విశాఖలో దారుణం.. తండ్రి గొంతుకోసి, తల్లిని బురదలో కుక్కిన తనయుడు

by  |
విశాఖలో దారుణం.. తండ్రి గొంతుకోసి, తల్లిని బురదలో కుక్కిన తనయుడు
X

దిశ, ఉత్తరాంధ్ర : సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు మంట కలిసి పోతున్నాయి. ఆస్తికోసం.. వ్యామోహం కోసం.. కక్షలతో రక్త సంబంధీకులు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న కుమారుడే కర్కశంగా వ్యవహరించాడు. 80 ఏళ్ల తండ్రిని హత్య చేసి.. తల్లిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు.

వివరాల్లోకి వెళితే.. సబ్బవరం మండలం టెక్కలిపాలెంకు చెందిన గొంప స్వామినాయుడు (80) డీఎల్‌బీ (డాక్‌ లేబర్‌ బోర్డు)లో పనిచేసి రిటైర్ అయ్యారు. స్వామినాయుడుకు అప్పారావు(48), సత్తిబాబు(42) కుమారులున్నారు. స్వామి నాయుడుకు సుమారు 4 ఎకరాల భూమి ఉంది. దీంట్లో 30 సెంట్లను తన పోషణకు ఉంచుకుని మిగిలినది ఇద్దరు కొడుకులకు పంచారు. భార్య నర్సమ్మ(70)తో కలిసి చిన్నకొడుకు సత్తిబాబు వద్ద స్వామినాయుడు ఉంటున్నాడు. అయితే, కొన్నాళ్లుగా స్వామినాయుడు క్షయ, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. సత్తిబాబు తల్లిదండ్రుల పోషణతో పాటు, వైద్యానికి ఖర్చు చేస్తున్నాడు. ఇంతలో తండ్రి పేరున ఉన్న భూమిపై పెద్దకుమారుడు అప్పారావు కన్నుపడింది. తన తమ్ముడికి ఆ భూమి ఎక్కడ ఇచ్చేస్తాడోనన్న అనుమానంతో అప్పారావు ఇటీవల పంచాయతీ పెద్దల సమక్షంలో సమావేశం పెట్టించాడు. స్వామినాయుడు మరణించే వరకూ ఆ భూమిలో ఎవరూ పండించొద్దని గ్రామపెద్దలు చెప్పారు.

గ్రామపెద్దల మాటలను లెక్కచేయకుండా అప్పారావు ఆ పొలాన్ని దున్ని నాట్లు వేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్వామినాయుడు తన భార్య నరసమ్మ బుధవారం వెళ్లి నాట్లు పీకేందుకు ప్రయత్నించారు. దీంతో అప్పారావు, అతని భార్య పార్వతిలు వారిని అడ్డుకున్నారు. ఒకానొక దశలో పెనుగులాట జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అప్పారావు కత్తితో తండ్రి గొంతుకోసి ప్రాణాలు తీశాడు. తల్లి నర్సమ్మను కొట్టి బురదలో కుక్కేశారు. అనంతరం తల్లి కూడా చనిపోయిందని భావించిన అప్పారావు భార్యతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని బురదలో కూరుకుపోయిన నర్సమ్మను ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సబ్బవరం ఇన్‌చార్జి సీఐ సయ్యద్‌ మహమ్మద్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించినట్టు వెల్లడించారు.


Next Story

Most Viewed