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే మేఘాలు లేదా వర్షం తెచ్చేవాడని అర్థం. ఇది సులభంగా వచ్చిన గుర్తింపు కాదు. తక్కువ ఫండింగ్‌తో పని చేసినా.. తన పరిశోధనను అనేక సార్లు డబ్బు వృథా అని తోసిపుచ్చారు. అయినప్పటికీ.. 1953లో సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ (CSIR) ఆయన పద్ధతిని గుర్తించి.. దేశవ్యాప్తంగా ‘రెయిన్ అండ్ క్లౌడ్ ఫిజిక్స్ రీసెర్చ్ యూనిట్’ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఆ యూనిట్ 1950ల చివరి నుంచి 1960ల వరకు ఉత్తర భారతదేశంలో రకరకాల సీడింగ్ కార్యక్రమాలు నడిపి.. వర్షపాతం పెరిగినట్లు రికార్డు చేసింది. ఇందులో బెనర్జీ బెలూన్-ఆధారిత ప్రయోగాలు కూడా భాగం.

ఇప్పుడు ఎందుకు ముఖ్యం?

70 ఏళ్లకు మించిన తర్వాత కూడా భారతదేశం బెనర్జీ నాయకత్వం వహించిన ఈ సైన్స్‌పై ప్రయోగాలు చేస్తోంది. కాకపోతే సాధనాలు మారాయి. ఢిల్లీ వంటి నగరాలు శీతాకాలపు విషపూరిత పొగమంచును ఎదుర్కోవడానికి విమానాల ద్వారా క్లౌడ్ సీడింగ్ చేస్తున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు కరువును ఎదుర్కోవడానికి సీడింగ్ కార్యక్రమాలు నడుపుతున్నాయి. బెనర్జీ జాదవ్‌పూర్ ల్యాబ్‌లో పరిమిత వనరులు, తక్కువ సంస్థాగత మద్దతుతో చేసిన పని ఇప్పటికీ మార్గదర్శకంగా ఉంది. ఆయన కథ భారతదేశంలో అనేక ముఖ్యమైన శాస్త్రీయ విజయాలు బాగా నిధులు లేని ల్యాబ్‌లలో కాకుండా.. ఒక సైంటిస్ట్ మొండి నమ్మకం నుంచి మొదలయ్యాయని గుర్తు చేస్తుంది.

Next Story