ఎన్440కే వేరియంట్ 15 రెట్లు ప్రమాదకరం

by  |
ఎన్440కే వేరియంట్ 15 రెట్లు ప్రమాదకరం
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్ రూపాలు మార్చుకుంటు మరింత ప్రాణాంతకంగా మారుతూ వస్తున్నది. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో తొలి వేవ్ ముగిసిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఎన్440కే వేరియంట్ భయాందోళనలను కలుగజేసింది. ఈ వేరియంట్ గత వైరస్ కంటే 15 రెట్లు ప్రమాదకరమైనదని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ(సీసీఎంబీ) అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో కనిపిస్తు్న్న డబుల్ మ్యూటెంట్ వేరియంట్ కంటే కూడా ఇదే ప్రమాదకరమైనదిగా ఈ అధ్యయనం తెలిపింది. అయితే, సెకండ్ వేవ్‌కు ఈ వేరియంటే కారణమని చెప్పలేమని పేర్కొంది.

తొలి వేవ్ సమయంలో, ఆ తర్వాత కూడా ఎన్440కే వేరియంట్‌‌పై ఆందోళనలుండేవి. కానీ, ప్రస్తుతమున్న వివరాల ప్రకారం, ఈ వేరియంట్‌ను క్రమంగా డబుల్ మ్యూటెంట్ వేరియంట్(బీ.1.617), యూకే వేరియంట్(బీ.1.1.7)లు రిప్లేస్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. మహారాష్ట్ర వివరాలను ఈ అధ్యయనంలో పేర్కొంటూ ఎన్440కే మార్చిలో కాకుండా ఫిబ్రవరిలోనే ఎక్కువగా కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు. పెరుగుతున్న కేసులకు ఈ వేరియంట్ తీవ్రతకు మధ్య పొంతన లేదని వివరించారు. అయితే, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో డబుల్ మ్యూటెంట్ వేరియంట్ కేసులు సెకండ్ వేవ్ తీవ్రతకు సమాంతరంగా కనిపించాయని సీసీఎంబీ శాస్త్రజ్ఞుడు దివ్యతేజ్ సౌపతి తెలిపారు.

ఎన్440కే ఎక్కువగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో కనిపించింది. మహారాష్ట్రలో మిగతా మూడు రాష్ట్రాల కంటే పక్షం రోజుల ముందు నుంచే సెకండ్ వేవ్ విజృంభణ మొదలైందని, ఎన్440కే తగ్గుతుంటే డబుల్ మ్యూటెంట్ వేరియంట్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయని వివరించారు.


Next Story

Most Viewed