దారి చూపిన సోషల్ మీడియా.. పల్సర్ బైక్‌తో వ్యవసాయం

by  |
Three Wheeler Tractor
X

దిశ, ముధోల్ : సోషల్ మీడియా ఓ రైతుకు దారి చూపించింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనాలు అందించే వ్యవసాయ యంత్రాన్ని రూపొందించడానికి నాంది పలికింది. ట్రాక్టర్ చేసే పనులన్నీ పల్సర్ బైక్‌తో చేస్తూ వేల రూపాయలను ఆదా చేసుకుంటూ ఆదర్శ వ్యవసాయం చేస్తున్నాడో యువరైతు.

భైంసా పట్టణానికి చెందిన పెండెపు కృష్ణమూర్తి అనే యువరైతుకు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. అయితే తక్కువ పెట్టుబడితో అధిక రాబడి సాధించాలనుకున్నాడు. కానీ దుక్కి దున్నుడు నుంచి పంట చేతికి వచ్చే వరకు కూలీలు, యంత్రాలకు పెట్టుబడి అధికంగా పెట్టాల్సి వస్తోంది. రాబడిలో సగానికి పైగా ఖర్చు వీటికే అవుతున్నట్లు గుర్తించాడు. దీంతో శారీరక శ్రమ తగ్గేలా.. తక్కువ పెట్టుబడిలో వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయాలని ఆలోచించాడు. దీనికి సోషల్ మీడియాను వేధికగా చేసుకున్నాడు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో సెర్చింగ్ చేశాడు.

అతడి శ్రమకు ఫలితం కనిపించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని చితోడ్ గడ్ జిల్లా బడిసాదిడి మండలంలో వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ లాగా పనిచేసే మూడు యంత్రాలను గుర్తించాడు. రూ.90 వేలు పెట్టుబడితో కల్టీవేటర్, సీడ్ డ్రిళ్లర్, స్ప్రే మిషన్‌ను కొనుగోలు చేశాడు. వాటిని దిగుమతి చేసుకుని తన వద్ద ఉన్న పల్సర్ బైక్ వెనక టైర్ తొలగించి, వెనుక భాగంలో ఆ మిషన్లను అమర్చాడు. అది కాస్తా త్రీ వీలర్ ట్రాక్టర్‌లా తయారు అయింది.

దీనిపై ట్రాక్టర్‌తో చేసే పనులు మొత్తం చేస్తున్నాడు. దుక్కులు దున్నడం, విత్తనాలు విత్తడం, కలుపు తీయడం, పత్తి చేలతో మందు స్ప్రే చేయడం లాంటి పనులు గంటల వ్యవధిలోనే చేసేస్తున్నాడు. కేవలం రూ.90 వేల పెట్టుబడితో లక్షల విలువైన ట్రాక్టర్ చేసే పనులు చేస్తుండడంతో తోటి రైతులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పెండెపు కృష్ణమూర్తి వ్యవసాయాన్ని చూడడానికి చుట్టు పక్కల గ్రామాల రైతులు సైతం వచ్చి ఆసక్తిగా గమనిస్తున్నారు. కూలీలతో పని లేకుండా కేవలం ఒక్కరు, ఇద్దరితోనే వ్యవసాయం చేసుకునేలా పెండెపు కృష్ణమూర్తి రూపొందించిన యంత్రం పని చేస్తుండడంతో తోటి రైతులు అతడి వినూత్న ఆలోచనకు ఫిదా అవుతున్నారు. అయితే వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకోవడం కోసమే తాను ఈ సరికొత్త యంత్రానికి రూపకల్పన చేశానని రైతు పెండెపు కృష్ణమూర్తి పేర్కొంటున్నాడు.


Next Story