ముస్లింల అంతిమ స్నానానికి స్పెషల్ వెహికిల్

by  |

దిశ, చార్మినార్: ముస్లింలు చనిపోయిన అనంతరం.. భౌతికకాయానికి చివరిసారిగా స్నానం చేయించేందుకు ఘుసుల్​మొబైల్ వ్యాన్‌‌ తీసుకొచ్చామని యూత్ వెల్ఫేర్ తెలంగాణ అధ్యక్షుడు జలాలుద్దీన్ జఫర్ తెలిపారు. నిరుపేదల కోసం ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా మొబైల్ వ్యాను ద్వారా సేవలందిస్తున్నామని ప్రకటించారు. భౌతికకాయానికి ఘుసుల్ స్నానం చేయించి జనాజా నమాజ్ చదవించి, శ్మశానవాటికలో ఖననం చేయడం ఇది మృతుడికి దక్కే గౌరవంగా భావిస్తారన్నారు.

హైదరాబాద్ నగరంలో అపార్టు‌మెంటు కల్చర్ పుణ్యమా అని భౌతికకాయానికి ఘుసుల్ స్నానం చేయించడం కష్టంగా మారుతోందని, ఇరుకైన ఇళ్లల్లో శవస్నానం చేయించాలంటే ఎంతో ప్రయాసపడాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవిడ్ సమయాల్లో ఇది మరింత క్లిష్టంగా మారిందన్నారు. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ యూత్ వెల్ఫేర్ యువకులు మొబైల్ ఘుసుల్ వ్యాన్‌ను ప్రారంభించారని తెలిపారు.

ఘుసుల్ వ్యాన్‌ ప్రత్యేకతలు..

భౌతికకాయానికి స్నానం చేయించేలా వ్యాను లోపలి భాగాన్ని డిజైన్ చేశారు. ఇందులో వేడినీళ్ల కోసం గీజర్ ఏర్పాటు చేశారు. షవర్, హైడ్రాలిక్ బెడ్ సౌకర్యం కూడా ఉంది. శవాన్ని మోసే భారం లేకుండా స్ట్రెచర్ మీద నుంచి ఏకంగా బెడ్ మీదకు తరలించవచ్చు.

నగరంలో నివసించే ముస్లింలు ఎవరైనా తమకు ఫోన్ చేస్తే ఇంటిముందుకే వచ్చి ఘుసుల్ స్నానం చేయించి, కఫన్ వస్త్రాన్ని ఉచితంగా అందిస్తామని, అవసరమైతే ఖబరస్తాన్ వరకూ చేర్చుతామని యూత్ వెల్ఫేర్ తెలంగాణ స్పష్టం చేసింది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed