లాక్ డౌన్ బతుకులపై అడ్డాకూలీ లక్ష్మణ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ..

by Shyam |

<p>దిశ, న్యూస్ బ్యూరో: సామాన్యుల జీవితాల్లో కరోనా సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. ఉద్యోగులపై, ఆర్థికంగా ఉన్నత కుటుంబాలపై కూడా వైరస్ ప్రభావం చూపినా దినదిన గండంగా జీవితాన్ని గడిపే వారిని ఒకరకంగా హత్య చేసిందనే చెప్పాలి. కుటుంబాన్ని వదిలి అడ్డాకూలీలుగా బతుకువెళ్లదీస్తున్న వారి కుటుంబాలపై కరోనా పిడుగు పడింది. లాక్‌డౌన్ కాలంలో పనులు ఎలాగూ దొరకడం లేదు. ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేసే పరిస్థితులు లేవని ముఖ్యమంత్రి మాటల్లో సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు [&hellip;]</p>

దిశ, న్యూస్ బ్యూరో: సామాన్యుల జీవితాల్లో కరోనా సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. ఉద్యోగులపై, ఆర్థికంగా ఉన్నత కుటుంబాలపై కూడా వైరస్ ప్రభావం చూపినా దినదిన గండంగా జీవితాన్ని గడిపే వారిని ఒకరకంగా హత్య చేసిందనే చెప్పాలి. కుటుంబాన్ని వదిలి అడ్డాకూలీలుగా బతుకువెళ్లదీస్తున్న వారి కుటుంబాలపై కరోనా పిడుగు పడింది. లాక్‌డౌన్ కాలంలో పనులు ఎలాగూ దొరకడం లేదు. ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేసే పరిస్థితులు లేవని ముఖ్యమంత్రి మాటల్లో సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించకుంటే ఆకలిచావులు తప్పవని రాజధానిలోని అడ్డాకూలీలు వాపోతున్నారు. ఉదయాన్నే టిఫిన్ బాక్స్ కట్టుకొని రోడ్డు మీదకొచ్చి నిలబడితే పనికి ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఆ రోజు పనిదొరకలేదంటే మరుసటి రోజు పొయ్యి వెలిగించాలంటే భయపడే దయనీయ బతుకులు వారివి. దాచుకున్న అంతో ఇంతో సొమ్ముఈ పది రోజుల్లో కరిగిపోయింది. దాతలు అన్నం పెడితే తప్ప కడుపు నిండని రోజులను నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వమిస్తామన్న రేషన్, ఆర్థిక సాయం ప్రభుత్వ ఆఫీసు పత్రాల్లో, మీడియా వార్తల్లో తప్ప వారి కాలనీలకు కూడా చేరడం లేదు. కనీసం ఒక్కసారి ఊర్లకు వెళ్లేందుకు బస్సులు నడిపిస్తే నగరాన్ని వదిలిపెట్టి వెళ్లడం తప్ప ఇంకో మార్గం లేదని అడ్డాకూలీలు చెబుతున్నారు. ప్రతీ రోజూ పనిచేస్తేనే తమ కుటుంబాలకు తినడానికి ఇంత దొరుకుతుందని, పనిలేకపోతే పస్తులు తప్పవని అంటున్ననిజామాబాద్‌ జిల్లాకు చెందిన అడ్డాకూలీ లక్ష్మణ్‌ లాక్‌డౌన్ కష్టాలను ‘దిశ’తో పంచుకున్న విషయాలు పాఠకుల కోసం…

దిశ: నమస్కారం లక్ష్మణ్.. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఎంత వరకు చదువుకున్నారు. ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చారు.

లక్ష్మణ్: నమస్కారమండీ..మాది నిజామాబాద్ జిల్లా బోధన్. నా వయసు 30 ఏండ్లు. ఏడో తరగతి వరకూ చదువుకున్నా. సదువు అంతగా అబ్బలేదు. దీంతో డ్రైవర్ పనికి వెళ్లేవాడిని. తర్వాత సొంతంగా ట్రాక్టర్, కంప్రషర్ కూడా కొనుకున్నాను. అది కూడా అచ్చిరాలేదు. అప్పులు ఎక్కువ కావడంతో వాటిని కూడా అమ్ముకున్నాను. ఆ తర్వాత బతుకుదెరువు కోసం ఆరేండ్ల నుంచి హైదరాబాదులో అడ్డకూలీగా పనిచేస్తున్నాను. ఇక్కడికొచ్చినంక వరంగల్​, ఆదిలాబాద్​ జిల్లాల నంచి వచ్చిన వారిలో చాలామంది తెలిసినోళ్లు అయ్యారు. అందరం కలిసి రోజూ పనులకు వెళ్తుంటాం..

