కేడర్‌లో అయోమయం.. ఆయన మౌనం వెనక మర్మమేమిటో..?

by  |
కేడర్‌లో అయోమయం.. ఆయన మౌనం వెనక మర్మమేమిటో..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయంలో ఆయన అంటి ముంటనట్టుగా ఉంటున్నారేంటి, తన వ్యూహంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం లేదేంటి అన్నదే ఇప్పుడు ఆ పార్టీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రతీ విషయాన్ని తనకు అనుకూలంగా మల్చుకునే ప్రతిపక్ష పార్టీ నాయకులకు భిన్నంగా.. ఈ విషయంలో ఆయన అడుగులేస్తుండటం సొంత పార్టీ నాయకులకూ ఫజిల్‌గా మారింది.

ఆయన స్కెచ్ ఏంటో..?

మంథని ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు.. పుట్టా మధు విషయంలో ఎందుకు మాట్లాడటం లేదన్న చర్చ కాంగ్రెస్‌లో వినపడుతున్నది. గతంలో ఇక్కడ జరిగిన ప్రతీ విషయంపై స్పందించి పుట్టా మధును డైలామాలో పడేసే ప్రయత్నం చేసిన శ్రీధర్ బాబు.. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నది ఎందుకో ఎవరికీ అంతుచిక్కకుండా తయారైంది. అడ్వకేట్ దంపతులు వామన్ రావు, నాగమణిల హత్య జరిగినప్పుడు సీరియస్‌గా స్పందించిన శ్రీధర్ బాబు.. ప్రతీ వైఫల్యాన్ని ఎత్తి చూపారు. అయితే ఈ జంట హత్యల వెనక ఉన్నదెవరో బయటకు రావాలని డిమాండ్ చేశారు తప్ప.. ఎక్కడా కూడా పుట్టా మధు పేరును ప్రస్తావించలేదు.

తాజాగా పుట్టా మధు అదృశ్యం, అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీధర్ బాబు స్పందిస్తారని కాంగ్రెస్ పార్టీ కేడర్ భావించింది. ఇదే అవకాశంగా విచారణ తీరుపై ఆయన.. రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తారని, దీని వల్ల తమ పార్టీకి లాభిస్తుందని కూడా పార్టీ నాయకులు అంచనా వేశారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీధర్ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జరుగుతున్న పరిణామాలను గమనించారే తప్ప మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం అందరినీ విస్మయపరిచింది.

అయోమయంలో కేడర్..

శ్రీధర్ బాబు మౌనం వెనక మర్మమేమిటో అంతు చిక్కక ఆయన అనుచరుల్లో అయోమయం నెలకొంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా లేక ఈ విషయాన్ని అసలు పట్టించుకోవడంలేదా అన్న డిస్కషన్ పార్టీ వర్గాల్లో సాగుతోంది. వామన్ రావు కపుల్స్ మర్డర్ తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మంథనికి రప్పించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన శ్రీధర్ బాబు.. పుట్టా మధు, అతని ఫ్యామిలీ మెంబర్స్‌ను విచారిస్తున్న సమయంలో అస్సలు స్పందిచకపోవడం ఏంటన్నదే అంతుచిక్కకుండా తయారైందని మంథని నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ హత్య కేసులో పుట్టా మధు ప్రమేయం ఉందా.? లేదా అన్న విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేయకపోవడం.. జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

మంథనిలో కూడా..

మూడు రోజులుగా మంథని నియోజకవర్గంలోనే ఉన్న శ్రీధర్ బాబు కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన మెడికల్ కాలేజీల కేటాయింపులో మంథని నియోజకవర్గానికి అన్యాయం చేశారంటూ మాట్లాడారు. మంథని, కాటారం ప్రాంతాల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారే తప్ప.. పుట్టా మధు విచారణ విషయం కానీ, వామన్ రావు మర్డర్ కేసు దర్యాప్తు గురించి కానీ కామెంట్ చేయకపోవడం అటు పార్టీ వర్గాలను ఇటు రాజకీయ విశ్లేషకులను శ్రీధర్ బాబు డైలామాలో పడేశారు.



Next Story