ట్రైనీ ఐఏఎస్‌లకు సిరిసిల్ల నీటి పాఠాలు

by  |
ట్రైనీ ఐఏఎస్‌లకు సిరిసిల్ల నీటి పాఠాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: జాతీయ స్థాయిలో సిరిసిల్ల జిల్లా నీటి యాజమాన్య విధానం ప్రశంసలు అందుకుంటోంది. సాగునీటికి ఇబ్బందులు పడ్డ జిల్లా జల నిర్వహణ ద్వారా వార్తల్లో నిలిచింది. జలసిరులు వైపు సాగించిన తీరుపై అధ్యయనం జరుగుతోంది. పాలన విభాగానికి ప్రాణం పోసే ఐఏఎస్‌కు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిరిసిల్ల మోడల్‌ని అధ్యయన అంశంగా ఎంచుకున్నది. ఈ ఏడాది మొదటి దశ ఐఏఎస్ అధికారుల శిక్షణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వాటర్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను అధ్యయనం చేసి, అక్కడ శిక్షణ పొందుతున్న అధికారులతో పంచుకుంది. సిరిసిల్లపై అధ్యయనం చేసిన తర్వాత వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐఏఎస్ ట్రైనీ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు.

ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, చిన్న తరహా సాగునీటి కార్యక్రమాలు, భూగర్భజలాలు కలుషితం కాకుండా తీసుకున్న చర్యలు, వాటర్ కన్జర్వేషన్ పద్దతులు, ఇతర కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తీసిన చెరువుల వివరాలు, గ్రామాల్లో తవ్విన ఇంకుడు గుంతలు, స్టాగ్గర్డ్ స్ర్టేచేస్ (ఉపాధి హమీలో చేపట్టే వాటర్ కన్జర్వేషన్ పనులు), ఫాం పాండ్స్ వంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా చర్చించింది. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలో భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగింది. మిషన్ కాకతీయ పనుల ద్వారా అనేక గ్రామాల్లోని చెరువులు నింపడం వంటి అంశాలను కూడా శిక్షణ సంస్థ పరిశీలించింది. క్షేత్ర స్థాయిలో మానవ వ్యర్ధ్యాలను శుద్ధిచేసే (ఫిజికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్- ఎఫ్‌ఎస్‌టీపీ) డ్రైవ్ రీసోర్స్ కలెక్షన్ సెంటర్ వంటి వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలు పాడవకుండా కాపాడుకుంటున్న తీరుపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. ఐదేళ్లలో జాతీయ ఉపాధి హామీ పథకం, జల నిర్వహణ, స్వచ్ఛత కార్యక్రమాలతో పాటు అనేక అంశాల్లో 2016, 2017, 2018, 2019 సంవత్సరాల్లో జాతీయ అవార్డులు లభించాయి. జాతీయ స్ధాయిలో అగ్రగామిగా నిలిచిన ఈ కార్యక్రమాలను డాక్యూమెంట్ చేసి తమకు పంపాలని ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్ర్తి అకాడమి కోరింది.

కేసీఆర్ మాటల వాస్తవ రూపం: మంత్రి కేటీఆర్

సిరిసిల్ల మోడల్ జాతీయస్థాయిలో ఒక ఆదర్శవంతమైన ఉదాహరణగా ప్రశంసలు పొందడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలసీలు, విధానాలు జాతీయస్థాయిలో ఇప్పటికే ప్రశంసలు పొందుతున్నాయన్నారు. త్వరలోనే జల విధానంపైన అధ్యయనాలు జరుగుతాయన్న కేసీఆర్ మాటలు నేడు వాస్తవ రూపం దాలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సిరిసిల్లకు సాగునీటి ప్రాజెక్టుల ఫలాలు అందడం ప్రారంభమైందని, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని దేశంలోనే ఆదర్శవంతమైన జల నిర్వహణకి చిరునామాగా నిలుస్తామన్నారు. వచ్చే రోజుల్లో ప్రతి చెరువును కాలువలతో కలపడం, ఏడాది మొత్తం వాటిలో నీరు నిల్వ ఉండేలా చూసుకోవడం, అన్నిటి కంటే ముఖ్యంగా ప్రస్తుతం ఏర్పడిన జలవనరుల చుట్టూ రీక్రియేషనల్ కార్యక్రమాలు చేపట్టడం వంటి భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు కొనసాగుతున్నట్లు మంత్రి చెప్పారు. ముస్సోరీ అకాడమి వీటిపై ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇవ్వడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. జిల్లా మోడల్ ను ప్రశంసించిన ట్రైనీ అఫీసర్లు ఇక్కడ పర్యటించేందుకు ఆసక్తి చూపించారు. శిక్షణలో భాగంగా జరిగిన జిల్లా సెషన్ తర్వాత జిల్లా కలెక్టర్ క్రిష్ణభాస్కర్‌తో ప్రత్యేకంగా మాట్లాడి సమాచారం తీసుకున్నారు. కాళేశ్వరంలో భాగంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, భారీ ఎత్తున భూసేకరణ చేసిన తీరు, నిర్వాసితులకు కల్పించిన పునరావాసంపై జిల్లా యంత్రాంగం అమలు చేసిన కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయన్న పలువురు ట్రైనీ ఐఏఎస్‌లు, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


Next Story