దిశ: ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు.

లక్ష్మణ్: మా అమ్మానాన్నకు నేను రెండో కొడుకుని. నాకు ఎనిమిదేండ్ల కింద పెండ్లయింది. ఆరేండ్ల కూతురు ఉంది. ప్రస్తుతం ఉప్పల్ విజయపురి కాలనీలో ఉంటున్నాం. ప్రతీ రోజూ గాంధీ చౌక్ దగ్గర అందరి కూలీల లాగానే వచ్చి ప్రతి రోజు నిలబడుతాను. వారికి అవసరమైతే పనికి తీసుకెళ్తారు. లేదంటే 11 గంటల వరకు చూసి ఇంటికి వెళ్లిపోతాను. ఇక్కడికి ప్రతీ రోజూ రెండు, మూడొందల మంది వస్తాం..

దిశ: మీ భార్య కూడా ఏమైనా పనిచేస్తుందా?

లక్ష్మణ్: మా మేనమామ బిడ్డనే పెండ్లి చేసుకున్న. వచ్చిన కొత్తలో బట్టల దుకాణంలో పని చేసేది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉండటంతో పనిచేయడం లేదు. నేను ఒక్కడినే పనిచేసి కుటుంబాన్ని పోషించాలి. రోజు పని దొరకితే తప్ప మాకు పైసలు వచ్చేది లేదు. ఈ పదిహేను రోజుల నుంచైతే ఏ చేద్దామన్నా తోస్తలేదు. అన్ని పనులు బంద్​ చేయించిండ్రు.. ఉప్పల్​లోనే కాదు సిటీలో ఎక్కడా మాలాంటి అడ్డాకూలీలకు పని దొరకకుండా పోయింది. ఊర్లు దగ్గరున్నోళ్లయితే నడుచుకుంటూ ఇండ్లకు వెళ్లిపోయారు. మా ఊరు 300 కిలోమీటర్లు ఉంటది. మేం వెళ్లేందుకు బస్సులు కూడా లేక ఇక్కడే చిక్కుబడిపోయినం.

దిశ: ఏఏ పనులు చేస్తారు. మీకు రోజూ పని దొరుకుతుందా.. కూలీ ఎంత తీసుకుంటారు?

లక్ష్మణ్: అడ్డాకూలీలంటే అన్ని పనులు చేస్తుంటాం. సెంట్రింగ్, హమాలీ, మూటలు మోయడం, ఇసుక లోడ్ కొట్టడం, ఇండ్లు కట్టడం. వచ్చేవారికి ఏ పనికి కావాల్నో చెప్పి అంతమందిని మాత్రమే తీసుకెళ్తారు. మిగిలిన వాళ్లకు ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూడాల్సిందే.. రోజు పని దొరుకుతదో లేదో చెప్పలేం. మాదేమైనా ఉద్యోగమా అన్న.. ఇన్ని రోజులు పోతమని చెప్పేందుకు వారంలో నాలుగు రోజులైతే దొరకొచ్చు. రోజు కూలీ మనిషికి ఏడొందలు తీసుకుంటాం. మా మేస్త్రీ మాట్లాడుకుని అందరిని తీసుకెళ్తాడు. పని దొరికితేనే ఆ రోజు పైసలు వస్తయి. అడ్డా మీదకు వచ్చిన అందరికీ పని దొరకుతదని ఏమీ లేదు. మా అదృష్టం ఉంటే పనొస్తది లేకుంటే ఉత్తగనే ఇంటికి పోయేది.

దిశ: పని దొరికిన రోజు ఏం చేస్తారు. దొరకకపోతే ఏం చేస్తారు?

