- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఇలాకకు షర్మిల?
<p>దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయనున్నారా? టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే మంత్రి హరీశ్ రావుకు షాకిచ్చేందుకు ఆమె సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి లోటస్ పాండ్ వర్గాలు. ఇన్నిరోజులుగా కొవిడ్ ఎఫెక్ట్, లాక్ డౌన్ కారణంగా ట్విట్టర్ కే పరిమితమైన షర్మిల తిరిగి తన కార్యాచరణను షురూ చేయనున్నట్లు ఆమె కార్యాలయవర్గం స్పష్టం చేసింది. అందుకు తెలంగాణ […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయనున్నారా? టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే మంత్రి హరీశ్ రావుకు షాకిచ్చేందుకు ఆమె సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి లోటస్ పాండ్ వర్గాలు. ఇన్నిరోజులుగా కొవిడ్ ఎఫెక్ట్, లాక్ డౌన్ కారణంగా ట్విట్టర్ కే పరిమితమైన షర్మిల తిరిగి తన కార్యాచరణను షురూ చేయనున్నట్లు ఆమె కార్యాలయవర్గం స్పష్టం చేసింది. అందుకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీని ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది షర్మిల. జూన్ 2న హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి అనంతరం సీఎం కేసీఆర్ ఇలాక అయిన ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మామా, అల్లుళ్లనే టార్గెట్ చేసేందుకు ఆమె సిద్ధమైనట్లు లోటస్ పాండ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
యాక్షన్ షురూ
గత కొద్దిరోజులుగా ట్విట్టర్ కే పరిమితమైన షర్మిల తన సైలెన్స్ కి బ్రేక్ ఇవ్వనున్నారు. యాక్షన్ ప్లాన్ ను షురూ చేయనున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అనంతరం ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 9వ తేదీన తొలి బహిరంగ సభ నిర్వహించారు వైఎస్ షర్మిల. ఏప్రిల్ 15వ తేదీన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల బలవన్మరణాలు జరగకుండా చూడాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టేందుకు పూనుకున్నారు. పోలీసులు ఒక్కరోజు మాత్రమే దీక్షకు అనుమతి ఇవ్వడంతో లోటస్ పాండ్ నుంచి రెండు రోజుల దీక్షను ఆమె కొనసాగించారు. ఏప్రిల్ 18వ తేదీన దీక్ష ముగిసిన అనంతరం జిల్లాల వారీగా నిర్వహించాల్సిన ర్యాలీలు కూడా దీక్షలకు కూడా బ్రేక్ పడింది. కరోనా నేపథ్యంలో లోటస్ పాండ్ కు లాక్ వేశారు. అప్పటి నుంచి ఎలాంటి కార్యాక్రమం షర్మిల చేపట్టలేదు. కేవలం ట్విట్టర్ కే పరిమితమయ్యారు. తిరిగి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తన యాక్షన్ ప్లాన్ ను షర్మిల షురూ చేయనున్నారు.
తొలిసారి గన్‌పార్క్‌కు..
ఇప్పటి వరకు షర్మిల ఒక్కసారి కూడా గన్‌పార్క్ కు వెళ్లలేదు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ షర్మిల తొలిసారి గన్‌పార్క్ కు వెళ్లనున్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. షర్మిల తొలిసారిగా గన్ పార్క్ కు పర్యటించనుండటంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకునే అవకాశముంది. అనంతరం అక్కడి నుంచి నేరుగా మెదక్ జిల్లా పర్యటనకు షర్మిల బయలుదేరనున్నారు. అమరవీరుల కుటుంబాలను లేదా ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయడం లేదని బలవన్మారణానికి పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను షర్మిల కలిసే అవకాశముంది.
మామా, అల్లుళ్లే టార్గెట్ గా?
వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్, ట్రబుల్ షూటర్ అయిన మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేసుకొనే మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు విశ్వసనీయం సమాచారం. రాజును ఓడిస్తే రాజ్యాన్ని సాధించడం సులభమవుతుందనే నానుడే ధ్యేయంగా ఆమె కేసీఆర్, ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే హరీశ్ రావునే ముందుగా ఢీకొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు షర్మిల చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్ష ముగింపు సమయంలోనూ గజ్వేల్ కు చెందిన అమరులు మురళి, కొప్పు రాజు కుటుంబీకులు వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా మెదక్ జిల్లాలోనే పర్యటన చేస్తుండటంతో మామా, అల్లుళ్లకు చెక్ పెట్టాలని షర్మిల దృఢంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వారి కుటుంబాలకు భరోసా!
మెదక్ పర్యటనకు వెళ్లనున్న షర్మిల ఆ జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబాలను లేదా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని బలవన్మరణానికి పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను కలిసే అవకాశాలున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు వెల్లడించాయి. వారిని కలిసి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రణాళిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్సార్’ కార్యక్రమం ద్వారా వారికి కొంత చేయూతనందించనున్నట్లు సమాచారం. లాక్ డౌన్ సడలింపు సమయాన్ని బట్టి వీలైతే అటు అమరులు, ఇటు నిరుద్యోగుల కుటుంబాలను కలిసి భరోసా కల్పించాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక తన పార్టీ కార్యాచరణను సైతం రెగ్యులర్ గా జరిగేలా షర్మిల ప్లాన్ చేశారు.
జూలై 8న పార్టీ ఏర్పాటు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన తేదీ జూలై 8న కావడంతో అదేరోజు పార్టీ ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే అందుకు సంబంధించి అన్ని పనులు దాదాపు పూర్తయినట్లు తెలస్తోంది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కూడా లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరో వారంలో అంతా పూర్తిఅవుతుందని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఏర్పాటు తేదీకి మరో 37 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీ వ్యవహారాలను కూడా చక్కబెడుతున్నట్లు ఆమె కార్యాలయవర్గం వెల్లడించింది. ఇందుకు సన్నాహక కమిటీలను ఏర్పాటు చేసి ప్రణాళికలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జూలై 8వ తేదీనే పార్టీ పేరును షర్మిల ప్రకటించనున్నారు.
పార్టీ పేరిదే..
తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీ పేరు దాదాపు ఖరారైంది. ‘యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీ(వైఎస్సార్ టీపీ)’ గా రిజిస్ట్రేషన్ కు పంపినట్లు లోటస్ పాండ్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ఎన్నికల కమిషన్ నుంచి సైతం ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఆమె కార్యాలయవర్గం స్పష్టం చేసింది. పార్టీ పేరులో తన తండ్రి పేరు కూడా ఉండాలని ఆమె ఫిక్స్ అయినట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అన్నింట్లోనూ వైఎస్సార్ బ్రాండ్ ప్రతిబింబించేలా ఆమె జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ జెండా, ఎజెండాలోనూ వైఎస్సార్ స్ఫూర్తి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన చేసిన సేవలు ప్రతిబింబించేలా ఉండాలని షర్మిల సూచించినట్లు లోటస్ పాండ్ వర్గాలు వెల్లడించాయి.






