బిర్యానీ ప్రియులకు షాక్.. ప్యారడైజ్ రెస్టారెంట్ సీజ్

by  |
Chicken Biryani,
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. విదేశీయులు సైతం ఇక్కడి బిర్యానీని ఆరగించడానికి ఉవ్విళ్లు ఊగుతుంటారు. పక్క రాష్ట్రాల భోజన ప్రియులు కేవలం హైదరాబాద్ బిర్యానీ తినడానికే ఇక్కడకు వస్తారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల హోటల్స్ నిర్వాహకులు లాభాలనే ధ్యేయంగా చూస్తూ.. సరైన నాణ్యత ప్రమాణాలు, శానిటైజన్ చేయకపోవడంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింటోంది. తాజాగా ప్యారడైజ్ హోటల్ బిర్యానీలో పురుగులు రావడంతో అధికారులు కొరాడ ఝులిపించారు.

మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో ప్యారడైజ్ పేరులో ఓ రెస్టారెంట్ నడుస్తోంది. ఆ రెస్టారెంట్ లో ఓ వ్యక్తి బిర్యానీ, డబుల్ కా మీఠా స్వీట్ పాన్ ఆర్డర్ చేశాడు. అనంతరం బిర్యానీ తింటుండగా.. పురుగులు కనిపించాయి. దానిని పక్కకు పెట్టి కిల్లీని ఓపెన్ చేయగా అందులోనూ పురుగులు దర్శనమిచ్చాయి. దీనిపై రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించినా సరైన సమాధానం లేకపోవడంతో మున్సిపల్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శానిటేషన్ సిబ్బందితో కలిసి హోటల్‌లో తనిఖీ చేశారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు చికెన్, మటన్ కుళ్లిపోయి ఉండడాన్ని గమనించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని హోటల్‌ను సీజ్ చేశారు. నిర్వాహకులకు రూ.50 వేల జరిమానా విధించారు. బిర్యానీ ప్రియులు.. తస్మాత్ జాగ్రత్త.


Next Story

Most Viewed