నైరుతి రుతుపవనాలొచ్చేశాయ్

by  |
నైరుతి రుతుపవనాలొచ్చేశాయ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వాతావరణ శాఖ అంచనాకు ఒకట్రెండు రోజులు అటు ఇటుగా బుధవారం అన్ని జిల్లాల్లో వానలు కురిశాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరుగా వర్షాలు పడ్డాయి. రానున్న మూడ్రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జనగామ జిల్లాలలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచే వాతావరణం చల్లబడింది. సాయంత్రానికి భారీ వర్షమే కురిసింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒకవైపు నాలాల్లో చెత్తా చెదారాన్ని తొలగిస్తున్న సమయంలోనే భారీ వర్షం కురవడంతో మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి.

కేరళ నుంచి తమిళనాడు మీదుగా త్రిపుర, మిజోరాం లాంటి ఈశాన్య రాష్ట్రాల వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు కేంద్ర వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, మధ్య అరేబియా సముద్రం, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, కోస్తా ఆంధ్రా తదితర ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. రానున్న 48 గంటల్లో రుతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. వీటికి తోడు తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ ఎత్తు వరకు నైఋతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.


Next Story

Most Viewed