త్వరలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ప్రారంభం : కేటీఆర్

by  |
public health profile
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో గురువారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ములుగు, సిరిసిల్ల జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ రెండు జిల్లాల ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ సేవలను ఆన్లైన్, మొబైల్ ప్లాట్ ఫాంపై అందిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.

టెక్నాలజీ సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, అత్యంత సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారానికి సంబంధించిన కనీస సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఆ శాఖ పరిధిలో చేపట్టేటువంటి భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుందన్నారు. పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుతో లభించే సమాచార విశ్లేషణ చేయడం వలన వివిధ జిల్లాల్లో ప్రత్యేకించి ఉన్న వ్యాధులు, సీజనల్ వ్యాధుల హెల్త్ ట్రెండ్స్ ని గుర్తించవచ్చన్నారు. దీంతో ఆరోగ్య సమస్యలకు అవసరమైన నివారణ, చికిత్స కు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుందన్నారు.

రాష్ట్రంలోనే చిన్న జిల్లాలైన ములుగు, సిరిసిల్లలను ఈ ప్రాజెక్టు కోసం ఎంచుకున్నామన్నారు. వైద్య శాఖ సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను ప్రజల ఇంటివద్దనే సేకరిస్తామన్నారు. బీపీ, షుగర్, యూరిన్, వివిధ రక్త పరీక్షల వివరాలను అక్కడికక్కడే క్షేత్రస్థాయిలో సేకరిస్తామన్నారు. ఎవరికైనా అదనపు పరీక్షల అవసరమైతే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల ద్వారా ఆయా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. హెల్త్ ప్రొఫైల్ రికార్డుని ఇప్పటికే పూర్తిచేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేయాలని సూచించారు.

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ గిరిజన జనాభా అధికంగా ఉండే ములుగు, సిరిసిల్ల ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్య సేవలను అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఐటీ, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రాజెక్టు వివరాలను మంత్రులకు వివరించారు. పైలెట్ ప్రాజెక్టు పై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సమావేశంలో వైద్య శాఖ ఉన్నతాధికారులు సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి, వాకటి కరుణ, శ్రీనివాస్ రావు, రమేష్, గంగాధర్, ఐటీ శాఖ ఉన్నతాధికారులు జయేష్ రంజన్, జి. వెంకటేశ్వరరావు ఇతరులు హాజరయ్యారు.


Next Story

Most Viewed