లక్ష్మణ్: మామూలుగానైతే పని దొరికేది ఉంటే పొద్దున 11 గంటల సరికే వస్తాయి. ఆ టైం దాటిందంటే పని రాదని మాకు అర్థమయితది. అప్పటికి రాలేదంటే ఇంటికి వెళ్లిపోతాం. ఇంటి దగ్గర ఏం పని ఉంటది. భార్యతో మాట్లాడుకుంటా. మా బిడ్డతో ఆడుకుంటాం. కొద్ది సేపు టీవీ చూస్తాం. రేపు పొద్దున గురించి ఏ మేస్త్రీ అయితే పని ఇప్పించగలుగుతాడో వాళ్లకు పోన్లు చేసి పని వస్తే చెప్పండి అని అడుక్కుంటాం పని దొరికినపుడు రోజంతా పని చేసి రాత్రి 7 లేదా 8 గంటలకు ఇంటికి వస్తాం. వచ్చేటపుడో ఓ 90 లేదా క్వార్టర్ తెచ్చుకుని ఇంట్లో వేసుకుని తిని పడుకోవడమే.. కూలీల్లో ఈ అలవాటు అందరికీ ఉంటది. తాగాలని మాకేం సోకు కాదు. కానీ రోజంతా పని చేసి అలిసి పోతాం. ఒళ్లు నొప్పులు పెడతయి. వాటిని మరిచిపోయి మంచిగ నిద్ర పడుతది.

దిశ: లాక్‌డౌన్‌తో పనులు దొరకడం లేదు కదా.. ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఇల్లు ఎలా గడుస్తుంది?

లక్ష్మణ్: బంద్​ కాకముందు నుంచి సరిగా పనులు దొరకడం లేదు. చెప్పిన కదా.. అడ్డా మీదకు వచ్చిన అందరికి పని దొరకదు. ఇప్పుడైతే ఓ పది రోజుల నుంచి మొత్తమే పనిలేదు. పని లేకుంటే ఇల్లు గడిసేది లేదు. అట్లా అని దొంగచాటుగా ఏదైనా సెంట్రింగ్​ పనులకో, ప్లంబింగ్​ పనులకో వెళ్లేందుకు చూసినాం.. ఎవరైనా పనులకు తీసుకెళ్లినా అక్కడికొచ్చి మరీ ఎల్లగొడుతున్నరు. పనిలేదు ఏం లేదు. అప్పట్లో దాచుకున్న డబ్బులనే ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం. ఈ బంద్ రోజుల్లో నాలుగు వేల వరకు ఖర్చు చేసుకున్నాం. మా పని మేం చేసుకుంటమన్నా చేసుకోనిస్తలేరు. డబ్బున్నోళ్లు ఎట్లనన్నా తెచ్చుకుని తింటరు. మేం ఎట్లా బతకాలి. రోజంతా పని చేస్తే కానీ నాలుగు మెతుకులు కడుపులకు పోవు.

దిశ: పని రోజులకు వేతనం ఇస్తామంది కదా.. మీకు రేషన్ సరుకులు, డబ్బులు ఇస్తామంది. అవి అందినాయా..

లక్ష్మణ్: మేము ఏమన్న ఆఫీసుల్లో పనిచేస్తున్నమా.. గవర్నమెంట్ ఉద్యోగమా.. పని చేయకుండా జీతమియ్యడానికి.. అడ్డా మీద నిలబడితే పని దొరకాలి. అట్లా అయితనే పూట గడిచేది. పెండ్లయిన తర్వాత కూడా నేను, నా భార్య మా అమ్మవాళ్ల కార్డులోనే ఉన్నాం. నా బిడ్డ పెద్దగయింది. కొత్త కార్డుకు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా. హైద్రాబాద్‌లో ఆధార్ కార్డులు కూడా చేయించినా. అయిన కార్డు రాలేదు. దరఖాస్తు చేసి కూడా రెండేండ్లయినట్టే ఉంది. ఎందుకు రాలేదని అడిగితే కూడా మాలాంటోళ్లకు సరిగా సమాధానం చెప్పేవాళ్లు ఎవరుంటరు. కార్డు లేదంటే రేషన్ బియ్యం ఎవరు ఇస్తారు చెప్పండి. రేషన్ దుకాణంల అడిగితే కార్డు లేదు.. పోయి మున్సిపల్ ఆఫీసుల పోయి కాయితం రాయించుకొని రావాలన్నరు. నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా
ఎవరూ ఏమీ చెప్పడం లేదు.

దిశ: రేషన్ కార్డు లేని వారికి 12 కిలోల బియ్యం, రూ.500 అందిస్తున్నారు. అవి వచ్చినయా..

లక్ష్మణ్: రేషన్ కార్డు ఉన్నవాళ్లకే సరిగా ఇస్తలేరు. మాకు ఎవరు ఇస్తరు. మా దగ్గరికొచ్చి చూసినొళ్లు కూడా లేరు. మా పేర్లు, ఆధార్ కార్డు నెంబర్లు రాసుకొని మున్సిపల్ ఆఫీస్‌కు పోయినం. ఉప్పల్​ ఆఫీసుల పోయి అడిగితే మీకు కాదు ఇచ్చేది ఆంద్రోళ్లకు ఇస్తమంటున్నరు. మాకు రేషన్​ కార్డు లేదు సార్​, మాకు కూడా ఇయ్యాలి కదా అంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. పోయి గవర్నమెంట్​ దవాఖానాలో రాయించుకొని రాపో అని చెప్పిండ్రు.. ఆడికి పోతే ఎవరు చెప్పిర్రు.. నీకు తలకాయ ఉందా అని తిప్పి పంపించిండ్రు.. ఏ ఆఫీసులు ఏ కాయితం రాసిస్తలేరు. రోజుకు వంద మంది మున్సిపల్​ ఆఫీసులల్లనే నిలబడుతున్నం. ఎండ కొడుతుంది. పనులు లేవు. ఏం చేస్తాం.. ఎవరన్న కరుణించి బియ్యమన్నా ఇస్తే బతుకుతాం కదా అని మా బాధ. మాకు బియ్యం ఇచ్చేవాళ్లు లేరు ఇంకా పైసలు ఏడ వస్తయి చెప్పండి.

దిశ: మరి మీ ఇల్లు ఎలా గడుస్తోంది?

లక్ష్మణ్: దాచుకున్న పైసలతోటి పది రోజులు గడిచినయ్.. ఇప్పడు కూలీలం రోజు పది గంటలకు వచ్చి గాంధీ బొమ్మ దగ్గర కూర్చుంటాం.. ఎవరో ఒకరు దాతలు వచ్చి రోజు అన్నం ప్యాకెట్లు ఇస్తున్నరు. ఒకటి నేను తిని, రెండు ప్యాకెట్లు ఇంటికి తీసుకెళ్తా.. నా భార్య, బిడ్డ అదే తింటరు. ఒక్కోసారి ఎక్కువ ప్యాకెట్లు దొరుకుతే రాత్రికి కూడా అయితది. లేదంటే బిడ్డకు కొంచెం మిగిలిస్తం. మేం పస్తులుంటం. ప్యాకెట్లు దొరకని రోజు అందరం పస్తులే ఉండాలి. కన్నబిడ్డకు ఇంత తిండిపెట్టలేని నా చేతకానితనానికి నామీద నాకే కోపం వస్తది. దానికి ఇన్ని పాలు తెచ్చివ్చలేకపోతున్న. గవర్నమెంట్​ ఇస్తమన్నాయిటికే గ్యారెంటీ లేదు. వాళ్లేదో సాయం చేసే మనసున్నోళ్లు బువ్వ పెడుతున్నరు. లేదంటే పస్తులే. కానీ అన్ని రోజులూ వాళ్లకు కూడా కలిగితేనే పెడతరు.. వీళ్లు కూడా వచ్చి ప్యాకెట్లు ఇవ్వకుంటే మా బతుకులు ఏందో ప్రభుత్వం ఆలోచన చేయాలే..

దిశ: మీ లోకల్​ లీడర్లు ఎవరూ పట్టించుకోవడం లేదా.. మీరు ఎవరినైనా కలిశారా..

