దంచు దంచు.. కుందెనలో దంచు.!

by Daayi Srishailam |

ఇప్పటి మిక్సర్ల లెక్క అప్పుడు ఇంటింటికీ కుందెన ఉండేది

దంచు దంచు.. కుందెనలో దంచు.!
X

దిశ, ఫీచర్స్: ఇప్పుడంతా రెడీమేడ్. ఆర్డర్ చేసిన ఐదు నిమిషాలకే ఎలాంటి ఫుడ్ అయినా వేడివేడిగా మన ముందుంటది. కానీ.. ఒకప్పుడు ఏం తినాలన్నా.. ఏ పూటకాపూట దంచుకొని.. తురుముకొని మాత్రమే తినే అవకాశం ఉంటుండె. ఇప్పటి మిక్సర్ల లెక్క అప్పుడు ఇంటింటికీ కుందెన ఉండేది.

సామూహిక కార్యక్రమం..

కుందెన ఒక చెక్కపాత్ర. ఇది ఒక పాత్ర మాత్రమే కాదు. అది మన సంస్కృతి. శ్రమజీవుల ఆయుధం. మానవ సంబంధాలకు, ఆహార సంప్రదాయాలకు ప్రాణం పోసి మనిషి జీవితంలో భాగమైన వ్యవసాయిక పరికరం. వెనకటి రోజుల్లో రైతులు పండించిన వడ్లను ఇంటికి తీసుకొచ్చి ఈ కుందెనలో పోసి దంచెటొళ్లు. కందెనను కొన్నిచోట్లు కుదురు అని కూడా అంటారు. కుదుర్లో దంచిన వడ్లను బియ్యంగా మారుస్తుండేది. కుదుర్లను మామిడి లేదా టేకు చెక్కతో చేసేవాళ్లు. మగవాళ్లు వ్యవసాయ పనుల్లో భాగంగా పొద్దున్నే బాయి కాడికివొయ్యి పనులు చేస్తే.. ఇంటికాడ ఉండే ఆడొళ్లు ఏ రోజుకారోజు కుదుట్ల బియ్యం దంచి వండి పెడుతుండె. ఒకరకంగా ఇదొక సామూహిక కార్యక్రమం. అంటే ఒక్కరితో కానిపని అన్నమాట.

గింజలతో పిల్లల సరదాలు..

తొమ్మిది.. పది అయినా ఇప్పుడు నిద్రలకెల్లి లేవరు కొందరు. కానీ ఒకప్పుడు చిన్నాపెద్దా అంతా ఐదింటిలోపే నిద్రలేసి ఎవరి పనులు వాళ్లు చేసుకునేది. పొద్దు పొద్దున్నే ఎండపొడ పొలాల మీద పడకముందే దాదాపు అన్ని పనులు పూర్తిచేసుకునేది. అవన్నీ అయ్యాయంటే ఇక వడ్ల పనే చేసేవాళ్లు. మొదట వడ్లను ఎండలో ఆరబెట్టి తర్వాత కుదురులో వేస్తుండె. రోకలితో దంచుకుంటూ పాటలు పాడేవాళ్లు. ఆ సప్పుడులో నిజంగా ఒక రిథమ్‌ ఉండేది. థప్.. థప్..మనే శబ్దం ఆ వాడకట్టు మొత్తం వినిపంచేది. దానికి లయబద్దంగా స్.. స్ అనే శబ్దం చేస్తూ దంచూ.. దంచూ బాగా దంచూ అని పాటలు పాడుకునేవాళ్లు. పెద్దొళ్లు అట్లా దంచుతుంటే ఆ దంచుడుకు ఎగిరిపడే బియ్యపు గింజలతోటి సరదా ఆటలు ఆడుతుండేది పిల్లలు.

ఊరంతా కుదుర్ల శబ్దాలే..

కుదురు రైతు శ్రమ ఫలితానికి సాక్షి. ఇది కేవలం దినచర్యనే కాదు.. సామాజిక ఐక్యతను కూడా సూచిస్తుంది. కుదురు సరిగా పనిచేయకపోతే లేదా చిన్నదిగా ఉంటే పక్కింటొళ్లదో.. ఎదురింటొళ్లదో అడిగి తీసుకెళ్లేవాళ్లు. ఇలా ఒకరికొకరు కుదురు సాయమే కాదు.. వడ్లను దంచుడు కూడా వంతులుగా ఒకరోజు ఒకరింట్లో.. ఇంకోరోజు ఇంకొకరింట్లో పెట్టుకుంటుండె. వడ్లను దంచేటప్పుడు అమ్మలక్కలు జానపద గీతాలను మాత్రం మరచిపోయేవాళ్లు కాదు. ఇది పండగల సమయంలో మరింత ఉత్సాహంగా ఉండేదిప సంక్రాంతి.. దసరా పండగలప్పుడైతే ఊరంతా కుదుర్ల శబ్దాలే వినిపించేవి. ఇలా దంచిన బియ్యాన్ని దంపుడు బియ్యం అనేవాళ్లు. ఇప్పుడు జనాలు ఎగబడి ఎగబడి కిలోకి వందా రెండు వందలు పెట్టి దంపుడు బియ్యం కొంటున్నారు.

గ్రామీణ జీవన కేంద్ర బిందువు..

ఇప్పుడంటే మిల్లులుంటున్నాయి. హై-స్పీడ్ గ్రైండింగ్ వల్ల వేడి ఏర్పడి విటమిన్లు, మినరల్స్ నష్టపోతాయి. కానీ కుదురులో నెమ్మదిగా దంచడం వల్ల బియ్యం మరింత పోషకవంతంగా ఉండేది. ఇది మా ఆరోగ్యానికి కూడా మంచిది. ముఖ్యంగా రైస్ బ్రాన్ లోని నూనెలు, ఫైబర్ సంరక్షించబడేవి. కాకపోతే ఇలాంటి ఇకమతులు అప్పటి రైతులకు తెలిసేవి కావు. తెలియకపోయినా దంచుకొని తినడమనే సంప్రదాయం వల్ల ఇంత పౌష్టికమైన తిండి తినేది. ఎలక్ట్రిక్ మిక్స్, మిల్లులు, యంత్రాలు మన ముందు ఉన్నో ఉన్నాయి. వేగంగా.. సులభంగా పనవుతుందోమోగానీ.. ఆ బంధాలు.. ఆ సంతోషం వీటితో రాదు. ఫైనల్‌గా కుదురు లేదా కుందెన అనేది గ్రామీణ జీవన విధానానికి కేంద్ర బిందువుగా చెప్పుకోవచ్చు.

Next Story