దోస్త్ లేకుండానే దోపిడీ షురూ.. ఆఫ్‌లైన్ పేరుతో అడ్మిషన్లు

by  |
Degree College Admissions
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : డిగ్రీ విద్యా అందరికీ అందుబాటులో ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘దోస్త్’ను ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళశాలలు వేర్వేరు కాదని నిరూపించేందుకు దోస్త్‌ ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. దీని వల్ల ప్రతి విద్యార్థి తనకు అనువైన డిగ్రీ కళశాలలో అడ్మిషన్ తీసుకునే అవకాశం కల్పించడంతోపాటు ప్రతి ఏడాది రూ.15వేల నుంచి రూ.25వేల వరకు రీయింబర్స్ మెంట్ చెల్లింపునకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ లక్ష్యం ఘనంగా ఉన్నా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని డిగ్రీ కళాశాలు ఆఫ్ లైన్ పద్ధతిలో అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. దోస్త్‌తో సంబంధం లేకుండా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకునే అవకాశాన్ని కోర్టు ద్వారా తెచ్చుకున్న యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

నిబంధనలకు పాతర.. అడ్మిషన్ల జాతర..

దోస్త్ నోటిఫికేషన్ తర్వాతనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అడ్మిషన్లు ప్రారంభించాలి. కానీ కార్పొరేట్ డిగ్రీ కళాశాలలు ఆఫ్‌లైన్ పేరుతో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సుమారుగా 1000 డిగ్రీ కళశాలలుంటే గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో 500లకు పైగా ఉన్నాయి. ఇందులో సుమారుగా 30 డిగ్రీ కళాశాలలు ఆఫ్‌లైన్ పద్ధతిలోనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అంతేకాకుండా యూజీసీ 2013 నిబంధనలు ఏ డిగ్రీ కళాశాలలో కోచింగ్ సెంటర్లు నిర్వహించవద్దని సూచిస్తోంది. కానీ షైన్ ఇండియా, విశ్వ విశ్వాణి, సెయింట్ మెరీస్, అవినాష్, తపస్వావి డిగ్రీ కళశాలలు గ్రేటర్లోని బ్రాంచీలను ఏర్పాటు చేసుకొని అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ కార్పొరేట్ కళాశాలల్లో నో అడ్మిషన్ల బోర్డులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

Avinash

కాసుల కోసం అకాడమిక్ క్యాలెండర్ తిరస్కరణ

ఈ కార్పొరేట్ డిగ్రీ కళాశాలలు ప్రభుత్వం విడుదల చేసే క్యాలెండర్‌తో సంబంధం లేకుండా కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశాలు చేసుకుంటూ విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూల్ చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కళాశాలల్లో అడ్మిషన్లు కావాలంటే ముందే బుకింగ్ చేసుకోవాలని యాజమాన్యం సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే ఆడ్మిషన్లు ఉండవనే ఉద్దేశ్యంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి చెల్లిస్తున్నారు. ఈ కళాశాలల్లో ఆడ్మిషన్ వస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతో తల్లిదండ్రులు ముందుగానే ప్రవేశాలకు సిద్ధమైతున్నారు. ప్రధానంగా ఈ కళాశాలల్లో సివిల్ సర్వీస్ కొచింగ్ అందిస్తున్నారని, విశాలవంతంమైన ఏసీ గదులు, బోధనలో నాణ్యత ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు.

ఫిర్యాదులపై అధికారుల స్పందనేది..?

నిబంధనల విరుద్దంగా అడ్మిషన్లు తీసుకుంటున్న కళాశాలలపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌లకు విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఆ కళాశాలల యాజమాన్యంతో కుమ్మక్కై పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబందనలకు విరుద్దంగా ఇప్పటికే భారీగా బ్యానర్లు, యాడ్ల రూపంలో ప్రచారం చేసుకుంటున్న పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.

కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి..

డిగ్రీ ప్రవేశాలకు ముందస్తుగానే అడ్మిషన్లు నిర్వహిస్తున్న అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్, తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. ఈ కళాశాలలపై ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణకు, ఆడిట్ సెల్ డైరెక్టర్ శ్యామల తదితరులుకు ఫిర్యాదు చేశాను. అయినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు.ఇప్పటికీ ప్రవేశాలు నిర్వహిస్తున్న కళాశాలల పైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి ఉన్నత విద్యా మండలి, ఉస్మానియా యూనివర్సిటీ శాశ్వత అనుబంధ గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి, ఉన్నత విద్యా మండలికి విజ్ఞప్తి చేస్తున్నాము.
-ప్రేమ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ నగర మాజీ అధ్యక్షుడు

Next Story

Most Viewed