లక్ష్మణ్​: గాంధీ బొమ్మ దగ్గర రోజు అన్నం పెడుతున్నరు. ఒక రోజు రేషన్​ కార్డు ఉన్నోళ్లకి బియ్యం ఇచ్చేందుకు ఓ లీడర్​ వచ్చాడు. మాకు కూడా ఇయ్యండి సారూ అని అడిగితే.. మీకేమైందిరా.. బట్టలు, మనిషివి మంచిగనే ఉన్నరుగా అంటూ ఎటకారంగా మాట్లాడారు. మాకు బాధ అనిపించి అవును సారూ… అన్ని మంచిగున్నగూడ బలిసి రోజు కూలి పనులకు పోతున్నం అనగానే ఆయనకు మాటలు రాలేదు. మమ్మిల్ని ఎవరు పట్టించుకుంటరు చెప్పండి. మాది ఈ ఊరు కాదు. మాకు ఓట్లు లేవు. మా కష్టం, నిష్టూరం మేమేం చూసుకుంటాం. వాళ్ల ఎనకాల తిరిగేటోళ్లకైతే పట్టించుకుంటరు. కాని మేం ఉపయోగపడం కదా వాళ్లకు అందుకే మా గురించి మాట్లాడేటోళ్లు ఉండరు.

దిశ: మీరు ఇంటి అద్దె ఎలా కడుతున్నారు.. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి..

లక్ష్మణ్​: మేం ప్రతి నెలా 12 తారీఖున ఇంటి అద్దె కడుతున్నాం. మా ఇంటి ఓనర్​ చాలా మంచివారు. ఇప్పటికైతే ఎప్పుడు తారీఖు మించిపోలేదు. ఈసారి అద్దె కట్టేందుకు డబ్బులు లేవు. పనులు బంద్​ అయినయని వాళ్లకు కూడా తెలుసు. ఏదో ఒకటి బతిలాడుకోవాలి. ఒప్పుకుంటరనే అనుకుంటున్నా. నాలుగు ఏండ్ల నుంచి ఆ ఇంట్లనే ఉంటున్నాం.. మమ్మల్ని చూస్తున్నది కాబట్టి ఒప్పుకుంటదనే అనుకుంటున్నాం. చేతిలో దాచుకున్న డబ్బులన్నీ అయిపోయినయి. మా ఇంటి ఖర్చులకే ఇప్పుడు లేవు. కిరాయి కట్టే పరిస్థితి అయితే లేదు.

దిశ: ఇంటి రెంట్​ కట్టాల్సిన అవసరంలేదని ప్రభుత్వం ప్రకటించింది కదా. తెలుసా మీకు..

లక్ష్మణ్​: తెలుసు.. అయితే మాత్రం అట్ల ఉంటదా అండీ.. కేసీఆర్​ చెప్పినంత మాత్రన అన్ని అయితాయా.. మాకు ఇప్పటికి రేషన్​ బియ్యమే రాలేదు మరి.. మీదీ ఈ రాష్ట్రమే కదా ఇవ్వరు అని ఒకరు చెపుతారు. మున్సిపల్​ ఆఫీసుల రాయించకురా అని ఒకరంటే.. దవాఖానాల రాయించుకురావాలని ఇంకొకరు చెప్తరు. కార్డు ఉన్నా లేకున్నా బియ్యం ఇయ్యాలని కేసీఆర్​ చెప్పలేదా… ? గట్టిగా మాట్లాడితే ఈడికి తిండి లేకున్నా బలుపుందని అంటరు. కిరాయి కట్టమంటే నడుస్తాదా.. వాళ్లు కూడా డబ్బులు వస్తాయనే కిరాయికి ఇస్తరు. కేసీఆర్​ చెప్పిండు మేం ఇయ్యమంటే తెల్లారే ఖాళీ చేయమంటరు. అప్పుడు ఇల్లు దేవులాడుకోవాలి. కొత్తగా దొరకదు. ఇల్లు మారాలంటే ఎంత కష్టమో మీకు కూడా తెలిసే ఉంటది. కిరాయిలు కూడా తక్కువ ఉంటలేవు. ఇప్పుడు అసలే పైసలు లేని కాలం. వాళ్లను అమ్మా, అప్పా అని బతిలాడుకోవాలి కాని కిరాయి కట్టమని రుబాబ్​ చేస్తే ఎట్ల నడుస్తది..

దిశ: మీలాంటి వారు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు. అందరి కష్టాలు ఒకేరకంగా ఉన్నాయా..

