గుంతలతో ప్రసిద్ధిగాంచిన రహదారి ఇదే..!!

270
Valigonda-Matsyagiri road

దిశ, భువనగిరి రూరల్ : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఒకటి. నిత్యం వందల సంఖ్యలో భక్తులు దర్శించే ఈ ఆలయానికి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. వలిగొండ నుంచి వేములకొండ వరకు 16 కిలో మీటర్ల మేర కంకర తేలి, గజానికో గుంత ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది క్రితం రోడ్డు మరమ్మతులకు గురైనా.. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Road Repair2

12 గ్రామాలకు ఇదే రహదారి

వలిగొండ నుంచి అర్రూర్ మీదుగా వెళ్లే ఈ రహదారిపై 12 గ్రామాల ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంత ప్రాముఖ్యం ఉన్న రహదారిని నూతనంగా నిర్మించాలని ఎమ్మెల్యేకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా.. ఎవరు స్పందించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. 16 కిలో మీటర్ల దూరం ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Road Repair

ప్రమాదాలకు నిలయం

16 కిలో మీటర్లు పూర్తిగా గుంతలతో అధ్వానంగా ఉన్న ఈ రోడ్డుపై నిత్యం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీళ్లు నిండి వాహనదారులు వాటిల్లో పడిపోతున్నారు. ఇటీవల పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాల పాలైన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యే స్పందించి వలిగొండ-మత్స్యగిరి రోడ్డుని పునర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఎవరు స్పందించకపోయినా ఆందోళనలు చేస్తామని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..