లక్ష్మణ్​: సిటీలో 30వేల దాకా అడ్డాకూలీలు ఉంటారనుకుంటున్న.. ఉప్పల్​ గాంధీ బొమ్మ, రింగ్​ రోడ్​, మేడిపల్లి, హయత్​ నగర్​, దిల్​సుఖ్​ నగర్, కొత్తపేట పండ్ల మార్కెట్​, బోయినపల్లి, సికింద్రాబాద్​, ఖైరతాబాద్​, ఆర్టీసీ క్రాస్​ రోడ్, మియాపూర్​, హైటెక్​ సిటీ.. నాకు తెలిసిన కొన్ని అడ్డాలు. అందరికీ పని దొరకాలంటే రోజు పొద్దున్నే రోడ్డు మీదకొచ్చి నిలబడాల్సిందే.. పని దొరికితే ఒకరకంగా లేకుండా ఇంకోరకంగా ఉంటాయి మా బతుకులు. కొందరికి రోజూ తాగే అలవాటు ఉంటది. ఇప్పుడు పని లేదు. మందు లేదు. పిచ్చివాళ్లయి పోతున్నాం. ఏం చేయాలో తెలియక ఇంట్ల గొడవలు అయితుంటయి. ఊరికి పోలేం. ఇక్కడ ఉండలేం.. మాలాంటి పేదోళ్లను పట్టించుకునేటోళ్లు కనబడరు.

దిశ: కరోనా గురించి మీకు తెలుసా.. మాస్క్ ల గురించి తెలుసా..

లక్ష్మణ్​: కరోనా అంటే నాకు, నా భార్యకు కూడా తెలియదు. ఇది కర్ప్యూ అంటరంటా.. కరోనా అనేది చైనాలో వచ్చింది. ఇక్కడ కూడా వస్తదని అన్ని బంద్​ చేసిర్రు.. ఇది మాత్రం తెలుసు. అది ఏం రోగమో ఏందో.. ఎందుకు వస్తదనేది తెలియదు. వాళ్లకు పైసలు ఉన్నయ్ కొనుక్కుంటున్నరు. మేము రెండొందల మంది వరకూ కూలీలమున్నం. మాకెవరికీ మాస్క్​లు లేవు. కట్టుకోవాలని కూడా చెప్పినోళ్లు లేరు. మాకెవరూ ఇవ్వలేదు. అయినా మాకు రోగం రానపుడు అయి కట్టుకునుడు ఎందుకు. రోజు మోటు కష్టం చేసే మాకు ఆ రోగం ఎందుకు వస్తది..

దిశ: 14వ తేదీన లాక్‌డౌన్ తొలగించకపోతే మీరు ఏం చేస్తారు?

లక్ష్మణ్: ఇప్పటికే మా పరిస్థితి చూస్తే భయం అవుతోంది. పైసలు లేవు. పని దొరకత లేదు. ఏదో దాతలు అన్నం పెడితే బతుకుతున్నం. కష్టపడి దాచుకున్న పైసలు కూడా అయిపోయినయి. మా పాప కూడా పెద్దగయితుంది. ముందు ముందు ఎట్లయితదోనని గుబులు పడుతున్నం. ఇట్లనే పనిలేకుంటే తిండికి లేక చావాల్సి వస్తది. ఆకలిచావులే మాకు గతి. ఇట్లనే బంద్ పెడుతమంటే కనీసం ఒక్క రోజన్నా బస్సులు నడిపియ్యుర్రి. మా ఊరికి మేం పోతాం. ఇక్కడ మేం బతకలేము. ఇంటికి పోతే ఊర్ల ఏదన్న పనిచేసుకుని కొంచెం ధైర్యంగా బతుకొచ్చు.

దిశ: చివరగా.. మీరొక అడ్డాకూలీగా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ?

లక్ష్మణ్​: కేసీఆర్​ సారు గారికి చేతులెత్తి మొక్కుతున్నా.. మీరిస్తమన్న బియ్యం కూడా మాలాంటి పేదలు, అడ్డాకూలీల దాకా చేరతలేవు. ఎవరన్న పుణ్యాత్ములు అన్నం, కూరగాయలు పెడితేనే మేం బతుకుతున్నం. ముందుగాల ఆ బియ్యమన్నా ఇప్పిస్తే ఓ రెండు రోజులు బతుకుతాం.. మీరు బంద్​ పెట్టుకున్న మాకేం లేదు గానీ.. మాకు రోజు పని చేసుకునేందుకు అవకాశం కల్పించండి. లేదంటే మా ఇల్లు గడిచేటట్టు లేదు. లేదంటే మా సొంతూళ్ల కన్నా పంపించి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.

Tags: corona, lockdown, daily labourers, telangana, no work no pay

Next Story